నా చిన్నప్పుడు అర్ధణా, అణా, బేడ అనే నాణ్యాలు ఉండేవి. పైస, దమ్మిడీ, కాణీలు ఒక పైస విలువ గల తొలి ద్రవ్యం. మధ్యలో చిల్లువుండే కాణీలను పిల్లలు చూపుడు వేళ్ళకు తగిలించుకుని, వెళ్ళి చిరుతిళ్ళు కొనుక్కునేవారు. ఈ కాణీలు రాగి లోహంతో తయారు ఔతూండేవి. అప్పట్లో ఒక కాణీకి ఒక నువ్వు జీడీ వచ్చేది.
ఆ చిన్ననాటి ముచ్చట్లు తలుచుకుంటే బహు ముచ్చట!
అర్ధణా, అణా, బేడ- ఈ గుణాంకములలో ఉన్న విశేషం ఏమిటో మీరు కనిపెట్టారా?
3, 6 అనే అంకెలు వీటికి మూలములు. కాల గణనము అధిక శాతం 6 పైన ఆధారపడి ఉన్నది. చాంద్రమానము ఈ లెక్కలకు మూల స్తంభము. మూడు ఆరు ఋతువులు, సీజన్లు, 12 నెలలు, ప్రధానంగా ఈ పరిగణనలు సాగుతూన్నవి. సాంప్రదాయ, ఆచారములు, పండుగలు సైతము వీని ప్రకారమే ఏర్పరచబడినవి.
12 పవిత్ర నదులు, వాటి పుష్కరాలను చూడండి. ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి వచ్చే పండుగే నదీ పుష్కరము. ఆ సమయములో వాటిలో పుణ్య స్నానాలు ఆచరించాలని చెబుతారు. ఆవిధంగా ప్రాజ్ఞులు ప్రతి పన్నెండు ఏళ్ళకు ఒక సారి ఈ వేడుకలన్నీ పుష్కర కాలములో వచ్చేలా ఏర్పరిచారు.
*****
దుకాణములలో పళ్ళు కొనేటప్పుడు విక్రయదారుని ఏమని సాధారణంగా అడుగుతూంటారు?
ముఖ్యంగా అరటిపళ్ళ అంగడిలో కొనేటప్పుడు అడిగే వాడుక మాట ఏమిటి? “డజను ఎంతకి ఇస్తావు?” మన ఆంధ్రులు అచ్చ తెనుగులో – అరటిపళ్ళు క్రయ విక్రయాలలో మాత్రం కొన్ని స్పెషల్ వర్డ్సు అగుపడుతూంటాయి!
“హస్తం” = పండ్రెండు కదళీ ఫలములు. “అమడపళ్ళు” = జతగా ఉండే అరటిపళ్ళు. పన్నెండింటికి ఒక పండు ఉచితంగా ఇవ్వాలనేది- అవగాహనా ప్రధానంగా ఏర్పడిన రూలు. దీనినే “కొసరు” అని పిలుస్తారు.
భోజనాల వేళ “కొసరి కొసరి వడ్డించుట” అనే తీపి జాతీయం కూడా ప్రయోగంలో ఉండేది. (ఇవన్నీ ఆనాటి ముచ్చట్ల మాటలే లెండి!)
మరి “డజను” అనే పదము ఎక్కడి నుండి వచ్చి మన ద్రవ్య సీమలోనికి అడుగిడింది?
*****
సంస్కృత భాష మన తెలుగుకు ఎన్నెన్నో పదముల పుష్పాలను ఒసగింది. అలాగే సరిహద్దు రాష్ట్ర భాషలైన – ఒరియా, కన్నడము, తమిళము, మరాఠీ భాషల నుంచీ, అలాగే రాజభాష ఐన హిందీ నుండి సైతము “లెక్కలేనన్ని మాటల తొలకరి జల్లులతో” త్రిలింగ భాష ఐన తెలుగు సీమ ఓలలాడినది. ఉర్దూ, చాలా ఇంగ్లీషు పలుకులు తెలుగుతల్లి ఒడిలోకి చేరి కేరింతలాడుతూన్నవి.
“Dozen” అనే మాటను మనము ఏ భాష నుండి స్వీకరించినాము?
ఈ నుడికారము అటు కన్నడము నుండైనా కావాలి, ఇటు ఉర్దూ, పార్శీ, హిందీల నుండి ఐనా అవ్వాలి? కానీ చిత్రంగా ఈ నామము ఫ్రెంచి భాష నుండి గ్రహించినది.
12 సంఖ్య మనకు ముఖ్యమైనట్టుగానే మల్లేనే ఫ్రాన్సు దేశ ప్రజలు కూడా “12” ను కేంద్రముగా వ్యావహారిక లెక్కలను వాడేవారు. “డజను” కి లఘు రూపం- doz, dz రు కాలములు, పండ్రెండు మాసాలు, ఈ పగిదినే ఏడాదికి మున్నూట అరవై రోజులు; దాదాపు సమయ నిర్ధారణలన్నీ ఈ “అర డజను”, “డజను” – ల మీదనే ఆధారపడి – ఖగోళ శాస్త్రవేత్తలు సిద్ధం చేసిరి.
*****
మెసపొటేమియా దేశస్థుల sexagesimal నుండి – యూరోపీయులు -ఈ గణితమును పుచ్చుకుని ఉండవచ్చును. ఇలాగ ద్వాదశ ఆధారిత సంఖ్యా గణనమును “ duodecimal system/ dozenal” అనే సాంకేతిక నామాలు కలవు. ఇక మన సీమలో “16 అణాల తెలుగుదనం ఉట్టిపడ్తూన్నది” అనే నుడికారం ఉన్నది. బండి మీద పళ్ళు అమ్మకానికి వచ్చినప్పుడు, పదిరెండు కు ఒకటి కొసరు ఇవ్వడం” ఆనవాయితీ మనకు కనపడ్తుంది.
తమాషా ఏమిటంటే యూరోప్ లో కూడా ఈ అలవాటు ఉన్నది.
“బేకర్స్ డజన్” (A baker’s dozen) అంటే 12 కి బదులుగా కాస్త చేతి బారుగా “13” ఉరుములను ఇవ్వడమే!
*****
3, 6, 9, 12 అంకెల ఆధారముగా ఏరియాలనూ, పొలాలనూ, స్థలాలనూ కొలుస్తూన్నారు.
అడుగులు, అంకణములు, గజములు- మొదలైన కొలతలు- గుంటూరు, మధ్య ఆంధ్ర జిల్లాలలోనూ, దక్షిణాంధ్ర ప్రాంతాలలో ఇప్పటికీ ఉపయోగితమౌతూన్నవి
ఉదాహరణకు:- 72 ఫీట్సు ఒక అంకణము – ఈ పద్ధతితో అన్నమాట!
గణితములో సర్కస్ ఫీట్లు అగణితములు కదా!
డజను – ఫ్రెంచి ధాతు పదమే ఐనా, వివిధ దేశాలలో- రోదసీ, ఋతు పరిణామములను ఆధారము చేసుకుని, (షష్ఠాంశము – షడ్రుతువులు- ఇత్యాది సంస్కృత పద మంజరి) వేర్వేరు పేర్లుతో ఐనప్పటికీ ప్రాచీన కాలము నుండీ ప్రయోజనములో ఉన్నవి.