అంకోల గణపతి దేవళము:
తమిళ నాడు రాష్ట్రంలో “అంకోల గణపతి దేవళము” ఉన్నది. ఇక్కడ స్వయంభూ గణపతి అంకోల చెట్టు వద్ద వెలసెను. అందుచేత ఆ సైకత వినాయకుడు అంకోల గణపతిగా వాసి కెక్కెను.
తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకు సమీపంలో ’అంకోల’ అన్న గ్రామం ఉంది. ఇక్కడ 2500 సంవత్సరముల వయసు గల “ఎరంఝిల్ తరువు” ఉన్నది. (ఊడుగ చెట్టుకు అరవ భాషలో Eranzhil tree అని పేరు. సంస్కృత భాషలో అంకోల అనే పేరుతో పిలువబడుతుంది). ఈ అంకోల వృక్షము కింద స్వయంభూ వినాయకుడు కొలువు తీరి ఉన్నాడు.
ఈ గణపతి ఇసుకతో చేసిన అపురూప విగ్రహము. ఈ ప్రతిమకు పైన కప్పు లేదు. ఐనప్పటికీ, ఎండ వానలకు చెక్కు చెదరకుండా ఈ సైకత ప్రతిమ స్థిరంగా నిలిచి ఉండి సైన్సు, హిస్టరీ శాస్త్రజ్ఞులకు ఆశ్చర్యం కలిగిస్తూన్నది.
ఈ సీమకు “చతుర్వేదేశ్వరము” అన్న చారిత్రిక నామధేయం ఉంది. ఇక్కడ అమ్మవారు శివకామి, భగవంతుడు చతుర్వేదేశ్వర స్వామి.అగస్త్యుడు అనే తాపసి అశరీర వాణి ఆదేశముతో, శివకామీ సమేతునిగా చతుర్వేదేశుని పూజలు చేయ పూనుకొన్నాడు.
స్థలపురాణం:
స్థల పురాణముగా మంచి సంఘటనా గాథ భక్తులకు సుపరిచితము.
అగస్త్య మహాముని తీర్థయాత్రలు చేస్తూ కాశీ నుండి వస్తూ ఇక్కడ ఆగాడు. అప్పుడు ఆయన బ్రహ్మారణ్య నదిలోని ఇసుకతో ప్రతిరోజూ శివ లింగమును తయరుచేసి, పూజలు చేసేవాడు. అలాగ 108 రోజుల వరకూ మహర్షి పూజలు చేసాడు. చిత్రంగా 108 రోజుల తర్వాత, ఆ నూట ఎనిమిది ఈశుని లింగములు అన్నీ ఒకే స్వరూపాన్ని పొందుతూ, శ్రీ మహా గణేశుని మూర్తిగా మారి, అక్కడ వెలసినది.
అగస్త్యునికి అప్పుడు తాను చేసిన పొరపాటు ఏమిటో జ్ఞాపకం వచ్చినది – ” పూజను ప్రారంభించేటప్పుడు ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశుని తలచి కొలిచి, అటు పిమ్మట యధావిధిగా పూజా కార్యక్రమాలను కొనసాగించాలి. కానీ తాను మహేశుని పూజించడముతో, ఇలాటి విచిత్రము తటస్థపడినది.”
మునివర్యుడు తన తప్పిదమును తెలుసుకొని, గణేశుని భక్తితో ప్రార్ధించాడు.
తత్కారణముచే ఏక రూపము పొందిన వినాయకునిగా చతుర్వేదేశుడు అగస్త్య మౌనికి సాక్షత్కరించాడు(“ఎరంఝిల్ తరువు” కింద సుప్రతిష్ఠుతుడు ఐన హేతువుతో Eranzhil Vinayahar అని ప్రసిద్ధుడు ఐనాడు ఈ స్వామి.)
అమోఘ ప్రతిభాశాలి శ్రీ ఆదిశంకరాచార్య రచించిన “శివానంద లహరి” లోని 61 వ శ్లోకంలో
అంకోలం నిజ బీజ సంతతిః |అయస్కాంతో ఫలం సూచికా ||
“అంకోలం విత్తనములు తన మాతృ వృక్షమునకు అతుక్కుంటాయి. ఆ వృక్షమునకు గల ఇనుము వంటి గుణము కల ఆ చెట్టు ముళ్ళకు అయస్కాంతము పట్ల ఆకర్షిత గుణమును కలిగి ఉన్నాయి. లతలు/ తీగ పాదపము మ్రాను చుట్టూతా పెనవేసుకుంటుంది. నది సముద్రములో కలుస్తుంది. పశుపతి నాధుని, మహేశుని చరణ పద్మములకు భక్తి భావనలు లీనమౌతాయి” అంటూ శ్రీ కంచి పీఠాధిపతి ఈ మహత్తర శ్లోకానికి వివరణను ఇచ్చారు.
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు