గుళ్ళెకాయి అజ్జి మండపము

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 5]

 

Image : Reuters
శ్రావణబెళగొళ అనే జైన పుణ్యక్షేత్రము సు ప్రసిద్ధమైనది. ప్రపంచ ఖ్యాతి గాంచిన ఈ జైన క్షేత్రము కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ కోవెలకు దగ్గరలో ఒక చిన్న గుడి ఉన్నది. అదే “గుళ్ళెకాయి అజ్జి మండప”.

ఈ గుడిలోని ప్రతిమకు ఒక స్థానిక స్థల గాధ (legend) చెబుతారు.

కర్నాటకలోని తలకాడు పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పశ్చిమ గంగ వంశ చక్రవర్తుల మంత్రిగా వాసికెక్కినవాడు చావుండ రాయుడు. ఇతను క్రీ.శ. 983లో  బాహుబలి (గోమఠేశుని) విగ్రహనిర్మాణానికి పూనుకుని, విజయవంతముగా పూర్తి చేసాడు. అంతటి ఘన విగ్రహాది నిర్మాణాలను తానే చేయగలవాడినని  అతనికి గర్వము కలిగింది. ఇక తన కీర్తి దశదిశలా వ్యాపించేలా మహామస్తకాభిషేకాన్ని చేయ పూనుకున్నాడు. తేనె, కుంకుమ, పసుపు, సింధూరము, పాలు మున్నగు పవిత్ర ద్రవ, ద్రవ్యాలతో అభిషేకం చేయడము సంప్రదాయానుసారంగా జరుగుతుంది.

ఇంతకు ఎవరీ గోమఠేశ్వరుడు?

బాహుబలి ఒక క్షత్రియుడు. ఒక రాజ్యానికి యువరాజు.  ఋషభదత్తుడనే మహారాజు కుమారుడు. ఎన్నో యుద్ధములు చేసాడు. రణభూమిలో రక్తపాతమును చూసి రోసాడు. ఫలితంగా అహింసావాదిగా మారి, గోమఠేశ్వరునిగా వెలిసాడు. శ్రావణ బెళగొళ కొండపై ఒక సంవత్సరం పాటు కదలకుండా నిలబడి తపస్సు చేసాడు. దీన్ని కాయోత్సర్గం అని పిలుస్తారు. ఆపై జైనులు మోక్షస్థితిగా పిలిచే ’కేవల జ్ఞానము’ను పొందాడు. ఇలా బాహుబలి జైన తీర్థంకరులలో ప్రముఖునిగా ప్రసిద్ధి కెక్కాడు. నిజానికి బాహుబలి తండ్రి ఋషభదత్తుడు మొదటి జైన్ తీర్థంకరునిగా వాసి కెక్కాడు. బాహుబలి కూడా అటు క్షాత్రంలోను, ఇటు వైరాగ్యంలోను తండ్రి తగ్గ తనయునిగా వాసి కెక్కాడు.

Buy this book on Amazon

బాహుబలి భక్తుడైన చావుండరాయుడు కాయోత్సర్గ స్థితిలో ఉన్న బాహుబలి నిలువెత్తు విగ్రహాన్ని అతను తపస్సు చేసిన స్థలంలో స్థాపించాడు. మహామస్తకాభిషేకమును  చేయాలని సంకల్పించాడు. తన సిరిసంపదలు, గొప్పదనాన్నీ లోకులకు చాటడానికి ఈ కార్యమును ఒక సాధనముగా ఎంచుకున్నాడు. “ఈ నిలువెత్తు విగ్రహానికి నేనే మహామస్తకాభిషేకము చేస్తాను” అన్నాడు.

భగవాన్ సంపూర్ణ అభిషేకము గొప్ప కార్యము. “దేవుని  పెళ్ళికి అందరూ పెద్దలే!” అనేది సకల లోక విదిత జాతీయము. కానీ చావుండామాత్యుడు తన దర్ప, ఆడంబరములను ప్రకటించే పరికరముగా దీనిని ఎన్నుకున్నాడు. స్వామి కార్యములో ఎల్లరూ భాగస్వాములే కదా!  ఈ విషయాన్ని ఆయన విస్మరించాడు. బాహుబలి యొక్క పాదములు తడిసేదాకా పాలను స్వామి శిరసు పైనుండి పోసారు. ఆపాదమస్తకమూ  క్షీరధారలలో తడిసినప్పుడే ఆ మహాభిషేకము పూర్తి  అవుతుంది. చిత్రంగా ఆ రోజు చావుండరాయడు తెప్పించిన పాలు ఐపోతున్నప్పటికీ బాహుబలి ప్రతిమ పూర్తిగా తడవలేదు. కానీ ఎన్ని కుంభాల పాలను పోస్తున్నప్పటికీ కాలి చీలమండ దాటడం లేదు. అందరూ విస్మయచకితులౌతూ, ఎటూ పాలుపోని స్థితిలో మల్లగుల్లాలు పడ్తున్నారు. అందరిలోనూ ఉత్కంఠ నెలకొనసాగింది.

“ఎక్కడనో ఏదో లోపం జరిగినట్లున్నది! ఆ దోషం ఏమిటో?” అందరిలోనూ ఎంతగా ఆలోచనలు ముప్పిరి గొన్నప్పటికీ సమాధానము లభించ లేదు. అమాత్యుడు రాజ్యం నలుమూలలనుండీ తెప్పించిన పాలు అన్నీ ఐపోయినవి. అప్పుడు ఒక ముదుసలి స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో “పాలు నింపిన గుళ్ళెకాయ (కొబ్బరి చిప్ప)” ఉన్నది.

“ఈ పాలను స్వామికి స్నానమునకై పోయాలి ” అన్నది. ఆమె ప్రార్ధనను పెడచెవిని పెట్టేసిన భటులు “నీకు లోపలికి ప్రవేశము లేదు” అంటూ వెళ్ళగొట్టసాగారు. అది తెలిసిన రాజు “ఆమెను ఆవరణలోనికి రప్పించండి” అంటూ సచివులను పంపించాడు. లోపలికి అడుగిడినది ఆ మహిళ.

తీరా చూస్తే …చేతిలో అతి చిన్న గుళ్ళికాయెడు పాలు  మాత్రమే! ఇన్ని పాలను పోసిన తర్వాత కూడా తడవని విగ్రహంకు ఈ చిన్న కొబ్బరి చిప్పలోని  పాలు ఏ మూలకి సరిపోతాయి?

ఐనా తప్పదు. రాజాజ్ఞ అమలు చెయ్యాల్సిందే!

అర్చకులు ఆ “అజ్జి” (అవ్వ ) తీసుకు వచ్చిన పాలను తీసుకుని, నిచ్చెనలతో కూర్చిన మంచెల మీదుగా ఎక్కారు. అవ్వ పాలను వాళ్ళు పోసిన పిమ్మట  జరిన అద్భుత దృశ్యము అందరినీ చకితులను చేసినది. గుళ్ళికాయ అజ్జి తెచ్చిచ్చిన పాలు శీర్షమునుండి జారసాగాయి.

లిప్తపాటులో సంరంభం!

బాహుబలి నఖశిఖపర్యంతమూ తడిసిముద్దైనాడు. అటు పిమ్మట పాలు కారుతూనే ఉన్నవి. అలాగ నిర్విరామ క్షీరవర్షాలతో మడుగు ఏర్పడింది. ఆ కొలనులోని నీళ్ళు ” పాల వెల్లువ లాగా  తెల్లగా ఉన్నవి. అందుచేతనే ఆ ప్రాంతానికి “బెలగొళ” అనే పేరు వచ్చింది.

కన్నడములో “బిళుపు అంటే తెలుపు రంగు అని అర్థం. బెళ్ళగిన అంటే తెల్లని అని అర్థం. అదేవిధంగా కొళ అంటే కొలను అని అర్థం. అలా ఆ ప్రాంతానికి బెళ్ళగిన కొళ అన్న పేరు వచ్చింది. అదే రానురాను బెళగొళగా మారిపోయింది. 

మళ్ళీ అవ్వ కథకు వస్తే…గుళ్ళెడు పాలతో 57 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పూర్తిగా అభిషేకించిన అవ్వను చూడాలని అందరూ ఆత్రుతపడ్డారు. కానీ ఆమె కనబడలేదు. అందరూ , అంతటా వెతికారు.”ఆమె ఎవరు? ఎక్కడామె? మీరు చూసారా? కనబడిందా? ఎటు పోయింది?” అన్న మాటలు ఆ స్థలమంతా మారుమ్రోగాయి.

ఆమె ఎవరో కాదు జైన పురాణాల్లోని యక్షిణీ దేవత అయిన “పద్మావతి”.

12 వ శతాబ్దమునాడు కట్టిన గుళ్ళు ఆ సీమలో ఉన్నవి. గుళ్ళెకాయి అజ్జి మండపం, అందులో గుళ్ళెకాయిని చేతిలో పట్టుకునివున్న స్త్రీమూర్తి విగ్రహం ప్రత్యేక వాస్తు, శిల్ప శైలీ చాతుర్యాలతో  భాసిస్తూ నేటికీ సందర్శకులకు  ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
*****

Buy this book on Amazon

Your views are valuable to us!