Like-o-Meter
[Total: 0 Average: 0]
“కనకడి కిటికీ”(Kannada – ಕನಕನ ಕಿಂಡಿ; English – Kanaka’s window) అంటే ఏమిటి? ఈ పేరు రావడానికి కారణమేమిటి? ఇందుకు ఒక ఆసక్తికరమైన సంఘటన మూలము.
కనకదాసు (1509–1609) కన్నడ కవికనకదాసు ‘కురుబ గౌడ’ కులజాత మణిదీపము. నిమ్నజాతీయుడైన కనకదాసు- కన్నడ భక్తి సాహిత్యములో వెదజల్లిన శరచ్చ౦ద్రికా రాశి.
“ఉడుపి” కర్ణాటకరాష్ట్రములోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రము. బాలకృష్ణమూర్తి ఇక్కడ కొలువై ఉన్న దైవము. ఉడుపి అనగా “తారా దైవము యొక్క సీమ”- అంటే “చుక్కల రేడు ఐన చంద్రుని స్థలము” అని అర్ధము. కనకదాసు ఉడిపి కోవెలలోనికి అడుగిడటానికి సమ్మతించలేదు, ఆ గుడి పూజారులు.ఆ మహా భక్తుడు వేదనతో కుమిలిపోసాగాడు.మహాభక్త కనకదాసు ఆక్రందన అంతా ఆలాపనగా మారినది. ఆ ఆలాపనే “బాగిలను తెరెదు సేవెయను కొడో హరియే” అన్న కీర్తన.
ఈ పవిత్ర అద్భుత సంఘటనను కనుల పంటగా పొందిన వారిలో ఉన్న వ్యక్తి “శ్రీ వాదిరాజ స్వామి”. పడిపోయిన గోడ స్థానే మళ్ళీ గోడను నిర్మించజేసారు శ్రీ వాదిరాజ స్వామి. కొత్తగా గోడలో “కిటికీ” ని జాగ్రత్తగా అమర్చారు. కనకదాసు బాలకృష్ణుడి దర్శనమును పొందిన ఆ శిధిల కుడ్యపు స్థానములో కట్టిన ఒక చిన్న కిటికీకి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడినది. ఈ చిన్న కిటికీ నామమే “కనకదాసు కిటికీ”. నేటికి కూడా ఆ గవాక్షము ద్వారా క్రిష్ణ ప్రతిమకు అర్చనలు చేస్తూండటమే ఒక సంప్రదాయమై స్థిరపడినది.
అంతకు పూర్వము తూర్పు దిక్కు వైపుకు ఉన్న చిన్ని క్రిష్ణమ్మ బొమ్మ కన్నడ సంకీర్తనకారుడైన కనకదాసు కూర్చున్న వేపుకు అంటే ‘పశ్చిమ ముఖంగా’ తిరిగింది. ఈ అద్భుత సంఘటన జరిగిన చోటు
“ఉడుపి దేవళము”.
* * * * *
కర్ణాటక సంగీతములోని ఉగాభోగ సంప్రదాయములో తాదాత్మ్య స్వర మాధురి నెలకొల్పినది కనకదాస. సాహిత్యము మాత్రమే ఆధారము కాకుండా శ్రావ్య ఆలాపనము శ్రవణములకు భోగమును చేకూర్చే సరి కొత్త రాగ ప్రస్తావనలుగా నాద సరస్వతీ కిరీటములో మణిభాసురములగుట వింతగా 15 వ శతాబ్దమునుండీ- 19 వ శతాబ్ది నాటికి సుస్థిరమైనవి.
ఈ పధ్ధతికి పురందర దాసు, కనకదాసులు శ్రీకారము చుట్టి, నాంది పలికారు. ౧౯వ శతాబ్ది నాటికి తమిళ సంగీత కళాబిమానులు సైతము ఈ ఉగాభోగాలాపనా సంస్కృతిని తమ లోగిలిలోనికి ఆహ్వానము పలికారు.సంగీత నందనవనములో మేల్బంతి ఐన భక్త కనకదాసు కర్ణాటక రాష్ట్రానికి గర్వకారణమైన సంగీత, సాహిత్య తేజో ప్రభాకరుడు.