Like-o-Meter
[Total: 1 Average: 5]
వీనులవిందైన ముఖారి రాగములోని “కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!;” – ఈ పాట చాలా ప్రసిద్ధిమైంది. ఈనాటికీ భజన గోష్ఠుల కూడళ్ళలో, చెక్కభజనలలో, కోలాటాలలో భక్తులు పరవశిస్తూ పాడే సుపరిచితమైన దరువు పాట ఇది. ఈ పాట రాసిన వాగ్గేయకారుడెవరో, అతని పేరు ఏమిటో తెలుసునా? -అతనే తాడంకి వేంకటదాసు. 17 వశతాబ్దము నాటి భక్తాగ్రేసరులు ఈయన.
ఉయ్యూరు వద్ద ఉన్న తాడంకి అనే పల్లెటూరులో వేంకటదాసు జన్మించారు. ఈ కుగ్రామము క్రిష్ణా జిల్లాలోనున్నది. “పెద్దమద్దాళి ఉద్దండరాయ కీర్తనలు” అనే పేరుతో ఇంచుమించుగా 73 కీర్తనలను రాసారు. పెద్దమద్దాళి పల్లె, తాడంకి సమీపంలో ఉన్నది. ఈ గ్రామ దేవళములో “ఉద్దండ రాముడు”గా శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు. తాడంకి వేంకటదాసు రాసినట్టి 89 సంస్కృత కీర్తనలకు “గీర్వాణ కీర్తనలు” అని పేరు. ఆయన రాసిన ఇతర సంగీత ప్రక్రియలు కూడా శ్రేష్ఠతలో వాసికెక్కినవి. తాడంకి వేంకటదాసు ఇరవై రెండు “ఖ్యాలూలు”లను రాసారు. హిందీలో “ఖయ్యాల్/ ఖ్యాల్” అనే ప్రక్రియయే ఇది. ఇవి శ్రీకృష్ణ గుణగానములు. వీనిని సంస్కృత, ఆంధ్ర భాషలలో తాడంకి వేంకటదాసు వ్రాసారు.
* * * * *
శ్రీకృష్ణ లీలలు:
“నిజాంపేట శ్రీ వేణుగోపాలస్వామి”ని కీర్తించే 262 సంకీర్తనా గీతములు వీరి రచనలలో ఉన్నవి. “శ్రీకృష్ణ లీలలు” అనే గేయ రాశీ సంపుటి వన్నెలు తీర్చినవి. తాడంకి వేంకటదాసు శ్రీకృష్ణ భక్తుడు. అందుకనే ఆయన అనేక నుతులు కృష్ణస్వామిపై విరచించారు. శ్రీకృష్ణ జననము మొదలుకుని, రుక్మిణీ కల్యాణము దాకా కొన్ని ఘట్టాలతో విస్తృతముగా వర్ణనాత్మకంగా నుతించారు. శ్రీ క్రిష్ణ భగవానుని షోడశోపచార వివరణాత్మక కీర్తనావళి చెవులకు కమ్మని విందు. మరి మీరూ చదవి, ఆనందించండి!
కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!;
భజ గోవింద బాల! ||కిట్టమ్మా!||
నంద కుమార రార! నవనీతచోర! రార!
వెన్నలదొంగ! రార! వేణువినోద! ||కిట్టమ్మా!||
కాళ్ళాకు గజ్జెలు కట్టి, వేళ్ళాకుంగ్రాలు బెట్టి;
గోళ్ళాకు మెఱుగులు దీర గోరంటాకు పెట్టెద రార ||కిట్టమ్మా!||
కళ్ళాకు కాటుక బెట్టి, బుగ్గాన చుక్కను బెట్టి;
జబ్బులు చేయక నీకు ఉగ్గులు/ ఒగ్గూలు పోసెద రార ||కిట్టమ్మా!||
కొండీ కుచ్చులు బెట్టి; మెండూగ కురులు దువ్వి;
బొండు మల్లెల దండలు సిగను చుట్టెద రార ||కిట్టమ్మా!||
పప్పులు పెట్టెద బంగరు తిత్తుల గుప్పి గుప్పి
తప్పటడుగుల మా ఒప్పూల కుప్ప రార్! ||కిట్టమ్మా!||
వేణువినోద! వెలది, గొల్లలందరు కూడి
పంచ బాణ పరవశులై పైపై బడుదురురా ||కిట్టమ్మా!||