Like-o-Meter
[Total: 0 Average: 0]
శ్రీకాకుళం వద్ద- వీరఘట్టం గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. సర్కస్ ప్రదర్శనలలో మేటి. కోడి రామ్మూర్తి నాయుడు కలకత్తాలో ప్రదర్శనలు ఇచ్చే వారు. మహా నగరంలో వరుసగా 2, 3 నెలలు ప్రదర్శించేవారు ఆయన. ఛాతీ మీద ఏనుగును ఎక్కించుకోవడము, బలమైన ఇనప సంకెళ్ళను త్రెంచివేసుకుని నిలబడడమూ, రెండు కార్లను ఆపుట,రైలు ఇంజనును ఒంటి చేత్తో ఆపివేయగలగడమూ వంటి బల ప్రదర్శనలతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు.
“కలియుగ భీముడు”, “వీర కంఠీరవ”, “ఇండియన్ హెర్క్యులెస్” మొదలగు అనేక బిరుదులతో సన్మానించబడిన వ్యక్తి. ఆ రోజులలో దేశ విదేశాలలో ఇచ్చిన ప్రదర్సనలు మన వారికి ఎంతో గర్వ కారణాలు అయినాయి. బకింగ్ హామ్ పాలస్ లో కింగ్ జార్జి, క్వీన్ మేరీ ల ఎదుట ఇచ్చిన – Culinary play లతో వారి మెప్పు పొందాడు ఆయన. ప్రజలచేత వేనోళ్ళ పొగడ్తలను అందుకున్నారు కోడి రామమూర్తి గారు.
అబ్బూరి రామక్రిష్ణారావు తనయుడు అబ్బూరి రాజేశ్వరరావు. అబ్బూరి వరద రాజేశ్వరరావు గారు తన తండ్రి గురించి కొన్ని జ్ఞాపకములను వివరించారు.
* * * * *
అబ్బూరి రామక్రిష్ణారావు “ఆంధ్ర కంఠీరవ” అనే పద్యాన్నిరచించినారు. అబ్బూరి రామక్రిష్ణారావు గారు ఆ పద్యాన్ని”కలియుగ భీముడు” బిరుదాంకితుడైన కోడి రామమూర్తి మీద రాసారు. ఆ పద్యాన్ని చదివిన వెంటనే, అబ్బూరి రామక్రిష్ణారావు ఉంటూన్న ఇంటికి వచ్చారు కోడి రామమూర్తి. “రావుగారూ! ఇంత మంచి పద్యం రాసారు.మీరు ఇంత చిన్నవారు అని నేను అనుకోనే లేదు” – అంటూ ఆయన ఆశ్చర్యపడ్డారు. కోడి రామమూర్తికి ఆ తెలుగు పద్య మాలిక “ఆంధ్ర వీర కంఠీరవ”ఎంతగానో నచ్చినది. అబ్బూరి రామక్రిష్ణారావు రాసిన ఆ పద్యాలనుసిలుకు(silk) రుమాళ్ళ (kerchiefs) మీద అచ్చొత్తించారు కోడి రామమూర్తి. అలాగ చేతిగుడ్డలపై అచ్చు వేయించి, వాటిని తెలుగువాళ్ళకు పంచిపెట్టారు .
“నీ యశః పారిజాతమ్ముల మాల” అనే పంక్తితో ప్రారంభమౌతుంది ఈ పద్యం.జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి తెలుగుదేశములో, ఆనాటి ప్రతి కవి ముందూ చదివే వారు. “నీ యశః పారిజాతమ్ముల మాల.” అనే పద సందోహం ఒక్క అబ్బూరి రామక్రిష్ణారావుకే చేతనవును” అనేవాడు జరుక్ శాస్త్రిగా ప్రశస్తి కెక్కిన రుక్మిణీ శాస్త్రి.
అబ్బూరి రామక్రిష్ణారావు తనయుడు అబ్బూరి రాజేశ్వరరావు అభిమాన పులకాంకితులైనారు. తన తండ్రి గూర్చి ఒక వ్యాసంలో కోడి రామమూర్తికీ, అబ్బూరి రామక్రిష్ణారావుకూ ఏర్పడిన మైత్రీ అనుబంధాన్ని వివరించారు.
* * * * *
కోడి రామమూర్తి ప్రదర్శనలకు గవర్నర్లూ, మహారాజులూ, ఆంగ్లేయ ప్రముఖులూ హాజరు అయ్యేవారు. కోడి రామమూర్తి గారు తన ప్రదర్శనలకు వచ్చే ప్రత్యేక ఆహూతులకు ముందు వరుసలలో,వేరుగా ఆసనాలను వేయించేవారు.అక్కడ అలాగ ఆ ఆసనాల పక్కగా- మా నాన్నగారి (అబ్బూరి రామక్రిష్ణారావు)కీ, మా అమ్మగారికీ రెండు కుర్చీలను ప్రతి రోజూ కేటాయించి ఉంచేవారు.
ఓ రోజున గవర్నరుగారి కుటుంబం వచ్చారు,. అక్కడ అబ్బూరి రామక్రిష్ణారావు దంపతులకై కేటాయించిన ఆ రెండు కుర్చీలనూ కూర్చోవడానికి తీసుకుంటామని అన్నారుట. కోడి రామమూర్తి “అలాగా కుదరదు! వీల్లేదు!” అంటూ సుతరామూ అంగీకరించలేదు. గవర్నరు కుటుంబానికి ఆ ఆసనాలను ఇవ్వకుండా నిర్మొగమాటంగా తిరస్కరించారు కూడా!
“ఆ కుర్చీలు అలా ఉండావలసిందే లేకపోతే ప్రదర్శనకు అంతరాయం కలుగుతుందని” గవర్నరు గారి కార్యదర్శికి కబురుచేసారుట- కోడి రామమూర్తి. అబ్బూరి రామక్రిష్ణారావు అంటే కోడి రామమూర్తి గారికి అంతటి అభిమానం. ఆ స్నేహ అభిమానములకు విలువ కట్టగలమా? స్నేహ బంధాలకు అంత విలువను ఇచ్చి, ఆ అమూల్య బంధాలను కాపాడే సున్నిత మనస్వి కోడి రామ్మూర్తి.
(అబ్బూరి సంస్మరణ, పేజీ 141)