కుల్ధారా దెయ్యాల దిబ్బ – రంగీలా సినిమా

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

“రంగీలా” అనగానే ఊర్మిళ, రాంగోపాల్ వర్మలు మనకు చటుక్కున జ్ఞాపకం వస్తారు. “హై రామా.. అనే పాటని “కులధారా శిధిలాల”లో ప్రత్యేక ఆసక్తితో తీసాడు వర్మ. కుల్ధారా శిధిలాలనే ఎందుకు ఎన్నుకున్నాడంటే- దానికి తనదైన శైలిలో వివరణ నిచ్చాడు.అలాంటి అపూర్వ అభిప్రాయాల్ని తెలుసుకోవాలంటే “నా ఇష్టం” అనే ఆతని ఆత్మ కథాగత ఒపీనియన్సును చదవండి .

*****

సరే! ఈ పుస్తకం సంగతులను అటుంచండి. కుల్ధారా శిధిలాల కథా కమామిషూ ఏమిటి?

కుల్ధారా అనే మారు మూల పల్లెటూరు, రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. జైసల్మీర్ పట్టణానికి పశ్చిమ దిక్కులో 15 Km దూరాన ఉన్న కుగ్రామం ఈ Mysterious Ghost-Town: Kuldhara Ruins -Rajasthan.అలనాటి కుల్ధారా వైభవంగా ఉండేది. అక్కడ నివసిస్తూన్న పాలీవాలా బ్రాహ్మణులు ఈ పరగణాల సిరిసంపదలకు మూల స్తంభాలు. వారు అమోఘమైన పండితులు, అంతే కాదు, సుడి తిరిగిన వాణిజ్యవేత్తలు కూడా!

అంతేనా! వాళ్ళు వ్యవసాయంలో కూడా చేయి తిరిగిన వాళ్ళు. నీళ్ళు లేని రాజస్థాన్ ఎడారి (Thar Desert పై సమృద్ధముగా పంటలు పండించేవారు. ప్రతి నీటిబొట్టునూ వృధాకానీకుండా బావులనూ, నీటి వనరుల కేంద్రాలనూ నిర్మించారు. ఆనాడు వీరు ఇళ్ళను బంగారు ఇటుకలతో కట్టించారు- అని జనశృతి. అలాగ ఎనలేని సిరిసంపదలు కలిగిన కుల్ధారా అకస్మాత్తుగా “దయ్యాల దిబ్బ” గా మారిపోయింది, నేడు శిధిలాలుగా దీనావస్థలో మిగిలిపోయింది.

ఎందుకని అలాగ?

ఇందుకు కారణమైన చారిత్రక సంఘటనలను స్థానికులు చెబ్తూంటారు.

*****

మహర్వాల్ దీవాన్ స్వరూప్ సింగ్. అతని కొడుకు సలీం సింగ్.  ఇతనికి ఇతర సంస్థానాధీశులు, సామంతులు, ఇత్యాదుల మధ్య జరిగిన పొడసూపినట్టి వివిధ సమస్యలూ, సంభవించిన సంఘర్షణలూ కుల్ధారా మహోజ్జ్వల చరిత్రను వింత మలుపులు తిప్పినవి. జైపూర్ మండలాలపై అధికారం చెలాయించే సలీం సింగ్ అనే దళపతి క్రూరత్వానికి మారు పేరు. మహారాజు రాజ్యాధికారాలను అప్పగించడంతో ఆతని ఆగడాలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. రాజు క్రమంగా నిస్సహాయతతో స్తబ్ధుడై మిగలగా, దళపతి ఆర్ధిక వ్యవహారాలను చేజిక్కించుకుని నిరంకుశత్వంతో, దుష్ట ప్రవర్తనతో చెలరేగిపోసాగాడు. అందమైన స్త్రీలను జనానాలోకి నిర్దయగా చేర్చుకునేవాడు. లెక్కలేనన్ని పన్నులను వసూలు చేసేవాడు. అలాగ ఊళ్ళలో తిరిగేటప్పుడు, కుల్ధారా పట్టణములోని ఒక చక్కని పడుచుపై ఆతని కళ్ళు పడ్డాయి. ఆ కన్నె ’పాలివాలా బ్రాహ్మణ’ కుటుంబిని.

*****

సలీం సింగ్ క్రూరుడు.అప్పటికే ఏడుగురు స్త్రీలను పెళ్ళాడాడు సలీం సింగ్. 16 ఏళ్ళ కుల్ధారా సుందరీమణిని తన అడ్డాలోకి తెచ్చుకోవాలనే దుష్ట తలంపుతో చాలా కిరాతకపు చర్యలకు తెగించాడు. షోడశ వర్ష ప్రాయ బాలికకై ఆమె తండ్రికి కబురు పంపించాడు. అతను తన కుమార్తెను ఒక క్రూరునికి ఇచ్చి పెళ్ళి చేయడానికి నిర్ద్వందంగా నిరాకరించాడు. అప్పుడు సింగ్ పూర్తిగా ప్రతినాయకుడు ఐనాడు. పగతో కక్ష సాధింపు క్రియలు మొదలెట్టాడు. అర్ధం పర్ధం లేని సుంకములను విధించాడు. ఆ పాలీవాలా బ్రాహ్మణులను ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించసాగాడు. చుట్టుపక్కల 82 గ్రామాలలో వర్తక వర్గీయులైన ఆ బ్రాహ్మణులు ఉన్నారు. అందరినీ ప్రతీకారంతో నానా బాధలు పెట్టసాగాడు.

*****

రాజస్థాన్ ఎడారులలో పాలీవాల వారు అత్యంత జాగరూకతతో త్రవ్వించిన బావి ఉన్నది. మంచినీళ్ళకు అందరికీ ఆధారమైన బృహత్ కూపము (బావి)అది. ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూన్న జలధారల ఊటబావి అది. అందులో సింగ్ జంతు కళేబరాలను వేయించాడు. నీళ్ళు కలుషితాలై, జనుల ఆరోగ్యభంగహేతువైనవి.

శాకాహారులైన పాలీ బ్రాహ్మణులు ఈ చర్యతో విసిగిపోయారు. రాత్రికి రాత్రే 84 పల్లెల వారూ దృఢనిశ్చయానికి వచ్చారు. చేతనైనంత బంగారమును, సంపత్తినీ మోసుకుంటూ కదిలారు. వెళ్తూ వెళుతూ వారు శపించారు. “ఇక మీదట అక్కడ ఎవరూ ఉండకూడదు..ఉంటే నేలమట్టమై పోతారు.”

వాక్శుద్ధి కలిగిన వారి వాక్కు వెంటనే వాస్తవమైంది. ఫలితంగా కుల్ధారా నిర్జన సీమ ఐంది.

పట్వా (కుల పెద్ద) తనయ ఆత్మహత్య చేసుకున్నది. ఆమె రక్తంతో ప్రతి ఇంటి తలుపుపై గుర్తులు వేశారు వాళ్ళు. నేటికీ అక్కడి ప్రజలు చీకటి పడిన తర్వాత ఆ ఊరి వేపుకి వెళ్ళరు. అక్కడ టూరిస్టు డిపార్టుమెంటు వారి బోర్డు కూడా “సాయంత్రము తర్వాత ఇటు ఎవరూ నడవకూడదు” అని ఉన్నదట! ఒకే రాత్రిలో తటస్థపడిన మహావలస సంఘటన ఇది. మేధావులు అందరూ (ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ మున్నగు జాగాలకు) తరలివెళ్ళడంతో సహజంగానే కుల్ధారా ప్రాంతాలు నిస్తేజమైనాయి. ఒకప్పుడు ధన ధాన్య భోగ భాగ్యాలతో విలసిల్లిన ఆ సీమలు – ‘దయ్యాల ధామములు’– అనే చిత్రంగా (బొమ్మగా, సినిమా) విచిత్రంగా మారిపోయినవి.

చిత్రమేమిటంటే – ఈ చారిత్రక సంచలనాత్మక చేదు నిజం – కుల్ధారా శిధిలాల కథను- వార్తలలోకి ముఖ్య శీర్షిక అయ్యేలా చేసినవి.

*****

ఏది ఏమైనా- “రంగీలా” పుణ్యమా- అని, ఇప్పుడు మళ్ళీ Kuldhara The Ghost Town ప్రజలకు హాట్ మంకి టాపిక్ గా మారినది. టూరిస్టులు ఒకసారి “కుల్ధారాకి వెళ్ళి చూడాలి” అని అనుకునేటట్లుగా చేసినవి “रंगीला” వంటి సినిమాల షూటింగులు, హంగామాలు.

Your views are valuable to us!