కేవలం ఒక ‘పళ్ళపొడి పేరు’ను తన పేరుగా రైలు పొందిన సందర్భం ఉంది. అదేమిటో తెలుసా?
మనదేశం స్వాతంత్ర్యం పొందిన తొలిదశలో – ఆర్ధికంగా తప్పటడుగులు వేస్తున్నదశలో – వ్యాపారరంగంలో కొన్ని ఉత్పత్తులు – అమృతాంజన్, నవనీతం లేపనం వంటివి వచ్చినవి.ప్రజల ఆదరణను పొంది, బిజినెస్ రంగానికి మార్గసూచికలు ఐనవి. అట్లాంటి లిస్టులో చేరిన పేరు “నంజన్ గూడ్ పళ్ళ పొడి“.
నేడు టూత్ పేస్టులు, టూత్ బ్రష్ లు, టూత్ పౌడర్లు మార్కెట్టులో హల్ చల్ చేస్తున్నవి. స్వాతంత్రం పొందిన కొత్తల్లో, సమాజం సాంప్రదాయిక విధానాలను అనుసరిస్తున్నది. అప్పట్లో ప్రజలు దంతధావనానికి వేప పుల్లలు, కానుగ పుల్లలు వంటి వాటిని పందుంపుల్లలుగా వాడేవారు. పిడకలపై వంటలు చేసేవారు. పిడకల కచ్చికలతోనూ,బొగ్గుపొడితోనూ, డికాక్షన్ తయారీకి వాడేసిన కాఫీపొడి మొదలైనవాటితో – పళ్ళుతోముకునేవాళ్ళు. ఆ తరుణంలో వ్యాపారరంగం వైపు దృష్టి సారించిన వ్యక్తి “బి.వి.పండిత్“.
మైసూర్ చామరాజ్ ఒడెయర్ ఆయుర్వేద కాలేజీ నుండి ఉత్తీర్ణులైన మొదటి బ్యాచి విద్యార్ధులకు లీడరు ఈ పండిట్. బృందనేతగా పటిష్ఠ ప్రణాళికకు రూపకల్పన చేసారు. “సద్వైద్య శాల” ను నెలకొల్పారు బి.వి. పండిత్.
B.V. Pandit ఆయుర్వేద వైద్యులు,ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రజావళికి ఉపయోగపడేలా యోచన చేసారు. పండిత్, శిష్యులు, కుటుంబీకులు అందరూ – పళ్ళపొడి తయారీకి వాడవలసిన వస్తువుల జాబితాను రాసుకున్నారు. సగటు మనిషి కొనుగోలుశక్తి – ఇందులో కీలకపాత్ర వహించినది. చిగుళ్ళకు హాని కలిగించని పదార్ధాలను ఎంపిక చేసారు. ఏకగ్రీవంగా ఆ మెనూ ని ఆమోదించారు. అందరి సమిష్ఠి కృషి ఫలితం నంజనగూడు దంతచూర్ణం.
మొదట కుటీరపరిశ్రమ స్థాయిలో వారు పొడిని ఉత్పత్తి చేసారు. వరిపొట్టుతో బి.వి. పండిత్ చేసారు. కొన్ని ఒడిదుడుకులను అధిగమించి, విపణివీధిలో నిలదొక్కుకున్నారు. మింట్ కలిపిన పింక్ కలరు పళ్ళపొడి అట్టడుగు వర్గాల వారు కూడా కొనగలిగేలాగా కారుచౌకగా లభించడం వలన మారుమూల పల్లెటూళ్ళు సైతం ఈ పేరును ‘పళ్ళపొడి’కి ప్రతీకగా నిలబెట్టినవి.
“సద్వైద్య శాల” ఫౌండర్ “బి.వి.పండిత్” – ఆయన ‘నంజనగూడు హల్లుపుడి‘ (నంజనగూడు పళ్ళ పొడి) ఉత్పత్తిని సంఘంలోనికి తీసుకొచ్చారు.
******
“సద్వైద్య శాల” నంజనగూడు పళ్ళ పొడి లేతగులాబీరంగులో, తియ్యగా ఉండి ఇంటింటా ఆదరణ పొందింది. నోటి చిగుళ్ళు, పళ్ళు సంరక్షణకు అద్భుత రక్షాకవచం అనే నమ్మకాన్ని పొందింది ఈ పళ్ళపొడి. ఈ దంతధావన చూర్ణం చిరకాలం నాణ్యతతో, అచిరకాలంలోనే కన్నడసీమలో అందరి ఆదరాభిమానాలను చూరగొన్నది.
హల్లు పుడి ట్రైను :-
ఈ పళ్ళపొడి ఎంత జనరంజకమైనది అంటే – నంజనగూడు ఊరుకి వస్తున్న రైళ్ళను “హల్లు పుడి ట్రైను” (పళ్ళపొడి ట్రైను) అని పిలిచే వారు. ఐదు పుష్కర కాలాల వెనుక ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణులకు సుపరిచితం నంజనగూడుపళ్ళపొడి. కొత్తగా 4-ఇంచ్, 3-ఇంచ్ బ్రౌన్ పేపర్ బ్యాగ్ రూపాన, హెర్బల్ ప్రోడక్టుగా ఇప్పుడు పునః ప్రవేశం జరుగసాగినది. 90 సంవత్సరాల ఘన చరిత్రను సొంతం చేసుకున్న నంజనగూడు పళ్ళపొడి, మళ్ళీ నేడు కొత్త అవతారం దాల్చుతున్నది.
*******
నంజనగూడు ప్రాంత సమాచారం, ఆసక్తికర విశేషాలు కొన్ని పరికిద్దాం.
1) బి.వి. పండిత్ సంబంధిత అంశాలలో ప్రత్యేక అంశం ఒకటి ఉన్నది. ఆయన కుమార్తె – కల్పనా పండిత్ ఫేమస్ సినిమా నటి కూడా!
2) నంజనగూడు కేలాలు:- నంజనగూడు సీమ లో పండుతున్న అరటిపళ్ళు రుచికరమైనవి. Kayyar Kinnan Rai వీటి రుచిని వివరిస్తూ “నంజనగూడిన రసబాళె” అనే పాటను రాసారు. నోరూరించే ఆ పాట (తెలుగులో ‘మొక్కజొన్నతోటలో’ వలె) అందరు కులాసాగా ఈలవేస్తూ కూనిరాగం తీసేలాగా హిట్ ఐంది.
3) కయ్యర కిణ్ణన్ రై (ಕಯ್ಯಾರ ಕಿಞ್ಞಣ್ಣ ರೈ) (జూన్ 1915) :- నంజనగూడు ప్రాంతాన పేరొందిన రచయిత, జర్నలిస్టు, సాహితీచైతన్య కృషీవలుడు – అని పేర్గాంచారు. వీరు రాసిన కదళీరసభరిత కవితను పద్య గీతమ్ – బాలగీత, జానపదగీత ఫణితితో శ్రవణానందకరమైనది. “పడువారళ్ళి పాండవరు” – అనే కన్నడ సినిమాలో అతనురాసిన కొన్ని పద్యాలను చేర్చారు. (తెలుగులో బాపు దర్శకత్వంలో “మన ఊరి పాండవులు”గాను, హిందీలో “హమ్ పాంచ్”గాను వచ్చిన సినిమా)
********
నంజనగూడుపుణ్యక్షేత్రం :-
కపిలనదీ తీరమున వెలసిన నంజనగూడ్. ఈ సీమలో గౌతమముని ప్రతిష్ఠించిన శ్రీలింగం కలదు. ఈ ఊరికి ఉపనామములు ‘గరళపురి ‘, గొలపుర. నంజనగూడు పుణ్యక్షేత్రం :- కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, “శ్రీ కంఠేశ్వరస్వామి” నెలకొని ఉన్నాడు . “దక్షిణ వారణాశి” “దక్షిణ ప్రయాగ” అని కీర్తి కలిగిన ఆలయం.
నంజుండేశ్వరస్వామి – “నంజు” కన్నడ మాటకు విషం అని అర్ధం. క్షీరసాగరమథనం జరిగినప్పుడు అనేకవస్తువులు పుట్టినవి. పిమ్మట హాలాహలం వచ్చింది. ఆ విషాన్ని గ్రోలి కంఠం లో నిలువరించగలిగిన మహాశివుడు, ఇక్కడ వెలిసాడు. గరళకంఠునికి ఇక్కడ నంజుండేశ్వరస్వామి అనే పేరు కలిగినది.
హకీం నంజన్ గూడు/ నంజనగూడ్ :- “హకీం నంజన్ గూడు” అని ఈ ఊరుని టిప్పుసుల్తాన్ పిలిచాడు. టిప్పు సుల్తాన్ యొక్క పట్టపు ఏనుగుకు కంటిచూపు పొయ్యింది.నంజుండేశ్వరస్వామి తలిచి, ప్రార్ధించాడు టిప్పుసుల్తాను. ఏనుగు సమస్యను పరిష్కరించుకున్నాడు. మైసూర్ గెజెట్ లో ఈ వివరములు ఉన్నవి. టిప్పుసుల్తాను పచ్చలు, మరకత నెక్లెస్ ను శ్రీనంజుండేశ్వరస్వామి గుడికి బహుమతులుగా సమర్పించుకున్నాడు.
కబినీ నది:-
కావేరీనదికి ఉపనది ఐనట్టి – కపిల నది కి ‘కబిని’ మరి ఒక ప్రాచీన నామం ఉన్నది. కపిలనదీ స్నానాలకు ప్రత్యేకత కలదు. భక్తులు కపిలనదిలో చేస్తున్న పావన స్నానాలను (ఉరుళు సేవె)అంటారు.