ప్రఖ్యాత గీతం “రఘుపతి రాఘవ రాజా రామ్” కు సంగీతబాణీ కట్టినది ఎవరో తెలుసా?
ఆయనే ప్రఖ్యాత పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్. విష్ణు దిగంబర్ పలూస్కర్ గారికి లోకమాన్య తిలక్,మహాత్మా గాంధీజి మొదలైన ప్రముఖులతో సాన్నిహిత్యం ఉండేది. “రామ్ ధున్” మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన పాట.
సత్యాగ్రహ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతూన్న రోజులు అవి. దండి ఉప్పు సత్యాగ్రహం (Dandi March) సమయాలలో “రఘుపతి రాఘవ రాజా రామ్ ”ఈ పాటను అందరూ పాడేవారు. ప్రధానంగా భక్తి కీర్తనలు ఆలపించే విష్ణు పలూస్కర్ ఈ గీతమునకు ట్యూన్ ని కట్టాడు. జాతిపిత పండిట్ విష్ణు దిగంబర్ప లూస్కర్ కి రాగమును కూర్చమని- విష్ణు దిగంబర్ పలూస్కర్ కి చెప్పారు. విష్ణు దిగంబర్ పలూస్కర్ అమితానందంతో ఆ మహత్తర బాధ్యతను స్వీకరించారు.
1907 లో లాలా లజపతి రాయ్ అరెస్టు ఐనప్పుడు విష్ణు దిగంబర్ పలూస్కర్ “పగ్రీ సంభాల్ జట్టా” అనే గీతమునకు సంగీత బాణీలను కట్టి, పాడారు. పండిట్ విష్ణు సమకూర్చిన బాణీలతో ఆ దేశభక్తి గీతాలు- ఉద్యమకారులలో ఉత్సాహ ఉద్వేగములు ఉవ్వెత్తున ఎగసిపడ్తూ పరవళ్ళు తొక్కించేవి.
**********
విష్ణు దిగంబర్ పలూస్కర్ (1872-1931)”సంగీత భాస్కరుడు”. విష్ణు దిగంబర్ పలూస్కర్ ప్రాచీన భక్తి గీతములను తీసుకుని, సాంప్రదాయిక స్వరములను కూర్చుటలో సిద్ధహస్తుడు. “వందేమాతరం” గీతమును పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ బాణీ కూర్చిన తర్వాత, “ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగులు”లో దేశభక్తి గీతముగా “వందేమాతరం…..” ను ఆలపించుట సంప్రదాయముగా ఏర్పడినది.
**********
మీరజ్ సీమ రాజు విష్ణు దిగంబర్ పలూస్కర్ లో సంగీత ప్రతిభ ఉన్నదని ఈతని 12 ఏళ్ళ వయసులోనే గుర్తించిన వ్యక్తి ; బాలక్రిష్ణ బువా పండితునికి “ఈ బాలునికి సంగీతము నేర్పమని” అప్పగించారు. బాలక్రిష్ణ బువా పండితుని వద్ద విష్ణు దిగంబర్ పలూస్కర్ సంగీత విద్యకు శ్రీకారము చుట్టబడినది.
***********
సంగీతమును ప్రజలకు హృదయంకితమయేలా, అందరికీ చేరువలోకి తెచ్చాడు పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్. అప్పటిదాకా చక్రవర్తుల పోషణలో ఉన్నతశిఖరములను చేరిన కళలు- ప్రజాస్వామ్య యుగములో- ప్రజలకు చేరువ అవ్వాల్సిన అవసరం కలిగినది. హిందూస్థానీ సంగీతమును జనుల మానస సరోవరములలో విరబూసే సహస్రదళ పద్మములా విరబూయించిన ఘనత పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ దే! పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ సాంప్రదాయ హిందూస్థానీ, ఘరానా రీతులు ఇత్యాదులు- పండితులకే పరిమితమవకుండా, పామరులకు సైతం అందుబాటులోకి తేగలిగాడు. ఇందుకు ఆయన స్థాపించిన “గాంధర్వ మహావిద్యాలయ” తొలి కాంచన సోపానమైనది. ఆయన శిష్య ప్రశిష్యులు ఎందరివో నిష్కామ సేవలు, నిస్సందేహంగా ఈ రంగంలోని మూలస్థంభాలు.
వినాయకరావు పట్వర్ధన్, ఓంకామఠ్ ఠాగూర్, నారయణరావు వ్యాస్, శంకర్ రావ్ వ్యాస్, బి.ఆర్. డియోధర్ మున్నగువారు- పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ యొక్క శిష్యులై, హిందుస్థానీ ; సాంప్రదాయ సంగీతమును ప్రజలకు కరతలామలకం చేసారు. సంగీతప్రపంచములో అనర్ఘ రత్నములైన ఇట్టివారు- కళామతల్లికి చేసిన పూజలు తరువాతి తరముల వారికి లభించిన గొప్ప వరములైనవి. ఆబాలగోపాలమూ సంగీత కళను ఆప్యాయతతో అభ్యసించే మేలిమి మలుపు ఏర్పడినది.
**********
పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ కుమారుడు “దత్తాత్రేయ విష్ణు పలూస్కర్” తన తండ్రి ఆశయాలను ఆచరిస్తూ, సంగీత ఉద్యమమును కొనసాగించిన ధన్యజీవి. పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ రచించిన “సంగీత్ బాల్ ప్రకాశ్” 3 వాల్యూములు, రాగములను గూర్చి వెలువరించిన 18 భాగములు సంగీతప్రపంచములో అనర్ఘ రత్నములు.
**********