“సారనాధ్” పేరు ఎలా వచ్చింది?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మన పావన త్రివర్ణ పతాకములో మధ్య ఉన్న ధర్మచక్రమును సారనాధ్ స్థూపము నుండి గైకొన్నారు. ఈ విశేషము మన అందరికీ తెలిసినదే!

ఉత్తర ప్రదేశ్ లోని “సారనాధ్” కు ఆ పేరు ఎలా వచ్చింది? 

సారంగము అనే సంస్కృత పదమునకు “జింక” అని అర్ధము కదా! సారంగ నామము ఆధారమైనది. జింకను అలంకారముగా తన చేతిలో ధరించిన వ్యక్తి “సారంగ పాణి”. 

(…మీరు కనుక్కున్నారన్న మాట!

పరమేశునికీ, గౌతమ బుద్ధుని అవతారమునకు ఈ నామాంతరము కలిగెను.జింకల కేంద్రంగా విలసిల్లుతూన్న ఆ చోటుకు సారంగము పద మూలముగా “సారంగ నాధ్” అని ఆ పట్టణానికి పేరొచ్చింది. అలాగే “సారనాధ్” ఈ సారంగనాధ్ అను మాట నుండి వచ్చినదే. 

******

గౌతమ బుద్ధుని జీవిత గాధతో ముడి ఉన్న చారిత్రకాంశము ఇది. దేవ భాష ఐన సంస్కృతభాష రాజభాషగా ఉన్న రోజులు అవి.

“బుద్ధమ్ శరణమ్ గచ్ఛామి।”, “సంఘం శరణమ్ గచ్ఛామి।”, “ధర్మం శరణమ్ గచ్ఛామి। ” అను ఈ త్రిపీటకములు (“Three Baskets”) బౌద్ధమతమునకు పునాదిరాళ్ళు. 

పామరుని నుడికారములుగా ఈసడించబడి, నిరాదరణకు గురైన భాషలు సాహిత్యములో చోటుకు నోచుకోలేదు. అలాటి అతి ప్రాచీన కాలాన బుద్ధభగవానుడు సామాన్యుల భాషకు పట్టం కట్టాడు. భాషాపరంగా అద్భుత సాహసి ఆయన అని నిక్కంగా వక్కాణించవచ్చు. “పాలీ భాష” లోనే ఆయన బోధనలన్నీ కొనసాగాయి.

అలాగే అప్పటి ప్రాంత, దేశాదుల పేర్లు “బుద్ధ జాతక కథలు” లో “పాళీ భాష”లోని స్వస్వరూపాలలోనే ఋజువును పొందినవి.

*****

జింకకు అనేక నామములు కలవు. సారంగము, మృగము, మృగోద్యానము మొదలైన పేర్లు ఉన్నవి. అలాగే ఆనాటి సమాజములో ఇలాటి “పాలీ పద పుష్పములు” లెక్కకు మించి ఉన్నవి. అట్టి కొన్ని పలుకులు చూద్దాము. ఋషి పట్టణం, ధర్మ చక్రము, ఇత్యాది గీర్వాణ పదములకు ప్రతిగా ఆయా మాటలు బౌద్ధ పరివ్రాజకులు వ్యాప్తిలోనికి తేగలిగారు.

“మృదావ” అంటే- హరిణముల పార్కు. వీనినే నేడు “అభయారణ్యాలుగా” తీర్చిదిద్దారు. ఋషి పట్టణమునకు పాలీ ధ్వని “ఇసి పటన” గా రూపుదిద్దుకున్నది.

******

జ్యూయన్ సాంగ్ (Xuanzang) ప్రఖ్యాత చీనా యాత్రికుడు. యాత్రారచనల రూపంలో తాను చూసిన అగణిత అంశాలను పూసగుచ్చినట్లు, అక్షర రూపాలను కల్పించడములో ఆయనది అందె వేసిన చెయ్యి.  అతని హస్త తూలిక (pen) అప్పటి బౌద్ధ సమావేశాలనూ, సాహిత్యాన్నీ అక్షర బద్ధం చేసినది. ఆ రచనలలో ఈ సమాచారములను ఉటంకించాడు. 

నిగ్రోధమిగ జాతక కథ (Nigrodhamiga Jataka) హరిణ వన వివరములను రాసాడు. బెనారస్ రాజు (కాశీ ప్రభువు) “హరిణాలు స్వేచ్ఛగా తిరుగాడేటందు కోసమని అడవిని కానుకగా సమర్పించుకున్నాడు.

******

“Lord of Deer” సారంగ పాణి. ఆ స్వామి కొలువైన ప్రదేశమే “సారనాధ్”. అందున్న స్థూపము – “సారనాధ్ స్థూపము”. ఆ స్థూపము మీదనున్న “ధర్మ చక్రము”ను నీతికీ ధర్మ ప్రవర్తనకూ ప్రతీకగా స్వీకరించి, పింగళి వెంకయ్యగారు మువ్వన్నె పతాకము మధ్య ఉంచి, సకల జనామోదముగా రూ పొందించాడు.

*****
 

 

Your views are valuable to us!