Like-o-Meter
[Total: 0 Average: 0]
వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్ (Vallabhai Jhawer Bhai Patel, 31st October 1875 – 15th December 1950), స్వాతంత్ర్య వీరుడు.ఉక్కు మనిషి గా ప్రజల మన్ననలను అందుకున్న వ్యక్తి.బాల్యం నుండీ అమిత ధైర్య సాహసాలను ప్రదర్శించే వాడు. పాఠశాల, విద్యార్ధి దశలో పటేల్ నిష్కర్షతనానికి గుర్తుగా ఒక జరిగిన సంఘటన ఇది.
స్కూలులో లెక్కల మాస్టారు బ్లాక్ బోర్డుమీద లెక్కలు రాస్తూ, చదువు చెబుతూన్నారు. ఒక ఆల్జీబ్రా లెక్క, ఆ పంతులు గారికి, ఎంతసేపటికీ కొరుకుడు పడలేదు. లేచి నిలబడ్డాడు. “అయ్యా! ఆ లెక్కను నేను చేస్తాను” అని అడిగాడు. “ఏమిటీ? ఈ గణితాన్ని ఔపోసన చేసినట్లు మిడిసిపడుతున్నావే? ఐతే సరే! ఈ లెక్కను చేసి, నువ్వే ఉపాధ్యాయుడిని, అనిపించుకో! సరి!” అంటూ సుద్దముక్కను విసిరాడు.
ఆ చాక్ పీసును అందుకుని, నల్లబల్ల దగ్గరికి చక చకా నడిచాడు విద్యార్ధి పటేల్. గబగబా ఆ లెక్కను పరిష్కరించాడు. అలా బోర్డు మీద పటేల్ లెక్కను రాయగానే, క్లాసులో కరతాళ ధ్వనులు మార్మ్రోగాయి. అందరూ నిర్ఘాంతపోయేలా అప్పుడే ఒక సంఘటన జరిగింది. పటేల్ మాష్టారు ఆసీనుడయ్యే కుర్చీ వద్దకు వెళ్ళాడు. ఠకాలన ఆ చైర్ లో కూర్చున్నాడు దర్జాగా. అధ్యాపకునికి దిగ్భ్రమతో, పట్టరాని కోపం కలిగింది. ఉక్రోషంతో రౌద్రంగా వెళ్ళి, హెడ్ మాస్టారుకు కంప్లైంట్ చేసాడు. అప్పుడు Head Master పటేల్ ను పిలిపించాడు.
“ఏమిటి పటేల్! ఇలాగ ఎలాగ ఎందుకని చేసావు?”
ఉన్నదున్నట్టుగా వివరిస్తూ చెప్పాడు పటేల్.
“సార్! గణిత సమస్యను solve చేసి, మాస్టారు గారు చెప్పినట్లే నేను కూడా ఉపాధ్యాయుడిని అనిపించుకున్నాను కదా! కాబట్టే ఆయన హెచ్చరిక ప్రకారమే లెక్కను చేసాను. అందుకనే ఆ కుర్చీలో కూర్చున్నాను. తప్పేమీ లేదే? ‘”
అది సమస్యాత్మక సందర్భమని- హెచ్. ఎం. కు అర్ధమైనది. పటేల్ చెప్పిన దాంట్లో సబబు కనిపించింది. ఐనప్పటికీ మనసులోనే నవ్వుకుని,
“పెద్దలను గౌరవించాలి పటేల్! నువ్వు అలాగ పంతులు గారి కుర్చీలో కూర్చోవడం చాలా తప్పు. ఇకమీదట ఎప్పుడైనా ఇలాటి పొరబాటు చేస్తే స్కూలు నుండి నిన్ను పంపిస్తాను” తర్జని చూపిస్తూ అన్నాడు పెద్దాయన. దానికి కూడా పటేల్ తటపటాయించకుండా ఇలా అన్నాడు “సర్! పిల్లలకు విద్య చెప్పే గురువుగారు ఆ పాఠాన్ని ముందే ప్రిపేర్ ఐ రావాలి. అంతేగానీ, సగం జ్ఞానంతో, అర్ధ చదువుతో వస్తే ఎలా? క్లాసులో అడుగు పెట్టే ఇలాటి టీచరు ఉన్న పాఠశాలలో ఉంటే పిల్లలకు చదువు ఎలా వస్తుంది. అందుకని నేనే వెళ్ళిపోతున్నాను!”.ఇంకేమున్నది, ధైర్యశాలి పటేల్ ఆ హైస్కూలు నుండి వెళ్ళిపోయాడు, వేరే స్కూలులో చేరాడు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ బాల్య దశలో ఇంతటి నిర్మొహమాటాన్ని మనము (రచయిత్రి) ఒప్పుకోలేము. కానీ విద్య పట్ల పటేల్ కు కల శ్రద్ధాసక్తులను మెచ్చుకోకుండా ఉండలేము. భావి కాలంలో అఖిల భారతావనిని ఏకత్వ పరచి,ఏక దేశముగా చేసి, “ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా” గా ప్రశంసార్హమైన ధీశాలి, మహావ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.