“మోడీ స్క్రిప్ట్” – ఇదేమిటి? ప్రధానమంత్రి ‘మోడీ’ పేరుతో ఉందే అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఆశ్చర్యజనకమైన అంశమే ఐనా ఆసక్తికరమైన విశేషమే!
ఈ ‘మోడీ లిపి / మోడీ స్క్రిప్టు మరాఠీ, గుజరాతీ ల కదంబమాలిక, ఇది మరాఠీ భాషలో విభిన్నశాఖగా మన్ననలను పొందుతూ ఉన్నది. సరే! మరి ఐతే – అసలు ఇట్లాంటి స్క్రిప్టును సృష్టించిన వ్యక్తి ఎవరు? ఆ మేధావి పేరు హేమాద్రిపంత్.
హేమాద్రిపంత్ ఎవరు? ఏనాటి మనిషి ఇతను?
‘హేమాద్రిపంత్ సింధు దుర్గ్ నివాసి, నాసిక్ మున్నగు ఊళ్ళలో నివసించాడు. 1259 – 1274 C.E మధ్యకాలంలో దేవగిరి పరిపాలన చేసిన శౌన యాదవ వంశీయులకు మంత్రి అయి, సమర్ధతతో యశస్సు నార్జించాడు. యాదవ రాజైన రామచంద్ర వద్ద ‘శ్రీకరణాధిప’ అనే పదవీగౌరవాన్ని పొందాడు. అంతేగాక, ప్రభువుకు ప్రధాన సలహాదారుగా, ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతల్ని నిర్వహించాడు. ఉద్యోగం చేసాడు. ఉద్యోగ నిర్వహనే కాకుండా అనేక గ్రంధాల రచనను కూడా చేసాడు. వీటిలో ‘వైద్యక్ శాస్త్ర‘ మున్నగునవి వాసికెక్కినవి. “చతుర్వర్గ చింతామణి” అనే సంకలనమును రూపకల్పన చేసాడు. ఇది ఒక సంస్కృత ఎన్సైక్లోపేడియా వంటి ఉద్గ్రంధం.
ఇది ఆతని సామర్ధ్యతకు, పాలన, కళలు, విజ్ఞానము, విద్యలు, అన్ని కోణాలలో సామ్రాజ్యము సుసంపన్నమైనది. అగణిత శిల్పనిర్మాణములు పంత్ కీర్తిబావుటాను ఎగురవేసినవి. కోవెల నిర్మాణవిధానములందు “హేమదపంతి“(Hemadapanti) అని ఒక నూతనశైలికి పేరు వచ్చినది. పండరీపురము గుడిలోని కొన్ని శిలా శాసనములు “హేమాద్రి పంత్ గొప్ప దాత, భూరి విరాళములను ఒసగెను.” అని పేర్కొని ఉన్నవి.
ఇతని ఆధ్వర్యంలో వర్తక వాణిజ్యాలు పెంపొందాయి. ఆర్ధికభద్రతతో- సామ్రాజ్యాన సుఖశాంతులు నెలకొన్నాయి. వర్తకుల కొరకై అప్పుడప్పుడూ, రహస్య లావాదే వీలు, సమాచార ఆదానప్రదానాదుల అవసరానికై ఒక కొత్త లిపిని నిర్మించాలని తలచాడు హేమాద్రి పంత్. ఆ ఆలోచనా ఫలితమే – మోడీ స్క్రిప్టు.
గొప్ప మేధావి ఐనట్టి హేమాద్రి పంత్ వినూత్నమార్గాన కృషి చేసెను. లేఖకులను, పండితులను రప్పించి విస్తృతంగా చర్చించాడు. ఆ సమావేశాల ఫలితంగా రూపుదిద్దుకున్న కొత్త లిపి “మోడీలిపి”. 13 వ శతాబ్దములో వలసవచ్చిన గుజరాతీలు, వ్యాపారులు ఈ విధానాన్ని అనుసరించినారు. ఇరవయ్యవ శతాబ్దంలోని వ్రాసిన కొన్ని పత్రాలు కూడా ఇంగ్లీషులోనూ, మోడీ అక్షరములలోనూ ఉన్నవి.
ఈనాడు – ఇట్లాంటి స్క్రిప్టు ఉన్నదని – యావన్మంది ఎట్లాగ తెలుసుకున్నారు?
ఇది అనుకోకుండా జరిగినది. ఆధునికకాలంలో మళ్ళీ కనుగొనబడిన ఒకప్పుడు వ్యాప్తిలో ఉన్న లిపి ఇది. ముంబై హైకోర్టు లో ఆస్థి పంపకం, వారసత్వం ఇత్యాది విషయ సంబంధి ఐన డాక్యుమెంట్సు ను చదవాల్సివచ్చింది. ఆ పత్రాలు 700 ఏళ్ళ నాటివి. ఆ పత్రాలను పరిశీలించిన జస్టిస్ ప్రతిభా ఉపాసని మాట్లాడుతూ “నా చిన్నతనాన ఈ లిపిని నేర్చుకున్నాను. దాదాపు మరచిపోయిన ఆ లిపిని అతి ప్రయత్నం మీద ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవలసిన సందర్భం ఎదురైంది.” అని అన్నారు.
న్యాయస్థానాలలో వ్యాజ్యాలకై లాయర్ల వద్దకు వచ్చిన – ఆ ప్రాచీన వీలునామాలు, దస్తావేజులను పరిశీలించవలసివచ్చింది. ఆ పాత దస్తావేజులలో ఉన్న విభిన్నమైన లిపి ‘మోడీ లిపి’ అని వారికి అర్ధమైంది. ఆ భాషను నేర్చుకునే అవసరం కలగడం వలన, “మోడీ లిపి” అనేదిఒకప్పుడు ఉన్నదని ప్రజలందరికి తెలిసివచ్చింది. ఆబాలగోపాలం ఆశ్చర్యచకితులైనారు. ఔత్సాహికులు, ‘తమకు మోడీ లిపితో పని లేకున్నప్పటికీ , జిజ్ఞాసతో అభ్యసించసాగారు. మహారాష్ట్రలో మోడీ లిపి శిక్షణా కేంద్రములు వెలిసినవి.
దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చును, ఆ మోడీ లిపి – సాహితీప్రపంచానికి ఝలక్ ఇచ్చి, కదలికను తెచ్చింది – అని. మోడీ లిపి శిక్షణ్ ప్రచారక్ మండళ్ స్థాపన జరిగి మూడు పుష్కరములు, అనగా పాతిక ఏళ్ళు పైన మాటే!
లాయర్లు వంటి వారు వృత్తికి దోహదపడే అంశం , కనుక కోచింగ్ సెంటర్ లలో చేరసాగారు. భాషా తీరుతెన్నుల పట్ల ఆసక్తి కలిగిన వారు అనేకులు మోడీ లిపిని నేర్చుకుంటున్నారు. దాదాపు 7వేలమంది మోడీ లిపి ట్యుటోరియల్ స్కూల్సు లో జాయిన ఐనారు. Modi Script విద్యార్ధులుగా చేరి, ఉత్తీర్ణులైనారు. ప్రస్తుతం మోడీ లిపి అనువాదకులు చక్కటి జీవనోపాధిని పొందుతున్నారు. మరాఠ్వాడా జనులు, తమవిజిటింగ్ కార్డు పైన, మోడీ లిపి, మరాఠీ – రెండు భాషలనూ ఒకే కార్డు లో ముద్రణ చేయించుకుంటున్నారు.
ఇంతగా జనులను ఆకర్షించిన మోడీ స్క్రిప్టు గురించి భారత ప్రధాని ‘నరేంద్ర మోడీ’కి తెలుసో లేదో మరి!!
@@@@@