ఛత్రపతి శివాజీ రాయగఢ్ కోట నిర్మించాడు. అది శత్రు దుర్భేద్యంగా ఉండేది. ఉదయం ఆరు గంటలకు తెరవబడే కోట తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనైనా రాత్రి తొమ్మిది గంటలకు మూయబడేవి. ద్వారం మూసివేసిన సమయంలో ఒక చీమ కూడా లోపలి నుండి బయటకు గానీ, బయట నుండి లోనికిగాని రాలేదు. అంత కట్టుదిట్టంగా ఉండేది.
శివాజీ రాజ్యంలోని హీరాకానీ అనే పడతి రోజూ కోటలో ఉన్న రాజ పరివారానికి, సైనికులకు ప్రతిరోజు పాలు పోయటానికి వచ్చేది. అలానే ఒక రోజు సాయంత్రం కోట లోకి వచ్చింది. అదే సమయంలో ఓ సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి, అక్కడే సహాయం చేస్తూ ఉండిపోయింది. ఇంటికి వెళదామనుకునే సమయానికి కోట తలుపులు మూసివేయబడ్డాయి.
కావలివాళ్ళు, హీరాకానీ చాలా మంచిదనే అభిమానం ఉన్నా, రాజాజ్ఞ కనుక కోట తలుపులు తీయలేదు. “అయ్యో, ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలి వేస్తుంది, వాడికి పాలివ్వాలి, కోట తలుపులు తీయండి” అని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. హీరాకానీ మీద జాలిపడి, కావలి వాళ్ళు రేపు ఉదయానే నిన్ను మేమే స్వయంగా లేపి పంపిస్తాము, అంతవరకు ఇక్కడే ఉండమని బదులిచ్చారు.
మర్నాడు ఉదయాన్నే కావలివాళ్ళు హీరాకానీ కోసమై వెదకసాగారు. ఎక్కడైనా ఆదమరచి నిద్రపోయిందేమో అని వెదుకుతుండగా, ఆవైవైపు కోట గోడ దగ్గర హీరాకానీ పాల, పెరుగు కుండల ఆనవాళ్ళు కనిపించాయి. ఆశ్చర్యంతో కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు.
ఒక స్త్రీ రాత్రివేళ శత్రు దుర్భేద్యమైన కోట ఒంటరిగా దాటి ఎలా వెళ్ళిందా? ఎలా సాధ్యమని శివాజీ స్వయంగా బయలుదేరాడు పరిశీలించటానికి.
ఇంతలోనే, హీరాకానీ తిరిగి రానే వచ్చింది. “అయ్యా, రాత్రంతా పాలకై ఏడ్చే నా బిడ్డడే గుర్తుకు వచ్చాడు, ఇక ఏ దారీ తోచక ప్రయత్నించి ఈ కోట గోడ దాటుకుని వెళ్ళాను, క్షమించండి” అని ప్రార్ధించింది.
శివాజీ కళ్ళు చెమ్మగిల్లాయి. అందరూ చూస్తుండగానే, హీరాకానీ మాత్రుప్రేమకు చెమ్మగిల్లిన కళ్ళతో ఆమెకు నమస్కరించి “అమ్మా మాతౄ ప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోట గోడలెంత. ఇక నుంచి ఈ కోట బురుజు హీరాకానీ బురుజుగా పిలవబడుతుంది” అని ప్రకటించాడు. అప్పటి నుండి రాయగఢ్ కోట బురుజు హీరాకానీ బురుజుగా పిలవబడుతున్నది.