రచన: కొప్పర్తి రాంబాబు , విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్ , విజయవాడ
ఈరోజు నా అభిమాన , కవి – కథకుడు కీ. శే. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి శత జయంతి.
తిలక్ 1ఆగస్ట్ 1921 లో ప.గో.జిల్లా తణుకు సమీపంలోని మండపాక గ్రామంలో జన్మించారు. కేవలం 45 సంవత్సరాలు మాత్రమే జీవించినా ఆధునిక వచన కవిత్వాన్ని ప్రభావితం చేసిన అత్యుత్తమ కవి. భాషా పరంగా, భావ పరంగా ఉత్తమ ఆలోచనల్ని పంచిన కవి. చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలు వైపులా అంధకారం …మంచి గంధం లాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం అంటారు.
తిలక్ గారి వచన కవితా సంకలనం “అమృతం కురిసిన రాత్రి ” ఆయన మరణానంతరం 1968 లో ప్రచురితం అయ్యింది. ఇప్పటికి 16 ముద్రణలు పొందింది. 1969 లో ఆం. ప్ర సాహిత్య అకాడమీ 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
తనను స్వయంగా అనుభూతి వాదిగా ప్రకటించుకొని, అనుభూతి వాద కవిత్వానికి ప్రతినిధిగా నిలిచారు. తిలక్ భావ కవులలో అభ్యుదయ కవి.అభ్యుదయ కవులలో భావకవి. ఆయన చాలా అందమైన వాడు. సుకుమార హృదయుడు. కొద్దిపాటి ప్రేరణకు కూడా చలించిపోయి కవిత్వం రాసిన వ్యక్తి. ఖచ్చితమైన మానవతా వాది. అనేక మంచి కథలు , నాటకాలు, నాటికలు , వ్యాసాలు రాశారు. ఆయన సమకాలీన రచయితలు ఎందరితోనో సన్నిహిత పరిచయం కలిగి ఉండేవారు. తిలక్ వారందరికీ రాసిన లేఖా సాహిత్యం చదివితే ఆయన సాహిత్యానికి ఎంతగా అంకితం అయిపోయారో, ఆయన సాహిత్య సృజన చేస్తున్న రోజుల్లో (1945-1965) సాహిత్యంలో వస్తున్న మార్పులకు తన రచనల ద్వారా ఏ విధంగా దిశా నిర్దేశం చేశారో తెలుస్తుంది.
ఆధునిక తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవి తిలక్. కరుణ , సౌందర్యం , మానవత్వం ప్రధానంగా తిలక్ రచనలకు ప్రాతిపదికలు.
“నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు , నా అక్షరాలు ప్రజా శక్తులావహించే విజయ ఐరావతాలు , నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని అన్నారు తిలక్. నా కవిత్వం, ఆ రోజులు , గుండె కింద నవ్వు , తపాలా బంట్రోతు , అమృతం కురిసిన రాత్రి , ప్రార్థన , నవత-కవిత, నువ్వు లేవు నీ పాట ఉంది , మన సంస్కృతి , శిఖరారోహణ….. తిలక్ అమృతం కురిసిన రాత్రిలో చదివి తీరాల్సిన కవితలు. మొత్తం 95 కవితలు ఉన్న ఆ సంకలనం చదవడం అంటే కవితామృత పానం కావించడమే.
కథల్లో కూడా గొప్ప ఆలోచనాత్మకమైన వాక్యాలు రాశారు. ప్రతి జీవితం ప్రత్యేక జీవితం. ఒకరికి మరొకరికి సంబంధం లేదు.ఆశకు అంతు లేదు. అంతానికి ఆశ కారణం.
“ఇది ప్రపంచం. ఇది జీవితం!” అంటారు.
“స్వార్థం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని నాకు తెలిసిపోయింది. ఈ ఆశయాలు ఆదర్శాలు అన్ని మనిషిలోని ప్రాథమిక స్వార్థానికి అంతరాయం కలిగించనంత వరకే” అంటారు వేరొక కథ.
మహాకవి శ్రీ శ్రీ గారు తన సమకాలీన కవి తిలక్ చిన్న వయస్సులో చనిపోయినందుకు ఎంతో బాధపడి దేవరకొండ బాలగంగాధర తిలక్‍ను – “కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం” అని ఆయన మీద స్మృతి గీతం రాసారు.
తెలుగు సాహిత్యంలో నా అభిమాన రచయితగా నేను తిలక్ పేరునే మొదట చెప్తాను. వారి గురించి క్రిందటి నెల ఈనాడు ఎఫ్ ఎమ్ రేడియోలో ఒక వారం మొత్తం కార్యక్రమాలు చేశాము. ఈ రోజు రాత్రి కొప్పర్తి కథావాహినిలో వారి కథ కవిత్వం వినండి. కీ. శే. తిలక్ గారి జన్మదినం సందర్భంగా వారిని ప్రేమతో స్మరించుకుంటూ….
మీ,
కొప్పర్తి రాంబాబు