కుక్క తోక – గోదారి ఈత

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అది 2014 ఏప్రిల్ నెల. మండు వేసవి. బాబు గోదారి గట్టున ఓ చెట్టు నీడలో పిట్టలా కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలతో మనసు పరితాపం చెందుతోంది బాబుకి. అప్పటికి 10 సంవత్సరాలుగా వేయిటింగ్ చేస్తున్నాడు, గట్టు దిగి ఎదురుగా కనిపిస్తున్న నది దాటటానికి. ఇప్పుడు ఓ మంచి అవకాశం వచ్చింది. మొన్నటిదాకా తనను వేటాడిన ఓ పెద్ద నక్క, మరో పిల్ల నక్క అక్కడే ఓ గుంటలో పడి కొట్టుమిట్టాడుతున్నాయి. బయటకు రావటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అవి ఏమాత్రం బయటకు వచ్చినా, తను ప్రాణాలతో మిగలడని తెలుసు. అవి వచ్చేలోపే, తట్టా బుట్టా సర్దేసుకొని నది దాటేయాలి.

 

 ఈసారి గట్టు దాటటం తేలికగానే అనిపించినా, నది దాటటానికి సర్వ శక్తియుక్తులు అవసరమౌతాయని తెలుస్తూనే ఉంది. కడుపులో దాచిపెట్టుకున్న తాళపత్ర గ్రంధాలు తీసాడు. అవి చాణుక్యుడు వ్రాసిన రాజకీయ తంత్రాలు. అప్పటికే, రాజకీయాలను కరకరా నమిలి మింగేసి అపర చాణుక్యుడని పిల్లపిట్టలు పొగిడేస్తుంటే మురిసిపోయిన రోజులు గుర్తుకు వచ్చాయి. ఎంతో కాలంగా ఔపోసన పట్టేసిన ఈ తంత్రాలు, తన సామర్ధ్యం మీద నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఓ విచిత్ర జీవి కనిపించింది.

[amazon_link asins=’9351941094′ template=’ProductAd’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’24443d7d-0b72-11e9-814c-9338b48feb8b’]

నాలుగు కాళ్ళతో, ముచ్చటైన కుచ్చు తోకతో, అప్పుడే కొద్దికొద్దిగా నెరుస్తున్న గడ్డంతో, నెత్తిన తలపాగాతో చూడగానే ముచ్చటపడేలా కనిపించింది ఆ జీవి. అక్కడి గుంట మీద అప్పుడే కాలెత్తి వస్తున్నది. తన చుట్టూ రెండు సార్లు తిరిగి అప్యాయంగా నాలుక తెరిచి ముందుకాళ్ళ మీద సాగిలపడితే ముద్దుగా సైగ చేస్తూ చేయి అందించాడు. మచ్చల జీవి ముద్దుగానే ఉన్నా, విచిత్రంగా కనిపించింది. హావభావాలతో ఆకట్టుకోవాలని అది చేస్తున్న ప్రయత్నాలకి అప్రయత్నంగా బాబు ముఖం మీద నవ్వు పొడచూపింది. పదేళ్ళ తర్వాత, ఇంత ఆహ్లాదకరంగా బాబు నవ్వటం ఇదే మొదటిసారి.

 

హఠాత్తుగా ఆ జీవి మాట్లాడటం మొదలేసింది. “బాబూ, నువ్వు తేలికగానే గట్టు దిగగలవు. కానీ, నాకు కొద్దిగా కష్టమే. నువ్వు చేయి అందించి గట్టు దాటిస్తే, నేను నిన్ను నది దాటిస్తాను” అంది. ఓసారి, తన తట్టా బుట్ట వైపు తేరిపార చూసాడు. ఇవన్నీ తానైతే మోసుకొని వెళ్ళలేడు. మరి ఈ జీవి తనను దాటిస్తూ, ఇవన్నీ మోసుకెళ్ళగలదా అనే అనుమానం కొద్దిగా వచ్చింది. వెంటనే వాసన పసిగట్టింది ఆ జీవి. “అనుమానం పెట్టుకోవద్దు, ఆ తట్టా బుట్ట నా మీద పెట్టి, నువ్వు సింపుల్‌గా నా తోక పట్టుకో, నది దాటటం చిటికెలో పని” అంటూ మెటికెలు విరిచింది ఆ జీవి.

 

 మెటికలు ఎందుకు విరిచిందో అర్ధం కాలేదు బాబుకి. తన జీవితంలో, ఇంతవరకూ ఎవ్వరినీ అంత తేలికగా నమ్మలేదు. ఎందుకో ఈ జీవిని చూస్తుంటే నమ్మాలని అనిపిస్తున్నది అనుకున్నాడు. “వేరే ఛాయిస్ ఏముందోయ్ బడుద్ధాయ్ …” అని ఎవరో అన్నట్లు వినిపించి చుట్టూ చూసాడు. ఎవరూ కనిపించలేదు. వెనుక కాళ్ళపై నుంచొని, ముందు కాళ్ళు ముందుకు చాస్తూ ముసిముసిగా నవ్వుతూ ఆ జీవే కనిపిస్తున్నది. విశ్వాసానికి మారుపేరైన కుక్కలా కనిపిస్తున్న ఈ జీవిని నమ్మితే తప్పేంటి అనిపించింది. ఎందుకో, అప్పుడే ఆ పక్క గట్టు దాటుతూ ఓ తెలంగాణా పిట్ట తుమ్మినట్లు అనిపించింది. శకునం బాగోలేదు, కాసేపు ఆగుదామని అనుకున్నాడు. “అక్కర్లేదు, వెనుక తుమ్ము ముందుకు మంచిదే” అంటూ నమ్మించింది ఆ జీవి.

తట్టా బుట్ట అన్నీ ఆ జీవి మీద సర్దేసాడు. నెమ్మదిగా గట్టు దిగించాడు. ఓ చేత్తో, తట్టా బుట్టా సంభాళించుకుంటూ, మరో చేత్తో తోక పట్టుకున్నాడు. నెమ్మదిగా నదిలోకి దిగింది ఆ జీవి, ఓ ఫర్లాంగు వెళ్ళగానే సంఝాయించటం మొదలేసింది. “ఆ బుట్టలో ప్యాంటు షర్టు అవసరమా? చెడ్డీ బనీను సరిపోదా? బరువు తగ్గితే దాటటం ఈజీ, అవి తీసేస్తే బాగుంటుంది” అని మెల్లగా మెటికలు విరిచింది. నిజమే కదా అనుకొని, ఆ రెండూ పారేసాడు.

మరో ఫర్లాంగు వెళ్ళగానే, అప్యాయంగా చెప్పింది. “చెడ్డీ బనీను మాత్రం దేనికి? ఒంటికి ఒక గోచీ గుడ్డ సరిపోతుందిగా, ఆ రెండూ తీసేస్తే ఇంకా తేలిగ్గా ఉంటుంది” అని నచ్చచెబుతూ, మళ్ళీ మెటికలు విరిచింది. కొద్దిగా అనుమానిస్తూనే, నిజమే కదా అనుకుంటూ, ఆ రెండూ తీసిపారేసాడు బాబు.

 మరో ఫర్లాంగు వెళ్ళగానే మళ్ళీ మెత్తగా చెప్పింది. “ఒక్క గోచీ గుడ్డ కోసం ఆ బుట్ట ఎందుకు. ఓ నిముషం నేను ఆగుతా, నువ్వు వేసుకున్న ఆ బట్టలు తీసేసి, ఈ గోచీ చుట్టేసుకో. బుట్ట తీసిపారేయొచ్చు, బరువు తగ్గి తేలిగ్గా ఉంటుంది అని గదమాయిస్తూ, మెటికలు విరిచింది. నిజం అని నమ్మేసి అలానే చేసాడు. ఈత కొడుతూ ఆ జీవి, జీవి మీద ఓ తట్ట, తట్ట వెనుక తోక పట్టుకుని గోచీతో బాబు.

విక్రమార్కుడిని మోస్తున్న బేతాళుడిలా ఫీలౌతూ, అటుకులు బొక్కిన నోళ్ళు, ఆడిపోసుకునే నోళ్ళు తనని ఎలా ఆరళ్ళు పెట్టాయో ఊకదంపుడుగా చెబుతూనే ఉంది ఆ జీవి. పదేళ్ళ క్రితం తన ఉపన్యాసాలు గుర్తుకొచ్చాయి బాబుకి. తన్మయత్వంతో వింటూ ఈడ్చుకుపోతున్న విషయం కూడా గుర్తించలేదు. ఇంకొద్ది దూరం వెళ్ళగానే ఇకిలిస్తూ “నది దాటగానే, ఆ గట్టు మీద నాక్కూడా ఓ పేద్ద బుట్ట ఉంది. అందులో బోల్డు బోల్దు గుడ్డలున్నాయి. నీకో నలభై జతలిస్తాను. కాబట్టి, ఈ గోచీ కూడా తీసేస్తే, ఇంకా తేలిగ్గా ఉంటుంది మనం తొందరగ చేరొచ్చు” అంది ఆ జీవి.

 దాదాపుగా గోచీ తీసేయబోయాడు. వెంటనే కడుపులో దాచుకున్న చాణక్యుడి తాళపత్ర గంథం  “ఒరేయ్ బాబు, నీకింకా లైటు వెలగలేదా? దాని ఇకిలింపుల వెనక మెరుస్తున్న పదునైన కోరలు కనిపించలేదా? అది కుక్కతోలు కప్పుకున్న తోడేలురా, గట్టు చేరేలోపలే నిన్ను నలుచుకు తినేస్తుంది, దాని తోక వదిలేయ్” అంటూ పెద్దగా అరిచింది. ఇప్పటిదాకా, ఆ జీవి అరవలేదనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే మనసులో మతాబులా వెలిగింది “కరిచే కుక్కలు అరవవు” అని.

 చప్పున తోక వదిలేసాడు బాబు. కళ్ళు తెరిచే నాటికి, 2018 మార్చి! కథ హస్తినకి, మనం అమరావతికి.

*****

Your views are valuable to us!