పసితనపు సంక్రాంతి

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈ సంవత్సరపు సంక్రాంతి గడచిపోయింది.

కానీ సంక్రాంతి తాలూకు కొన్ని స్మృతులు ఇంకా…అలానే…నిలిచిపోయివున్నాయి. ఆ స్మృతుల్లోని ఓ మధురస్మృతిని ఇక్కడ మీ అందరితో పంచుకుంటున్నాను.


చాగల్లు లో స్కూలు ముగించుకొని వచ్చే సరికి అమ్మ అన్నం కూరా సిద్ధం చేసి ఇల్లు సర్దివుంటుంది. 

నాన్నగారు మమ్మల్ని స్నానం చేయించి సాయంత్రం బస్సుకి రెడీ చేయడం; ఇల్లు తాళం వేసి బస్టాండ్ కి కాలి నడకన వెళ్ళడం తో “ఓహో ఇప్పుడు బస్సు ఎక్కాలి!” అన్న థ్రిల్ మొదలవుతుంది. 

బస్టాండ్ లో తేగలు, రేగు పళ్ళు కొనుక్కొని వాటిని తింటూ బస్సు కోసం ఎదురుచూపు.

వచ్చే పోయే చెరకు బళ్ళు, చెరకు ట్రాక్టర్స్, లారీలు – షుగర్ ఫ్యాక్టరీ  వైపు వెళుతుంటే ఆబగా చెరుకు ముక్క కోసం చూడడం.

అంతకు ముందు సాయంత్రం తిన్నా ఆ చెరకు రుచిని తలచుకొంటూ మధ్య లో “ఆ( వడా, బజ్జీ, పుణుకు లోయ్!” అంటూ ఒకడు రావడం వాటి ఘుమఘుమ…

నాన్నగారు బొటన వేలు ఊపుతూ అవి మంచివి కావు అని గతం లో చెప్పిన మాటలు  గుర్తు చేయడం.

మరి కొంచం సేపటికి “ఆ(….బఠానీలు, సెనగలు, వేరుసేనక్కయలోయ్!” అంటూ మరొకడు రావడం…

ఈసారి నాన్నగారు వేరుసెనగ కాయలు నాలుగు పొట్లాలు కొని తలోకటీ ఇచ్చి తనూ ఒకటి తీసుకోవడం.

బస్సు పంగిడి లో పాడైందట అని ఎవరో చెప్పడం…ఎదురు చూపు కొనసాగడం. … అలా ఓ గంట గడిచాక బస్సు రావడం తో మరల థ్రిల్ మొదలవ్వడం….

చాగల్లు లో చాలామంది దిగిపోవడం తో బస్సు కొంచం ఖాళీ కావడం వెంటనే ఎక్కి కిటికీ దగ్గర సీట్ లో అక్క, నేను పోటీ పడి కూర్చోవడం… మా పక్కన అమ్మా నాన్నగారు కూర్చోగా బస్సు డ్రైవర్ టీ తాగడానికి ఇంజిన్ ఆఫ్ చేసి దిగడం…ఒక్క పది నిముషాలలో బస్సు బయలు దేరడం….  

ముందు మా పాతవీధి…ఆపై చెరువు… తరువాత పొలాలు…

ఆ మార్గంలో వచ్చే మొదటి ఊరు ఊనగట్ల. అక్కడ బస్సు ఆగగానే “ఇది ఊనగట్ల” అని నాన్నగారు చెప్పడం… మళ్ళీ బస్సు ముందుకు సాగడం….

“ఇప్పుడు బ్రాహ్మణగూడెం”

చెట్ల నీడన బస్సు ఆగితే కొందరు ఎక్కడం కొందరు దిగడం…బస్సు టికెట్ కొట్టడం చూడడం…

నిడదవోలు పాటిమీద బస్సు స్టాప్ దగ్గరకు బస్సు రాగానే మరి కొందరు దిగిపోవడం.

నిడదవోలు మాకు ఒక మహా నగరం. “ఆహా, ఓహో” అని దానిని చూడడం. కొంచం మలుపు తిరగ్గానే రైల్వే గేటు కనబడడం. గూడ్స్ ట్రైన్ చకచకా వెళ్లి పోవడం….ఆ గేటు పక్క రోడ్ లోకి బస్స్ తిరగ్గా అక్కడ చాల చాలా దుకాణాలు.

“ఓహో సిటీ అంటే ఇదే!” అని ఆశ్చర్యపోవడం.

[amazon_link asins=’8182940761,B01EFVKNY2,B071G3WT56,9380409613′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’2db6c799-a168-48ce-b040-c85f2b695ea9′]

బస్సు వెళ్లి బస్టాండ్ లో ఆగడం… అక్కడనుంచి రిక్షా లో రైల్వే స్టేషన్ కు ప్రయాణం…దారిలో వీరభద్రా టాకీసు లో ఆడుతున్న సినిమా పోస్టర్స్ చూడడం…’బ్రాహ్మణ భోజన హోటల్’, ’రాజుల మిలిటరీ హోటల్’ అని పేర్లుండేవి…వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం…అవి దాటి మలుపు తిరిగితే నిడదవోలు జంక్షన్ అనే బోర్డు చూస్తే మరొక థ్రిల్ లాంటిది మనసులోకి పాకడం.

స్టేషన్ లోకి వెళ్ళే ముందు నాన్నగారు టికెట్స్ తీసుకోవడం కోసం వెళ్ళడం నేను అక్కా అమ్మదగ్గరిగా జరిగి నాన్నగారిని చూస్తూ ఉండడం.

స్టేషన్ లోకి వెళ్లి, ఆ విశాలమైన ఫ్లాట్ఫారం లో నడుస్తూ, వంతెన ఎక్కి కింద ఉన్న గూడ్స్ బళ్ళు, కొన్ని స్టీమ్ రైల్  ఇంజన్లు చిత్రం గా చూడడం.

రెండవ నెంబర్ ఫ్లాట్ఫారం పైకి చేరి అక్కడ ఖాళీ గా ఉన్న బెంచ్ పై కూర్చొని ఇక అంతుపట్టని ఆనందం తరుముకొస్తుంటే అక్కతో “చూసావా! మనం ఒక బస్సు, ఒక రిక్షా ఎక్కి ఇప్పుడు పే…ద్ద రైలు ఎక్కి…ఆపై కాలవ దాటడానికి ఒక దోనే…ఇలా నాలుగు వాహనాలు ఎక్కి నాలుగు ఊళ్లు దాటితే వస్తుంది మన ఊరు!” అని ఒక గొప్ప ప్రయాణం చేస్తున్న అనుభూతిని హద్దు అదుపు లేని మాటలతో చెప్పడం.

ఈ లోపున రకరకాల రైళ్ళు రావడం పోవడం. వాటి బోగీల్ని లెక్కించడం…గూడ్స్ కి 77 డబ్బాలు ఉన్నాయి అని ఆశ్చర్యపోవడం…. ఇంతలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ల లో అనౌన్స్మెంట్  రావడం  …. చెవులు రిక్కించి వినడం ఆ మాటలు బట్టీ పట్టడం.  

అప్పటివరకూ మా ఫ్లాట్ఫారం పైనే ఉన్న నరసాపురం వెళ్ళే ట్రైన్ బయలుదేరడం…అది చూసి కొంచం కంగారు కలగడం…అలా ఒక గంట రెండు గంటల కాలం గడచి పదకొండు గంటలు కావడం…వచ్చేది దయ్యాల బండి అని విని “అమ్మో!” అని అనుకోవడం. ట్రైన్లను దెయ్యాలు నడుపుతాయా అని ఆశ్చర్యపోవడం…నా భయాన్ని పెంచడం కోసమేమో అన్నట్టు ప్లాట్‍ఫాం పై బహు కొద్దిమంది మాత్రమే ఉండడం. వచ్చిన ట్రైన్ మరలా ఒక అరగంట ఆగి కదలడం…

రైలు దిగి, మేము ఎక్కిన బండి ఎర్రకాలవ వంతెన పై చేరగానే పెద్దగా చప్పుడు చేస్తుంటే మా నాన్నగారు “ఇదే రా, ఎర్ర కాలువ” అనిచెప్పడం….తలెత్తి చూసే లోగా అది కాస్త వెళ్ళిపోవడం. సరిగ్గా అర్థరాత్రి వేళకు ఫ్లాట్ఫారం లేని మారంపల్లి స్టేషన్ జాగ్రత్త గా ట్రైన్ దిగడం…

మారంపల్లి స్టేషన్ లో దెయ్యాల బండి దిగి మా ఊరు ఆరుళ్ల వైపు మా నాన్నగారి భుజాలపై ప్రయాణం చేస్తుంటే, కొరివి దయ్యాల దృష్టాంతాలు జ్ఞప్తికి వచ్చి ఎక్కడైనా అవి కనబడతాయేమోనని కళ్ళు గట్టిగా మూసుకొని నాన్నగారి మెడచుట్టూ చేతులు బిగించి బిక్కు బిక్కు మని కళ్ళు తెరుస్తూ మూస్తూ గడిపిన ప్రయాణ కాలం.

కొంతసేపటికి మరింత చల్లని గాలి తో స్వగతం పలికే  కాలువ గట్టు…”రంగా” అని గట్టిగా నాన్నగారు పిలిస్తే అవతలి ఒడ్డున ఉన్న దోనెలో అగ్గిపుల్ల వెలుగు…ఆపై దోనె లో కదలిక…ఆ అర్థరాత్రి మసక వెలుతుర్లో ఆ కదలిక…”అయ్యబాబోయ్!”

ఆవలిగట్టు చేరగానే ఆత్రం గా ఊరు వైపు చూడడం…నాన్నమ్మ ఇల్లు చేరగానే అక్కడున్న తడిక గేటు… “హమ్మయ్యా!” అనుకొంటూ ఉండగా నాన్నగారు అరుగుపై నన్ను దింపి పోయి పడుకోండి అని చెప్పడం….మేము రాగానే మా చిన్న నానమ్మ, నానమ్మా దగ్గరకు తీసుకొని “రండి, పట్టెమంచం మీద పడుకోండి” అని ఇంట్లోకి తీసుకొని వెళ్ళడం…ఎలా నిద్ర పట్టిందో తెలియదు… కోడి కూతలు వినపడడం…చిన్నమామ్మ వచ్చి “చలిమంట వేసాను. చలి కాచుకోండి!” అంటే బద్దకంగా లేచి వెళ్లి ఆ మంట చుట్టూ కూర్చొని చలి కాచుకోవడం. మళ్ళీ నిద్ర పోవడం….

తెల్లవారి వేడి నీళ్ళ స్నానం.

కొత్త బట్టలు వేసుకోవడం, సున్నుండలు, అరిశలు, చక్కిలాలు ఉన్న డబ్బాలు చూసి మురిసిపోవడం…ఉదయాన్నే సున్నుండ నెయ్యి వేసుకొని తినడం.

మధ్యాహ్నం తేగల పాతర దగ్గరకు వెళ్లి బుర్రగుంజు, కొన్ని తెగలు తీసుకొని వాటిని తంపట వేయడం చూడడం …. ఇంటి ముందున్న జామచెట్లు ఎక్కి ఉన్న జామకాయలు కోసుకోవడం … పక్కనే ఉన్న ఉసిరి చెట్టు కొమ్మ అందుకొని ఉసిరికలు తిని వాటి పులుపు సహించక కొరికి వదిలేయడం…ఇది మా పసితనపు సంక్రాంతి !!

 

ఊళ్ళు విడచి ఏళ్ళు గడచి 

సంకుచితమైన స్వాతంత్రం 

స్వర్గం మనే వేదాంతం 

మూలాలను ధ్వంసం చేస్తే 

బతుకు గాలానికి వేలాడుతూ 

వెనుతిరిగి చూసి ఇప్పడు  

అసలైన వేదాంతం వెతుకుంటున్నా !!

॒@@@@@॒ 

2 thoughts on “పసితనపు సంక్రాంతి

Your views are valuable to us!

%d bloggers like this: