“అబద్ధం చెబితే అన్నం పుట్టదు, నిజం చెబితే నీళ్ళు పుట్టవు” అన్న సామెత గుర్తుకొస్తున్నది మన చంద్రబాబుగారి పరిస్థితి చూస్తుంటే.
ఈ అయ్యకు ఆరాటమే కానీ, పోరాటం తక్కువ. అర నిముషం తీరిక లేకుండా, అర్థరూపాయి ఆదాయం లేకుండా నాలుగు సంవత్సరాలు గడిపేసారు. ప్రత్యేక ప్రతిపత్తి అడిగిన ప్రతివాడినీ ఆడిపోసుకున్నారు. మోడీ ఇచ్చిన గుప్పెడు మట్టి, చెంబెడు నీళ్ళే తన భాగ్యమని, రాష్ట్ర సౌభాగ్యమని వక్కాణిస్తూ, “అల్లమంటే తెలియదా, బెల్లంలా పుల్లగా ఉంటుంది” కాబట్టి ప్రతిపత్తి ఒద్దు, ప్యాకేజీ ఇస్తే చాలని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి గొట్టాంగాడికి అర్ధరాత్రిళ్ళు కూడా గొడుగులు పట్టి, శాలువాలు కప్పాడు. ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారుల్లా బేరాలాడటానికి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతివాడిని రాష్ట్ర మంతా ఊరేగించాడు. కాలికి డబ్బు అడిగితే మెడకు, మెడకు డబ్బు అడిగితే కాలికి ముడులేస్తూ, ఎంతెంతో ఉరిమి కొంతైనా కురవకండా పోయారు ఆ దౌర్భాగ్యులు. చేతులు కాదు కడుపులు కాలాకైనా ఆకులు పట్టుకుంటాడేమో అనుకుంటే, ఆ ఆకులు మడిచి చెవిలో పెట్టుకు కూర్చున్నాడు ప్రజాగ్రహం వినిపించకుండా ఇంతకాలం!
2018 బడ్జెట్‌తో నిజంగానే కళ్ళు తెరుచుకున్నాయో, ప్రజలకు తెలియకుండా బాధపడకూడదనో మొత్తానికి ఈసారి అయ్యవారు పబ్లిక్‌గానే మండిపడ్డారు. మనం చీదేయటమే ఆలస్యం, మోడీ ముక్కు ఊడిపోతుందంటూ ఆవేశంలో మంత్రుల్ని, ఎంపీలను మీడియా ముందే ఊపించారు. చివరికి ఏం ఉప్పు అందిందో, ముందు పార్లమెంటులో ఆందోళన చేబడతాం, కేంద్ర మంత్రులతో మాట్లాడుతాం, ఆపైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. ఛీ కుక్కా అంటే ఏంటక్కా అంటూ, ఆ మర్నాడే, సింగారించుకుని పార్లమెంటుకి బయలుదేరారు తెలుగుదేశం నాయకులు. అంతా చూస్తూ, ఎన్‌టీవోడి ఆత్మ క్షోభిస్తుందంటే క్షోభించదు మరీ!
అంతా చేసి, ఉన్న 15 పైగా ఎంపీలలో, అక్షరాలా ఆరుగురు పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర కార్డులు పట్టుకొని దేబిరిస్తూ కనిపించారు. ఇలా ఆరుగురి బ్యాచుగా కనిపించేవాళ్ళని హిందిలో ఛక్కా బ్యాచా అని అడుగుతారు, అది వేరే విషయం. మొత్తానికి తెలుగుదేశం పుణ్యమా అని ఆంధ్రుల పౌరుషం, పరాక్రమం పార్లమెంటు సాక్షిగా కొట్టేసిన సోడా బుడ్డిలా బుసలు కొట్టింది. మొత్తానికి కిందపడ్డా తెలివొచ్చిన విషయం ఏమిటంటే, భా.జ.పా.ని తగిలించుకోవటం సులభమే, వదిలించు కోవటం కష్టమని శివసేన తర్వాత తెలుగుదేశం నిరూపించింది.
మరో మూణ్ణాలుగు రోజులు ఈ టెక్కు టమారాలు సాగించి, మతిలేని మనోళ్ళకు గతిలేని మగోడు మోడీనేనని తెలుగుదేశం ఒప్పేసుకుంటుంది చూడండి.