ఆమ్ఆద్మీనా, అంతా హవాయేనా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

2000-2001లో శంకర్ దర్శకత్వంలో అనీల్‌కపూర్‌తో నాయక్ అనే సినిమా వచ్చింది (తెలుగులో అర్జున్‌తో ఒకేఒక్కడు). ఆ కథలో ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఒక్క రోజు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి, ఆ ఒక్కరోజులోనే ప్రజలకు మేలు కలిగించే పనులెన్నో చేసి, ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో పార్టీ పెట్టి, ప్రజల ద్వారా ఎన్నుకోబడి ముఖ్యమంత్రి అయిన నాయకుడి కథ అది. ప్రజల సమస్యలకి పంచదార పూసి పరిష్కారం చూపించిన సినిమా అది. ఈ ఏడుపంతా దేనికంటే, పార్టీ పెట్టిన పదమూడు నెలలకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు గెలిచి కాంగ్రెస్, భా.జ.పా.లకు కునుకులేకుండా చేస్తున్నదని ఆమ్ఆద్మీ పార్టీ గురించి చిలవలుపలవలుగా మీడియా వర్ణిస్తూ, మోడీని ఎదుర్కొనే నిజమైన మొనగాడుగా అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రొజెక్ట్ చేస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. నిజానికి, ఆమ్ఆద్మీ కన్నా, ఆ సినిమాలో కన్నా అద్భుతమైన రాజకీయ ఆరంగేట్రం మన రాష్ట్రంలో జరిగింది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే, కాంగ్రెస్‌కు శృంగభంగం చేసి ముఖ్యమంత్రి అయిన ఎన్‌టీఆర్ మన జాతీయ మీడియాకు ఇప్పుడు గుర్తుకు రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

 

ఆమ్ఆద్మీ ప్రజల ఆకాంక్షలకు అసలైన రూపమా, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఆమ్ఆద్మీనే పరిష్కారమే అని చర్చించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ప్రస్తుతానికి, అవినీతి మీద తప్పించి ఇతర జాతీయ సమస్యల మీద ఆమ్ఆద్మీ దృక్ఫథం తెలియదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో, ఆ పార్టీ అవినీతితోపాటుగా, స్థానిక సమస్యలనే ఏజెండాగా చేసుకొని పోరాడింది. అందుకు ఆ పార్టీ వెలువరించిన 30-40 మ్యానిఫెస్టోలే ఓ ఉదాహరణ. మరి దేశ సమస్యల మీద ఇంతవరకూ తన విధివిధానాలు ప్రకటించని ఓ పార్టీ కాంగ్రెస్‌కైనా, భా.జ.పా.కైనా ప్రత్యామ్నాయం ఎలా కాగలదు? మరి మన జాతీయ మీడియా ఆమ్ఆద్మీ పార్టీ విషయంలో అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నది? ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఒకానొక ప్రశ్నకు సమాధానమిస్తూ, అరవింద్ కేజ్రీవాల్ “ఈ ఫలితాలు, కాంగ్రెస్, భా.జ.పా.ల అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు”గా ప్రకటించాడు. మరి ఆ ప్రజలే 32 స్థానాలలో భా.జ.పా.ని గెలిపించారుగా. దానికి ఆయన సమాధానం ఏమిటి? ఈ ప్రాథమికమైన ప్రశ్న కూడా వేయకుండా ఆ పార్టీని జాతీయ మీడియా నెత్తికెందుకు ఎక్కించుకుంటున్నది?

 

ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో విరివిగా కనిపించే వివాదాస్పద విషయాలు ఢిల్లీలో లేవు. వద్దు అనుకున్నా వదులుకోలేని కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో రాజ్యం చేస్తున్నాయి. ఢిల్లీలో ఇటువంటి వివాదాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టే, కుల మత ప్రాంతీయాల ప్రమేయం లేకుండా ప్రజలు ఆమ్ఆద్మీకి కూడా వోటు వేసారు. ఈ రకంగా ఇతర రాష్ట్రాలలో ఆ పార్టీని అక్కున చేర్చుకుంటారా అనేది అనుమానాస్పదమే. ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఒకవేళ ఆమ్ఆద్మీ ఇక్కడ ఎన్నికల్లో నిలవాలంటే మొదటగా తెలంగాణాపై తన అభిప్రాయాన్ని చెప్పగలగాలి. అలా చెప్పగలిగే పరిస్థితుల్లో ఆ పార్టీ ఉన్నదా? చెప్పినా, ఆయాప్రాంతాల ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తారా? ఒక కాస్మోపాలిటన్ పట్టణంలో ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగే మెజారిటీ కూడా సంపాదించకుండా, 28 సీట్లు గెల్చుకున్నంత మాత్రానే, ఆమ్ఆద్మీ పార్టీ ఇతర జాతీయపార్టీలకు సింహస్వప్నమౌతుందని భావించటం అవివేకం.

 

దాదాపు జాతీయ మీడియా యావత్తూ ఆమ్ఆద్మీ పార్టీని ఊరేగించబూనటంలోని ఔచిత్యం ఇక్కడ ప్రశ్నార్ధకం! ఫలితాలు ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ గాలి వీస్తున్నదని ఒప్పుకోవటానికి మనస్కరించక, ఆమ్ఆద్మీ పార్టీని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాలలో, మూడు రాష్ట్రాలలో భా.జ.పా. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా ఓడించటమే కాకుండా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో మూడోసారి పగ్గాలు చేబట్టబోతున్నది. ఢిల్లీలో అతిపెద్దపార్టీగా అవతరించింది. ఇంత పెద్ద గెలుపును గమనించకుండా, 28 సీట్లు మాత్రమే గెల్చుకున్న ఓ పార్టీ విజయదుందుభి మోగిస్తున్నదనే పొగడ్తలేమిటి? భా.జ.పా. గెలుపుకు ముఖ్యకారకుడైన నరేంద్రమోడీకి సమవుజ్జీగా అరవింద్ కేజ్రీవాల్‌ను నిలబెట్టాలనే ప్రయత్నం చేయటమేమిటి?

 

చూడబోతే, ఇవన్నీ కాంగ్రెస్ పెయిడ్ మీడియాలా అనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ కన్నా ఎక్కువగా నరేంద్రమోడీని, ఆయన కారణంగా భా.జ.పా.ని ఇదే మీడియా ఆడిపోసుకున్నదనే మాట వాస్తవం. ఒక్క టీవీ మాధ్యమమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోసే అన్ని ద్వారాలు తెరిచిపెట్టుకుంది మీడియా. అప్పట్లో ప్రధానంగా రాహుల్‌గాంధికి దన్నుగా నిలవాలనే ఉద్దేశ్యంతో మొదలైన కార్యక్రమాలలో రాహుల్ ఏరకంగా మోడీకి ధీటుగా నిలబడగలడో అన్న విషయాలపై చర్చలు, వాదోపవాదాలు చేయటంతో మొదలైన వ్యవహారం, క్రమంగా రాహుల్ సభలకు ప్రజలు రాకపోవటం, వచ్చినా రాహుల్ ప్రసంగం మొదలు కాగానే వెళ్ళిపోబోవటం, యువరాజు గారి ప్రసంగాలలో ఏమాత్రమూ పరిణతి కనిపించకపోవటం, చివరికి రాబోయే ఫలితాలు ఎగ్జిట్‌పోల్సులో అటూఇటూగా తెలిసిపోవటంతో మీడియా ఇరుకున పడినట్లయ్యింది.

 

వాళ్ళు నిర్వహించిన ఏ పోల్సులో కూడా ఆమ్ఆద్మీకి 12-18 సీట్లకు మించి వస్తాయని ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఆ పార్టీ తమకు పోటీయే కాదని కాంగ్రెస్, భా.జ.పా. కూడా ప్రకటించేసాయి. ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ మట్టికొట్టుకుపోవటంతోబాటు, ఆమ్ఆద్మీకి 28 సీట్లు రావటంతో, మోడీని ఎదుర్కోగలిగిన మొనగాడు మీడియాకు కనిపించాడు మరి! ముఖ్యంగా గమనించాల్సిన క్రమం చూడండి. ముందుగా,  ఫలితాల మీద మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఆమ్ఆద్మీని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇవ్వటం. ఆ వెంటనే, షకీల్ అహమ్మద్  కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆమ్ఆద్మీ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించటం, వెంటనే కొన్ని మీడియా ఛానల్సులో ప్రజల అభిప్రాయాలతో ఆమ్ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వార్తలు ప్రసారం చేయటం. అది అందిపుచ్చుకొని ఇప్పుడు ఢిల్లీలో నరేంద్రమోడీని నిలువరించగలిగే మొనగాడు అరవింద్ అంటూ ఒకటేపనిగా దాదాపు అన్ని ఛానల్సు ఊదరగొట్టేయటం!

 

మొన్నటిదాకా, ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికి ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహించిన కాంగ్రెస్, ఆమ్ఆద్మీ దెబ్బకు కుదేలై, ఇప్పుడు ఆ పార్టీని తనవైపుకు తిప్పుకొని భా.జ.పా.కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నట్లుంది. ఎందుకంటే, మీడియా చెబుతున్నంతగా ఆమ్ఆద్మీ హవా ఉండి ఉన్నట్లయితే భా.జ.పా. ఢిల్లీలో 32 సీట్లు గెలుచుకునేదే కాదు. ఆ విషయం గ్రహించింది కాబట్టే, కాంగ్రెస్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే మీడియాతో పాచికలు వేయిస్తున్నది. ఢిల్లీలో హంగే స్థిరపడితే, ఆరు నెలల తర్వాత వచ్చే ఎన్నికల్లో తమకు వచ్చిన ఆ ఎనిమిది కూడా మిగలవని కాంగ్రెస్‌కు తెలుసు. నా అభిప్రాయం మేరకు, దేశంలో ఆమ్ఆద్మీ హవా ఏమీ లేదు. ఉన్నా, ఢిల్లీ లాంటి కొన్ని అర్బన్, కాస్మొ, మెట్రొపాలిటన్ ప్రాంతాలకే పరిమితమౌతుంది. ఈ విషయాలు గమనించుకుంటే ఆమ్ఆద్మీకి మేలు!

Your views are valuable to us!