చిన్ననాటి జ్ఞాపకాలకి వెడితే ప్రస్తుత ప్రపంచాన్ని మరచి పోయి ఇంద్ర లోకాల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది.
నిజమే మరి, ఆనాటి పల్లెటూళ్ళు, పొలం గట్లు, తాటి తోపులు, పచ్చని వరి చేలు, చెరకు, మామిడి, అరటి లాంటి తోటలు చల్లని పైర గాలి అన్ని దాటుకుంటూ తాత గారి ఊరు వెడుతుంటే ఎంత బాగుండేదని!
అసలు ఆ అందాలు,అనుభూతులు తిరిగిరాని ఆ బాల్యం అనుభవైకవేద్యమే, కానీ వర్ణనాతీతం .
రైలు దిగి తాత గారింటికి [అదే దివాణం] వెళ్ళాలంటే తాత గారు పంపిన రెండెడ్ల బండిలో గతుకుల రోడ్డులో గానీ బల్లకట్టు దాటి పొలం గట్లమ్మట నడిచి గానీ [ఎందుకంటే ఏలూరు కాలవ అడ్డం గనుక] వెళ్ళాలి. అందుకని బండి కన్న నడకే ఇష్టం గా ఉండేది.
అందర్ని అటు ఇటు ఒడ్డుకు చేర్చే వెంకన్న మాత్రం ఎప్పుడు వెళ్ళినా అదే బల్లకట్టు మీద నిశ్చలంగా ఉండిపోవడం మరింత ఆనందంగా హాయిగా ఉండేది. కరణం గారి తాలుకు అని చూడగానే మరింత వినయ విధేయతలతో ప్రేమగా పలకరిస్తు కబుర్లు చెప్పేవాడు.
అన్ని దాటుకుని దివాణంలో అడుగు పెడితే ఎదురొచ్చి సామాన్లు అందుకునే పాలేర్లు. నానమ్మ, తాతగారు, అత్తలు, బాబాయిలు…ఇలా అందరి ఆప్యాయపు తీయని కౌగిలి.
చుట్టు పక్కల ఊళ్ళకి కరణం కావడం వల్ల తాతగారికి తిరగడానికి గుఱ్ఱం ఉండేది. ఇక రోజు ఒకసారి తాతగారి వెనకాల కూర్చుని గట్టిగా నడుం పట్టుకుని బిక్కుబిక్కు మంటు రౌండ్లు తిరగడం బలే మజాగా ఉండేది .
ఇక వేసవి కాలం ఐతే సాయంత్రాలు నాన్నగారు, తాతగారు, బాబాయిలు, పిల్లలందరం కలసి పొలంకి వెళ్ళి కొబ్బరి బొండాలు కొట్టించుకుని నీళ్ళు తాగడం, తాటి ముంజలు తెప్పించు కోవడం , మామిడి పళ్ళు సరేసరి. ఇక తేగలు లాంటివి వేరే చెప్పాలా ?
సాయంత్రాలు ఆరుబయట వెన్నెట్లో పక్కలు వేసుకుని తాతగారు చెప్పే కధలు వింటూ వెన్నెట్లో ఆడుతూ, మత్తెక్కించె పూల వాసనలతో హాయిగా ఉండేది.
అదే సంక్రాంతి కైతే ఇంటికి వచ్చిన ధాన్యం గాదెలలోకి నింపుతుంటే ధాన్య లక్ష్మితో, పాడిపంటలతో, పిల్లా పాపలతో నిండుగా ఉండేది. బొమ్మల కొలువులు, పట్టు పరికిణీలు, పూలజడలు, నిండుగా నగలు, గొబ్బి పాటలు ఇలా చెప్పుకుంటూపోతే అంతెక్కడిది?
ఆరోజుల్లో “సావిత్రి గౌరిదేవి వ్రతమని ” సంక్రాంతి తర్వాత తొమ్మిది రోజులు చేసేవారు. అప్పుడు అమ్మలు, అత్తయ్యలతో కూడా మేము వెళ్ళేవాళ్ళం. ఇది బొమ్మలు అందరు కలిసి ఒకరి ఇంట్లొ పెడతారు. మొదటి రోజు బేండు మేళంతొ నొము చేసుకునే వారందరు అంటే కొత్త పెళ్ళికూతుళ్ళు, పాతబడిన పెళ్ళి కూతుళ్ళు (అదేనండీ! పిల్లల తల్లులు!) అందరు కలసి కుమ్మరి వాని ఇంటికి స్వయంపాకం తీసుకుని [అంటే ఇంటికి చీర జామారు వంటకి కావలసిన బియ్యంతో సహా కొంత కట్నం డబ్బు]వెడతారు. అవన్నీ తీసుకుని ఆ కుమ్మరి తన చక్రం మీద మట్టితో బొమ్మలు చేసి ఇస్తాడు.
వాటిని తెచ్చుకుని ఒకరి ఇంట్లో పూజారి గారిని పిల్చి మంత్రాలతో, శాస్త్రీయంగా పూజిస్తారు . మర్నాటి నుంచి ప్రతి రోజు పిండి వంటలతో నైవేద్యమిడి చివరి రోజున మళ్ళీ మంగళ వాయిద్యాలతొ ఊరేగించి చెరువులో కలుపుతారు. ఇలా తొమ్మిది రోజూల చొప్పున తొమ్మిదేళ్ళు చేయాలి. మన బతుకమ్మలు లాగ ఆ పండుగ వేడుకలు చాలా బాగుండేవి.
ఇక అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు తెల్లవారు ఝామునే [చుక్కొడిచింది అనేవారు] లేచి మడినీళ్ళు, తడిబట్టలతో అవుసరాన్ని బట్టి ఇత్తడి బిందెలతొ కాలవకో, చెరువుకో, ఏటికో ఏదిఉంటే దానికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు. వెలుగొస్తె కరణంగారు, మునసబు, ప్రసిడెంట్ ఎదురు పడతారని భయం.
అంతేనా? దారిలో ఇతర కులాల వాళ్ళు గానీ ఎదురు పడితే ఇంతే సంగతులు. మడికి భంగం. ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ వెళ్ళి దారి పొడవునా నీళ్ళు జల్లుకుంటు మంత్రాలు చదువుకుంటూ ఇంటికొచ్చే సరికి సగం బిందె ఖాళీ. [అది వేరే విషయం].
ఇలా కోకొల్లలుగా అనుభవాలు. ఇక పెరిగే వయసు తో బాటుగా నాగరికత, బస్తీ బ్రతుకులు, చదువులు. అందమైన యవ్వన దశ. క్లాసులో అబ్బాయిల కేరింతలు, ఉపాధ్యాయుల అదలింపులు. “వరూధినీ ప్రవరాఖ్యుల మధుర ఘట్టాలు”. అప్పుడు అదో ఇంద్రలోకం. వారెవరో కలల రాకుమారులు తమ మనసును దోచే గంధర్వులు. మది నిండా వింత వింత ఆనందం. కొంత గర్వం. గుండెలు బరువెక్కి సిగ్గు దొంతరల ముసుగులొ ఒయ్యారంగా పైటను సవరించుకుంటూ ఒకరినొకరు చిరునవ్వులు, పలకరింపులతో క్రీగంటి చూపుల తూపులు అబ్బాయిలపై విసురుతూ మహరాణుల మన్నట్లు వాలు జడల విసుర్లు,హంస నడకలు – అదొక అందరికి అందమైన ఆనందమైన తిరిగి రాని దశ తెలిసీ తెలియని మనసు విరిసీ విరియని వయసు. కళ్ళముందు ఇంద్రలోకం అసలు ఆ ఆలోచనలే వేరు. వీలైనంత వరకు అందానికి మెరుగులు దిద్దడం, అబ్బాయిలను ఆకర్షించాలన్న తాపత్రయం.”నిలువవే వాలు కనులదాన”, “కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడి చాన”, “నన్ను దోచుకొందువటే ” ఇలాంటి పాటలు మాటల డైలాగులు – అవన్నీ మనసుకి హాయిగా ఉల్లాసంగానే ఉంటాయి.
ఇక మనకి తెలుగు మేష్టారంటే ఇష్టం. సైన్స్ మేష్టారికి మనమంటే ఇష్టం.
ఇద్దర్ని కాదని చాదస్తపు మేష్టారిని చేసు కోవడం [ఎందుకంటే ఆ రోజుల్లో ఆసిడ్ ప్రేమలు రాక్షస ప్రేమలు లేవుగనుక. మనం చేసుకోక పోయి మనం ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా ఎవర్ని చేసుకున్నా సుఖంగా ఉండాలని కోరుకునే వారు గనుక ].
ఇక ఉద్యోగంలో[బ్యాంక్ లో] సెక్షన్లో ఐదుగురు మాత్రమె ఉండి పాతిక పైగా మగ వారు ఉండే వారు అందుకని మమ్మల్ని “పంచ భూతాల్ల” ఉన్న ఐదుగురు అస్తమానం కొట్లాడుకుంటారు మేం పాతిక మందిమి ఉన్నాం ఎప్పుడైనా కొట్లాడుకున్నామా? అనేవారు.
ఎన్నో సరదాలు. ఎంతో అభిమానాలు, మరెన్నో ఆప్యాయతలు. అదొక అద్భుత ప్రపంచం. మంచి స్నేహానికి మించి కావల్సిందేముంది? మధురమైన పెళ్ళి ఘట్టం తర్వాత అత్తిల్లు. కొత్త కోడలు ఊహ కందని నిజాలు ఒడిలో వాలాక పసిపిల్లలు ముద్దు ముచ్చట్లు, చేదు నిజాలు అన్నీ కలసిన సంసార సాగరం ఈది జీవిత సమరంలొ అలసి పోయి ఊడిపోయిన పళ్ళు, వెలిసి పోయిన పెన్సిలు జడ, కళ్ళకి జోడు, అందాలు కరిగి ముడతలు పడిన శరీరం మనమీద సవారి చేస్తుంటే మన ముఖం మనకే వింత కనుపిస్తుంది.
కళ్ళు మూసి తెరిచేలోగా కరిగిపోయిన జీవితం వద్దన్నా మనసును వెనక్కి వెడుతుంది. పాత రోజులు మననం చేసుకుంటు బండ బారి బీడు వడిన హృదయం. నిష్క్రమించిన పెద్దలు , కాలం నేర్పిన అనుభవాలు , తలపోసుకునే జ్ఞాపకాలు, దూరమౌతున్న అనుబంధాలు, ఓడిపోయిన ప్రేమలు , మిగుల్చు కున్న మధుర స్మృతులు ,ఇంక మరపురాని అనుభూతులు అంతేగా జీవితం.