అహంకారమా? అత్యుత్సాహమా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

రెండు రోజుల కిందట టూ వీలర్లో వెళ్తున్నాను. నేనే డ్రైవ్ చేస్తున్నాను. కొద్దిదూరంలో రోడ్డుకు పక్కగా ఇద్దరు అబ్బాయిలు ఆడుకొంటున్నారు. వాళ్ళని అలర్ట్ చేద్దామని హారన్ కొట్టి, నెమ్మదిగా వెళ్ళబోయాను. నేను దగ్గరికి రాగానే ఒక కుర్రవాడు సర్రుమని అటునుండి ఇటుకి పరుగెట్టుకొచ్చాడు. అంతేకాక “పోవే పోవే” అని అరిచాడు. ఇంతచేసీ వాడి వయసు ఆరేడేళ్ళు ఉంటాయి అంతే. వాడికి జోడీగా రెండో అబ్బాయి కూడా “ఓ ఓ ఓ” అని అరవడం వినబడింది. నేను పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయాను…ఆ అబ్బాయిలది అహంకారమా లేక అత్యుత్సాహమా అన్న ఆలోచనతో!

“మన పిల్లలు” అన్న గుడ్డి అభిమానం విడిచి చూస్తే ఈతరం పిల్లల్లో నిర్లక్ష్యం చాలా మందంగా పేరుకుపోయింది. విపరీతమైన హైపర్ యాక్టివిటీతో వాళ్ళు సతమతమౌతున్నట్టు అనిపిస్తుంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లలు ఏం చేస్తున్నదీ పట్టించుకొనే తీరిక తక్కువగా ఉండడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం జరుగుతోంది. 

అసహనం అన్నది రోజువారి జీవితంలో ప్రధానభాగమైపోయింది. “ఈ పని చేయండర్రా” అని చెబితే మొహమ్మీదే విసుక్కొనే పిల్లలున్నారు. బదులు ఇవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళూ ఉన్నారు.

టీవీ, సినిమాల ప్రభావంతో వాళ్ళకేదో చాలా తెలుసుననే ఫాల్స్ ప్రిస్టేజ్ పిల్లల్లో ఎక్కువౌతోంది. పాతకాలం సినిమాల్లో పిల్లల పాత్రలు పిల్లల్లానే వ్యవహరించేవి. కొత్తతరం సినిమాల్లో పిల్లలే పెద్దవాళ్ళకు సలహాలిచ్చే స్థాయికి ఎదిగిపోయారు.

నాయికా నాయకులకు వాళ్ళే లవ్ టిప్స్ ఇస్తారు. ఎడమొహం, పెడమొహం పెట్టుకొన్న భార్యాభర్తలను ముద్దులు పెట్టుకొనేట్లు చేస్తారు. బామ్మలను, అమ్మమ్మలను వెకిలి ఆటలు పట్టిస్తారు. మిగతావాళ్ళకు తలకు చెప్పులడిగే రీతిలో బదులిస్తారు. రీల్ లైఫ్ పిల్లల్నే రియల్ లైఫ్ పిల్లలు అనుకరిస్తున్నారనడంలో సందేహం లేదు కదా!

అలక్ష్యం వల్ల జరిగే ప్రమాదాల్లో దేహము గాయపడితే చికిత్స చేసి మాన్పవచ్చు. కానీ తల్లిదండ్రుల అలక్ష్యం వల్ల జరిగే మానసిక ప్రమాదలకు మందు లేదు. ముందు చెప్పిన సంఘటనలోని పిల్లల్లాగా ఆరు, ఏడేళ్ళ వయసులో పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు అప్పుడే పట్టించుకోకపోతే ముందు ముందు అనర్ధాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఏమి చేస్తున్నాము అనే జ్ఞానము లేని పిల్లలకు జ్ఞానాన్ని బోధించాల్సింది తల్లిదండ్రులే.

ఇప్పటి తల్లిదండ్రులు చదువులకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. రియాలిటీ షోల పుణ్యమాని కొద్దిమంది పేరెంట్స్ పిల్లల్ని అందులో కూడా రుబ్బేస్తున్నారు. కేవలము చదువుల్లో మాత్రమే ముందు ఉంటే చాలదు. లేక రియాలిటీ షోలో ఫస్ట్ ప్రైజ్ కొడితే చాలదు. సత్ప్రవర్తన, వివేకములు కూడా అంతే ప్రధానమైనవి. ఈ లక్షణాలు ట్యూషన్ కు పంపితే వచ్చేవి కావు. సరిగమప నేర్చుకొన్నట్టో, థైథకథై నేర్చుకొన్నట్టో నేర్చేసుకొనేవి కావు. తల్లిదండ్రులు మనసు పెట్టి పిల్లల ప్రవర్తనలోని సూక్ష్మమైన మార్పుల్ని కనిపెట్టి దిద్దాలి. 

పాశ్చాత్య దేశాల్లోని తల్లిదండ్రులు బుద్ధిమాంద్యంతో పిల్లలు పుడితే డాక్టర్ల పై కేసులు వేస్తున్నారని విన్నాను. గర్భిణిగా ఉన్నప్పుడే సరైన మెడికల్ ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండా కాన్పు చేసారని డాక్టర్ల పై కేసులు నమోదు చేస్తున్నారంట. అలా వాళ్ళు అతిగా పట్టించుకొని కోర్టులకు వెళుతుంటే మనమేమో మన పిల్లల్ని నిర్లక్ష్యం చేసి, వాళ్ళ బుద్ధిని భవిష్యత్తును నాశనం చేస్తున్నాము.

చిన్న వయసులోనే అతిగా మాట్లాడడం, ఆవేశ పడడం, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం వంటి లక్షణాలను పసిగట్టి సరిచేయవలసిన బాధ్యత మొదటా తల్లిదండ్రులది. తర్వాత ఉపాధ్యాయులు మొదలైనవారు వస్తారు. అందువల్ల తల్లిదండ్రులు వీలైనంతవరకూ సినిమా, టీవీ వ్యామోహాలనుంచి బైటపడి నిజమైన జీవితం ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఉత్తమమైన సమాజం ఏర్పడగలదు.

ఆర్ధిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల సమాజం భ్రష్టుపడుతోందని చెప్పుకోవచ్చు. కానీ మనమే మన పిల్లల్ని భ్రష్టు పట్టిస్తున్నామన్న నిష్టుర సత్యాన్ని ఎంత త్వరగా తెల్సుకొంటే అంత మేలు.

@@@@

Your views are valuable to us!