అనుకూల పవనాలా, వ్యతిరేక పవనాలా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో పదవీ వియోగం కలిగి పదేళ్ళయ్యింది. మొత్తానికి, నక్కతోక తొక్కినట్లు నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా రంగంలోకి దించిన తర్వాత ఆ పార్టీకి బానే కలిసివస్తున్నట్లు కనిపిస్తున్నది. 2002 నాటి గుజరాత్ మతఘర్షణల కళ్ళజోడు తగిలించుకునే చూస్తున్న చాలామందికి ముఖ్యంగా మీడియాకు, కుహానా లౌకికవాదులకు అలా అనిపించకపోవటంలో ఆశ్చర్యం లేదు. వీళ్ళ వాదనకి ఊతం ఢిల్లీ, ఛత్తీస్‌ఘఢ్‌ల ఫలితాలు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో మరో ప్రత్యామ్నాయం లేకపోవటం వల్లనే భా.జ.పా. గెలిచిందనేది వీరి వాదన. మరికొందరి అభిప్రాయం ప్రకారం, మొదటి నుంచి రాహుల్‌గాంధీని నరేంద్రమోడీకి సరిజోడుగా చేసిన ప్రచారం, రాహుల్‌గాంధీ అపరిపక్వ రాజకీయాలు, ఉపన్యాసాల కారణంగానే తిప్పికొట్టింది కానీ, అదేమీ నరేంద్రమోడీ ప్రతిభ కాదన్నది వీరు తీర్మానించే విషయం.

అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన అసెంబ్లీ సీట్లు మొత్తంగా 629. కాంగ్రెస్ గెలుచుకున్నది 157 సీట్లైతే, భా.జ.పా. గెలుచుకున్నది 407 సీట్లు. అంటే మొత్తం ఫలితాలలో 65% సీట్లు భా.జ.పా. గెలుచుకుంటే, 25% సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక్క ఢిల్లీ వరకూ చూసుకున్నా, ఆమ్ఆద్మీ వేవ్ ఇప్పుడు మీడియా ఊదరగొడుతున్న స్థాయిలో ఉన్నదనుకుంటే, భా.జ.పా. 31 స్థానాలు గెలవటం చాలా గొప్పే! అసలు ఆ వేవ్ లేదనుకున్నప్పుడు ఫలితాలు మరింత విశ్లేషించుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయి.

నేను సేకరించిన గణాంకాల పరంగా చూస్తే, ఢిల్లీలో భా.జ.పా. 31 సీట్లలో గెలిచింది, మరో 29 సీట్లలో రెండవ స్థానంలో ఉంది. ఆమ్ఆద్మీ పార్టీ 28 సీట్లు గెలిచి, 20 సీట్లలో రెండవ స్థానంలో నిలిచింది. వేయి వోట్ల తేడాతో 5 సీట్లను, 2000 వేల వోట్ల తేడాతో 9 సీట్లను భా.జ.పా కోల్పోతే, ఆ.ఆ.పా. వెయ్యి వోట్ల తేడాతో ఒక్క సీటు, 2000 వేల వోట్ల తేడాతో 3 సీట్లు మాత్రమే కోల్పోయింది. ఈ లెక్కలతో ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేయొచ్చు. కానీ స్థూలంగా చూస్తే, ఢిల్లీలో భా.జ.పా. ప్రదర్శన మీడియా కూస్తున్నంత దరిద్రంగా ఏమీ లేదు.

ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకారం, సి.ఎన్.ఎన్.-ఐ.బి.ఎన్.-సి.ఎస్.డి.ఎస్. సర్వే ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆఆపాకు వోట్లు వేసినవాళ్ళలో దాదాపు 50% మంది ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి వేస్తారట! ఆఆపా చేసిన సర్వే ప్రకారం దాదాపు 30% ఆఆపా ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి వేస్తామన్నారట! 2014 వస్తే కానీ, ఈ విషయం తేటతెల్లం కాదు.

ఛత్తీస్‌ఘడ్ విషయానికి వస్తే, ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ఫలితాల కోసం చివరి నిముషందాకా వేచిచూడాల్సిన పరిస్థితే. గత ఎన్నికల కన్నా, కాంగ్రెస్ అదనంగా సంపాదించగలిగింది ఒకే ఒక్క సీటు! ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఒక్క సీటు మాత్రమే అదనంగా  గెలుచుకోటానికే ఉపయోగపడిందంటే ఎలా అర్ధం చేసుకోవాలి? దానికితోడు, మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ లీడర్లకు సానుభూతి ఓట్లు కూడా పడ్డాయి మరి. అయినా, భా.జ.పా.ను ఓడించలేకపోవటానికి కారణం ఏమిటి?

 

అటు రమణ్‌సింగ్ మీదా, ఇటు మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇన్నేసి వ్యతిరేకపవనాలు ఉన్నా ఆ రెండు రాష్ట్రాలలో భా.జ.పా. గెలిచిందంటే కారణం ఏమయ్యుంటుంది? రాష్ట్రస్థాయిలో జరిగే ఎన్నికలలో ప్రజలు కేంద్రంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోటు వేసారని అనుకోవాలా? అలా అనుకునేట్లయితే, ఇది ఖచ్చితంగా మోడీ వేవ్ కిందకే వస్తుంది కదా మరి. మరోవిషయం ఏమిటంటే, ఢిల్లీలో భా.జ.పా., కాంగ్రెసేతర ప్రత్యామ్నాయంగా ఉన్నా, ఆమ్ఆద్మీకి మెజారిటీ రాలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్‌లలో కాంగ్రెస్, భా.జ.పా.లకు ప్రత్యామ్నాయంగా బి.ఎస్.పి. లాంటి పార్టీలు రంగంలో ఉన్నాయన్న విషయం మర్చిపోకూడదు.  ఇక రాజస్థాన్ విషయానికి వస్తే, అక్కడి ఓడిపోయిన ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ స్వయంగా ఒప్పుకున్నాడు… ప్రభుత్వ వ్యతిరేకతకు మోడీ తోడవ్వటం వల్లనే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని. ఇక వాదవివాదాలకు ఆస్కారం ఏది?

అటు అరవింద్ కేజ్రీవాల్‌ను మోడీకి సరితూగే స్థాయి గల నాయకుడుగా భావించే పరిస్థితి కూడా లేదు. ఆ స్థాయే ఉంటే, రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్‌లలో కూడా ఆ.ఆ.పా.ని ఆరంగేట్రం చేయించగలిగేవాడు. ఏదేమైనా, దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకతకు తోడు మోడీ గాలి వీస్తున్నదనేది నిజం. అందుకే ఎన్నడూ లేనివిధంగా ఓట్లశాతం బాగా పెరిగింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలని ప్రభావితం చేయటంలో మోడీ కృతకృత్యుడౌతున్నాడు. అటు కాంగ్రెస్, తదితర భా.జ.పా. వ్యతిరేక పక్షాలు ఈ నిజాన్ని గ్రహించకుండా, 2002నాటి పాతపాటలే పాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి కానీ, మోడీ గాలిని ఎదుర్కునే మార్గాలు వెతకటంలేదు. కనీసం, మోడీ గాలి వీస్తున్నదని ఒప్పుకుంటే, ఆ గాలి ఆపటానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ పని చేయకపోతే, ప్రజల్లో మోడీ పెల్లుబుకిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఆపగలరు?

Your views are valuable to us!