అప్పుడు మహాత్మా గాంధి, ఇప్పుడు అన్నా హజారే

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

Anna Hajare - Fight against corruptionడెబ్భై ఏళ్ళు పైబడిన వయసులో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన సత్యాగ్రహం నిద్రాణమైన దేశానికి మేలుకొలుపు కావాలి. ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య పోరాటం కావాలి.

 

ఇప్పటికే విదేశాలలో మురిగిపోతున్న లక్షల కోట్ల నల్లధనం, దానికి తోడు బోఫోర్స్ నుండి నిన్నటి స్పెక్ట్రం కుంభకోణం వరకు ఎన్ని లక్షల కోట్లు రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల చేతులు మారిందో బహిరంగ రహస్యమే అయినా, ఏనాడూ, ఏ ప్రభుత్వమూ అవినీతిని అంతమొందించే దిశగా అడుగులు వేయలేదు. ఆరు దశాబ్దాల పైబడిన మన సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంలో అవినీతి నిరోధానికి సరైన చట్టం లేకపోవటం ఒక విషాదమైతే, ఆ వెసులుబాటును ఆధారంగా చేసుకొని తమ అవినీతిని నిరూపించమని సవాళ్ళు విసిరే వ్యక్తులతో మంత్రివర్గాలు నిండి ఉండటం మరో విషాదం. అధికారంలో ఉన్న వ్యక్తుల అవినీతి ఏనాటికి నిరూపించబడదనేది కటిక వాస్తవం.

 

రోజుకో చీకటి కోణంతో ఆవిష్కృతమౌతున్న అవినీతి, ఆయా ప్రభుత్వాలపైన, రాజకీయ నాయకులపైనే కాదు, చివరికి మన ప్రజాస్వామ్యంపైన కూడా సగటు పౌరుడికి నమ్మకం సడలిపోవటానికి కారణమౌతున్నదంటే దానికి కారణం ఎవరు? అవినీతిని అంతమొందించే దిశగా నిర్ణయాత్మకమైన విధానంతో లోక్ పాల్ బిల్లు తయారౌతుందని చెప్పిన ప్రభుత్వం ఆ చట్టం తయారీకి మునుపు లాలు యాదవ్ ను, ఇప్పుడు శరద్ పవార్, వీరప్ప మొయిలీ, కపిల్ సిబాల్ లతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయటం పేనుకు పెత్తనం ఇచ్చినట్లే కాదా?

 

దేశంలోని అవినీతిని పెంచి పోషిస్తున్నది మన నేతలే అన్నది అందరికీ తెలుసు. అయినా, ఆ నేతలను నేరుగా విచారించే అవకాశం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న లోక్ పాల్ వ్యవస్థకు లేకపోతే, ఆ చట్టం వలన ఎవరికి ప్రయోజనం? ఈ విధివిధానాలను వ్యతిరేకిస్తు అన్నాహజారే ఉద్యమించటంలో అనౌచిత్యం ఏముంది? లోక్ పాల్ వ్యవస్థ స్వతంత్ర్యప్రతిపత్తి కలిగి ఉండాలని ఆశించటంలో తప్పేముంది? స్వతంత్ర్య  ప్రతిపత్తి గల సంస్థగా లోక్ పాల్ ని తీర్చి దిద్దటంతోబాటుగా, జవాబుదారీతనంలేని మన పాలనావ్యవస్థను కూడా సమగ్రంగా ప్రక్షాళించాల్సిన అవసరం కూడా ఉందనేది సుస్పష్టం.

 

ఏదేమైనా పార్టీలకు, రాజకీయ నాయకులకు అతీతంగా జరుగుతున్న ఈ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ఆనాడు ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం కోసం మహాత్ముని నేతృత్వంలో జరిగిన పోరాట ప్రేరణతో ఈనాడు అవినీతికి వ్యతిరేకంగా నిలిచిన అన్నా హజారేకు ప్రజలందరూ బాసటగా నిలవాలి.

 

Your views are valuable to us!