అరబునాట ఆంధ్ర మాట

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ప్రపంచంలోని అంతరించిపోతున్న భాషలలో తెలుగు ఏడవ స్థానంలో ఉందని ఆమధ్య ఎవరో ఒక పెద్దాయన అంటుండగా విని చాలా బాధపడ్డాను. ఆమాట కొంతవరకు నిజమే అనిపించింది ఎందుకంటే, కారులేని మిత్రులెవరైనా కుటుంబ సమేతంగా మా ఇంటికొస్తే వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారిని వారి ఇంటికి నా కార్లో తీసుకెళ్ళి దింపడం అలవాటు నాకు. అలా చేసేటప్పుడు “పదండి మిమ్మల్ని నేను దింపేస్తాను” అనడమో, “వీళ్ళని దింపేసి వస్తాను” అని నా భార్యతో అంటుండగానో విన్న మా అమ్మాయి ఇంగ్లీషులో డ్రాప్ చెయ్యడం అనేమాటకు తెలుగులో దింపడం అని అనుకుందిగాబోలు ఒకసారి నా చేతికి ఒక ఉత్తరం ఇచ్చి “నాన్నా, దీనిని పోస్ట్ బాక్స్ లో దింపండి!” అంది. 

అప్పుడే చెప్పేను మా పిల్లలకి రోజుకో తెలుగు పదం నేర్చుకొమ్మని. అలాగే అని మా చిన్నది నాదగ్గరకొచ్చి “నాన్నా తెలుగులో అమ్మని అమ్మా అనికాకుండా ఇంకెలా పిలవవచ్చూ?” అని అడిగింది. “తల్లీ” అనిగానీ, “మాతా” అని గానీ లేదంటే “జననీ” అనిగానీ పిలవవచ్చు అన్నాను. జననీ అన్నమాట నచ్చినట్లుంది వాళ్ళమ్మని జననీ అని పిలవటం మొదలెట్టింది.

“అమ్మని అలా పిలుస్తునావు, మరి నాన్నకున్న మరో మాటగురించి అడగలేదేమి?” అంటూ ప్రశ్నించేను. “అది కూడా అడగాలా నాన్నా, నాకు ఆమాత్రం తెలివిలేదా, నాన్నని “జననా” అంటే సరి అంది.” తలపట్టుకోవడం నా వంతయింది.

ఇదిగో అప్పుడు నా నోట పలికిన పద్యమే ఇది.

దినమునకొక తెనుగు పదము

అనువెరుగుచు నేర్వమంచు నమ్మికి తెలుపన్

జననీ యని తల్లి బిలచి

జననాయని నన్ను బిలుచు చందము గనరే!

ఇక లాభంలేదనుకుని మా ఊళ్ళో(అబూధాబీ)ఉన్న ఔత్సాహికులూ ముఖ్యంగా తెలుగు భాషమీద అభిమానం ఉన్నవారైన కొందరు యువకులను కూడగట్టుకుని ఇక్కడ తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించాలని నిర్ణయించుకుని తెలుగు బడిని ప్రారంచించేము. బడి బాగోగులు చూసుకునే బాధ్యత మా తెలుగు కళాస్రవంతి తీసుకోగా ఏబదియారుగానున్న అక్షరమాలాదిగా తెలుగు నేర్పే బాధ్యతను నేనూ, నా తోడి కొందరు మిత్రులూ చేబట్టేము.


వాసము విడి వారాశిని

కోసులు కోసులుగమీరి కొలువులుగొన్నన్

వేసము లెవ్విధి వేసిన

బాసకు మధురాల తెల్గు పలికెదమన్నా

పై పద్యాన్ని ధ్యేయంగా చేసుకుని ఇక్కడి తెలుగు పిల్లలకు తెలుగు భాష నేర్పుతూ వారికి మన పురాణాలపై అవగాహన కలిగించటంకోసం రామాయణ, భాగవతాదులను నృత్య రూపకాలుగా మలచి వారిచే ప్రదర్శింపచేయడం జరుగుతోంది. 

పై విషయాన్ని మా తెలుగు కళాస్రవంతి దశాబ్ద్యుత్సవాల వేడుకలు చూసిన టీవీ 5 వారు నలుగురికీ తెలిసేలా వారి వార్తల కార్యక్రమంలో చూపడం జరిగింది.

ఆవకాయ మిత్రులతో ఈ విషయం పంచుకోవడం కోసం ఆ లింక్ ఇక్కడపెడుతున్నాను. అలాగే మా తెలుగు కళాస్రవంతి కోసం నేను చేసిన పాట శ్రీమతి ఎస్ పి శైలజ గళంలో వినవచ్చు.

 01 – Track 1.mp3

 

భవదీయుడు 

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

Your views are valuable to us!