ఓ “అఫ్సూర్యుడు” గురించి…

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అఫ్సర్ గారితో నా వ్యక్తిగత పరిచయం దాదాపు కొత్తదనే చెప్పాలి. కానీ ఓ కవిగా ఆయన నాకు ఒకటిన్నర దశాబ్దిగా తెలుసు. నేను “ఆంధ్రజ్యోతి” తిరుపతి ఎడిషన్ లో ప్రకటనల విభాగంలో అనువాదకుడిగా పనిచేస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి వారి ఇతర పత్రికలైన బాలజ్యోతి, వనితాజ్యోతి, ఆంధ్రజ్యోతి వారపత్రికల్ని ఉచితంగా చదివేవాణ్ణి. అలానే ఆంధ్రజ్యోతిలో ఆదివారం, సోమవారం వచ్చే సాహిత్య పుటల్ని ఒకటికి పదిసార్లు చదివేవాడిని. ఆవిధంగా అఫ్సర్ గారి పేరు సుపరిచితమైంది. ఆ తర్వాత ఓ సహోద్యోగి చెబితే తెలిసింది ఆయనా ఆంధ్రజ్యోతి ఉద్యోగేనని. కానీ ఆ కాలంలో నేను మహాసిగ్గరిని, అంతర్ముఖుడినై ఉండడంవల్ల అఫ్సర్ గారితోను, ఆంధ్రజ్యోతి వీక్లీ సంపాదకుడైన త్రిపుర్నేని శ్రీనివాస్ తోనూ పరిచయాలు పెంచుకొలేదు.

ఇప్పుడు, ఆవకాయ.కామ్ ద్వారా అఫ్సర్ గారితో వ్యక్తిగత పరిచయం దొరకడం, ఆవకాయ కోసం ఆయన నుండి సాహితీ ప్రముఖులపై ప్రత్యేక వ్యాసాలను కానుకగా పొందగలగడం అందమైన అనుభవం.

దాదాపు నెల రోజుల క్రితం అఫ్సర్ గారితో చాట్ చేస్తున్నప్పుడు తెలిసింది, ఆయన సాహిత్య వ్యవసాయం మొదలుపెట్టి మూడు దశాబ్దాలు గడిచాయని. అందులో దాదాపు సగభాగం పైగా (అంటే 1994 నుండి) అఫ్సర్ గారి రచనల్ని చదవుతూ ఉండడం వల్లనూ, “ఆంధ్రజ్యోతి” వారమన్న కించిదభిమానం ఉండడం వల్ల అఫ్సర్ గారి మూడు పదుల సాహిత్యప్రస్థానం సందర్భంగా నాకు తోచిన నాలుగు మాటల్ని వ్రాతరూపంలో అంతర్జాల పాఠకులతో పంచుకోవాలన్న ఆశ కలిగి, ఇదిగో ఈ వ్యాసాన్ని మీ ముందుంచుతున్నాను.

అఫ్సర్ కవిత్వం, వచనం, ఇతరత్రా…:

అఫ్సర్ గారు ఏ విషయం గురించి వ్రాసినా అందులో కవిత్వముండేట్టు జాగ్రత్త పడతారు. ఈ “కవిత్వ ప్రజ్ఞ” ఎల్లప్పుడూ జాగృతమై ఉండడం సామాన్య విషయం కాదు. ఓ పాఠకునిగా నాకు ఊరట కలిగించే అంశాలలో ఇది ముఖ్యమైనది.

“ఏకమ్ సత్” అన్నట్టు కవిత్వం ఒక్కటేనని, వారివారి బుద్ధికి అనుసారంగా ఆ పదానికి ముందు వారికి కావల్సిన పదాలను చేర్చుకుంటారని నా అభిప్రాయం.  ప్రిఫిక్సులు లేని శుద్ధ “కవిత్వం” నాకు నచ్చుతుంది. అర్థమౌతుంది. కదిలిస్తుంది. అలానే కవి విశ్వమానవుడు. అతనికి ప్రాదేశిక పరిధుల్ని విధించడం జీవితఖైదులాంటి శిక్షే. ఇదేదో లోతైన పరిశోధనా ఫలితం కాదు, డొక్కశుద్ధి పూర్తిగాలేని ఓ పాఠకుడి మనసు మాట అనేసుకోవచ్చు. దీని వల్లనో ఏమో కొండకచో అఫ్సర్ గారి ’లేబుల్డ్ కవితలు/రచనలు’ నా మనసులోకి ఇంకకుండా జారిపోతాయి.

అఫ్సర్ గారిలోని మరో గుణమేమిటంటే సమకాలీన సందర్భాలను జాగ్రత్తగా అనుసరించి, గమనించి, విశ్లేషించుకోవడం. ఆయా సందర్భాలలో ఏమాత్రం వస్తు వైవిధ్యమున్నా, నాడిని పట్టగానే వ్యాధిని కనిపెట్టే వైద్యునిలా కవిత్వౌషధాన్ని తయారుచేయడం అఫ్సర్ గారికి ఉండే సహజ శక్తి. ఈ సహజ శక్తికి తోడు “స్వంతగొంతు” గల కవి కావడం వల్ల ఎటువంటి విషయాన్నైనా తన గొంతుతో, తన బాణీలో వినిపించగలరు అఫ్సర్.

సినిమా గేయ రచయితల్లో శ్రీశ్రీ, ఆత్రేయలు వారికిష్టమైనంత తీపి సమయాన్ని లాగించి వ్రాసేవారైతే, ఆరుద్రగారు వారికి తద్విరుద్ధంగా చిటికెలో పాట వ్రాసి ఇచ్చేవారట. అఫ్సర్ గారు కవిత్వం వ్రాయడంలో ఆరుద్ర లాంటి వారేనని చెప్పడానికి నేను సందేహించను. తాజా విషయాలు, వార్తల పట్ల ఆయనంత సత్వరంగా ప్రతిస్పందించే వారు నేటి కవుల్లో తక్కువగా ఉంటారనుకుంటాను.

ఇక్కడో మాట. చేదుమాత్రలాంటిదే ననుకోండి! ఒక్కోసారి ఔషధం ఏదో కారణం చేత ప్రభావశీలంగా ఉండకపోవచ్చు. అలా, కొన్ని కొన్నిసార్లు కవిలోని అత్యుత్సాహమో, అధిక స్పందననో పరిధి నతిక్రమించడంవల్ల వచనం చొరబడ్డం జరుగుతూంటుంది. ఈ వచనాధికరణం వల్ల రచనలో ఉన్న కవిత్వం పలచబారి, పాఠకుల మేధో రసనలకు రుచించకపోవచ్చు. సమకాలీన విషయాలపై అఫ్సర్ గారి స్పందనల్లో కొన్నిసార్లు ఇలాంటి అరుచికరమైన వచన భ్రమణాలు సంభవిస్తుంటాయి. ఇది ఎలాంటి సాహిత్య లోపమో, అసలు లోపమో కాదో నాకు స్పష్టంగా తెలియదు. కాబట్టి దీన్నొక విమర్శగా చూడకండి.

మనిషికి “స్థిత ప్రజ్ఞత” చాలా అవసరమని అటు ఆధ్యాత్మిక వాదులు, ఇటు వ్యక్తిత్వ వికాస బోధకులూ చెబుతుంటారు. అలాంటి స్థిరత్వాన్ని నేను అఫ్సర్ లో చూసాను. గత మూడు దశాబ్దాలుగా “విరామమెరుగక పరిశ్రమించే” కవిగా అఫ్సర్ గారు కవిత్వం పట్ల గల అంకితభావాన్ని ఏ స్థాయిలోనూ వదలకుండా చూపుతూ వచ్చారు. ఈ ముప్ఫై సంవత్సరాలలో అఫ్సర్ వ్రాసిన ముద్రిత, అముద్రిత, బ్లాగ్ రచనలను పేరిస్తే కొన్ని వందల సంకలనాలౌతాయి. ఓ వ్యక్తి సాహిత్య జీవితం వాసి తగ్గని రాశి ఉండడం అరుదైన సందర్భం. నేను వ్యాసం వ్రాయడానికి గల ప్రధాన కారణాల్లో ఇదొకటి.

కవిత్వాన్నే కాదు వచనాన్ని కూడా నిభాయించగల సామర్థ్యమున్న వారు అఫ్సర్. తన అక్షరం బ్లాగులోనూ, పొద్దు, పుస్తకం, ఈమాట వంటి సాహిత్య పత్రికలు, ఆవకాయ.కామ్ లో వ్రాసిన సాహిత్య ప్రముఖులపైని వ్యాసాలూ ఈ విషయాన్నే చెబుతాయి. బహుశా ఈ సవ్యసాచిత్వమే ఒక్కోసారి ఆయన వ్రాసింది కవిత్వంలో వచనమా? వచనంలో కవిత్వమా? అన్న సందేహంలో పడేస్తుంటుంది, నాలాంటి పాఠకుల్ని.

అఫ్సర్ గారి క్రియాశీలత కవిత్వం, వ్యాసాలు వ్రాయడానికే పరిమితం కాక చర్చలను మొదలుపెట్టడం లాంటి ఉపయుక్తమైన పనుల్లో కూడా వ్యక్తమౌతుంది. కవిత్వం గురించి, సాహిత్య చరిత్ర గురించి లోతైన అవగాహన ఉన్న అఫ్సర్ లాంటి వారు మంచి చర్చలను నిర్వహించడం ఎంతో అవసరం. పాతతరానికీ, కొత్తతరానికీ మధ్య వారధిలాంటి అఫ్సర్ లాంటి అనుభవజ్ఞులు చొరవ తీసుకోకపోతే  కొత్త-పాతల మధ్య సమాచార వారధి ఏర్పడదు. ఈ దిశగా అఫ్సర్ గారు మరింత మనసు పెట్టగలరని ఆశిస్తున్నాను.

సామాజిక అంశాలను చెబుతున్నప్పుడు వస్తు ప్రధానంగానూ, అంతర్ముఖ విషయాలు చెబుతున్నప్పుడు రూప ప్రధానంగానూ చెప్పడం లోనే అఫ్సర్ గారి నైపుణ్యం వ్యక్తమౌతుంది. ఇదే అంశాన్ని ఇక్బాల్ చంద్ మాటల్లో చెప్పాలంటే “మధుపాత్రలో మధువునెంత వొంచుకోవాలి, ఉపదంశాన్ని ఎంతగా నంజుకోవాలీ అనే రహస్యం కవిత్వంలో బాగా తెలిసినవాడు మా అఫ్సర్!”.

దాశరథి గారి నోటిమాట “అఫ్సూర్యుడు” ఏమాత్రం పొల్లుపోక సమకాలీన తెలుగు సాహిత్యంలో వెలుగులు విరజిమ్ముతోంది. ఆ వెలుగు రేకుల్ని కంటినిండా పరుచుకుని, మనసును వెచ్చజేసుకోవడం మినహా మరేం చేయగలరు నాలాంటి పాఠకులు!

హైనా అఫ్సర్జీ!!


Your views are valuable to us!