ఈరోజుల్లో అంతర్జాలం నిండుగా విచ్చలవిడిగా కనిపిస్తున్న అర్ధనగ్న/నగ్న చిత్రాలు ముఖ్యంగా స్త్రీని ఒక విలాస వస్తువుగా చూపిస్తూ వస్తున్న ప్రకటనలు, కేవలం “నేను 18 సంవత్సరాలు నిండిన వ్యక్తిని” అని “ఎస్” బటన్ నొక్కినంత మాత్రంచేత విచ్చలవిడి శృంగార చిత్రాలు చూడగల స్థాయిలో ఈనాటి యువత ఉంది. బరితెగించిన లైంగిక చర్యల తో కూడిన వీడియోలు, చిత్రాలు, బూతు సంస్కృతి కి సంబంధించిన సమస్త అంశాలు అంతర్జాలంలో ఎల్లలెరుగని రీతిలో లభ్యం – ఒక్క క్లిక్ చాలు.
వసుధైవ కుటుంబకంలో ఇంత కుసంస్కృతి కూడా భాగమేనా?
దీనికి మూలమైన అంతర్జాలానికి కొన్ని హద్దులు పెట్టవలసిన ఆవశ్యకత మన భారత దేశంలో ఇప్పుడు తత్క్షణం ఉంది. కేవలం ఈ బూతు వెబ్ సైట్ల వలన యువతలో నేర ప్రవృత్తి పెట్రేగి పోతుంది. మగ పిల్లలను మృగాలుగా మారుస్తుంది. ఏ టెక్నాలజీ మన జీవితాలలో వివిధ రకాలైన సౌలభ్యాన్ని తీసుకొని వచ్చిందో అదే టెక్నాలజీ ఈ బూతు సంస్కృతినీ మన లోగిళ్ళ లోకి తీసుకొని వచ్చింది.
భారతీయతకు గొడ్డలి పెట్టు గా ఈనాడు ఈ విశృంఖల, అనైతిక వీడియోలు విరివిగా అంతర్జాలంలో లభ్యం. ఒక సంస్థకు ఫైర్ వాల్ ఎలా అనవసరపు వెబ్ సైట్లను ఓపెన్ కాకుండా చేస్తుందో తద్వారా వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేలా చూస్తుందో అలాగే మన భారత దేశానికి కూడా ఒక ఫైర్ వాల్ కావాలి. ఇది ఇంకా కట్టుదిట్టం గా పనిచేయాలి అప్పుడే మనం ఈ అత్యాచారాలను నిరొధించగలం. ఇది సాధ్యం కాదా? – ముమ్మాటికీ సాధ్యమే.
ఒక అమానుష అత్యాచారం జరిగాక వెంటనే స్పందించి నిరసన వ్యక్తం చేయడం తో భారతీయ మహిళల బాధ్యత తీరిపోదు. టెక్నాలజీ తమ మస్తిష్కం లో ఉన్నది అనే నిజాన్ని మరచి పోరాదు. ఆ టెక్నాలజీని సద్వినియోగ పరచి వైజ్ఞానిక పోరు సలపడమే భారతీయ మహిళా ఇంజనీర్ల నిజమైన బాధ్యత. ఇందుకు ఇతోధికంగా వనరులు సమకూర్చడమే భారతీయ సాఫ్ట్ వేర్ సంస్థల యాజమాన్యాల కర్తవ్యం.
ఇ-గవర్నెన్స్ అనే ప్రణాళిక కోసం కోట్లు వెచ్చిస్తున్న భారత ప్రభుత్వం ముఖ్యం గా అశ్లీల వెబ్ సైట్ల భరతం పట్టాలి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అగౌరవ పరచే స్థాయిలో ఉన్న ఈ అంతర్జాల అశ్లీల మాయాజాలం నుంచి భావి భారత పౌరులను పరిరక్షించాలి. దీనిపై రాజకీయ నాయకులు, పార్టీలు తమ కార్యాచరణను ప్రకటించాలి. సమస్య పరి పరి విధాలుగా మళ్ళీ మళ్ళీ సమాజం లో ప్రత్యక్షం ఔతుంటే కేవలం కంటి తుడుపు చర్యలతో కాలం వెళ్ళ బుచ్చడం పరిపాటి అయ్యింది మనకు. సమస్య మూలం లోకి వెళ్లి దాని అంతం చూడాలి అప్పుడే ఈ జాతి పటిష్టమౌతుంది !!
భారతీయ మహిళా ఇంజనీర్ లు మేలుకోవాలి, ఈ జాతిని, వారి భావి సంతతిని ఈ అనైతిక స్థితి నుంచి కాపాడాలి. స్త్రీ ప్రకృతి స్వరూపం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అంశ. స్త్రీ తలచుకొంటే ఏదీ అసాధ్యం కాదు. కేవలం ఆర్ధిక స్వతంత్రత కోసమే కాదు సాంస్కృతిక స్వాతంత్ర్యం కోసం పాటు పడాలి. దేశానికి వెన్నెముక అమ్మ. ఆ అమ్మ ఇబ్బంది పడేలా మన అభివృద్ధి ఉండకూడదు.
“నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అనే నానుడిని తిట్టిపోయడం వరకే మహిళామణులు పరిమితమౌతున్నారు. హద్దులు మీరిన స్వతంత్ర్యం ఎవ్వరికైనా ప్రమాదకారినే. మగవారి చేతుల్లో బలైపోతున్న స్త్రీలు, స్త్రీల చేతిలో నలిగిపోతున్న పురుషులు ఈ సమాజంలో ఉన్నారు. ఎవరి ఎంత శాతం అన్న కాకి లెక్కలు ఇక్కడ అప్రస్తుతం. పాప, పుణ్యాలు స్త్రీ, పురుషులిద్దరికీ సమానంగా లభిస్తాయి. కనుక హింస ఎవరు చేసినా అది హింసనే. అప్రస్తుతమైనా ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పదల్చుకొన్నాను. కులాల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఏ కులం వారు ఎంత అవినీతికి పాల్పడుతున్నారన్న లెక్క కూడా అవసరమే కదా! కానీ అలా జరగడం లేదు. లాభాలపైనే దృష్టి పెట్టి, అవినీతిలాంటి రుగ్మతలవల్ల సమాజానికి కలుగుతున్న నష్టాల్ని లెక్క వేయడంలో పారదర్శకత లోపించడం వల్ల కులాన్ని స్వలాభం కోసం వాడుకోవడం జరుగుతోంది. అలాగే లింగ వైవిధ్యాన్ని కూడా ఎన్నోసార్లు స్వలాభం కోసం వాడుకోవడానికి ప్రయత్నించడం వల్ల సమాజంలో లైంగికపరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.
మళ్ళీ అసలు విషయానికి వస్తే – ఈ ప్రకృతిలో రంగులు, రుచులు, అందాలు, హంగులు ఉన్నాయి. ఇదీ అసలైన అమ్మతత్వం. ఈ అమ్మే ఉగ్రురాలైతే భూకంపాలు మొదలగు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. “సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండితే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే”. భూమాతకు క్షమాపణలు చెప్పి ఉదయాన్నే మంచం దిగి భూమిపై కాలు మోపడం ఒక ఆచారంగా గల మహోన్నత సంస్కృతి కి వారసులం మనం. కానీ ఈరోజు తల్లిదండ్రులుగా పిలువబడుతున్న వారిలో ఎంతమంది ఈ శ్లోకాన్ని చెబుతున్నారు? వారిలో ఎంతమంది పిల్లలకి నేర్పించారు? బహుశా వేళ్ళ మీద లెక్కవేయవచ్చునేమో! పొద్దున లేవగానే సాత్వికమైన చింతనతో మనసును ప్రశాంతంగా ఉంచాల్సినదానికి బదులుగా మూల్గులు, కేకలు మాత్రమే ఉండే సినిమా పాటలు వింటూ లేస్తే బుద్ధి చెడిపోదా? లేక పరస్పరం తిట్లు, శాపనార్థాలతో రోజు మొదలు పెడితే అనవసరమైన క్రోధం పెరిగి, దాన్ని ఇతరులపై వెళ్ళగ్రక్కేందుకు ప్రేరేపించదా? ఇలా చిన్న చిన్న తప్పులతో రోజులను, జీవితాలను నాశనం చేసుకొంటున్నాం.
“ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తి ధారవోసి కృషి చెయ్యాలి” అన్నాడు కొసరాజు. కానీ భగవంతుడు మాత్రం “స్వల్పంగా కృషి చేయండి. అధిక ఫలాన్ని పొందండి” అన్నాడు. సమస్త శక్తిని ధారపోస్తారో లేక ధర్మాన్ని అణుమాత్రమైనా మనసుపెట్టి ఆచరి స్తారో – అన్నది వారి వారి విజ్ఞతకు వదిలిపెట్టాల్సిన విషయం. ఏది ఏమైనా వాస్తవ సమాజంలో ఉన్న స్త్రీ, పురుషులిద్దరిలోను ధర్మ ప్రవృత్తి పెరిగేంత వరకు అంతర్జాలంలో వికృత పోకడలకు అడ్డుకట్ట పడదు.
తస్మాత్ జాగృత జాగృతః
@@@@@