నిజమే భాజపా కావాలి భారతదేశపు జవసత్వం!
ఇది ఏదో భాజపా పట్ల ఉన్న పారవశ్యం, అభిమానంతో లేదా పక్షపాత బుద్ధితో చేసిన విజ్ఞప్తి కాదు. ఇదొక చారిత్రిక అవసరం. బూజు పట్టిన పాలనా వ్యవస్థ, కుళ్ళిపోయిన రాజకీయాలకు ప్రతిబింబమైన ఈనాటి రాజకీయ పార్టీలు భాజపా తో సహా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ అదే పాత పద్ధతిని, డబ్బుని, మత్తు పానీయాలను, మాంసాహార విందుల్ని ఎర వేసి, ఓట్లు దండుకొని, అందలమెక్కడం, ఎక్కిన తర్వాత ఓటరుని మరచిపోయి దేశ సమస్యల్ని స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకొని కేవలం నేతలు, వారి కుటుంబాలే అభివృద్ది చెందేలా పరిపాలన సాగించడం ఒక రివాజు అయిపొయింది. ఈ రివాజుకు కాలం చెల్లిపోయే తరుణం ఆసన్నమౌతోందని తెలుసుకొని భాజపా సంస్థాగతంగా పెనుమార్పులు తీసుకొని వస్తేనే భారత జాతికి మేలు జరిగేది.
మరి కాంగ్రెస్ ఈ పెను మార్పులు తన పార్టీ నిర్వహణలో తీసుకొని వస్తే ఆ మేలు జరుగదా అంటే తప్పక జరుగుతుంది. కానీ ఆ పని కాంగ్రెస్ చేయలేదు. ఎందుకంటే అందుకు కావలసిన మానసిక స్థితిలోఆ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ లేరు.
భాజపాకే ఎందుకు ఆ స్థితి ఉంది అనే ప్రశ్నకు సమాధానం – ఆ పార్టీ భావజాలంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న సనాతన ధర్మం. సనాతన ధర్మం ఒక అద్భుతమైన, సహజమైన ఆధ్యాత్మిక జీవన శైలినే కానీ ఓ పిడివాదపు మతం కాదు. ఈ విషయం భాజపా నేతలందరికీ తెలుసు. అదే విషయం భారతీయులకూ తెలుసు. ఈ తడవ ఈ విషయం భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్ఫుటంగా తెలియజేయ లేకపొతే ఆ పార్టీ ఒక చారిత్రిక తప్పిదం చేసిన రాజకీయ పక్షంగా మిగిలిపోతుంది. కనుక అద్వానికి, ఇతర దేశ-రాష్ట్ర స్థాయి భాజపా నేతలకు, మనసుల్లో ఉంచుకోవలసిన ముఖ్య విషయం ఇది.
ఇక నరేంద్ర మోడీ లేక వేరే మొండిఘటం ప్రధాన అభ్యర్ధా కాదా? అనే ప్రశ్న అనవసరం. పార్టీ ప్రణాళిక మేరకు ప్రజలకు చేసే ప్రమాణం ప్రాతిపదికగా సాగే పాలన ముఖ్యం కానీ కేవలం వ్యక్తులు కారు. ఈనాడు నితీష్ కుమార్ కటీఫ్ అన్నా మరో సతీష్ పార్టీని లేదా కూటమిని వీడినా నష్టపోయేది వాళ్ళే తప్ప పార్టీ కాదు. ఒక విధంగా ఈ కప్పగంతుల వలన బాగా, చాల బాగా లాభపడేది భాజపేనే తద్వారా భారత ప్రజ. ఈ విధంగా ఎవరు మిత్రులో NDA కూటమి భాగాస్వాములో వారంతా భాజపాను వీడి వాళ్ళకు తగ్గ కూటమికి చేరడం ఎంతో శ్రేయస్కరం.
సమకాలీన రాజకీయ నేతలలో మోడీ పట్ల భారత ప్రజలకు ఉన్న గౌరవం, నమ్మకం అద్వానీ కంటే ఎక్కువగానే ఉన్నది అన్న విషయం అద్వానికి ఇంకా తెలియకపోవడం శోచనీయం. పెద్దన్నగా ఉన్నవాడు తన తమ్ముడి ఖ్యాతి చూసి కుళ్ళిపోవడంలా ఉంది అద్వానీ వ్యవహారం. అద్వానీ రాజీనామా డ్రామా భాజపా నాయకత్వపు పరిణతికి భారత దేశ ప్రజల పట్ల ఉన్న అభిమానానికి చెంపపెట్టులాంటి ఘటన. భాజపా అంటే అద్వాని కాదు భాజపా అంటే క్రింది స్థాయి కార్యకర్త. ఎందఱో విశ్వాసం గల కార్యకర్తలు భాజపాకు వెన్ను, దన్ను. అదే విధంగా భాజపా యొక్క మూలం (సనాతన ధర్మం) పట్ల నమ్మకం ఉన్న భారత ప్రజలు. “ఆలు లేదు చూలు లేదు” చందాన మోడీ ప్రధాన ప్రచారకర్త అయినంత మాత్రాన ప్రధాని అయిపోయినట్లే భావించిన ఈ చుప్పనాతి భాజపా నేతలు భాజపాను ఎంత తొందరగా వదలి వెళితే అంత భాజపాకు భారత జనతకు మంచిది.
ఇప్పుడు భాజపా నేతలలో వస్తున్న మార్పులు కేవలం వారి వారి సహజ గుణ ప్రదర్శనలు మినహా ఏదో గొప్ప లౌకిక భావాలు కాదు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పడే ఆరాటం తక్క నిజాయితీ, కార్య దక్షత కోసం చేసే పోరాటం కాదు. ఇవి ఇలా కొనసాగితేనే చాల లాభం భాజపాకు. ఇలా ఈ పరిణామాలు కోసాగాలని ఆ భగవంతుని మనమంతా ప్రార్ధిద్దాం.
భాజపా ఎలా భారత దేశానికి జవసత్వాలు, భారత ప్రజలకు సుస్థిరపాలన యొక్క పారవశ్యం ఇవ్వగలదు? అనే విషయం ప్రతిపాదనకు వస్తే ఒక్కటే దానికి సమాధానమ్. అదే భారత ప్రజానీకం చిరకాలంగా కోరుకొంటున్న సుపరిపాలన. ఈ సుపరిపాలన గత 63 ఏళ్లగా కాంగ్రెస్ ఇవ్వలేదు. ఇక ఇవ్వబోదు అనే విషయం తేటతెల్లం కనుక ఉన్న ఒకే ఆశల్లా భాజపా మాత్రమే!
ఈ కుమ్ములాటలు, కటీఫ్‍లు పక్కన పెట్టి భాజపా నేతలు పార్టీ ఎన్నికల ప్రణాళిక, అది ప్రజలకు చేయబోయే నెరవేర్చగలిగిన ప్రమాణాలు – వీటి పట్ల దృష్టి సారిస్తే చాలు భవిష్యత్ చాల స్పష్టంగా గోచరమౌతుంది. భాజపా ఇక ఏ కూటమితో సంబంధం లేకుండా ఏకైక పార్టీగా అన్ని లోక్ సభ స్థానాలలోనూ పోటీ చేయాలి, చేయగలదు కూడా అందుకు రుజువు భాజపాకు ఉన్న వ్యవస్థ. దురదృష్టవశాత్తూ ఈ వ్యవస్థ ను ఇంత వరకూ సరిగా వినియోగించుకోలేదు ఈ భాజపా నాయకుడూ – వాజ్ పాయ్ తో సహా.
ఈ ప్రపంచంలో మార్పు మాత్రమే స్థిరమైన విషయం కనుక అవశ్యమైన మార్పులు ఎవరు వద్దన్నా, కాదన్న, కోపగించుకున్నా జరిగిపోతుంటాయి. ఇంకా సమయం మించిపోలేదు కనుక చక్కన ప్రణాళికతో భాజపా రంగంలోకి దిగి మంచి వ్యక్తిత్వం, చరిత్ర గల అభ్యర్థులను ఎన్నుకొని పాత నాయకులకు ఎవ్వరికీ టికెట్ ఇవ్వకుండా పూర్తిగా కొత్త నీటినే ఆహ్వానించి ప్రపంచ మానవ చరిత్రలో ఒక చక్కని అధ్యాయాన్ని ప్రారంభిచవచ్చు.
దేశానికి కావలసింది మానసికంగా శారీరకంగా ముసలి వారి పోయిన నేతలు కాదు. పరిపక్వత ఉన్న కొత్త నేతలు వారికి భాజపాలో కొదవ లేదు. ఈ విధమైన ఆలోచానా విధానాలతో మోడీ ఇక సమాయత్తం కావలసిందే. ఇలా చేసిన పక్షం లో ఆయన యావత్ భారత ప్రజా నీరాజనాలు అందిస్తుంది. మన భారత జాతికి కావలసింది సరికొత్త రాజకీయం అది సనాతన ధర్మంతో సమ్మిళితమై ఉండాలి. అది భాజపానే సాధించగలదు.
సరస్సులను, నదులను, అడవులను, మూగ జీవాలను, గోమాతలను, స్త్రీలను, బాల బాలికలను, పర్యావరణాన్ని, సేంద్రీయ సాగును, సహజ సిద్ధమైన విద్యను, ఆయుర్వేదం చెప్పిన వైద్య విధానాన్ని, అందరకూ మేలుచేసి సంపద యొక్క సృష్టి ని పరిరక్షించే పరిపాలన అత్యవసరంగా కావల్సిన ఈ దేశానికి ప్రస్తుతమున్న ఒకే ఒక ఛాయిస్ భాజపానే అని అనిపిస్తోంది.
ఇప్పటికైనా భాజపా నాయకత్వం కళ్ళు తెరచి, నిజాన్ని గుర్తించడంతో బాటూ “ఆమ్ ఆద్మీ” యొక్క ఆశల్ని, ఆకాంక్షల్నీ గుర్తిస్తుందని ఆశిస్తూ…
జై భారత్ మాతా కి
ఒక భారతీయుడు