చెరిగిపోతున్న చరిత్ర

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

 

 

భారతదేశం దేవాలయాల నాడు.

అలనాడే కాదు ఈనాడు కూడా ఎన్నెన్నో దేవాలయాలు నిర్మింపబడుతూనే ఉన్నాయి. కొత్తగా తలెత్తుతున్న దేవాలయాలు పెరుగుతున్న ఆధ్యాత్మికతకు నిదర్శనాలు అవుతాయో లేదో గానీ కూలిపోతున్న ప్రాచీన ఆలయాలు మాత్రం చెరిగిపోతున్న చరిత్రకు సజీవ సాక్ష్యాలని కచ్చితంగా చెప్పగలను.

కొద్దిరోజుల క్రితం Facebookలో ఒక చిత్రాన్ని చూసాను. కడప జిల్లాలోని ఒక ప్రాచీన దేవాలయం తాలూకు చిత్రమది. మొండి గోడలు, కూలిన పైకప్పులు, పెచ్చులూడుతూ నిలబడివున్న ఆ దేవాలయాన్ని చూసాక ఒక వెలితి ఆవరించింది. కూలిపోయిన కొన్ని ఆలయ కట్టడాల వార్తలు గుర్తుకొచ్చాయి. వాటి వివరాలను కొద్దిగా శోధించి, కాలానుగుణంగా పెట్టడానికి చేసిన ప్రయత్నమే ఈ వ్యాసం.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 
 

ఇక వివరాలు…..

26 మే, 2010 – కూలిన శ్రీకాళహస్తి రాజగోపురం

500 సంవత్సరాల ఐతిహాసిక కట్టడమైన శ్రీకాళహస్తి రాజగోపురం కుప్పకూలింది. గజపతుల రాజ్యం పై (నేటి ఒడిశా రాష్ట్రం) తన ఘన విజయానికి గుర్తుగా మహారుద్రుని ఆలయానికి భవ్యమైన రాజగోపురాన్ని కట్టించాడు ఆంధ్రభోజ శ్రీ కృష్ణదేవరాయలు.

పశ్చిమ దేశాల్లో వెయ్యి, రెండు వేల ఏళ్ళనాటి కట్టడాలు నిటారుగా నిలబడివుంటే, ప్రాచీన కాలంలోనే అమోఘమైన సాంకేతిక నైపుణ్యంతో అలరారిన భారతదేశంలో మాత్రం మూడు లేక ఐదువందల ఏళ్ళకే కట్టడాలు కాటికి కాళ్ళు జాపుకొంటున్నాయి. ఇందులో ప్రజలు, అధికారులు, ప్రభుత్వాల పాత్ర అమోఘం, అద్భుతం, అనితరసాధ్యం.

శ్రీకాళహస్తి రాజగోపుర ధ్వంసానికి కారణం – బోరు బావులు. అడ్డు అదుపూ లేకుండా ఆలయం చుట్టూ బోరు బావుల్ని తవ్వుకుంటూ పోతుంటే, ఆ ధాటికి గోపురాలకు గోపురాలే కూలిపోతున్నాయి. కూర్చొని తింటే కొండలు కరిగినట్టే, బోర్లు వేసుకొంటూ వెళ్తే కొంపలు కూలుతాయన్న సరికొత్త నానుడిని తయారు చేసుకోమని చెబుతూ ప్రాణం విడిచింది కృష్ణరాయలి రాజగోపురం!

1980లోనే ఈ కట్టాడంలోని పగుళ్ళు కనడ్డాయి. 1996లో తి.తి.దే. సహాయంతో కొన్ని మరమ్మత్తుఉ చేయడం జరిగింది. ఆపై 2010లో నిలువునా కూలిపోయే వరకూ ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు, ఆలయ అధికారులు కొత్త బంగ్లాలను, ఫార్మ్ హౌస్‍లను కట్టుకొని బాగుపడిపోయారు. నోరులేని ఆది భిక్షువు గోపురం పేకముక్కలా కూలిపోయింది. తనతో బాటే శిల్పాలను, ఓ వంద కోతుల్నీ శిథిలాల్లోకి కలిపేసుకొంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న నానుడి నిజంగా నిజమే!

*****

12 జూన్, 2011 – హంపీ వరాహ స్వామి గుడి ధ్వంసం

హంపి – పేరు వింటే చాలు అష్ట దిగ్గజాలు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, సంగీతం పలికే రాతి స్థంభాలు గుర్తుకొస్తాయి. మూడు శతాబ్దాల మహోజ్జ్వల చరిత్రకు నిలువెత్తు నిదర్శనమైన హంపీ రక్కసి-తంగడి యుద్ధం తర్వాత మరుభూమిగా మారింది. పోయినవి పోగా కావల్సినన్ని కట్టడాలు ఆనాటి భవ్య నాగరితను తెలియజేయడానికి ఉత్సాహపడుతూనే ఉన్నాయి. కానీ, మనం బాగా ఏమారిపోయామని ఆ అమాయక కట్టాడాలను ఏమాత్రం తెలీదు.

ఏ భూమి మీద మనం జల్సాగా బ్రతుకుతున్నామో, ఆ భూమిని ఉద్ధరించినవాడు భూవరాహ స్వామి. భూమీశులైన విజయనగర పాలకులు తమ రాజ్యాధికారమంతా ఆ స్వామి దయేనని చెప్పుకొన్నారు. ఎలా? తమ రాజచిహ్నంగా వరాహాన్ని ఎంచుకోవడం ద్వారా. 13వ శతాబ్దంలో కట్టబడిన వరాహస్వామి ఆలయం గనుల త్రవ్వకాల కోసం డైనమైట్లను పేల్చడంతో బాగా దెబ్బతిన్నది.


ఈ ఘటన జరగడానికి ఓ వారం రోజుల ముందు అక్రమ గనుల తవ్వకందార్లచే పేల్చబడ్డ మందుపాతరలు విఖ్యాతమైన విజయవిఠల ఆలయ భాగాల్ని తాకి, ధ్వంసం చేసాయని మరో వార్త వచ్చింది. పురాతత్వ పరిశోధక శాఖ వారు సంఘటనా స్థలాన్ని పరీక్షించారన్న వార్త తప్ప ఆ తర్వాత ఏం చేసారన్నదానిపై ఎటువంటి వార్తలు లేవు. మరి ASI వారు నిద్రించారో లేక మరో మసాలా వార్త వెంటబడి మీడియావారు వెళ్ళిపోయారో నాబోటి అజ్ఞానికి తెలిసిరావడం లేదు. 

రక్కసి-తంగడి యుద్ధంలో అళియ రామరాయలి మరణం, విజయనగర సైన్యం ఓటమి తర్వాత ఆరు నెలల పాటు హంపీ లూటికీ గురైంది. విజయనగరంపై విజయం సాధించిన బహమనీ సైన్యాలు స్వైరవిహారం చేసాయి. కొన్ని అపురూపమైన కట్టడాలు నేలమట్టమయ్యాయి. ఇది గత చరిత్ర. మతపరమైన భావాలు, రాజకీయ ద్వేషాలు రగిల్చిన మంటల్లో ఆనాడు హంపీ ధ్వంసమైంది. నిర్లక్ష్యం, స్వార్థం, దేశ చరిత్ర-సాంప్రదాయాల పట్ల పిసరంతైనా గౌరవం లేకపోవడం వంటి అవలక్షణాలతో బాధపడుతున్న భ్రష్టుల చేతిలో ఈనాడు హంపీ కునారిల్లుతోంది.

మనం చరిత్రహీనులుగా బ్రతుకబోయే రోజులు దాపురిస్తున్నాయి!

23 అక్టోబర్, 2011 – బాపటలో కూలిన 160 ఏళ్ళనాటి గాలిగోపురం

ప్రకాశం జిల్లా, బాపట్ల నగరంలోని శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయ గోపురం ఓ మధ్యాహ్నం నాడు నిలువునా కూలిపోయింది.

దాదాపు ఒకటిన్నర శతాబ్దికి పూర్వం, 1860లో నిర్మితమైన ఈ కట్టడం ఎడతెరిపిలేని వాహనాల రాకపోకల ధాటికి తట్టుకోలేక సెలవుపుచ్చుకొంది. ఇది ASI వారు చెప్పిన విషయం. 19వ శతాబ్దపు కట్టడానికే భద్రత లేకపోతే 5వ శతాబ్దంలో, ఆనాటి చోళ రాజు చే కట్టబడిన ప్రధాన ఆలయం నిలబడుతుందా అని ఆరోజు కొందరు ప్రశ్నించారు. నేటి వరకూ ఎటువంటి దుర్వార్త విన రాలేదు గనుక భావనారాయణుడు భద్రంగానే ఉన్నాడనుకొందాం!

 

03 అక్టోబర్, 2012 – శివాజీ నిర్మించిన శ్రీశైల గోపుర పతనం

ఛత్రపతి శివాజీ నిర్మించినదని చెప్పబడుతున్న శ్రీశైల దేవాలయ ఉత్తర గోపురం పగుళ్ళ కారణంగా కూలిపోయింది. ఈ గోపురానికి చివరిసారిగా 1965లో మరమ్మత్తుల్ని చేపట్టారు. అంటే, 2012 నాటికి 47 సంవత్సరాలు గడిచిపోయాయన్న మాట! నాలుగు శతాబ్దాల కట్టడం నాలుగు దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా దెబ్బతినడమనేది సంఖ్యాపరమైన కాకతాళీయం!

చేయాల్సిన మరమ్మత్తులపై వివిధ ప్రభుత్వ శాఖలు యుద్ధాలు చేసుకోవడంలో మునిగిపోవడంతో మొగలాయి పాలకుల్ని ఎదిరించి నిలబడిన మరాఠా వీరుని కట్టడం నిరుత్తరమై, నిలువునా కూలిపోయింది. ఇంతకంటే గొప్ప గౌరవాన్ని ఏ జాతి తన జాతీయ నాయకునికి ఇచ్చివుండదు.

 

20 జనవరి, 2013 – శ్రీరంగంలో కూలిన గోడ

కావేరీ నదిలోని ద్వీపకల్పంలో వెలసిన ఆలయ పట్టణం శ్రీరంగం. ఏడు ప్రాకారాలతో భూవైకుంఠంగా భాసిస్తూవుంటుంది. ఆధ్యాత్మికత ఓ వ్యాపారంగా మారిన తర్వాత ఈ ఆలయ పట్టణం ఆక్రమణలకు గురి అవుతూ వచ్చింది. వీటి ఫలితంగా అప్పుడప్పుడూ పురాతన కట్టడాలు కూలుతూ వస్తున్నాయి.

 

04 ఫిబ్రవరి, 2014 – బిల్ద్వారా గుహాలయంలో కూలిన గోడ

మైనింగ్ కార్యకలాపాలకు పెట్టిన పేరైన ఛత్తీస్‍గఢ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బిల్ద్వారా గుహలో కూలిన గోడ ఐదుగురు భక్తుల ప్రాణాల్ని హరించింది. ఈ దుర్ఘటనకు కారణం – మైనింగ్ కోసం పేల్చిన డైనమైట్లు. 


మానవ నిర్లక్ష్యం, తప్పిదాలు, పొరబాట్లకు తోడుగా ప్రకృతి వికోపాలు, ప్రమాదాలు పెచ్చరిల్లడంతో ఎన్నో పురాతన దేవాలయాలు దెబ్బతింటున్నాయి.

  1. ఆగస్ట్, 2007లో తమిళనాడులోని రెండు ప్రముఖ దేవాలయాలలోని కట్టడాలు పిడుగుపాటుకు గురై, దెబ్బతిన్నాయి. కుంభకోణంలోని కుంభేశ్వరాలయం, చెన్నైలోని కపాలేశ్వర స్వామి దేవాలయంలోని గోపురాలు పిడుగుపడడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి.
  2. నవంబర్ 2013లో త్రిపురాంతకం పట్టణంలోని ప్రాచీన బాలా త్రిపురసుందరి ఆలయ శిఖరం పిడుగుపాటుకు గురైంది.
  3. డిసెంబర్ 2013లో ప్రఖ్యాత మధుర మీనాక్షీ ఆలయంలోని తూర్పు గోపురం పిడుగుపాటుకు దెబ్బతినింది. ఈ గోపురం 13వ శతాబ్దిలో నిర్మింపబడింది.
  4. జులై 2014లో కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో 4వ శతాబ్దిలో కదంబ రాజుల చే నిర్మించబడిన ఏకనాథీశ్వరీ ఆలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది.
  5. ఉత్తరాఖండ్ లోని యమునోత్రి ఆలయం కాళింది పర్వతం నుండి జారిపడే ప్రపాతాల వల్ల, రాళ్ళ వల్ల నిరంతరం దెబ్బతింటూ కూలిపోయే ప్రమాదానికి లోనవుతోందని వార్తలు వచ్చాయి.

పై వార్తల్ని పరిశీలిస్తే పిడుగుపాట్లు, అగ్నిప్రమాదాలు, ఇతర ప్రకృతి ప్రకోపాలు మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతూండడం గమనించవచ్చు. వీటిలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల వంటి వాటిని ఆధునిక పరికరాలతో నివారించవచ్చు. సమాచార విప్లవం కారణంగా కూర్చున్న చోటునే ప్రపంచాన్ని పరికించగల ఈకాలంలో ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు జరిగిపోతున్న తప్పిదాల్ని మళ్ళీ మళ్ళీ జరగనిస్తూ కళ్ళున్న కబోదుల్లా, చెవులున్న బధిరుల్లా మారడం ఓ గొప్ప చారిత్రక దౌర్భాగ్యమనే అనుకోవాలి.


దేవుడా రక్షించు నా దేవాలయాల్ని

ASIల నుండి, ఎండోమెంట్ల నుండి

స్వార్థం మూర్తీభవించిన ప్రజల నుండి, దోపిడీ దొంగల నుండి

* * * * *


Your views are valuable to us!