చిరంజీవి కాదు ఓ “చిరు జీవి”

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మూడు దశాబ్దాల సినిజీవితంలో, దాదాపు రెండు దశాబ్దాలు చిరంజీవి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే డాన్సుగా తెలుగు వెండితెర వెలుగులు చిమ్మింది. రెండు సంవత్సరాల రాజకీయ జీవితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ముగిసింది. రఫ్ఫాడించేస్తానన్న చిరంజీవి ఇప్పుడు హస్తం పార్టీతో చేతులు కలిపేసాడు. ఇంతవరకూ, ఎవరి విశ్లేషణలు వారు చేసుకొని, చివరికి చిరంజీవి ప్రజాదోహ్రం చేసాడని ఆరోపిస్తున్నాయి అన్ని పార్టీలు.

Chiruవిచిత్రం ఏమిటంటే, గత ఎన్నికలలో గెలుచుకుంది 18 అసెంబ్లీ సీట్లే అయినా, 16 శాతం వరకు ఓట్లను చీల్చగలిగింది ప్రజారాజ్యం. తను బాగుపడిందేదీ లేకపోయినా, మా పొట్టలను కొట్టింది ఈ ప్రజారాజ్యం అని అప్పట్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు వాపోయారు కూడా. సామాజిక న్యాయమే పరమార్ధంగా పెద్దయెత్తున మొదలైన ప్రజారాజ్యం ఈరోజు చతికిలపడటానికి కారణం ఏమిటి? రాజకీయ పరిణతి లేని చిరంజీవా? వ్యాపారంతో రాజకీయాలు చేయాలనుకుని ఒంటెద్దు పోకడలతో పార్టీని నడిపిన బావమరిదా? ఉన్న పార్టీలలో ఉనికి ఏమాత్రమూ లేకపోయినా, పదవుల కోసం ప్రజారాజ్యంలోకి పాక్కుంటూ వచ్చిన పాత నాయకులా?

 

ఈ సందర్భంగా చిరంజీవి ప్రజారాజ్యాన్ని, అప్పటి ఎన్ టి ఆర్ తెలుగుదేశంతో సరిపోల్చటం తప్పు కాదు. అప్పటి రాజకీయాలలోని శూన్యత, ప్రత్యామ్నాయంలేని పార్టీగా కాంగ్రెస్ కొనసాగించిన దుష్పరిపాలన నేపధ్యంలో “తెలుగువాడి ఆత్మగౌరవం” ఒక నినాదమై సహజంగానే ప్రజలను ఆకర్షించింది. నిర్లిప్తంగా నిర్వికారంగా నిద్రాణమై ఉన్న తెలుగుజాతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది.

ఎన్ టి ఆర్ సామాజిక న్యాయమంటూ నంగి మాటలు మాట్లాడలేదు. తెలుగుజాతి ఆత్మగౌరవమంటూ గర్జించాడు. కొత్త రాజకీయాలంటూ దిక్కులు చూడలేదు, రాత్రికి రాత్రి కొత్త నాయకులను తయారుచేసాడు. ఎన్నికలలో వారికి దన్నుగా తాను నిలిచాడే కానీ, వారి డబ్బుతో తాను నుంచోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పెకిలించివేయాలనే లక్ష్యంతో, స్థిరచిత్తంతో అడుగులు వేసాడే కానీ, ఒకడుగు ముందుకువేసి రెండు అడుగులు వెనక్కు తగ్గే తరహాలో కాదు.N.T. Ramarao, Telugudesm Founder

 

ఎన్ టీ ఆర్ కు పూర్తి విరుద్ధమైన తరహాలో చిరంజీవి రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఏ ప్రశ్నకైనా, కప్పదాటు సమాధానాలే కానీ, ఖచ్చితమైన సమాధానం ఏనాడు చిరంజీవి ఇవ్వలేదు. తన పార్టీవారే, తననే తిట్టిపోస్తున్నా, తమలో తామే కోట్లాడుకుంటున్నా ఒక సామాన్య ప్రేక్షకుడిలా దిక్కులు చూసాడే కానీ, ఒక నాయకుడుగా దిశానిర్దేశం చేయలేకపోయాడు. రాజకీయ అవగాహన, విషయ పరిజ్ఞాన లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

 

చిరంజీవిని ఒక సాధారణ నాయకుడిగా మాత్రమే గమనిస్తే, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయటం “ప్రాప్తకాలజ్ఞత”గా కనిపిస్తుంది. ఒక దశాబ్దంపైగా రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసిన ఎన్ టి ఆర్ కు చివరిలో పట్టిన గతి, తనకు రెండు సంవత్సరాలలో పట్టకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు ఖచ్చితంగా తెలుస్తుంది. 16 శాతం ఓట్లు వచ్చినా, దక్కింది 18 సీట్లే. పదవుల కోసం వేరే పార్టీలను వదిలి వచ్చిన నేతలు, పదవుల కోసం పార్టీని చీల్చగలరని అర్ధమయ్యుంటుంది. అసెంబ్లీలో ఏమాత్రమూ అవకాశం లేకపోయినా, నాదెండ్ల భాస్కర రావును ఎగదోసి, ఎన్ టి ఆర్ ను దించటానికి ప్రయత్నించిన కాంగ్రెస్, రేపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకోటానికి ప్రజారాజ్యాన్ని కూడా చీల్చగలదని చిరంజీవి నమ్మి ఉంటారు.

ఏదేమైనా, వెండి తెర మీది అసాధారణ నాయకుడు ఒక సాధారణ నేతలానే తన శేష రాజకీయ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవటం ఆయన అభిమానులకు ఏమాత్రం రుచిస్తుందో!

Your views are valuable to us!