కమ్యూ”నిజం” కాలం చేసిందా?

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక వర్గం) కార్ల్ మార్క్స్ ప్రస్తావిస్తాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి కమ్యూనిస్టు వ్యవస్థకు ఆయన కోరుకున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ న్యాయమనే మార్పు వర్గపోరాటాలు, విప్లవాల ద్వారానే సాధ్యం. ఏదేమైనా, వ్యక్తి స్వేచ్ఛకన్నా సామాజిక ప్రయోజనానికే కమ్యూనిజం ప్రాధాన్యతనిచ్చింది. ఆ ప్రాధాన్యతా క్రమంలో, దాదాపు అన్ని కమ్యూనిస్టు ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించటం జరుగుతున్నది. ప్రజాస్వామ్య పరిధుల్లో సామాజిక న్యాయం ఆచరణాత్మకం కాదని వీరి అభిప్రాయం.

పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల ఓటమిని ఈ నేపధ్యంలో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాటకొస్తే, అన్నాదురై ఆశయాలతో అంటకాగిన డి.ఎం.కె. ఓటమి కూడా ఈ నేపధ్యంలోనే చర్చించుకోవాలి. ముందుగా మనది ప్రజాస్వామ్య దేశం. సామాజిక న్యాయాన్ని ప్రజాస్వామ్యయుతంగా సాధిద్దామనుకునే దేశం. మార్క్స్, లెనిన్ లు కమ్యూనిస్టులకు ఎలా పూజనీయులో, గాంధీ, జే.పీ.లు నూరేళ్ళ కాంగ్రెస్ నుండి, లాలూ ప్రసాద్ ఆర్జేడి వరకు అలానే పూజనీయులు. నిన్న మొన్నటి జగన్ పార్టీ నుంచి, భా.జ.పా. వరకూ అందరూ సామాజిక న్యాయమే తమ పార్టీ పరమార్ధంగా ప్రకటిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి, కమ్యూనిస్టులను కూడా కలుపుకొని, మన దేశంలోని పార్టీలన్నీ ప్రజాస్వామ్య సోషలిస్టులే! ఆశయాలు ఆచరణలో శూన్యమైనప్పుడు, సిద్ధాంతాలు కారల్ మార్క్స్ వైనా, గాంధీవైనా కాగితం పూలే.

మనకు స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దానికి 1957లో దేశంలోనే మొట్ట మొదటి ప్రజలు ఎన్నుకున్న కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలో ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ నేతృత్వంలో ఏర్పడింది. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు 1977 లో పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు బెంగాల్ లో కమ్యూనిస్టుల ప్రభ అప్రతిహతంగా సాగిపోయింది. 1977 లో “ఆపరేషన్ బర్గా” భూసంస్కరణలతో మొదలైన కమ్యూనిస్టుల ప్రాబల్యం, సింగూర్, నందిగ్రాం లలో చేసిన పాపాలతో ముగిసిపోవటం ఓ విశేషం.

1990 దశకం నుంచే కమ్యూనిస్టుల పతనానికి బీజాలు పడ్డాయి. గోడలకు తగిలించుకున్న సిద్ధాంతాల మోజులో ప్రజల గోడును ఆ ప్రభుత్వం పట్టించుకోవటమే మానేసింది. అంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో భూకేటాయింపులను అసంబద్ధంగా అభివర్ణిస్తూ అడుగడుగునా ఎర్ర జెండాలు పాతిన ఎర్రన్నలు, బెంగాల్ లో మాత్రం టాటాల, బహుళజాతి సంస్థల జెండాలు మోయటం ఏ మార్క్సిజమో అర్ధంకాని ప్రజలు గూబలదిరేట్లుగా కమ్యూనిస్టు పాలకులకు బుద్ధి చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా దన్నుగా నిలచిన రైతులు, మధ్యతరగతి ప్రజలు; ప్రజల కోసం కన్నా, తమ పార్టీ కోసమే ప్రభుత్వాన్ని కమ్యూనిస్టులు నడుపుతున్నారన్న నిజాన్ని గ్రహించారు. పేరుగొప్ప సిద్ధాంతాలైనా, అవకాశవాద రాజకీయాలతో ప్రజా సంక్షేమాన్ని మరచిన కమ్యూనిస్టులకు మిగతా రాజకీయ పక్షాలకు తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారు. మూడున్నర దశాబ్దాల పరిపాలన తర్వాత కూడా ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా ఎటువంటి మార్పు లేనందువల్లే, ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేసారు.

పార్టీ సంస్థలుగా మారిన ప్రభుత్వరంగ సంస్థలు, దయాదాక్షిణ్యం లేకుండా కొనసాగించిన భూఆక్రమణలు, ప్రతిఘటించిన రైతులపై కాల్పులు, బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు, జంగల్ మహల్ ఆదివాసీల సమస్యలు… చెప్పుకుంటూ పోతే కమ్యూనిస్టుల వైఫల్యాలు ఒక్క బెంగాల్ లోనే కోకొల్లలు. లౌకిక, సామ్యవాద సిద్ధాంతాల పేరుతో అడ్డగోలు రాజకీయాలాడుతూ, పొలిట్ బ్యూరో సమావేశాల్లో తమ పతనానికి పోస్టుమార్టం చేసుకుంటే సరిపోదు. 41% శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి, ప్రజలు మమ్మల్ని ఇంకా ఆదరిస్తూనే ఉన్నారనే భ్రమల్లో ఉంటే కడుతున్న సమాధిని ప్రజలు త్వరలోనే పూర్తిచేస్తారు.

ఆశయాలను, ఆదర్శాలను సిద్ధాంతాల వరకే పరిమితం చేసి, ఆచరణలో అలసత్వం చూపిస్తే, ఏ పార్టీకైనా ఈ ముప్పు తప్పదు. కానీ, సిద్ధాంతాల పునాదుల మీద నిలబడ్డ పార్టీగా గతంలో ఆచరణాత్మకంగా వ్యవహరించిన నిష్ట కమ్యూనిస్టులకు ఇప్పుడు అవసరం.

Your views are valuable to us!