దద్దమ్మదినోత్సవం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పంద్రాగస్టంటే సాలు మా పోరగాళ్ళకి యాడలేని ఇది. కుడిసేత్తో ఎడంసేత్తో వో తెగ తిరంగాల్ని వూపేస్కొంటా తిరిగేస్తరు. ఉత్తినే తిరగ్తారా అంటే..ఉ ఊ…”Wish you happy Independence day” అన్న అరుపొకటి. అంగ్రేజోణ్ణి తరిమేసినామని అంగ్రేజు బాసలో సెప్పుకోడం మన దేసబక్తి. యెం సేత్తాం సెప్పండి!

నిన్న మా పిలగాడు గుండె మీన జెండా పిన్ను బెట్ట్కొని వచ్చిండు. వచ్చీరాంగనే “జై హింద్” అని సాల్యూటూ కొట్టిండు. ఆణ్ణి దగ్గర దీస్కొని అడ్గితి “నాన్నా జై హింద్ అంటే యేట్రా?”. “యేమో నాకు తెల్వదు. ఇస్కూల్లో మేడమ్ మా సేత అరిపిచ్చింది.” అని సెప్పి తుర్రుమన్నడు. ఆడికే గాదులేండి మన దేసంలో గొప్పగొప్పోళ్ళకే ఆ అరుపుకు అర్దం తెల్వదు.

ఆడు లోనికి లగెత్తి పోయినంక మంచెం మీద పండుకొని జై హింద్ అనంటే బూతు కాదేటి సోచాయించబట్టినా. సెక్యులరిస్టు గుండెలు ఈ అరుపును ఇనగానే పగిలిపోవేటి? పుట్టికాడినుంచీ ఈడే గూడు కట్టుకొనున్న హిందువులకంటే ఆనక వొచ్చినోళ్ళే గొప్పోళ్ళు గదో? మా తాతమ్మ సెప్పేది “వొరే అబయ్యా ముందొచ్చిన సెవుల కంటే యెనకొచ్చిన కొమ్ములు వాడిరా”. దాన్ని సత్తెంగా నిబాయిస్తాన్నారు సెక్యులరిస్టోళ్ళు.

ఈ పంద్రాగస్టుకు బారతదేసానికి సొతంత్రం వొచ్చి 65 యేళ్ళు. గంటే మన సేతకాని దద్దమ్మతనానికి సస్టి పూర్తి పూర్తైమీన అయిదేళ్ళైతాంది గదో!

యెనకాటికొకడు “నన్ను కొట్టేదేటి మా బావని కొట్టి సూడు” అని సెప్పిండంటా. గట్లనే ఐపోనాది ఈ దేసం. తెల్ల తోలోళ్ళు ఒకళ్ళ తర్వాత ఇంకోళ్ళు రాంగానే మనోళ్ళు ఆ పక్కనే వున్న ఇంకో మనోళ్ళపై ఉస్కో ఉస్కో అని తెల్లోళ్ళని ఎగేసిండ్రు. ఇనోదం సూసిండ్రు. ఆనక ఆ తెల్లోడు ఈళ్ళపైకే ఉస్కో అనంగా చెంగడబంగడ ఉర్కబట్రిండ్రు. సివరాకరికి ఆల్లకి దాసోహమని కాల్లు నాకబట్టిండ్రు.

యెందకో యెక్కవగా సోచాయిత్తాననిపింసింది. యెహే సోచాయించక ఇంకేం సేతనౌ నీకని లోపల్నుంచి (ఇంట్లోంచి గాదులే) వోలో అర్సిండ్రు. మల్లీ సొఃచాయించడం సురూ జేస్తి.
అప్పుడెప్పుడో 1600ల్లో తెల్లోళ్ళు బారతదేసానికి వొచ్చినట్టు మా పిలగాడు సదవతాంటే ఇన్నా. కనిపింసిన రాజు కాల్లకి దండాల్ బెట్టి యాపారం సేసేందుకొచ్చినామ్ దొరా కనికరింసమని సెప్పిండ్రంట. గట్లా వో వంద నూటాబై యేండ్లు కాంగానే సీను మారిపోయి మన రాజులు ఆల్ల బూట్లని నాకడం మొదలెట్టిండ్రంట. బలే, మనోళ్ళది మాసెడ్డ ప్రోగ్రెసు గదో. తమ పిర్రల కింద సీటు కదలనంత కాలం మన రాజులోల్లకి కూడా సెగ పుట్టేదాని నా బయంగోరానుమానం. పిరంగుల్తో తెల్లోల్లు కదిలొస్తే సానామంది రాజులు వొంగివొంగి కౌగిలింసుకొన్నారంట.

ఆనక 1857లో మంగల్ పాండే అయ్యగోరు ఇప్లవ సంకం వూది తెల్లోల్ల మీద్కి బడినాడంట. మా పొరగాడ్ని అడ్గితి “వొరే అబ్బీ పాండె బాబు ఎందుకురా సంకం వూదిండు” అని. దానికి మావోడు “యేంలా అయ్యా! గప్పట్లో తుపాకుల్లోనికి గుండ్లు సేత్తో వొక్కటొక్కటిగా దూర్సేవాల్లు. గట్ల గుండు దూర్సాలంటే దానికున్న సీలు నొటో వొలవాల. గానీ ఆ సీలుకి ఆవు కొవ్వు, పందుకొవ్వు పూసేటోళ్ళంట. మంగల్ పాండే బాపనయ్యోరు గందా ఆవు కొవ్వుండాదనంగానే కోపమొచ్చీసీసి తెల్లేల్ల పై తిర్గబడ్నాడ్లే” అని సెప్పి సాకలేట్ సీక్కొంటా పోయిండు.

గప్పుడు నాకనిపింసింది అది దేసబక్తా జాతిబక్తాని? సపోజ్ పర్ సపోజ్ ఆవుకొవ్వు గన్క లేకపాయింటే పాండే అయ్యోరు ఇప్లవ సంకం మోగింసేవోడు గాదు గదో! ఎంసెక్కా తెల్లోల్ల గులాముగిరీలో మనోల్లపైనే గుండ్లు పేల్సేటోడు గాదేటి? గిట్లా సెప్తాన్నానని తిట్టబాకండి. సదువుతక్కువోన్ని….బుర్ర తక్కవైనాదని సర్దేసుకోండి.

అయ్యలూ, అమ్మలూ నా గోడు ఇంతే ….సొతొంత్రం సాంతంగా వూడిపోయేంత వరకీ గురకెట్టీసీడం దేసబక్తా? కోన్ కిస్కా గాడెవడో వొచ్చి మనపై పెత్తనం సెలాయింసేదాక వూర్కుండి, ఆడు మనోల్లని దోమలకంటే హీనంగా సూసేంత వరకీ నోరు మూసుకోడం దేసబక్తా? కిందాబాగ మంటపుట్టి బొబ్బలెక్కేసినాక గోలగోల సేసి పేనాల మీదికి తెచ్చీసుకోడం దేసబక్తా? యేతో నాకైతే సమజౌతలేదు. గెప్పుడైనా పొయ్యే పేనాల్ని తెల్లోళ్ళు కాలెట్టిన ఎంబటనే బలిచ్చేసుంటే యెంత ఇదిగ వుండేది.

నా సోది పూరా సదివినోల్లకి వెయ్యిన్నొక్క హాపీ డిపెండెన్స్ డేలు. సదవనోల్లకి……ఆల్లకి కూడా డేడేలే.

Your views are valuable to us!