ఇటీవలి కాలములో దేవుళ్ళను కార్టూన్లుగా చిత్రిస్తూ కార్టూను సినిమాలు వస్తున్నాయి. హనుమాన్, గణేశ మొదలైనవి. పిల్లలను ఆకర్షించాలన్న తపనతో విచిత్రములైన అంశాలను చొప్పిస్తూ సాగితాయి ఈ సినిమాలు. అలాగునే పాశ్చాత్య కార్టూను ఫిల్మ్ శైలిని అనుకరిస్తూ మన సంప్రదాయములకు విరుద్ధములైన విన్యాసాలను దేవతల చేత చేయిస్తున్నాయి ఆ సినిమాలు. ఉదాహరణకు హనుమాన్ కార్టూనులో హనుమంతుడు ఒక ఋషి తపస్సు చేసుకొనుచున్న కొండను పెకిలించి మరో చోట స్థాపిస్తాడు. ఇది చాలా గర్హనీయమైన చిత్రీకరణ. మహాభాగవతోత్తముడైన హనుమంతుడు తపోభంగము వంటి వెకిలి చేష్టలు చేసినట్టు ఎక్కడా ఉల్లేఖనలు లేవు. హనుమంతుడు చురుకైనవాడు, బలశాలి అన్న విషయములను నిరూపించుటకు ఇంతకంటే ఉత్తమమైన ఉదాహరణలు కోకొల్లలుగా కలవు కదా!
అలాగునే, ఈ మధ్య కాలమున దేవతల చిత్రాలను గీయుటలో నవీనతను చూపించు అత్యుత్సాహములో కొద్దిమంది చిత్రకారులు వింతపోకడలకు పోతున్నారు. ఉదాహరణకు ఈ క్రింది చిత్రములను చూడండి
రాముని వికృత రూపము:
హనుమంతుని వికృత రూపము:
రాముడు పురుషోత్తముడు. సాత్విక శక్తికి నిలువెత్తు నిదర్శనము. ఆతని సాత్వికశక్తి కేవలము శారీరికమైనది కాదు, దివ్యజ్ఞాన పూరితమైనది. అలౌకికమైనది. అట్టి మహిమోపేతుని ఈవిధముగా కండలు మాత్రమే పెంచజూసే తుచ్ఛ మానవునిగా చిత్రించుట సమంజసమేనా? ఆశ్చర్యకరముగా ఈ చిత్రమును వేసిన చిత్రకారుడు భారతీయుడే. మనము నిత్యమూ అర్చించి, దర్శించి, పులకించెడి శ్రీరాముని సాత్విక రూపము ఇదే.
మరి హనుమంతుని నవీన చిత్రీకరణను చూచిన దుఃఖమే తప్ప మరొక్క భావము కలుగదు. కించిత్తూ అపశబ్దము పలుకని వానిగా శ్రీరామునిచే శ్లాఘించబడిన హనుమంతుడుని ఈవిధముగా ఆటవికజాతి వానిగానూ, పూర్ణముగా ఎదగని ఒక వానరముగానూ చిత్రించి చూపట ఖండనీయమే. రామనామజప తత్పరుడై నేటికీ గంధమాదన పర్వతమున నివసించెడి శ్రీహనుమంతుని ఈ క్రింది సాత్విక రూపము చూచిన మనలో కూడా భక్తిభావము ఉప్పొంగును కదా!
“దీపం దీపేన సంయోజయతి” అన్నట్టుగా ఒక రూపము మరొక రూపమును తీర్చిదిద్దును. సాత్విక గుణ సంపన్నములైనట్టి రూపములను మరల మరల దర్శించుట చేత దర్శకుల మనోవైకల్యములు దూరములై వారి మనసులు వక్రములు కాకుండా ఉండును. ఇదే రీతిని తుచ్ఛములు, కామపూరితములు, వికృతములగు రూపాలను చూచిన కొలది మనసు వికారమై, దుష్ట కార్యముల వైపుకు తిరుగగలదు. దీనిని యోచించియే మన పూర్వీకులు రూపచిత్రణా మార్గములైన శిల్పకళ, చిత్రకళ మొదలగువాటిని కొన్ని నియమములచే నియంత్రించినారు. కానీ నవీనత పేరుతో వీటన్నింటిని త్రోసిరాజనుట మూర్ఖత్వమే. భావ స్వేచ్ఛ, కళా స్వేచ్ఛయను ముసుగులను వాడి సౌకుమార్య హీనములైన చిత్రములను నిర్మించుట తగదు. విజ్ఞులు ఒకపరి యోచించిన అంతుతేలని బ్రహ్మపదార్థమేమీ కాదీ విషయము. మీరు ఏమందురు?