దుశ్శబ్దపు జాడీల్లో…

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

జాడీలోని ఆవకాయ లాలాజలోత్పత్తికి తొలిమెట్టైతే దుశ్శబ్దపు జాడీల్లోని బూజు భావాలు తిరకాసు కవిత్వానికి ఆఖరి మెట్లుగా మారతాయని జాలం జగ్గేశ పండితుడు రాసిన “నవవర్ణశాల”లో వుంది. ఇదో తిర్యక్ సృష్టిపరిణామక్రమమని, కోతి మనిషిగా మారినట్టుగానే శబ్దం నిశ్శబ్దం కాబోయి దుశ్శబ్దమైందని కూడా జగ్గేశ పండితుడు చెప్పాడు.


మీకు అక్షరాలు వచ్చునా?

వాటిల్తో వాక్యాలు రాయడమూ వచ్చునా?

“రా! కూర్చో!” అని కాక “కూర్చోడానికి రా!” అని డొంకతిరుగుడుగా చెప్పడం వచ్చునా?

అలా కాస్త ముందు కెళ్ళి “కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా!” అని చెప్పగలరా”?

అక్కడితో ఆగక “కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా! నగ్నంగా, నైపుణ్యంగా, వంకరగా, వాలుగా, చేవ్రాలుగా” అని సుత్తికొట్టడం కూడా చేతనౌనా?

ఇంకేం మీరు కూడా కవిత్వం రాసేయొచ్చు. గుర్రం కదం తొక్కాలంటే గుగ్గిళ్ళు జోరుగా దట్టించాలి. మీ కలం కదం తొక్కాలంటే బోలెడు పదాల్ని దట్టించాలి.

దళిత కవిత్వం ఉంది. స్త్రీవాద కవిత్వం ఉంది. అభ్యుదయ, విప్లవ కవిత్వాలు కలియుగారంభం నుండీ ఉన్నాయి. ఉన్నవి చాలుననుకొంటే అజీర్ణమని మన తెలుంగుల బాధ. మన ఆకలికి ఈ నాలుగైదు రకాల అరకాసు కవిత్వాలు చాలవుగా! అందుకనే కొత్తవి కనిపెట్టుకొన్నాం. నానీలు వచ్చాయి. కంశ్రీలు వచ్చాయి. నానోలూ వచ్చాయి. ఏకాక్షరాలూ ఊడిపడ్డాయి. వీటికి తోడు నంజుడు కోసమని కధన కవిత్వం, వ్యాస కవిత్వం వంటివి కూడా వచ్చాయి.

కధన కవిత్వం – ఒక ఉదాహరణ కవిత


“నీవు నేను కలుసుకొన్నాం. కలుసుకొని నలభై యేళ్ళ పై మాటే.
కలుసుకొన్న తొలిరోజులో నీలో విద్యుత్తు ఉండేది. కావల్సినపుడు నేను స్విచ్చు వేసుకొనేవాణ్ణి!
నువ్వు వెచ్చగా వెలిగితే…నేను హాయిగా దొర్లేవాణ్ణి
రాను రాను, పరమాణువులే తగ్గాయో! అణుకాలుష్యమే పెరిగిందో తెలీదు
నీలో విద్యుత్తు తగ్గింది. నా స్విచ్చు కూడా సరిగ్గా పనిచేయడం మానేసింది
నీలో వెచ్చదనం పోయింది. నాకు దొర్లడం కూడా చేతకావడం లేదు.
ఐనా కలిసే ఉన్నాం.
నువ్వు అప్పుడప్పుడూ వెలుగుతూ…నేను అప్పుడప్పుడూ దొర్లుతూ”

 

వ్యాస కవిత్వం – ఒక ఉదాహరణ


మా వూళ్ళో నీళ్ళు లేవు.
1967 జులై నుండీ లేవు
గత నలభై నాలుగేళ్ళలో ఎనిమిది మంది ప్రధానులు మారారు.
పన్నెండుమంది ముఖ్యమంత్రులు మారారు.
పదహైదుమంది నీటిపారుదల మంత్రులు మారారు.
ఇరవై ఎమ్మెల్యేలు మారారు.
మా వూరి తలరాత మాత్రం మారలేదు. గొంతులో గుక్కెడు నీళ్ళు జారలేదు.
వాగ్దానాల గంగలు తప్ప తెలుగుగంగ పారలేదు.

ఒక బొక్కెన నీళ్ళ కోసం ఐదు మైళ్ళు నడవాలి.
అంత నడవాలంటే ఎంత తినాలి?
కానీ తిండి ఎక్కడ? పంటలు పండాలిగా?
పంటలు ఎక్కడ? నీళ్ళు కావాలిగా?
నీళ్ళు ఎక్కడ? వర్షాలు పడాలిగా?
గత నలభై నాలుగేళ్ళలో మా వూళ్ళో పడింది నాలుగు మి.మి.ల వానే!
ఓ వానా! నీకు కూడా మేము లోకువేనా?
……………..
(ఇంకో ఇరవైపేజీల సరకు ఉంది కానీ చేతులు నొప్పెట్టడంతో టైపలేకపోయాను. రచయితగారు క్షమించగలరు!)

నవల కవిత్వం – ఒక ఉదాహరణ


“అదో పెద్ద మేడ. ఆ మేడ కోటీశ్వరుడైన రాజశేఖరానిది.
రంగుల పూలరంగడైన రాజశేఖరానిది యూజ్ అండ్ త్రో మనస్తత్వం.
వస్తువులే కాదు మనుష్యుల్ని కూడా….యూజ్ అండ్ త్రోనే!
వాణీశ్రీ అతని సెక్రెటరీ
జలపాతం లాంటి శిరోజాలు
జలచరాల్లాంటి చంచలమైన కళ్ళు
కోటేరు ముక్కు, చిన్ని పెదాలు
నునులేత పెదాలు..వగైరా వగైరాలు.
అన్నింటినీ త్రో చేసే రాజశేఖరం వాణిశ్రీని ప్రేమించాడు.
వాణీనే తన వలపు తొలి బోణీ అని తీర్మానించాడు.
పురుషాహంకారానికి ప్రతినిధిగా రాజశేఖారాన్ని ఎంచింది వాణిశ్రీ
…………………..
ఇలా సాగి..పోతుంది నవల కవిత్వం.

డిటెక్టివ్ కవిత్వం – ఒక ఉదాహరణ

“ఎవరది?
ఎందుకిలా చేస్తున్నారు?
ఏమిటా ఉద్దేశం?
శత్రువు ఎవరు? ఇంటివాడా? వంటింటివాడా? రాయి వాడా? పరాయివాడా?
కనిపెట్టాలి. శోధించాలి. సాధించాలి.
మన నీడనే అనుమానించాలి.
మన జాడనే పెనుమానించాలి. దాచాలి. విదిల్చినా పడకుండా చూసుకోవాలి.
దేశానికి పేరు తేవాలి. దేశమాతను సేవించాలి.
అంతర్గత, బహిర్గత శత్రువులను ఏకకాలంలో తుదముట్టించాలి.”

 

*************

ఇది ఘోరం, ఇది నేరం, ఇది నీచం” అని వ్రాస్తే అది వ్యక్తిగత బాధా కవిత్వం.

నీయమ్మా..నీయబ్బా..” సంబోధన నిరసన కవిత్వం.

ఓ ఓరి ఓసి” – సంబోధనా ప్రధమా విభక్తి ధిక్కార కవిత్వం.

చేతన్ చేన్ తోడన్ తోన్ బుడబుక్కలోడన్” – సంబోధనా తృతీయా విభక్తి కవిత్వం.

ఫోటో పెట్టి కింద రాసేది ఫోటో క్యాప్షన్ కవిత్వం.

ఇలా తెలుగునేలంతా కవిత్వ వ్యవసాయంలో మునిగిపోయింది. తేలడం ఇప్పట్లో అగుపట్టంలేదు.

*****

దాంతో కంగారుపడిన నేను ఒకానొక కొమ్ములు తిరిగిన విమర్శక భూషణుడిని అడిగాను.

దానికి ఆయన-“కధన కవిత్వం అవసరం. లేకుంటే కధకు, కవిత్వానికి తేడా లేకుండ పోతుంది. వ్యాస కవిత్వమూ అవసరమే. ఎందుకంటే అప్పుడే వ్యాసానికి, కవిత్వానికి తేడా తెలిసేది. మీరు చెప్పిన నూటొక్క రకాల కవిత్వాలూ సృష్టి పరిణామక్రమంలో వచ్చినవే. వేటిల్నీ తోసిపారేయ్యరాదు.” అన్నారు.

ఔనేమో అనుకొని బైటకొచ్చాను.

అంతలో ఏదో డౌటువచ్చి అడగడానికి లోనికెళ్తే ఆ విమర్శకుడిగారికి దణ్ణాలు పెడ్తూ, అంకితాలు ఇస్తూ కధన కవులు..వ్యాస కవులు..ఫోటో క్యాప్షన్ కవులూ…..

*****

ఈ సుత్తి రాయడానికి ప్రేరణనిచ్చిన అజ్ఞాత మిత్రునికి కృతజ్ఞతలు!

Your views are valuable to us!