ఎవడు తవ్విన గోతిలో ఎవరు?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

జగన్ అక్రమ ఆస్తుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నది. వైయస్సార్ ప్రాపకంతో ఆయన అడుగులకు మడుగులొత్తి చక్రాలు తిప్పిన అతిరధ మహారధులైన మంత్రులకు, అధికారులకు, కార్పొరేట్ దిగ్గజాలకు ముచ్చెమటలు పడుతున్నాయి. మంత్రి మోపిదేవి వెంకటరమణను సి.బి.ఐ. అరెస్టు చేసిన నేపధ్యంలో, ఇవాళో రేపో జగన్ అరెస్టు కావొచ్చనే ఊహాగానాల మధ్య రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి.

ఎత్తులు పైఎత్తులతో సాగుతున్న ఈ జిత్తులమారి రాజకీయాలు నాలాంటి సగటు పౌరుడికి చాలా ప్రశ్నలు సంధిస్తున్నాయి. సత్యం కుంభకోణం నుంచి, 2 జి, కామన్వెల్త్, ఆదర్శ్, వాన్ పిక్, తదితర అక్రమాల వరకు “చట్టం తన పని తాను చేసుకుపోతుందని” ఏలిన్నాటి పాలకులు చిలక పలుకులు పలుకుతూనే ఉన్నారు. ఎవడి గోతి ఎవడు తవ్వుతున్నాడో తెలీకుండా సస్పెన్సు థ్రిల్లర్ లాగా రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి.

విచిత్రం ఏమిటంటే, అరెస్టైన ప్రతివాడు తను చేసినదాన్లో తప్పేం లేదంటున్నాడు! మోపిదేవి ముఖ్యమంత్రికి వ్రాసిన రాజీనామా లేఖలో జీ.ఓ. 29 కి, పోర్టు పరిధికి సంబంధించిన అంశాల్లో నూటికి నూరుశాతం బాధ్యత వహిస్తానని చెబుతూనే, ఆ జీ.ఓ. మాత్రం తన స్వంత నిర్ణయంకాదని, అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే చేసానని చెబుతున్నాడు! బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఓ మంత్రి, బాధ్యతారాహిత్యంతో అడిగినచోటల్లా సంతకాలు పెట్టి వందలవేల కోట్లు నష్టం కలిగించటమే కాకుండా, ఈరోజు అదంతా తూచ్ అనేస్తే తూచ్ ఐపోతుందా?

నీతి, నిజాయితీ లేకుండా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఇలాంటి రాజకీయ నాయకులు తమ గోతులు తామే తవ్వుకుంటారని ఈ ఉదంతం నిరూపిస్తున్నది. ఏ.రాజా, కణిమొళి, సురేష్ కల్మాడీ లా ఈయన ఏమాత్రం అదృష్టవంతుడనేది కాలమే చెబుతుంది. శిక్షపడుతుందనే గ్యారంటీ మాత్రం లేదు.

తిలా పాపం తలా పిడికెడు అన్న విషయం మర్చిపోయి, అక్రమాలతో ఆస్తులు సంపాదించింది ఒకరైతే, అరెస్టులు అరదండాలు మాకా అంటున్నారట మరికొందరు సీనియర్ మంత్రులు. తమ మంత్రిత్వ శాఖలో అక్రమాలు జరుగుతున్నా కబోదుల్లా కళ్ళు మూసుకొని సంతకాలు చేయకుండా ఆరోజే, ఆ ముఖ్యమంత్రిని ఆక్షేపించి ఉండవచ్చుకదా!

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు మంత్రులంతా బాధ్యులే, కానీ చాటుమాటున జరిగే లావాదేవీలతో సంబంధం ఉండదని బొత్స స్పష్టం చేసారట! ఇది చాలా ఆసక్తికరమైన అంశం. లిక్కర్ సామ్రాజ్య పునాదులు కదిలించిన పోలీసు అధికారిని చాటుమాటు వ్యవహారాలతో కాదా బదిలీ వేటు వేయించింది? రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చి, ఇదే లిక్కర్ వ్యవహారాన్ని తిరగదోడితే ఆయన ఏమంటారో!

వైయస్సార్ హయాంలో జగన్ అక్రమార్జన చేసినట్లు ఆరోపణలు ఈరోజు శంకరరావు చేస్తేనే తెలిసిందా? ఆరోజు మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నా, ఈ వ్యవహారాల్లో అక్రమాలు కనిపించలేదా? అప్పుడు కుక్కిన పేనుల్లా ఉన్నవారికి ఈరోజు ఇన్నేసి కోరలు ఎలా వచ్చాయి? అంతే కాకుండా, ఆరోజుల్లోనే ఈ అక్రమాస్తులతో కాంగ్రెస్ అధిష్టానానికి మూటలు మోస్తున్నారనే ఆరోపణలు వచ్చింది నిజం కాదా? అప్పట్లో ఇన్నేసి అక్రమాలు జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం గుడ్లప్పిగించి చూస్తూ ఎందుకు ఉంది? అసలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తెలియకుండానే వేలకోట్ల అక్రమాలు జరిగాయంటే నమ్మశక్యమేనా? చట్టం తన పని తాను చేసుకుపోటానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? అసలీ వ్యవహారం జగన్ ను రాజకీయంగా మట్టుపెట్టటానికేనా? లేక ఈ అక్రమార్జనలో కాంగ్రెస్ అధిష్టానానికి ఉన్న భాగస్వామ్యానికి మసిపూయటానికా? గాంధీ కుటుంబాన్ని కాపాడటానికి రాష్ట్ర మంత్రులు బలిపశువులౌతున్నారా?

Your views are valuable to us!