హిందూత్వం కొత్తదేమీ కాదు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మార్పుకై భారత జనత కలవరింత, నరేంద్ర మోదీ ఉత్థానం, భా.జ.పా ప్రభంజనం, ఎన్డీయే విజయ కేతనం  – వెరసి భారతదేశంలో సుస్థిరమైన కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు జరిగిపోయింది. ఇది నిజం. ఈ నిజాన్ని యథాతథంగా స్వీకరించలేని వారు ఉన్నారు. వీరు అనేక విధాలుగా భారత ప్రజల విజ్ఞతను శంకిస్తూ, అనుమానిస్తూ, అవమానిస్తూనే ఉన్నారు.

భా.జ.పా గెలుపు తర్వాత ఈ అజీర్తి బాధితుల్లో అనేకులు “శాతా”ను భూతాల్ని పైకి లేపి ప్రజల్ని భయపెట్ట చూసారు. “భా.జ.పాకు ఇంత శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి”, “భా.జ.పాయేతరులకు ఎంతో శాతం ఓట్లొచ్చాయి”, “ఇది అధిక శాతం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు” – ఇలా ఎన్నో రకాల పర్సెంటేజీ పజిల్స్ తో విరుచుకుపడ్డారు. కానీ వీరి పౌనఃపున్యాలను పట్టించుకొన్న నాథుడు లేడు. దీనికి బదులుగా “నరేంద్ర మోదీ తల్లి దీవెనలు తీసుకొన్నాడు”, “పార్లమెంటు మెట్లపై సాగిల పడ్డాడు”, “సెంట్రల్ హాల్లో ఏడ్చాడు”, “సోనియాజీ అవమానించిన సర్దారుజీ గారిని ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఆయన ఇంటికే వెళ్ళి పలకరించాడు”, “రోజుకు పన్నెండు గంటలు పని చేస్తున్నాడు” వంటి వార్తలే రాజ్యమేలాయి.

ఇలా “శాతా”ను భూతాలు భూస్థాపితం కావడంతో బెంబేలు పడిన లౌకికవాదులు ఇప్పుడు మరో కొత్త ప్రేతాన్ని లేపుకొస్తున్నారు. దాని పేరు “హిందూత్వం”. సదరు హిందూత్వం సోనియాత్వం కన్నా రాహులీయం కన్నా ప్రియాంకవాద్రోయం కన్నా ఘోరమైనదని ఘోషిస్తున్నారు. అంతే కాదు మార్క్సిజమ్, లెనినిజమ్, స్టాలినిజమ్, మావోయిజమ్, రివిజనిజమ్, క్యాపిటలిజమ్ వంటి వాటి కన్నా నీచమైనదని ఉపదేశిస్తున్నారు.

సరే. వారి ఘోషలెలావున్నా ఓమారు భారత ప్రభుత్వం తరతరాలుగా హిందూత్వాన్ని ఎలా గౌరవిస్తోందో పరిశీలిద్దాం: 

 

  1. భారత ప్రభుత్వ నినాదం    :     సత్యమేవ జయతే
  2. సుప్రీం కోర్ట్                  :       యతో ధర్మస్తతో జయః
  3. దూరదర్శన్                :        సత్యం శివం సుందరం
  4. ఆలిండియా రేడియో       :      బహుజనహితాయ – బహుజనసఖాయ
  5. ఇంటలిజెన్స్ బ్యూరో (IB)  :      జాగృతం అహర్నిశం
  6. RAW                         :       ధర్మో రక్షతి రక్షితః
  7. DRDO                      :        బలస్య మూలం విజ్ఞానం
  8. భారత వాయుసేన         :        నభః స్పర్శం దీప్తం
  9. భారత నౌకాదళం           :        శం నో వరుణః
  10. తీర రక్షక దళం             :        వయం రక్షామః
  11. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్     :       సర్వత్ర
  12. ఆర్మీ ఏర్ డిఫెన్స్           :       ఆకాశే శత్రూన్ జహి
  13. రాజపుత్ రైఫిల్స్           :       వీరభోగ్యా వసుంధరా
  14. ఉత్తరప్రదేశ్ పోలీస్          :    పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం

ఇవి కాక ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు కూడా “హిందూత్వ”పు స్లోగన్లనే స్వీకరించినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు: 

  1. LIC                            :          యోగక్షేమం వహామ్యహం
  2. AIIMS                        :          శరీరమాదాయం ఖలు ధర్మసాధనం
  3. BITS Pilani                 :          జ్ఞానం పరం బలం
  4. CBSE                         :          అసతో మా సద్గమయా
  5. IIT Madras                 :          సిద్ధిర్భవతి కర్మజా
  6. IIT Bangalore            :          తేజస్వీ నావధీతమస్తు
  7. IIT Kharagpur            :          యోగః కర్మసు కౌశలం
  8. IIT Kanpur                 :          తమసో మా జ్యోతిర్గమయా
  9. Sr. Xavier’s School, Bokaro :       రూపాంతరీకరణీయం
  10. హిదాయితుల్లా జాతీయ న్యాయ కళాశాల : ధర్మ సంస్థాపనార్థం

ఇలాంటి సంస్కృత సుభాషితాలు చాలా సంస్థలకు ఉత్ర్పేరకాలుగా ఉన్నాయి. ఇక భారత సైన్యం యుద్ధ నినాదాల వైపు కొద్దిగా చూపు మరల్చుదాం.

 

  1. ఇండియమ్ ఆర్మీ          :        భారత్ మాతా కీ జై
  2. పంజాబ్ రెజిమెంట్         :        జో బోలే సో నిహాల్ సత్ శ్రీ అకాల్
  3. మద్రాస్ రెజిమెంట్         :        వీర మద్రాసీ అడి కొల్లు అడి కొల్లు
  4. గూర్ఖా రెజిమెంట్           :        జై మహంకాళీ అయో గోర్ఖాలీ
  5. మరాఠా లైట్ ఇన్‍ఫాంట్రీ    :       హర హర మహాదేవ్
  6. గ్రెనెడియర్స్ రెజిమెంట్     :       సర్వదా శక్తిశాలీ
  7. రాజ్‍పుటానా రైఫిల్స్        :      జై రామచంద్ర జీ కీ
  8. రాజపుత్ రెజిమెంట్        :      బోల్ భజరంగ బలీ కీ జై
  9. జాట్ రెజిమెంట్             :      జాట్ బలవాన్, జై భగవాన్
  10. మహర్ రెజిమెంట్          :      బోలో హిందూస్థాన్ కి జై

ఇప్పుడు భా.జ.పా ఉన్నతిని “హిందూత్వ” ఉన్నతిగా భావిస్తూ ప్రళయకాలం సమీపించేసిందని “2012కు సృష్టి అంతం” వంటి (అప)ప్రచారం చేస్తున్న వారి వాదన చూస్తే పై సంస్థలన్నీ హిందూత్వ సంస్థలే ఐవుండాలి. అక్కడ హిందూ ఉన్మాదులకు తప్ప మరే మతస్థులకు చోటు లేదని అర్థం చేసుకోవాలి. కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఐతే ఈ మేధావులు ఎవరి కోసం తపిస్తున్నట్టు? వేరేవారెవ్వరి కోసం కాదు. వారి సొంత అస్తిత్వం కోసం. ఇన్నాళ్ళు మేధావులుగా, ఉన్నత స్థాయి వ్యక్తులుగా చెలామణీ ఐన వీరిని భారత ప్రజలు వామనులై పెరిగి పాతాళానికి ఉన్న పళాన తొక్కేయడంతో ఉక్కిరిబిక్కిరై నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు.

సంస్కృత భాషను ఒక భాషగా చూడక ఒక మతానికి ముడి పెట్టడం, ఆ మతాన్ని ఒక ప్రాచీన సంస్కృతిగా గౌరవించక మూఢనమ్మకాల ఆమాం బాపతు మతంగా అగౌరవపరచడం, ఆ భాషాసంస్కృతులకు చెందినవాటిని అంటరానివిగా చూడడం, సమర్థించే వారిని ఉన్మాదులుగాను మూర్ఖులుగాను అవమానించడం వంటివి ఆరు దశాబ్దాలుగా చాలామందికి అలవాటైపోయింది. ఇంతకాలం తమ అంట కాగిన అధికారులు నిరుద్యోగులవడం వీరికి మింగుడు పడ్డం లేదు. సంస్కృత భాష, సనాతన సంస్కృతుల్లోని మంచి విషయాలను స్వీకరించాలని నిర్ణయించేవారికి అధికారం రావడం చేదుమాత్ర అయింది.

ఈ పరిస్థితుల్లో అందరికీ వర్తించే ఒక నిజాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి – తిరిగే చక్రంలో పై భాగం ఎప్పుడూ అక్కడే ఉండదు. కిందిది పైనికొచ్చి ఆ పైది కిందికి దిగినప్పుడే ప్రయాణం సాగుతుంది. ఐతే చక్రం వెనక్కు తిరిగితే తిరోగమనమే మిగులుతుంది. ఇన్నాళ్ళూ ఈ దేశపు సాంస్కృతిక చక్రం వెనక్కే తిరుగుతూ వెళ్ళింది. ఐదువేల సంవత్సరాలుగా ప్రపంచానికి తన వంతుగా విజ్ఞానాన్ని పంచిన ఒక పురాతన దేశపు ఆనవాళ్ళను తుడిచివేసే ప్రయత్నం ప్రజాచైతన్యం మూలంగా అగ్రస్థానం నుండి అధః పాతాళానికి దిగజారింది. జాతీయతావాదాన్ని వినిపించిన గళాన్ని కింది నుండి పైకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చక్రం తిరగాల్సింది ముందుకు మాత్రమే. “వైరాగ్యేన చ గృహ్యతే” అని పురోగమనానికి పనికిరానివి పాతవైనా, కొత్తవైనా వదుల్చుకోవల్సిందే. లోతైన ఆలోచనతో కూడని జాతీయవాదం నిరర్థకం అవుతుంది. పైపై మెరుగులు పూసే లౌకికవాదం ప్రమాదకరమవుతుంది.

భారత ప్రభుత్వము, మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ ఆదర్శాలుగా ప్రకటించుకున్న సంస్కృత సూక్తులు, సంస్కృత సాహిత్యం నుండి సేకరించిన సైనిక దళాల నినాదాలు, ప్రభుత్వ సంస్థలు-విద్యాలయాల ఆశయ సూచికలు భారతీయతను నిస్సందేహంగా ప్రదర్శిస్తున్నాయి. ఇవి ఒక మతానికి చెందిన భావాలు కావు. కావు గనుకనే అరవై సంవత్సరాలకు పైగా వాడుకలో ఉంటున్నాయి. వీటిలో ఎవ్వరూ “మతపరమైన” కోణాల్ని చూడడం లేదని తెలిసివస్తోంది. ఆయా సూక్తులలో మత విశ్వాసాలు గాక సర్వకాలీనమైన దార్శనికతను, విశ్వసౌభ్రాతృత్వ కాంక్ష, మానవీయ విలువలు చక్కగా ప్రతిఫలిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

సనాతన సంస్కృతిలోని సిసలైన ఉదారత్వాన్ని గ్రహించలేని వారు మొదలు చేయవలసింది అధ్యయనమే గానీ ఉపదేశం కాదు. కానీ ఈ ప్రపంచంలో చాలా సులువుగా చేయదగ్గపని ఉచిత సలహాలను పడేయడం. ఇన్నాళ్ళూ సదరు మేధావులు చేసింది ఇదే. తాము స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయక కొన్ని చీకటి కోణాలను చూపించి అవే “హిందూత్వ”మని,  ఇది చాలా ప్రమాదహేతువని ప్రచారం చేసారు. ప్రతి కార్యము ఎక్కడో ఒక చోట ముగింపుకు లోనైనట్టే ఈ ప్రయత్నాలకు కూడా ముగింపు ఉండాలని నేటి ఎన్నికల్లో ప్రజలు సూచించారు. జనతాభిప్రాయాన్ని గ్రహించి, గౌరవించాల్సిన కర్తవ్యం సదరు మేధావులదే.

ఉత్తేజపూరితాలైన ఆ మాటల్లోని సారాన్ని, సారాంశాన్ని గ్రహించి ముందుకు సాగడమే మన ముందున్న ముఖ్య కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణకు అడ్డుపడేవారిని పక్కన బెట్టి సాగాల్సిన అవసరం సామాన్యుల కంటే మేధావులకే ఎక్కువగా ఉంది. లేనిపోని ఊహాగానాలతో బురద జల్లే మహనీయులందరూ తమ స్వకపోలకల్పితాలకు విశ్రాంతినిచ్చి కొద్దిరోజులు మౌనం వహించడం ఉత్తమం. సదరు ధీరులందరూ నిందారోపణలకు వెచ్చించే సమయాన్ని నైతిక స్థైర్యాన్నిచ్చే పనులకు వెచ్చించడం అభిలషణీయం.

 

||శుభమ్||

Your views are valuable to us!