గౌరవనీయులు పవన్‌కళ్యాణ్ గారికి – నమస్కారాలతో…
ఈమధ్య ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో మీతో నా భావాలు పంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఈ బహిరంగ లేఖ. మిమ్మల్ని అవమానించాలనో, మీ అభిమానులను కవ్వించాలనో ఉద్దేశ్యంతో మాత్రం వ్రాయలేదని గ్రహించగలరు.
ఈ లేఖకు సంబంధించి అప్రస్తుతమైనా, నేను ఒకప్పుడు ఎన్.టి.రామారావు, శోభన్‌బాబు గార్ల అభిమానిని. ఆ తరువాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణలకు అభిమానిని. ఇప్పటితరంలో మహేష్‌బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్.టి.ఆర్.ల అభిమానిని అని చెప్పదలచుకున్నాను.
***
ఇక అసలు విషయానికి వస్తే…
నేను ప్రస్తావించాలని భావించిన విషయాలు ముఖ్యంగా రెండు ఉన్నాయి. అందులో మొదటిది, ప్రజారాజ్యం నేపథ్యం – నిష్క్రమణ. రెండవది, జనసేన నేపథ్యం – లోటుపాట్లు.
ప్రజారాజ్యం నేపథ్యం – నిష్క్రమణ
ఎన్.టి.ఆర్. తరువాత అంతటి ప్రజాదరణ కల హీరోగా మేము భావించిన చిరంజీవి 2008 నాటి ప్రజారాజ్యాన్ని, 1980ల నాటి ఎన్.టి.ఆర్ తెలుగుదేశంతో సరిపోల్చటం తప్పు కాదు. 1980ల నాటి రాజకీయాలలోని శూన్యత, ప్రత్యామ్నాయంలేని పార్టీగా కాంగ్రెస్ కొనసాగించిన దుష్పరిపాలన నేపధ్యంలో “తెలుగువాడి ఆత్మగౌరవం” ఒక నినాదమై సహజంగానే ప్రజలను ఆకర్షించింది. నిర్లిప్తంగా నిర్వికారంగా నిద్రాణమై ఉన్న తెలుగుజాతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది.
ఎన్.టి.ఆర్ సామాజిక న్యాయమంటూ నంగి మాటలు మాట్లాడలేదు. తెలుగుజాతి ఆత్మగౌరవమంటూ గర్జించాడు. కొత్త రాజకీయాలంటూ దిక్కులు చూడలేదు, రాత్రికి రాత్రి కొత్త నాయకులను తయారుచేసాడు. ఎన్నికలలో వారికి దన్నుగా తాను నిలిచాడే కానీ, వారి డబ్బుతో తాను నుంచోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పెకిలించివేయాలనే లక్ష్యంతో, స్థిరచిత్తంతో అడుగులు వేసాడే కానీ, ఒకడుగు ముందుకువేసి రెండు అడుగులు వెనక్కు తగ్గే తరహాలో కాదు.
ఎన్.టి.ఆర్ కు పూర్తి విరుద్ధమైన తరహాలో చిరంజీవి రాజకీయ ప్రస్థానం కొనసాగింది. 2008లో ప్రజారాజ్యం ఆవిర్భవించే నాటికి, సమైక్యాంధ్రలో ఎటువంటి రాజకీయ శూన్యతా లేనప్పటికీ, చిరంజీవి ఎలుగెత్తిన సామాజిక న్యాయం అనే నినాదాన్ని ప్రజలు తలకెత్తుకోవాలనే భావించారు. కానీ, ఏ ప్రశ్నకైనా, కప్పదాటు సమాధానాలే తప్ప, ఖచ్చితమైన సమాధానం ఏనాడు చిరంజీవి ఇవ్వలేదు. తన పార్టీవారే, తననే తిట్టిపోస్తున్నా, తమలో తామే కోట్లాడుకుంటున్నా ఒక సామాన్య ప్రేక్షకుడిలా దిక్కులు చూసాడే కానీ, ఒక నాయకుడుగా దిశానిర్దేశం చేయలేకపోయాడు. రాజకీయ అవగాహన, విషయ పరిజ్ఞాన లేమి కొట్టొచ్చినట్లుగా కనిపించేది.
విచిత్రం ఏమిటంటే, 2009 ఎన్నికలలో గెలుచుకుంది 18 అసెంబ్లీ సీట్లే అయినా, 16 శాతం వరకు ఓట్లను చీల్చగలిగింది ప్రజారాజ్యం. తను బాగుపడిందేదీ లేకపోయినా, మా పొట్టలను కొట్టింది ఈ ప్రజారాజ్యం అని అప్పట్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు వాపోయారు కూడా. సామాజిక న్యాయమే పరమార్ధంగా పెద్దయెత్తున మొదలైన ప్రజారాజ్యం చతికిలపడటానికి కారణం ఏమిటి? రాజకీయ పరిణతి లేని చిరంజీవా? ఒంటెద్దు పోకడలతో పార్టీని నడిపిన బావమరిదా? ఉన్న పార్టీలలో ఉనికి ఏమాత్రమూ లేకపోయినా, పదవుల కోసం ప్రజారాజ్యంలోకి పాక్కుంటూ వచ్చిన పాత నాయకులా?
వీటన్నిటికన్నా ప్రధానకారణం, ప్రజారాజ్యం పార్టీలోని మేధోపరమైన శూన్యత. సరైన సమయంలో సరైన అవగాహన కల్పించి, సరైన నిర్ణయాలు తీసుకోగలిగే నేతలు లేకపోవటం. దూరాలోచనలు చేయగలిగే నాయకులు లేకపోవటం.
***
జనసేన నేపథ్యం – లోటుపాట్లు
రాష్ట్ర విభజన గాయాల నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల సమయంలో, చాలామందికి చిరంజీవి ప్రజారాజ్యం ఉండిఉంటే బాగుండేదని అనిపించిన మాట వాస్తవం. అప్పటికి కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తున్నా, కనీసమాత్రంగానైనా రాష్ట్ర విభజనను ఖండించింది చిరంజీవే. తెలంగాణాలో తనకన్ను తాను పొడుచుకోలేని పరిస్థితుల్లో రెండు కళ్ళ సిద్ధాంతంతో ఒకవైపు తెలుగుదేశం, విభజన పాపాన్ని కాంగ్రెస్‌కు కాకుండా చంద్రబాబుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఇటు వైయస్సార్పీ. పోటీ ప్రధానంగా సాగింది ఈ రెండు పార్టీల మధ్యే.
రాజకీయాల్లో, అయితేలు – గియితేలు, కానీలు – అరకానీలు ఉండవు, అయినా కూడా, 2014లో ప్రజారాజ్యం ఉండి ఉంటే, ఆంధ్రా ప్రజలు 2009నాటికన్నా కూడా ప్రజారాజ్యాన్ని ఆదరించి ఉండే వారని నేను ఖచ్చితంగా చెప్పగలను. సరిగ్గా ఆ సమయంలోనే మీరు ప్రకటించిన జనసేన ప్రజలలో ఆశలు రేకెత్తించిందనేది అతిశయోక్తి కాదు.
“సామాన్యుడి హక్కుల కోసం పోరాడదాం” అనే స్ఫూర్తితో అప్పుడే కళ్ళు తెరిచిన పసికూన జనసేన; భా.జ.పా., తెలుగుదేశంకు మద్దతుగా నిలవటం, ‘రాజకీయాల్లో చంటబ్బాయి చిరంజీవినే’ గుర్తుకు తెచ్చింది. ఎన్నికల అవగాహనలు తప్పు కాదు. కానీ, జనసేనకు ప్రాతినిధ్యం లేని అవగాహనలోని ఔచిత్యం ఏమిటి? ఒకవేళ, రాజకీయ పార్టీగా పూర్తి సంసిద్ధత లేని పక్షంలో, తన అభ్యర్ధులను స్వతంత్రులుగా నిలబెట్టి ఉండవచ్చు కదా! చట్టసభలలో ప్రాతినిథ్యం లేకుండా సామాన్యుల హక్కులు ఎలా సాధించగలం అనే ప్రాథమిక ప్రశ్న కూడా వేసుకోలేకపోవటం జనసేనలో లోపాన్ని ఎత్తి చూపిస్తుంది. అధికారం ముఖ్యం కాదు, హక్కుల పోరాటమే ముఖ్యం అనుకోవటం రాజకీయ పరిజ్ఞాన లేమినే సూచిస్తుంది.
నిన్న మొన్నటి శ్రీరెడ్డి విషయంలో కూడా, అనవసరమైన వివాదాన్ని పూస్తుకున్నట్లే కనిపిస్తుంటే ఎవరిది తప్పు. ఒక అమ్మాయి సినీ ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలపై గొంతెత్తింది. సామాన్యుల హక్కుల కోసం పోరాడే జనసేన కార్యకర్త ఏం చేయాలి? వెంటనే, మందీ మార్బలంతో పోరాటానికి ఉపక్రమించాలి. మరి మీరు చేసిందేమిటి? ఆ అమ్మాయిని పోలీసులకు ఫిర్యాదు చేసుకోమని చెప్పటమా, హక్కుల కోసం పోరాటమంటే! అందుకు ప్రతిస్పందిస్తూ ఆ అమ్మాయి మిమ్మల్ని బూతులు మాట్లాడిన వెంటనే, ఆఘమేఘాల మీద పోరాటం ప్రకటించారే! ఎవరి మీద? ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి చేసిన బూతు ప్రసంగాన్ని మ్యూట్ చేసి ప్రసారం చేసిన మీడియా మీద! ఇంత రాజకీయ అపరిపక్వతతో ఏం సాధించగలరని మీ ఉద్దేశ్యం?
మీ మీది అభిమానంతో, రాళ్ళు రువ్వి, ఆస్తులు ధ్వంసం చేసి పోలీసులచే నిర్భంధించబడ్డ ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి? వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? అసలు, ఈ పిల్లలు మీకు జరిగిందనుకున్న అవమానంపై ఎందుకు పోరాటం చేయాలి? అభిమానులను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో మీరు చేస్తున్న ప్రసంగాలు దీనికి కారణం కాదని అనగలరా? రాజకీయాల్లో వచ్చే వివాదాలు రాజకీయంగానే పరిష్కరించుకో గలిగే నేర్పు ఓర్పు లేనప్పుడు రేపు ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికైతే, రాష్ట్రం పరిస్థితి ఏమిటి?
రైట్, ప్రత్యేక హోదా విషయంలో మన రాష్ట్రాన్ని భా.జ.పా. మోసం చేసింది. ఆ తిలా పాపంలో తెలుగుదేశంది కూడా ఓ పిడికెడు ఉంది. మరి, మీ భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రభుత్వమేగా ఇది. మీ పిడికెడు పాపం లేదని అనగలరా? ఈ రెండు పార్టీలతో 2014లో మీరు చేసుకున్న అవగాహనకు క్షమాపణ చెప్పలేదే, తెగతెంపులు చేస్తుకుంటున్నామని ప్రకటించలేదే?
ప్రత్యేక ప్యాకేజీ కంపుకొడుతున్న లడ్డు అని అభివర్ణించిన మీరు, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలిసివచ్చిన మీరు, ఆంధ్రుల హక్కుల పోరాటానికి పాంచజన్యాన్ని పూరించలేదే? రైట్, రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో అవినీతి ఉందని కూడా మీరు ఆరోపిస్తున్నారు, ఆవేదన పడుతున్నారు. సరే, ఆ అవినీతి చిట్టా పద్దులు చెప్పమని అడగగానే, బయట ప్రజలు అనుకుంటున్న విషయమే నేను చెప్పాను అనే నంగి మాటలు దేనికి? రాజకీయాలంటే సినీ గాస్సిప్పులని భావిస్తున్నారా? నేను లేస్తే మనిషిని కాదు అన్న బెదిరింపులే తప్ప, ఈ నాలుగు సంవత్సరాలలో ప్రజల కోసం మీరు చేసిన పోరాటం ఒక్కటి చూపగలరా?
అప్పట్లో చిరంజీవి చేసిన తప్పులు తిరిగి చేయరాదనే ఉద్దేశ్యంతో తొందరపడి పక్క పార్టీ నేతలను చేరదీయటంలేదు. మంచిదే. కానీ, మీ పార్టీలో మేధోమథనం చేయగల నాయకుడు ఏడి? రాజకీయపు ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగే దురంధరులు ఏరి? కనీసం, ఆలోచనలు సక్రమంగా ప్రజలకు చేరవేయగలిగే సమాచార వ్యవస్థ ఏది? అయినదానికి, కానిదానికి ఉద్రేకంతో ఊగిపోయే అభిమానుల ఎనర్జీని గాడిలో పెట్టగలిగే వ్యవస్థ ఏది? వారి కారణంగా అభాసుపాలౌతున్న పార్టీగానీ, మీ పలుకుబడి గురించి గానీ ఆలోచించి మీకు నచ్చజెప్పే సలహాదారులు ఏరి?
మొన్నటిదాకా, తెలుగుదేశం, తెరాసా, కాంగ్రెస్ పార్టీలు విదిలించిన ఎంగిలి మెతుకులతో సీట్లు గెలుచుకున్న పరాన్నభుక్కులైన కమ్యూనిస్టులు మీ వెంటే సదా నడిచివస్తారని మీరు భావిస్తున్నారా? ప్రపంచమంతా ఏరిపారేసిన కమ్యూనిస్టులతో అంటకాగుతూ, మీరు ప్రత్యామ్నాయం అందించ గలరని భావిస్తున్నారా?
2014 ఎన్నికల ఫలితాల తర్వాత మన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో రాజకీయ శూన్యత కనిపిస్తున్నది. విభజన పాపం కారణంగా కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోయింది. ఇప్పట్లో లేచే అవకాశం లేదు. ప్రత్యేక హోదా పక్కన పెట్టిన కారణంగా భా.జ.పా.కి కూడా కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుంది. అవినీతి మంకిలం అంటుకున్నా, కొద్దోగొప్పో ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర పోషిస్తూనే ఉన్నాడు జగన్. చంద్రబాబుని కాదు అనుకుంటే, మనకు ఉన్న ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి జగనే. ఆనాడు చిరంజీవికి ఏమాత్రం అనుకూలంగాలేని పరిస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. కానీ, మీరు వివేకం కోల్పోయి, వస్తున్న అవకాశాలు మట్టిపాలు చేస్తున్నారనేది నా అభియోగం.
ప్రత్యామ్నాయం కోరుకునే ప్రజలకు మీరు అందివస్తారనే ఆశతో…. ఈ నాలుగు వాక్యాలు.
భవదీయుడు,
కొండముది సాయికిరణ్ కుమార్