మొదటగా కొంతమంది గొప్పవాళ్ళ అభిప్రాయాల్ని చెప్పుకొస్తా. వాటి ఆధారంగా చర్చించుకొవచ్చు.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు వొక వుపన్యాసంలో నాటకం పరిపూర్ణమైన కళ అని చెప్పే సందర్భంలో తక్కిన కళల్లోని లోటుపాట్లను యెంచారు. ఆ సందర్భంలో కవిత్వం లోని “లోపాల” గురించి అట్లా జెప్పారు. గానీ మనం ఆయన అభిప్రాయంలో మనక్కావల్సింది మాత్రమే తీసుకొని చర్చిద్దాం.
“ప్రతి కళయందును కొంత విశిష్టమైన మేలివి గలదు. అట్టి కొదవయు గలదు. ప్రతి కళయును కొన్ని భావముల జూపి మరికొన్నింటిని మీరే వూహించుకొనుడని తనకు చేతగాక మనకు వదిలిపెట్టును. చిత్రకర్మలో వ్యక్తియొక్క పలు వన్నెలు స్పష్టముగా జూపవచ్చునుగాని దాని ప్రక్కలు, వీపును జూపలేము. విగ్రహ రచనలో వస్తువు దశ దిక్కులను చూపవచ్చును గాని వస్తు భేదమునకును, భావభేదమునకును ముఖ్య సాధనములలో నొకటి యగు వర్ణ భేదమును జూపలేము. వీనికంటే కవిత్వమందు వస్తువు యొక్క అంతరంగ బహిరంగములు, క్రియలు చిత్రింపవచ్చును గాని దానికి మూలమైన పదార్ధము శిల, మన్ను, వన్నె మొదలగువాని నుండి ప్రత్యక్ష ద్రవ్యము గాక సంకేత రూపమైన భాష యగుటచేత స్పష్టత యను గుణము పైవాని కన్న నిందులో తక్కువ. కాబట్టి తక్కిన కళలయం దక్కర లేనిది మాత్రమే కాక వికారముగా గూడా పరిణమించు అతిశయోక్తి కవిత్వమునం దలంకారబీజమై వెలకెక్కినది.”
కట్టమంచి రామలింగారెడ్డి తమ కవిత్వతత్వవిచారంలో యిల్లాగంటారు- “విషయము ప్రధానమైనది గద్యము. రసప్రధానము పద్యము…భావనాశక్తియనగ విషయముల మనసులో బ్రతిబింబించునట్లు చేయు సామర్ధ్యము. ఒక్క ప్రతిబింబించుట యననేల! ప్రత్యక్షముగ నవతారమెత్తునట్లు చేయుట…ఈ తీరున కృత్రిమముల సైతము మూర్తీభవింప జేయువారే మహాకవులు…వ్యాకరణము యతిప్రాసలు అన్నియుదప్పక కుదిరినను భావనాశక్తి లేనియెడల నట్టి పాండిత్యము జీవము లేని యాకారము వలె జడంబుగ గాన్పించును.”
వీళ్ళేగాక ప్రాచీనులైన ఆనందవర్ధనుడు, రాజశేఖరుడు మొదలైనవాళ్ళు గూడా కవిత్వమంటే, కావ్యనిర్మాణమంటే కగుడింతం వొప్పజెప్పేంత సులువైన విద్యగాదని మొత్తుకొన్నారు. అట్లా కొంచెం ఆవలకేసి జూస్తే అరిస్టాటిల్ మొదలు ఎజ్రా పౌండు దాకా గ్రీకు లాటిన్లలో మొరబెట్టుకొన్నారు.
తెలుగునేలలో యెవడు జెపితే నాకేంటనే వీరబాహులు దుడ్డు కర్రల్తో వీరంగంజేసి కవిత్వానికి, వచనానికి తేడాల్ని తుడిపేసారు. ఇంట్లో యెలక ఛస్తే, వీధిలో కుక్క కరిస్తే “స్పందించి”పోయే ‘కవులు’ తయారయ్యారు. ఫ్లైవోవరు, కోకాకోలా, నర్మదా డ్యాము….యిల్లా పెద్ద చిట్టానే తయారుజేసారు. ప్రతి చిట్టాకి వీళ్ళు పెట్టుకొన్న ముద్దుపేరు “సంకలనం”. యివిగాక పిల్లి ఈనినట్టు ఆర్నెల్లకో, యేడాదికో పుస్తకాలు వేయడమనే జబ్బొకటి. ఇవన్నీ చాలవన్నట్టు పైత్యాన్ని ముదరబెట్టుకొని నానీలు, బనీన్లని వికారాలని ఉత్పత్తి జేయడం. మర్కెటింగు జేయించడం. ఆయనెవరో పదకవితా పితామహ కాంగాలేంది నేను నాన్ననైనా కాలేనా అని వాతలెట్టుకోవడం….యీల్లా మనోవికారాల మధ్య అసలు కవిత్వం చచ్చి సున్నం గావడమే గత 10-15 యేళ్ళల్లో మన సాహిత్య క్షేత్రం పురోగతి. వెర్రితలలేస్తున్న వికారాల్ని శస్త్ర చికిత్స జేసి తీసిపారేయాలేగానీ లేపనాలు రాసి, చందనాలు పూసి తగ్గిస్తామంటే కుదురుతుందా?
కొత్తగా రాసేవాళ్ళను విమర్శిస్తే గొల్లుమని యేడుస్తారు. అమ్మకంటే కమ్మరకట్టే ముఖ్యమనే పిల్లల్లా! అంచాత కొంచెం పేరున్నవాళ్ళు, భుజకీర్తులు దట్టంగా తగిలించుకొన్నోళ్ళను చూద్దాం.
తెలుగు సాహిత్యంలో 75 నానీలనబడే కిచిడీ ముక్కల్ని “శతకం” అని పేరుపెట్టే వక్ర శకమొకటి బయల్దేరింది. దాన్నొక ఆధునిక సాహిత్య ప్రయోగమని చెప్పేసిన విమర్శక సంతతి కూడా వుంది. సదరు ప్రయోగంలోని కొన్ని కర్మ కాండలు..
గుండెకు గండి
ఆ గాయానికి
మొక్కుదాం రండి
(మూల్గుదాం రండి అంటే మరింత నప్పేది!)
చిన్న పత్రికలు
తలలెగరేస్తున్నాయి
సినారె
సిరాగాలతో
(యేం! పెద్ద పత్రికలు తిలోదకాలిచ్చేసాయా?)
తెలంగాణ మట్టికి
మకుటం
తెలుగు వీధుల్లో
పూలశకటం
(మకుటం, శకటం అని రాయడానికి యూనివర్శిటీ డాక్టర్లు గావాలా?)
అంటాంగానీ భట్రాజులే మేలు. “ఫలానా రాజుగారి తలగుండుగండా” అని వున్నదున్నట్టు వుత్ప్రేక్షించేవాళ్ళు. మరి వీళ్ళో! వీళ్ళ రాతలో?
సమీక్షకు, విమర్శకూ తేడాలున్నాయ్ గానీ రెండింటా సాత్వికతా సంయమనమూ అవసరమని బహుమంది చెబుతున్నారు. ఈకాలంలో సమీక్షలే దప్ప విమర్శలెక్కడివీ? వెన్నముక నిటారుగా వుండే విమర్శకులేరీ? కనబడరేం!!
మన కవికులాలంకారులు విమర్శకులకిచ్చే కిమ్మత్తేమిటో చూడండి..
కాకవులైతే తప్ప మరింకే కవులూ
విమర్శకుల తలవూపుకోసం
ప్రయత్నంతో కవిత్వం వ్రాయరు!
….
విమర్శకుల సాహిత్య వ్యాఖ్యానాలు
చాలాసార్లు గరిక పాటి!
….
కవిగా యెప్పుడూ నాకు ఒకటే అనిపిస్తుంది
సహితీ రంగాన…
అతడు ఒకానొక విమర్శకుడు
కానీ, నేను
ఒకే ఒక జయప్రభని!
(ది పబ్ ఆఫ్ వైజాగపట్నం – జయప్రభ)
యిల్లా విమర్శకుల్ని వినను అని తీర్మానించుకూర్చోడమా గొప్పదనం? యిల్లాంటి కేకల్ని వూదరపెట్టి దాన్ని కవిత్వమని సంకలనాల్లో వేసుకోడం అపరిపక్వతకు నిదర్శనం కాదా?
యిప్పుడొస్తున్న సమీక్షలు కూడా అసలు సమీక్షలైతేగా! మొక్కుబడిగానో, మొహమాటంగానో గొణిగే మాటల్నేనా మీరు సమీక్షలని భ్రమపడ్తోంది?
సరే నా కళ్ళతో వొద్దు…వ్యాసం మొదట్లో చెప్పిన రాళ్ళపల్లి, కట్టమంచి నిర్వచనాల ప్రకారం చూడండి. నానీలు, నానోలనీ, కంశ్రీలనే నానా చెత్తలో యెక్కడుంది రసం? యెక్కడుంది నవనవోన్మేషనత్వం?
అస్తికి, అస్థికి తేడాతెలీని అర్భకులు కూడా సంకలనాలు తెస్తున్న ఘోరకలికాలం యిది. రూపం, శిల్పం అంటే యెరుగని స్వయంఘోషిత మేధావులు సాహిత్యాన్ని సంకుచితం జేస్తున్నారు. అరుపులు, కేకలు, పెడబొబ్బలు, తిట్లు, శాపనార్ధాలను కవిత్వమని చెలామణి జేస్తున్నారు. పొలిటికల్ డిక్షన్కు, పొయెటికల్ డిక్షన్ను ముడిబెట్టి నానా డింకావాదాల భేరీనాదాల్ని నలుదిక్కుల్లోకి వాయగొడుతున్నారు. అక్షరాల మర్యాదనే గాక అంకెల మానాల్ని గూడ బజారులో హరాజువేసే మెయిన్ స్ట్రీము కుకవుల విసర్జనాల్లో మునిగిపోయి తేలని తరమొక్కటి తయారైపోయింది. తమ కాళ్ళకి తామే దండాలు పెట్టుకొని దీర్ఘాయుష్మాన్ అని దీవించుకొంటున్న మరుగుజ్జులు తిరుగుతున్న నేటి కాలంలో సిసలైన సాహిత్యం చీకటి మూలల్లో బిక్కుబిక్కుమంటోంది.
కలుపుమొక్కల్ని కొడవలితో కోసి తీసెయ్యాలిగానీ మునిపంటితో సుతారంగా కొరకమంటున్నారా?