కుటుంబ పాలనా? సుపరిపాలనా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎవడిని పడితే వాడిని నోటికి వచ్చినట్లు తిట్టేసి, ఎంత డబ్బు కావాలో చెప్పండి నిధులకు కొరత లేదు. అన్నీ మాఫీ చేస్తా, బంగారు తెలంగాణా నిర్మిస్తా, హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తా, కరెంటు కోతలతో ఒక రెండేళ్ళు భరించండి. మూడో ఏడు మిగులు కరెంటు చూపిస్తా, అది చేస్తా ఇది చేస్తా అన్నీ నేను చేసేస్తా అని చెప్పడం చాల మంచి మాట. ఈ మాటలు ఎవరు చెప్పినా సంతోషాన్నే ఇస్తాయి.

’పోరు బిడ్డడు’, ఆయన బిడ్డలు, ఆయన చుట్టాలు వెరసి ఈనాడు తెలంగాణాలో ఉన్న అతి కొద్దిమంది ముఖ్య మైన పౌరులు రాబోయే బంగారు తెలంగాణా కు మూల విరాట్టులు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తూ కాలం పోతూ ఉంటుంది. మరి ఇంకా ఇది పోరు తెలంగాణమా లేక కాబోయే బంగారు తెలంగాణమా అనేది తెలంగాణా లో ఉన్న ఈ అతికొద్ది ముఖ్యమైన పౌరుల మాటలు, చేష్టలు, వారి ప్రభుత్వ విధానాలు అతి త్వరలోనే తెలియచేస్తాయి. తెలంగాణా కోసం అసువులు బాసిన వాళ్ళ సంఖ్య, వాళ్ళ సామాజిక వర్గం, ఆర్ధిక స్థితి, విద్యార్హత మొదలగునవి పరిశీలించి వారికి తగు రీతిన తెలంగాణా ప్రభుత్వం పరిహారాన్ని ఉద్యోగాన్ని ఇవ్వడానికి సంబందించిన దస్త్రం మీద మొదటి సంతకం పెట్టాలి మన కెసిఆర్ కాని రైతుల రుణాల మాఫీ పై పెట్టారు. అదీ మంచిందే అన్నదాత ఉంటేనే మనం ఉంటాం. అలా సంతకం పెట్టి మరలా మన సెల్ ఫోన్ కంపనీల లాగ “షరతులు వర్తిస్తాయి” అన్నారు అంటే బంగారు తెలంగాణా తెస్తాము కానీ “షరతులకు” లోబడి అని అన్న మాట.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఇంకా వారం కూడా నిండకుండానే రుణ మాఫీ నాకు వర్తించదు అని తెలిసి ఒక తెలంగాణా రైతు గుండె ఆగిపోతే తెరాస వారు అది రోగ గ్రస్తమై ఆగిపోయిన గుండె ఆయనకు రుణ మాఫీ వర్తిస్తుంది అని చెప్పేశారు. మరి పోరు కాలం లో చనిపోయిన తెలంగాణా బిడ్డలకు, తెలంగాణా వచ్చాక చేసింది ఇది అని సమాచార ప్రచార శాఖ వారు ప్రకటన ఎందుకు విడుదల చేయలేదు? తెలంగాణా ప్రజల ఏడున్నర కోట్ల ధనం ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారం చేసుకున్న కెసిఆర్ గారికి ఈ తెలంగాణా పోరు బిడ్డల ఆత్మహత్యలు తదనంతరం వారి కుటుంబాల స్తితి గుర్తుకు రాలేదా? వందల సంఖ్యలో కెసిఆర్ కట్ ఔట్లు కోసం తెలంగాణా ప్రజల సొమ్ము ను వాడుకున్న కెసిఆర్, తెరాస పార్టీ పరంగా ఎందుకు ఈ ఖర్చు చేయలేదు? ఒక్క సారి పదవి వస్తే విలువలు మారిపోతాయి అని కెసిఆర్ తెరాస తెలంగాణా లో అలాగే అరవింద్ గారి “ఆప్” ఢిల్లీ లో ఋజువు చేసాయి.

రామాయణంలో పిడకలవేట లాగ మరొక ప్రశ్న: మరి ఈ వందల కట్ ఔట్లు ఎండకు ఎండి వానకు తడిసి, పాడైపోతే ఎలా? వీటిని పరిరక్షించాలి గా? లేదంటే రాబోయే వానా కాలం లో అవి జోరు వానలో హోరు గాలి లో కూలి పొతే అశుభం కాదా ? కట్ ఔట్లు పెట్టడం సులభం వాటిని కాపాడుకోవడం కష్టం.

వైఎస్సార్ చనిపోయాక చనిపోయిన వాళ్ళు “ఆయన లేరని” బెంగ తో చనిపోయినట్లు చూపించి ఓదార్పు యాత్ర చేసిన జగన్ ఆపై “ఆయన వస్తున్నాడు” అనే నినాదం తో రాజకీయ పోరు సలిపితే ఆ పోరుకు ఆంద్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకా తెలుగు జాతి మరచిపోలేదు. “యదనుకూలం సుఖం యద్ప్రతికూలం దుఃఖం” చందాన చావు లెక్కలు తమ తమ ఖాతాలో వేసుకొని పబ్బం గడుపుకున్న కుహనా రాజకీయవాదుల, పోరుబిడ్డల నిజస్వరూపాలు ప్రజలకు తెలియని విషయాలు కావు.

తెలంగాణా రాష్ట్ర అవతరణ తెరాసా కు, భాజపా కు కాంగ్రెస్ కు తెలంగాణా టి డి పి కు ఒక అద్భుత అవకాశం. నూతన సాంకేతికత ను వినియోగించి నూతన పని విధానాలు, సేవల ద్వారా నిజం గా బంగారు తెలంగాణా సాధ్యం ఔతుంది ఇందుకు కావలసింది చిత్త శుద్ధితో కూడుకున్న సమిష్టి గా అంటే ప్రతి పక్షాలను సైతం కూడగట్టుకొని చేసే నిస్వార్థమైన విధి నిర్వహణ. ఇదే బంగారు తెలంగాణాకు తారక మంత్రం.

తెలంగాణా ప్రజల ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చించి జరిపిన ప్రమాణ స్వీకార మహోత్సవం వారం రోజులు కాదు ఒక్క రోజులో ముగిసి పోయింది. ఎందుకంటే ఇది కెసిఆర్ కుటుంబ మహోత్సవం అందుకే ఆ మహోత్సవానికి ఆహ్వానించినా అతిధులు ఎవరూ రాలేదు! ఈ పాఠం కెసిఆర్ కుటుంబ సభ్యలు నేర్చితే ఇహ ఇటువంటి పొరపాట్లు జరుగవు. నేర్వక పొతే మళ్ళీ “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా…. !! దీనికి సంకేతం గా కే టి ఆర్ గారు “తెలంగాణా ఉత్సవం చాల కంగారుగా నిర్వహించాము కనుక మరల భారీ ఎత్తున నిర్వహిస్తాము అప్పుడు ప్రధాని మొదలుకొని అందరినీ పిలుస్తాము అని ప్రకట చేసారు!!! ఐనా……. మనిషి మారలేదు…… ఆ సినీ కవి ఎంత దార్శనికుడూ ?!

నిరక్షరాస్యత, అణచివేత, అమాయకత్వం, పెట్టుబడిగా సాగిన రాజకీయం క్షుద్రోపాసనలా సర్వనాశనానికి దారితీస్తుంది. ప్రజలను విద్యావంతులుగా సన్మార్గంలో ఉంచేలా చేసే ప్రగతిశీల రాజకీయం రామరాజ్య స్థాపనకు పునాది లాంటిది. “నా పాదాలకు నమస్కరించ వద్దు” అని భారత ప్రధాని వెయ్యి పుటల సారాంశాన్ని ఒక చక్కని సందేశం ద్వారా జాతికి ఇచ్చారు. ప్రజాస్వామ్యం లో కాంగ్రెస్ తరహా “వ్యక్తి ఆరాధన” లేదా “ఒక కుటుంబ ఆరాధన” ఇక ముగిసిపోయింది. అది తెలంగాణా లో పునరుజ్జీవం కాకుండా కెసిఆర్ కుటుంబం జాగ్రత్త పడాలి. వర్తమాన భారత దేశం లో ఈ ప్రగతిశీల రాజకీయం మొదలైనది అని చెప్పే శుభ సూచనలు దేశం నలుమూలలా మెండుగా ఉన్నాయి.

//శుభం//

Your views are valuable to us!