ఆరు దశాబ్దాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా మన రాజమండ్రి, కాకినాడ లాంటి పట్టణాలు మురుగునీటి వ్యవస్థ లేని స్థితిలో ఉన్నాయంటే మనకు సిగ్గుచేటు. ఈ రాష్ట్ర రాజధానిలో సైతం మురుగు కాలువలు బాహాటంగా ప్రవహిస్తాయి ఉదా: ఫతేనగర్లో, చిన్నతోకట్ట వద్ద మురుగు నీటి “నదులు” వైతరణీ నదులుగా ప్రవహిస్తాయి వాటిపై వంతెనలు కట్టి వాటి పట్ల మనకున్న గౌరవాన్ని మనం తరచుగా చాటుకుంటాము. మన జన సాంద్రతను బట్టి మనం గృహావసరాలకు వినియోగించే నీరు శుద్ధి చేసి తిరిగి ఉపయోగిస్తే మన పార్కులకు, రహదారులకు ఇరుపక్కల ఉన్న వృక్షాల పెంపుదలకు, ఇతర శుద్ది కార్యక్రమాలకు, పరిశ్రమలకు వినియోగించవచ్చు. కాని నీటిని ఎంతగానో వృధాచేస్తూ తిరిగి నీటి కొరతతో విలవిల్లాడే దుస్థికి మనం చేరుకున్నాము. ఇప్పటికీ రక్షిత మంచి నీటి పథకాలు అమలు చేస్తున్నామంటే మనం ఎంత వెనకబడిపోయామో విదితమే. ఇప్పటికీ నీటికి ఎదురు చూసి నిద్రలు మానుకొని ఎన్నో కష్టాలు పడుతున్న కుటుంబాలు మన మహానగరంలో ఉన్నాయి.
చిత్రమేమంటే చికన్ గున్యా, మలేరియా, ఫ్లూ, టైఫాయిడ్, బోద కాలు వంటి రోగాలు కేవలం మురుగు నీటి వల్లా, వాటిలో జలకాలాడే పందుల వల్ల వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. గత ఆరు దశాబ్దాలుగా కొన్ని వందల లేదా వేల కోట్ల రూపాయలు (ప్రజాధనం) మనం వెచ్చించి ఈ రోగాలతో యుద్ధం చేస్తున్నాము. కాని మూల కారణాలను తొలగించే ప్రయత్నమూ చేయడం లేదు. ఇది మన అసలైన దౌర్భాగ్యం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎందఱో నాయకులు గెలిచారు కాని ఒక్కరు చిత్తశుద్దితో భూగర్భ మురుగునీటి ప్రవాహ వ్యవస్థను మన పల్లెల్లోనూ పట్టణాలలోనూ నిర్మించలేదు. పావలా వడ్డీలు, వడ్డీ లేని రుణాలు, రుణాల మాఫీలు, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత విద్యుత్/వైద్యం వంటి పథకాలు ప్రజల ఆర్ధిక ఆరోగ్యాన్ని కాపాడవచ్చు గాక కాని వారికి ఆరోగ్యకరమైన పరిసరాలను ఇవ్వలేవు. ఆరోగ్యమే మహా భాగ్యమనే సత్యం ఇప్పటికీ మనకు ఆచరణలో ప్రజా పరిపాలనా వ్యవస్థ లోకి రాలేదు. ఇది మన స్వయంకృతాపరాధం. మన పిల్లలు పెద్దలైన మనల్ని మన చేతకానితనాన్ని చూసి నవ్వలేక తిట్టలేక మిన్నకుండే స్థితిని మనం చేతులారా తెచ్చుకున్నాం.
“నేను మునిసిపల్ కమీషనర్ గా చేశా”, “నేను నగర మేయర్ గా చేశా”, “నేను ఫలానా సంఘానికి అధ్యక్షుణ్ణి”, “నేను పురపాలక శాఖ మంత్రిని”, “నేను ఫలానా ఇది” అని చెప్పుకొనే వాళ్ళంతా ఇలా బాహాటంగా ప్రవహిస్తున్న మురుగుకు అన్ని పదవుల్లో ఉన్న సాక్షులు గానే చరిత్రలో మిగిలి పోయారు/పోతున్నారు. ఇదా మన పురాతన వైభవం? మన నాగరికత? మన సంస్కృతి? స్వర్ణాంధ్ర ప్రదేశ్ అని రాష్ట్రాన్ని ఎక్కడికో – ప్రగతిలో- తీసుకుపోతామని, అపర భగీరదులని, “అహో” అని “ఓహో” అని విర్రవీగిన వాళ్ళంతా ఈ మురుగు కాలువలు దశాబ్దాలుగా దాటుతూ ప్రజల్ని కలసి వోట్లు పొందుతున్న వారే. ప్రజలు (అంటే మనం) కూడా “ఇంతేలే నిరుపేదల బతుకులు, ఈ మురుగు కాలువలు, ఈ పందులతో సహా వాసాలు” అని కర్మ భూమిలో కర్మ సిద్ధాంతాన్ని మనసా వాచ కర్మణా నమ్మి ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప కర్మభూమి అని చాటి చెబుతున్నాము. తలుచుకుంటే ఒక్కోసారి ఒళ్ళు జలదరిస్తుంది మనం ఎంత వేదాంతులమో!! ఇది చాలదా మనల్ని చూసి మనం పొంగి పోవడానికి!
“మా పిల్లలు USలో ఉన్నారు, మా మనుమలు USలో చదువుకుంటున్నారు. వాళ్ళు మన పరిసరాలు చూసి అసహ్యించుకుంటారు అందుకే అక్కడే ఉండిపోదామని అంటారు!” అని మూతులు తిప్పుకొంటూ వ్యాఖ్యానించే తల్లులూ, తండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలని మనం ఎందరినో చూసాం. కాని వాళ్ళు అసహ్యించుకోనేది నిజానికి ఎవరిని? ఇలా ఏళ్ళు గడచిపోవడమే గాని చిత్తశుద్ధితో మన పరిసరాలను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుకొనే కార్యాచరణ పెద్దలైన మనకు ఎప్పుడు వస్తుందో! మనలో అతి పెద్దలు ఉన్నా అధికారులైన వారికి ఎప్పుడు ఒక దీక్షగా దీనిని పూర్తి చేయాలని అనిపిస్తుందో! ఎప్పుడు మనం ఎంచుకున్న పాలకులకు ఈ మురుగు పరిస్థితులు సిగ్గు పుట్టించి మేలు చేయాలని బుద్ది పుడుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు ఊహకు కూడా అందనివి. మురుగు నిర్మూలన మన సమిష్టి బాధ్యత. ఏది ఉమ్మడి బాధ్యతో అది పుచ్చి చచ్చిపోతుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి మన మురుగు కాలువల ద్వారా అదే జరుగుతోంది.
నిజమే మనది కర్మభూమే కాని ఇక్కడ పనికిమాలిన కర్మలతో బాటూ కొన్ని మంచి కర్మలు కూడా చెయ్యవచ్చు. కొందరు సామాజిక స్పృహతో పల్లెల్లో పక్కా బిల్డింగులు, స్కూళ్ళకు కట్టిస్తున్నారు. రక్షిత మంచి నీటి వ్యవస్థను కల్పిస్తున్నారు. కొందరు మరుగు దొడ్లు నిర్మిస్తున్నారు. కాని మురుగు జోలికి పోరు! కారణం – అది తీగలాగితే డొంక అంతా కదిలే చందం. హైదరాబాద్ మహానగరంలో మురుగు పరీవాహక ప్రాంతాలన్నీ పేదల నివాసాలే! లేదా అంగళ్లు ఉంటాయి.
మన మహానగరంలో నదులపై వంతెనలు కట్టిన రీతిన పెద్ద మురుగు కాలువలపై వంతెనలు ఉన్నాయి. ఇదే మనకు గర్వకారణం! ఇవి మన సమకాలీన సంస్కృతీ చిహ్నాలు. మనం భూగర్భ మురుగునీటి ప్రవాహక వ్యవస్థను పల్లెలు మొదలు మహానగరాలవరకూ పటిష్టంగా నిర్మించడానికి కేటాయించిన నిధులు, వాటిని వాడిన తీరు మన ప్రగతికి కొలమానాలు. మురుగు కోసం వెచ్చించే డబ్బు కూడా మనం స్వాహా చేసే పరిణతిని సాధించాం. నిజానికి మురుగు వ్యాపార వస్తువైతే, దానిని దాచుకోవడానికి కూడా మనం వెనుకాడం! ఎందుకంటే అన్నిటిలోనూ సంపాదన చూడగలిగే స్థితికి మన మానసిక పరిపక్వత చేరుకుంది కనుక.
“మురుగు బయటుందా మనలో ఉందా?” అనే సందేహం కలగడంతో పాటు దాని నివృత్తి కూడా కలిగిపోయింది. దీనితో మరో కొన్ని దశాబ్దాలు హాయిగా గడిపేయవచ్చు. ఎందుకంటే సమస్యకు దొరికిన పరిషారం మరలా ఉమ్మడిదే !! ఉమ్మడి మురుగు పెరిగి ఇంకా మురుగుతాది. ఇప్పటికే మనకు మురుగు చెరువులు హైదరాబాద్ నగరంలో చాల ఉన్నాయి. కృష్ణ, గోదావరి నదులు రాజమండ్రి, విజయవాడ వంటి నదీ తీర పట్టణాల వల్ల యథాశక్తి మురుగునీటిని తమ ప్రవాహంలో కలుపుకుపోతున్నాయి ఎన్నో చోట్ల మురుగునీటి నదీ సంగమ పవిత్ర దృశ్యాలు మనకు కనిపిస్తాయి. తీర ప్రాంత పట్టణమైన మన విశాఖకు సముద్రం ఒక అద్భుతమైన సహజ మురుగునీటి ప్రవాహాలకు అంతిమ గతి!! కొన్ని చోట్ల మనం పాడుబడ్డ నూతులు చూస్తుంటాం. వాటిలో నీళ్ళు ఉంటాయి కాని ఆ నూతులు మురుగు నీటి డస్ట్ బిన్నులుగా ఉపయోగిస్తాం. మన సృజనాత్మ శక్తికి ఇదో గొప్ప ఉదాహరణ. సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎవరూ పోటీ పడలేనిది మనం వచ్చే తరాలకు ఎంతమాత్రం జవాబుదారులం కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ భవిష్య తరాలకు కూడబెట్టుకొంటే చాలు. ఎందుకీ మురుగు రోద!! ఇలా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని కాలాతీతమైన మురుగును సృష్టించుకుంటున్నాం. ఈ శ్రమ అందరూ గుర్తించెదరు గాక.
వేదకాలం నుంచి ఈ భూమి మానవ జీవితానికి జీవన విధానానికి ఇస్తున్న ప్రాముఖ్యత మనకు తెలిసిన పదాలు వ్యక్తం చేయలేనిది. మన అధర్వణ వేదంలోని “క్రిమిఘ్న సూక్తం” మానవ నివాస స్థలాలో ఉండవలసిని పరిశుభ్రత గురించి చాల కూలంకషంగా చెబుతుంది. ఈ సూక్తానికి ఇంద్రుడు అధిదేవత. మనకున్న పురాణ జ్ఞానం అంతా సినిమా వారు ఇచ్చిందే ఎక్కువ కనుక ఇంద్రుడు ఒక వ్యభిచారిగానో విపరీతమైన పదవీ కాంక్ష కలవాని గానో తెలుసుకున్నాం. కాని ఇటువంటి సూక్తానికి అధిదేవతగా మనకు తెలియదు. ఇంద్రుడు త్రిలోకాధిపతి అని అందరికీ తెలుసు. అతను కూడా ’పరిసరాల పరిశుభ్రత’కు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో కదా! కానీ సంస్కృతం అర్థం కాదు కనుక, వేదాలు-పురాణాలన్నీ మూలనున్న ముసలోళ్ళకే చెందినవి కనుక వాటిల్లోని విజ్ఞానం మనకొద్దు. అంతేకాదు మనకు అర్థం కానివి నమ్మదగ్గ శాస్త్రాలు కావు అనే భ్రమ ఒకటుంది. ఇక్కడ ఒక మినహాయింపు మన వాస్తు శాస్త్రం. ఇది ఏది ఎక్కడ ఎలా ఉండాలో జనావాస స్థలాలేవో చెబుతుంది. ఈ వాస్తు మన ఇంటివరకే పరిమితం కాని పైన చెప్పుకొన్న అధర్వణ సూక్తం మొత్తం సమాజానికి సంబంధించింది.
రోడ్ల పై మామూలు ఉమ్ములు, పాన్ పరాగ్ యుక్త ఉమ్ములు, కిళ్ళీ ఉమ్ములు ఇన్ని రకాలుగా మనం మన రోడ్లను మూలాలకు – అదే మూలలకు కేవలం నోళ్లతోనే రంగులు అద్దుతున్నాం. తాంబూలం ఉమ్మడానికే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన ఘన కీర్తి మనకే దక్కింది. దీనికి తోడు బెల్టు షాపులని కొత్త రకం కొట్లు తీసుకొని వచ్చాం. అక్కడ తాగి, ఉమ్మి తుక్కు పాడేసి వెళ్ళినా ఎవ్వరూ ఏమీ అనరు. అంత స్వేచ్చను మనం పొంది ఉన్నాము. ఇంతటి స్వేచ్ఛ ప్రపంచంలోని ఇతర సభ్య సమాజాలకు అసూయను తెప్పించే విషయం. ఇంత స్వేచ్చ మన కర్మ భూమిలో తప్ప ఎక్కడ దొరుకుతుంది? “పాపాలు చేయాలా! లైవ్ లో చూడాలా! రండి భారత దేశానికి!” అని ఒక మార్కెటింగ్ సూత్రాన్ని ఆధారంగా మన పర్యాటక ఆదాయాన్ని గణనీయంగా వృద్ధి చేసుకోవచ్చు.
మురుగును ఎవరు పెంచి పోషిస్తారో వారే సరైన రాజకీయ నాయకులు భవిష్యత్ ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, MLAలు ఇప్పుడు మురుగు వెనుక దాగిన రాజకీయ అవకాశాల గురించి తెలుసుకోవడం మన ధర్మం :
మురుగు అభివృద్ధికి ఒక అవకాశాన్ని ఇస్తుంది
మురుగే లేక పొతే రాజకీయ పార్టీలకు అజెండా పాయింటు ఉండదు
మురుగు ఎంత పెరిగితే అన్ని ఎక్కువ నిధులు కేటాయించి తద్వారా పార్టి ఫండు పెంచుకోవచ్చు
రోగం లేనిదే రోగాలను నయం చేయడం ఎలా ? ఇంగింత జ్ఞానం ఉన్న ఎవరైనా మురుగునీ సమర్ధిస్తారు ఎందుకంటే మురుగు ఉంటేనే దోమలు, దోమలు ఉంటేనే వాటి నివారణ సాధ్యం. దోమలే రోగాలను సమర్ధవంతంగా విస్తరించగలవు,
రోగాలు లేనిదే రోగులను ఆసుపత్రిలో ఎలా చూడగలం వాళ్లకు పళ్ళు బ్రెడ్ ఎలా ఇవ్వగలం?
రోగం ఉంటేనే కదా మన ఫార్మ పరిశ్రమ అభివృద్ది చెందేది?
అసలు మన వైద్య వ్యవస్థ కుప్పకూలి పోదూ మురుగు లేకపోతె?
మురుగును మరగు పరిస్తే అభివృద్ది ఎలా జరుగుతుంది?
పాత మురుగు కాలువల స్థానంలో కొత్త మురుగు కాలువలు రావాలి
జనాభా పెరిగే కొలదీ మురుగు కాలువల విస్తీర్ణం పెరగాలి ఇందుకు భూములు కేటాయించాలి
బాహాటం గా మురుగు కాలువలు ఉండబట్టే సామాన్యులు అంత స్వేచ్చగా మల మూత్ర విసర్జన చేయగలరు
అసలు అభం శుభం ఎరుగని పందులు మురుగు కాలువలు లేకపోతె ఏమైపోతాయో ఈ జీవ కారుణ్య సంఘాలు ఆలోచించావా?
మురుగు మన జీవన స్రవంతిలో ఒక విడదీయలేని అంశం
మురుగు గురించి ఎవరు వ్యతిరేకంగా వ్రాసిన వారి చిత్తం ఒక విచిత్రమైన భ్రమకు లొనై ఏదీ చెప్పలేని స్తితిని చేరిపోతారు సహజంగా !
ఇది మన మురుగు చరిత్ర. క్లుప్తంగా.
చూసారా నేను అనుకున్న రీతిలో నా ఈ వ్యాసాన్ని ముగించలేక పోయాను. అదీ మురుగు మహిమ.