మనకెందుకు ఈ మోడీ దరిద్రం?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

2014 ఎన్నికల నాటికి అయ్యో పాపం అనుకున్న మోడీ, 2017 నాటికి అధికారమదంతో, తలకెక్కిన అహంకారంతో రోజుకో రూపంలో అక్కడాఇక్కడా కాదు, సాక్షాత్తు తానే నమస్కరించి అడుగుపెట్టిన పార్లమెంటులోనే వికృతంగా ఆవిష్కృతమౌతున్నాడు.

సమయాసమయ విచక్షణలేకుండా పార్లమెంటును ఓ ఎన్నికల సభగా మార్చిన మతిహీనత్వం పది తలలతో వికటాట్టహాసం చేస్తున్నది. అవినీతిరహిత దేశాన్ని నిర్మించటానికి, అభివృద్ధే ఏజెండాగా పనిచేస్తానని ప్రజలకు చేసిన వాగ్దానాలు సముద్రమంత నీటిమూటలై పార్లమెంటునే ముంచెత్తుతున్నా నంగిమాటలతో ఇకిలించటమే సరిపోతున్నది నరేంద్ర మోడీకి. ప్రజలకు జవాబుదారీ కావల్సిన పాలకవ్యవస్థ, పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజల గోడును పరిహాసాస్పదం చేస్తూనే ఉంది. చిన్న గీత పక్కన పెద్ద గీతలా, కాంగ్రెస్ అవినీతి పక్కన భాజపా అవినీతి, అసమర్ధత పెనుభూతంలా దేశాన్ని ఆవరిస్తున్నది.

భాజపా ప్రభుత్వపు అయిదవ బడ్జెట్‌పై పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నెన్నో ఆశలు పెంచుకున్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ ప్రతి బడ్జెట్‌లోనూ పన్ను రాయితీలు ఆశించటం సరికాదు అని కొందరి వాదన. వారికి కొన్ని విషయాలు మనవి చేసుకోవాలనుకుంటున్నాను.

[amazon_link asins=’9322008458,8129132621,9350642387,9351770257′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’b57740e8-0b88-11e9-83a2-c34adb82a40d’]

ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మోడీ చేపట్టిన కార్యక్రమం ఏమిటి? పేద ప్రజల చేత బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేయించటం. ఆ అవసరానికి ప్రధాన కారణం, ప్రభుత్వం నుండి అందాల్సిన ఫలాలు పేదలకు నేరుగా చేరాలనే సత్సంకల్పం. అదో ఉద్యమంలా నడిపారు. కోట్లాది మంది ప్రజలు సానుకూలంగా స్పందించటం కూడా జరిగింది. అదో అద్భుతమైన ఘనకార్యమే. ఆ సమయంలోనే, వేరు వేరు స్టేట్ బ్యాంకులని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసారు. ఇప్పుడు అదే స్టేట్ బ్యాంకు, ఖాతాలో కనీస మొత్తం లేకపోతే రూ 40 నుంచి 50 వరకు జరిమానా విధిస్తున్నది! ఆ రకంగా దాదాపు రూ 1750 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈమధ్యనే చదివాను.

ఇదే ప్రభుత్వ హయాంలో 9 వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకి పారిపోయాడు విజయ్ మల్లయ్య. పారిపోయేదాకా ఊరుకొని, అతడిని వెనక్కు తీసుకురావటానికి కోట్లు ఖర్చు పెడుతున్నది ఈ ప్రభుత్వం! ఇంకా విచిత్రం, అతని ఋణాలకు సంబంధించిన వివరాలు కేంద్ర ఆర్ధిక మంత్రి కార్యాలయంలోని ఫైలులో లేవంటే ఆశ్చర్యం అనిపించదా! గతంలో, బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైలు కూడా అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ కార్యాలయం నుంచి మాయమైన విషయం ప్రజలకు గుర్తు ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ ఎన్నికల సభలలో కూడా ప్రస్ఫుటంగా ప్రస్తావించిన విషయం కూడా మరిచిపోయి ఉండరు. అంతే కాదు, యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చిదంబరం ఇంట్లో సోదాలు చేసినప్పుడు, అతని మీద కేసులకు సంబంధించి కోర్టులకు ఇంకా సమర్పించని నివేదికలు దొరికాయని వార్తలు. ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పగలరా?

దేశంలోని నల్లడబ్బును వెలికి తీయటానికి పెద్దనోట్ల రద్దు మాత్రమే మార్గం అని మోడీ ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందించి ముఖ్యంగా, పేదలు, దిగువ, మధ్యతరగతి ప్రజలు దాదాపు సంవత్సరం పైగా అష్టకష్టాలు పడి మరీ మద్దతు ఇచ్చారు. చివరికి తేలిందేమిటి? 95% పైగా డబ్బు రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చింది. ఇది నల్లడబ్బును పట్టుకోటానికి నడిపిన కార్యక్రమమా, లేక నల్లధనాన్ని తెలుపు చేసుకోటానికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశమా ఎవరికీ తెలియదు! ఇంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే, ఈ పెద్దనోట్ల రాదు ఉద్దేశ్యం ప్రజలను ఆదాయపు పన్ను వలలోకి లాగటానికి చేసిన ప్రక్రియగా ఆర్ధిక మంత్రి చెబితే, వ్యభిచారం తగ్గించటానికి కూడా ఉపయోగపడిన కార్యక్రమం అని మరో కేంద్ర మంత్రి దరువులు వేసారు! ఈనాటి వరకూ, ఈ పనివల్ల లాభపడింది ఎవరనేది ఎవరికీ తెలియదు. ఇక స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పిన 15 లక్షల కోట్ల సంగతి ఏమయ్యిందో ఏమీ తెలియదు.

2జి స్కాములో ముద్దాయిలుగా ఉన్న నేతలందరూ, ప్రభుత్వం తరుఫు న్యాయవాదుల చేతకానితనం కారణంగా బయటకి వచ్చినట్లు కూడా మనం తెలుసుకున్నాం. ఈ ప్రభుత్వంలో అవినీతి లేదని ఎవరిని మోసం చేస్తారండి? ఇకపైగా, ఆ న్యాయవాదులు సమర్పించిన వాదనలు మునుపటి యు.పి.ఎ. ప్రభుత్వం తయారుచేసినవే, వాటికి మా ప్రభుత్వంతో సంబంధం లేదని కూడా కొందరు మసిపూసే ప్రయత్నం చేసారు. అది నిజమే అనుకున్నా, భాజపా చేతకానితనం కొట్టొచ్చినట్లు తెలుస్తున్నది కదా? ఈ విషయపరంగా, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చిన సుబ్రహ్మణ్య స్వామిని, స్వయానా ఆయన పార్టీకే చెందిన ఇతరులు గేలి చేయటం కూడా జరిగింది.

2014తో పోలిస్తే, డీజల్, పెట్రోలు రేట్లు అంత పెరగలేదనుకున్నా, వీటి ధరల మీద ప్రభుత్వ పెత్తనం తీసేసిన తర్వాత ధరలు తగ్గిన దాఖలాలు ఏమంత లేవు. ఒకే దేశం, ఒకే పన్ను అంటూ జి.ఎస్.టి. మొదలేసిన ప్రభుత్వం పెట్రోల్, డీజల్‌లను మాత్రం ఎందుకు మినహాయించిందో అర్ధం కాదు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కిందమీద ఔతున్నారు ప్రజలు. సానుభూతితో అర్ధం చేసుకోవాల్సిన ప్రభుత్వం, అడిగిన పాపానికి ఆ ప్రజలనే ఆడిపోసుకుంటుంటే ఏమనుకోవాలి? ఇన్ని కిలోమీటర్లు రోడ్లు వేసాం, ఇన్ని గ్రామాల్లో ఇన్నేసి దీపాలు వెలిగించాం, ఇంతమందికి ఇళ్ళు కట్టించాం, మరిన్ని మరుగుదొడ్లు కట్టించామని డప్పులు కొట్టుకుంటూ నేల విడిచి సాము చేయటమే కానీ, నేల మీది నిజాలు ఎవరైనా పరిశీలిస్తున్నారా అనేది అనుమానమే.

కొన్ని స్నాప్ షాట్స్ మీ కోసం :

దేశం వెలిగిపోతుందనే ప్రచారాలు చేసుకొని, ఎన్నికలు ముందుకు జరిపి మరీ బోల్తాకొట్టాడు వాజ్‌పేయి 2004లో. దేశాన్ని ఎలాగైనా వెలిగించి పారేయాలనే దీక్షతో గ్రామాల విద్యుదీరణ గురించి మొన్నటిదాకా ఆ శాఖకు మంత్రిగా ఉన్న పీయుష్ గోయల్ ఏమంటున్నాడో చూడండి. 2016 కు పూర్తి చేయాల్సిన వ్యవహారాన్ని 2022 దాకా ఎలా పొడిగిస్తున్నారో చూడండి. పని పూర్తిగా కాక ముందే ప్రచారాలెందుకు చేస్తున్నారు అని అడగకూడదు.

అధికారంలో లేము అని ప్రతిపక్షాలు, పన్ను మినహాయింపులు ఇవ్వలేదని ప్రజలు ఆడిపోసుకుంటున్నారంటే, ఫర్లేదు వాళ్ళ ఏడుపు ఎప్పుడూ ఉండేదే కదా అని తేలిగ్గా కొట్టి పారేయొచ్చు. స్వయానా, భాజపా రాజ్యసభ ఎం.పి. అనూప్ మిశ్రా (మొరేనా, మధ్యప్రదేశ్) గుక్క తిప్పుకోకుండా ఎలా ఏడుస్తున్నాడో చదవండి. మోడీని, అరుణ్ జైట్లీని నగ్నంగా చూపించే నిలువుటద్దం ఈ వ్యాఖ్య.

ఈ దేశంలో పుడితే, దరిద్రాతి దరిద్రంలోనైనా పుట్టాలి, లేదంటే డబ్బుల గోడల మధ్య సంపన్నుడిగానైనా జన్మించాలి. మధ్య తరగతైతే మటాషే.

పన్నులు కట్టటానికి, డబ్బుతో మదించినవాడికి నిజానికి ఏ ఇబ్బందీ ఉండకూడదు. అయినా కట్టడు. కాదు కూడదు అంటే వాడి వ్యాపారాలు ఐ.పి.లు పెట్టేసి కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చేసుకుంటాడు. పైగా, దేశాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి అన్ని ప్రభుత్వాలు రకరకాల మినహాయింపులు ఇస్తాయి వీడికి. ఇక బి.పి.ఎల్.కి ఐతే ఎటువంటి సమస్యా లేనేలేదు. 70 ఏళ్ళ నుంచీ ప్రతి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వాళ్ళని ఉద్ధరించటానికి ఖర్చు చేస్తూనే ఉంటుంది. వాళ్ళు మాత్రం పైకి రాలేక పోతున్నారు. దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజలంటే మాత్రం అందరికీ చాలా చులకన.

ఏ ప్రభుత్వం వచ్చినా ముందుగా పీల్చి పిప్పి చేసేది వీళ్ళనీ, వీళ్ళ బ్రతుకులనే. అటువంటి, మధ్య తరగతి వాడు, ఉద్యోగస్తులు ఆదాయపు పన్నులో మినహాయింపులు అడిగితే వాడిని దేశానికి శత్రువుగా పరిగణిస్తారు భాజపా జనాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ అనే రాజకీయ కీచకుడు ఉద్యోగస్తులపై కనీసం 5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు ఉండాలని కాంగ్రెస్‌తో యుద్ధం చేసేవాడు. ఆర్ధిక మంత్రి అయ్యాక, క్రమం తప్పకుండా మధ్యతరగతికి ముష్టి వేస్తున్నాడు. ఈ సంవత్సరానికి ఈయన వేసిన ముష్టి కూడి, తీసి, గుణకారాలు, భాగహారాలు చేస్తే వచ్చింది ముప్ఫై రూపాయలు కూడా లేదు.

సరే, మనం అని నోరు పారేసుకోవటం దేనికి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్ ఆదాయ పన్ను కట్టే “మధ్య తరగతి” వారి గురించి ఏమంటున్నాడో చూడండి.

కనీసం కాంగ్రెస్ ఏలుబడిలో ప్రజలు ఉద్యమాలు చేస్తే వినే పరిస్థితి ఉంది. భాజపా ఏలుబడిలో, పోరాడే ప్రజలను తస్మదీయులుగా భావించటం, మూతి ముడుచుకు కూర్చోవటం మోడీకే చెల్లు. మరో విషయం మన ప్రజలు గమనించారో లేదో తెలియదు. దేశంలో ఉన్నంత కాలం మొహం మటమటలాడిస్తూ ఉంటాడు మోడీ. అదే విదేశాలకు వెళ్తే మాత్రం వెలిగిపోతూ వెళ్తాడు!

ఆధార్ కార్డులు చేయించుకోవటం, వాటిని బ్యాంకు ఖాతాతో అనుసంధానించుకోవటం, బ్యాంకు ఖాతాలు మొబైలుతో అనుసంధానించుకోవటం, మొబైలును మళ్ళీ ఆధార్‌తో అనుసంధానించు కోవటం, పాన్ కార్డులు బ్యాంకు ఖాతాతో అనుసంధానించుకోవటం, అదే పాన్ కార్డు ఆధార్‌తో అనుసంధానించుకోవటం, వీటన్నిటినీ రేషన్‌కార్డుతో కలుపుకోవటం, మోడీ ఏలుబడిలో బ్రతుకంతా అనుసంధానించుకోటానికే సరిపోతున్నది. మాట్లాడితే, స్ట్రక్చరల్ ఛేంజెస్ ఇవి అనే ఉపన్యాసాలు వినాల్సి రావటం! మనకెందుకు ఈ మోడీ దరిద్రం?

ఏతా వాతా తేల్చేదేమిటంటే, అక్కరకు రాని వ్యాపారాలు చేయలేం. తింటానికి మిగిలింది పన్నులు కట్టుకోటానికి మాత్రమే సంపాదన చేసే ఉద్యోగి బతుకులు బతకలేం. ఏదో బాబాలానో, అమ్మలానో అవతరించి దుకాణం పెట్టుకోవటం బెస్టు.

*అభివృద్ధి, అవినీతి ప్రాతిపదికగా 2014లో మోడీకి వేసిన వోటుకు పశ్చాత్తాపపడుతున్న ఆపసోపాలు మాత్రమే. ఒక హిందువుగా నేనాశించిన మోడీ ఈ ప్రభుత్వంలో లేడు. ఆ విషయాలు వీలువెంట.

One thought on “మనకెందుకు ఈ మోడీ దరిద్రం?

Your views are valuable to us!

%d bloggers like this: