చార్ ధామ్ లో సంభవించిన ప్రకృతి విపత్తు భారత దేశపు ప్రజల సత్తాను వారి పాలకుల పరిపాలనా దక్షతను మరొక్క సారి ప్రపంచానికి చాటింది. దేశంలో ఇప్పటివరకూ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ప్రతిసారీ మన స్పందన ఒకటే – ముఖ్యమంత్రి సహాయ నిధికి లేదా ఆ విపత్తు కోసమే ఏర్పడ్డ సహాయ నిధికి తోచింది లేదా తాహతు మేర విరాళం ఇచ్చి ధార్మిక చింతనతో మరల జీవితాన్ని కొనసాగించడం. ఆపై పేపర్ లో వచ్చిన సహాయ నిధుల దుర్వినియోగం, సహాయం ఇంకా అందలేదనే రిపోర్ట్ లు చదివి, మన కష్టార్జితం సహాయ కార్యక్రమాలకు పూర్తిగా వినియోగింపబడలేదని సహాయ చర్యలలో కూడా అవినీతా అని వాపోతాము. వార్తలు న్యూస్ పేపర్స్ ప్రచురించడం మానేసాక మనం కూడా వాటిని మరచిపోయి మరలా మన జీవన యాత్ర కొనసాగించడం.
అలాగే మన ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, రాజకీయ పక్షాలు, ఎన్జీవోలు వారి వారి వివరణలూ, ఉద్దేశ్యాలు, సర్దుబాటు చర్యలు పత్రికలకు చెప్పి మొత్తం మీద సహాయక చర్యలు పూర్తయిపోయాయి అని కూడా చెప్పకుండానే ముగించేస్తాయి. ఇది ఒక తంతుగా ప్రతి సారి – అది ప్రకృతి భీభాత్సమో, లేక మానుష అమానుష చర్యయో – ఇదే విధంగా స్పందిస్తాము. ఇదీ మనం సాధించిన ప్రగతి!! ఇది మారాలి అని చెడు జరిగిన ప్రతి సారి మనం ఏకకంఠంతో మన ఇళ్లలోనే ఉంది అరచి ఊరుకుంటాము. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో కొనసాగుచున్న వరద సహాయక చర్యలు ఈ మన భారతీయుల మానసిక స్థితికి అద్దం పడుచున్నాయి.
ఇప్పటి వరకూ మనకు జాతీయ ప్రాతిపదికన కేవలం కేంద్ర నిర్వహణలో విపత్తు అనంతరం చేపట్టే సహాయ చర్యలు, వాటికి సమకూరిన ధనాన్ని వినియోగించే విధానం, పారదర్శక వినియోగం, దాని ఆడిట్ రిపోర్ట్ పత్రికలలో ప్రచురించడం మొదలైన కార్యక్రమాలు చేయడానికి ఎక్కడ విపత్తు సంభవించినా ఒకే విధమైన పారదర్శకమైన నిర్వహణను హామీ ఇచ్చేలా ఒక సాధికారిక సంస్థ లేదు. మనకు ప్రస్తుతం ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (మన హైదరాబాద్ లో ఉన్నది) ఉత్తరాఖండ్ లో చేసిన పనుల గురించి మనం ఏ విధమైన విశిష్ట వార్తా వినలేదు. కారణం ఈ సంస్థ తన కార్యక్రమాలలో సహాయ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను తీసుకోలేదు. దేశంలో ఎక్కడ విపత్తు జరిగినా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులతో సహాయ చర్యలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరిన దానం ఉపయోగించి పార దర్శకంగా నిర్వహించే స్థితి లేదు. ఇందుకు కావలసింది చిత్తశుద్ధి తో కూడుకొన్న పాలన సామర్ధ్యం ఉన్న జాతీయ నేత అనగా ప్రధాన మంత్రి. మనకు ఇటువంటి ప్రధాన మంత్రి ఇంత వరకూ లేరు !
కేంద్ర సహాయ నిర్వహణ వ్యవస్థ మనకు లేదు. అది ఉంటే విపత్తు సంభవించిన వెంటనే అది అక్కడకు చేరుకొని తత్క్షణం కార్యోన్ముఖం ఔతుంది. ఆ టీమ్ అక్కడి చేరిన మరుక్షణం అక్కడి అధికారులు వెంటనే ఆ టీం కు జవాబుదారి గా మారిపోతారు. అంటే ఆ టీమ్ నుంచే వారు ఉత్తర్వులు పొంది వారు చెప్పినట్లే సహాయ కార్యక్రమాలు అందుకు ఉన్న నిధుల / విరాళాల ఖర్చు చేస్తారు. విపత్తు జరిగిన ప్రతిసారి అక్కడకి చేరింది మొదలు సహాయ చర్యలు ముగిసే వరకూ ప్రతి రోజూ ఒక ప్రెస్ నోట్ వారు జారిచేస్తారు. అలాగే ఆడిట్ చేయబడ్డ ఖర్చులను ఆఖరున ప్రెస్ కి ఇచ్చి తద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందుతారు. ఇది మనకు లేదు. మనం ఇచ్చిన ప్రతి పైసా ఆర్తులకు ఏదో ఒక రూపాన చేరినట్లు తెలిసి భారత ప్రజ హర్షాతిరేకం తెలిపేలా చేయగల సత్తా మనకు ఉన్నప్పటికీ శవాలపై పైసలు ఏరుకొనే మన మానసిక స్థితి ముఖ్యం గా మన పాలనా యంత్రాగంలో ఉన్న వారికి (ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు) ఉన్నంత వరకూ ఈ సత్తా బయల్పడదు. కనుక ప్రత్యామ్నాయం ఒక్కటే – ఒక చక్కని వ్యవస్థ. అది ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో ఉండాలి.
ఇందుకుగాను మనం ఇప్పుడు మన పత్రికలను ముఖ్యంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని ఈ క్రింది ప్రశ్నలు వేసి సమాధానా;ఇ రాబట్టి తద్వారా పైన తెలిపిన జాతీయ విపత్తు సహాయ నిర్వహణ సంస్థను తత్క్షణం ఏర్పాటు చేసికో గలగాలి:
- ముఖ్యమంత్రి సహాయ నిధిలో ప్రస్తుతం ఉన్న ధనమెంత?
- రోజువారిగా ఆ సహాయ నిధికి చేరిన విరాళాల మొత్తం ఎంత?
- రోజువారీగా ఎంత దానం దేనికి ఎలా ఖర్చుచేయబడింది తద్వారా లభ్ది పొందిన వారు లేదా బాగుపడ్డ సేవ లేదా మౌలిక స్థితి సహయ చర్యలకు నియమింప బడ్డ సిబ్బంది వివరాలు వారిని సంప్రదించే వివరాలు కేంద్ర సహాయ నిధులను అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ధన వస్తు విరాళాల వినియోగం పై పారదర్శక రిపోర్ట్
- సహాయ చర్యలు మొదలు పెట్టింది మొదలు ఆఖరు వరకూ చేసిన కార్యక్రమాలపై వాటికి హెచ్చించిన దానం పై ఆడిట్ రిపోర్ట్
- సహాయ చర్యలు ముగిసాయి అని ఒక ప్రెస్ నోట్ విదుదల.
ఈ ప్రశ్నలకు సమాధానం మనమందరం సంపాదించాలి. దీనికి ఇతోధికంగా మీడియా కూడా దోహదపడి తే ఇది సుసాధ్యం. ఒక్క సారి ఇటివంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకొంటే భారతీయులందరికీ కనీస సహాయం గారంటీగా అందుతుంది.
ఉదాహరణకు :
- సహాయ చర్యలలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా ఇకపై మరణించిన వ్యక్తుల కుటుంబాలకు లేదా గాయపడ్డ వాళ్లకు ధన సహాయం ప్రకటించవు. వాటిని ఈ కేంద్ర సంస్థే ప్రకటిస్తుంది అలాగే వాటిని వెనువెంటనే అందచేస్తుంది (కేవలం రెండు రోజుల వ్యవధి లో).
- విరాళాలుగా సేకరించిన ధన వస్తు సేవలను సింగల్ విండో సిస్టం లో సహయార్ధులకు అందచేస్తుంది.
- వెనువెంటనే పునరావాస, పునరుద్ధరణ కార్యక్రమాలను పటిష్టం గా నిర్వహిస్తుంది ముఖ్యంగా ఎవరూ ఆకలితో, చలితో, వానకు తడిసి, వైద్యం అందక లేదా ఎటువంటి నిస్సహాయ స్థితిలోనూ ఉందని పటిష్ట వ్యవస్థ విపత్తు అనంతరం వెంటనే ఏర్పడాలి.
ఇవి చాలవా మన భారతీయులు విపత్తును సమిష్టిగా చక్కగా ఎదుర్కోగలరు అని చెప్పడానికి ప్రపంచ దేశాలకు చాటడానికి!
“ఇంకానా ఇకపై చెల్లదు” అనే ధోరణిలో ప్రజలు సమాయత్తం కావాలి. మరో విపత్తు జరుగ కూడదు. జరిగితే ఇలా అసమర్ధంగా దానిని ఎదుర్కొని మరొక్కసారి మన భారతీయలు అసమర్ధులు అని ప్రపంచానికి చాటకూడదు.
సర్వేజనా సుఖినో భవంతు.