మిలియన్ మిస్టేక్స్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఏ ప్రజా ఉద్యమమైనా ఒకానొక స్థాయిలో హింసాయుతంగా పరిణమించటం సర్వసాధారణం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటం ఒక ఎత్తైతే, లూటీలు మానభంగాలకు పాల్పడటం మరో ఎత్తు. వీటిని మించి, మన సంస్కృతిని మనం ధ్వంసం చేసుకోవటం మూర్ఖత్వం. ప్రజా ఉద్యమాలు హింసాయుతంగా మారటానికి గల కారణాలు విశ్లేషిస్తే, నాలుగు ముఖ్య విషయాలు గమనించొచ్చు. ప్రభుత్వాలు ఉద్యమానికి సానుకూలంగా స్పందించకపోవటం, బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నించటం, ఉద్యమంలో అసాంఘిక శక్తుల ప్రవేశం, అసమర్ధ నాయకత్వం ముఖ్యమైన కారణాలు.

 

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పెడదోవ పట్టటానికి ఇవన్నీ కారణాలే. ఇదివరలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం హింసాయుతంగా మారటానికి పొట్టి శ్రీరాములు బలిదానం దోహదపడింది. అంతవరకు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం శాంతియుతంగానే కొనసాగింది. ప్రస్తుతం, అటువంటి బలిదానాలేవీ లేకుండానే ఉద్యమం పెడదోవ పట్టిందంటే కారణం అసమర్ధులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించటం. నిన్నటి టాంక్ బండ్ విధ్వంసానికి కొన్ని నిముషాల ముందే, ఉద్యమకారుల చేత శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని కె.సి.ఆర్. ప్రతిజ్ఞ చేయించటం, జరగబోయే విధ్వంసాన్ని చూచాయగా చెప్పినట్లే. ముందస్తు ప్రణాళికతో చేయబడిన విధ్వంసమే ఇది. అందుకే, కె.సి.ఆర్. తనకు ఎలిబీగా ఉద్యమకారుల చేత ప్రతిజ్ఞ చేయించటం.

 

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మరోసారి మొదలు పెట్టినప్పటి నుంచి కె.సి.ఆర్. చేసింది ఉద్యమం కాదు, మోసం. సామూహిక జన మోసం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం, పదవుల కోసం వెంపర్లాడటం, ఏకాభిప్రాయం కోసం కృషిచేస్తున్నానని కల్లబొల్లి కబుర్లు చెప్పటం, సంకీర్ణ ప్రభుత్వపు ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణా ఉన్నదని అబద్ధపు ప్రచారాలు చేయటం, ఆసుపత్రిలో నిరాహార దీక్షలు, చండీ హోమాలు, ఆంధ్రా బిర్యాని కబుర్లు… చెప్పుకుంటూ పోతే నిన్నటి తాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం వరకు పదిలక్షల రకాలుగా ప్రజలని మోసం చేసాడు. నిరుటి కేంద్రప్రభుత్వపు ప్రకటన తర్వాత ప్రజల చేతుల్లోకి వెళ్ళిన ఉద్యమాన్ని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకోటానికి కె.సి.ఆర్. ఆడుతున్న నీచపుటెత్తుల చదరంగం ఇది.


ఇంతవరకూ ఈ తెలంగాణా ఉద్యమంలో నిస్వార్ధంగా బలిదానానికి సిద్ధపడ్డ ఒక్క నాయకుడు లేడు. బలిదానం సంగతి తర్వాత, నిబద్ధతగా రాజీనామాలకు సిద్ధపడ్డ ఒక్క నాయకుడు లేకపోవటం తెలంగాణా దౌర్భాగ్యం. పట్టుమని పది గంటలు నిరాహార దీక్ష చేయలేని నాయకుడు, విద్యార్ధులు ఆత్మాహుతి చేసుకుంటే, వారి బలిదానాన్ని తన రాజకీయ స్వార్ధానికి ఉపయోగించాలనుకోవటం ఘోరం,

 

ప్రాంతీయ అసమానతలు ఉన్న మాట వాస్తవమే. అది సాకుగా తీసుకొని ప్రాంతాల మధ్య విబేధాలకు ఆజ్యం పోయటంలో అటు సమైక్య ఆంధ్ర నాయకుల, ఇటు తెలంగాణా నాయకులు సరిసమానమైన పాత్రలు పోషించారనేది కూడా వాస్తవమే. నోరు అదుపులో పెట్టుకోలేని నాయకులు, ఉద్యమాన్ని అదుపులో ఉంచగలరనుకోవటం మన మూర్ఖత్వం. ఈ అరాచక రాజకీయంలో ప్రజలు పాచికలై తమ సంస్కృతిని తామే ధ్వంసం చేసుకోవటం హేయం.

 

దురదృష్టం ఏమిటంటే, ప్రత్యేక తెలంగాణా ఓ రాజకీయ ప్రక్రియ. ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమే ఈ ఉద్యమం. కానీ, తెలంగాణా ప్రజా నాయకుల (?) అనైక్యతే ఈ ప్రక్రియకు నిజమైన అడ్డంకి. ఈ నాయకులను ఏరివేసి, తమ ఆకాంక్షలకు అనుగుణం నడుచుకునే నాయకుడిని ప్రజలు ఎన్నుకోగలిగినప్పుడే తెలంగాణా కల సాకారమౌతుంది. లేదంటే, ఈ నాయకుల తప్పిదాల వల్ల తెలంగాణా కోలుకోని విధంగా విధ్వంసమౌతుంది.

 

పెచ్చుమీరిన మూర్ఖపు ఆవేశానికి, చారిత్రక విధ్వంసానికి ప్రతిరూపంగా టాంక్ బండ్ పై కూల్చబడిన ఈ విగ్రహాలను పునరుద్ధరించకుండా మూగసాక్షిలా మిగల్చాలి. ఎప్పటికైనా, తమ కాళ్ళను తామే నరుక్కునే ఉద్యమకారులకు కనువిప్పు కలుగుతుందేమో!

Photo Courtesy : eenadu.net

Your views are valuable to us!