దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది.
దాదాపు 20 నెలల నుండి దేశ పరిస్థితులు పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్లు కనిపిస్తున్నది. బహుశా, కాంగ్రెస్సే కేంద్రప్రభుత్వంలో ఉండి ఉంటే, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు కనిపించేవి కావనుకుంటాను. దానికి ఒక కారణం మోడీ నేతృత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వమైతే, మరో ప్రధాన కారణం అధికారంలో లేని కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే, శ్లేష్మంలో ఈగల్లా అవినీతి రొచ్చులో కేరింతలు కొట్టే ఆ పార్టీ నాయకులకి దేశాన్ని భ్రష్టు పట్టించే మరిన్ని ఆలోచనలకు అంత తీరిక దొరికి ఉండేది కాదు. ఇప్పుడంతా తీరికే. అందుకే దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందనేది. అసలే కాంగ్రెస్. అవినీతి కల్లు బాగా తాగి ఉంది. అధికారం ఇచ్చి అత్తరు పూయకుండా, ప్రజలంతా తేళ్ళై కుట్టి నిప్పుల మీద నడిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ వీరంగాలకు అడ్డూ అదుపు ఏముంటుంది?
దాదాపు సగం దేశంలో మట్టికొట్టుకుపోయిన కాంగ్రెస్ అధికారంలో లేకపోతే ఏం పీకుతుందిలే అని ఎన్.డి.ఎ. సరిపెట్టుకున్నట్లుంది. ఇక్కడే వాళ్ళు తప్పులో కాలేసారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ముందుచూపు మరేపార్టీకి లేదనటం అతిశయోక్తి కాదు. అధికారంలో ఉన్నన్నాళ్ళూ ఆ పార్టీ గంతకు తగ్గ బొంతలన్నిటినీ పోగేసుకుంటుంది. మతి లేనివాడికి గతి లేనమ్మ అన్నట్లు ఆ బొంతలన్నీ కాంగ్రెస్ గూటిలో చేరిపోయి చిలకపలుకులు నేర్చుకుంటాయి. ఈ గుడ్డి గుర్రాలకు దాణా వేసే విషయంలో ఏ లోటుపాట్లు రానీయదు కాంగ్రెస్. అందుకే, అధికారం పోయిన తర్వాత కూడా ఆ చిలకలన్నీ కాంగ్రెస్ నేర్చిన పలుకులు వల్లెవేస్తాయి. కాంగ్రెస్ చంకలో ఊరేగినన్నాళ్ళూ పిత్తిన ముత్తైదువల్లా ఉన్న ఈ చిలుకలకి, కాంగ్రెస్ అధికారంలో లేదనగానే, దేశ సమస్యలన్నీ గుర్తుకు వస్తాయి. అలా బయటపడుతున్న సమస్యలే దేశంలో అసహనం పేట్రేగిపోతున్నదనే విమర్శలు. దాదాపు 70 ఏళ్ళ దేశ సమస్యలన్నిటికీ కారణం 20 నెలల ఎన్.డి.ఎ. ప్రభుత్వం అని ఈ చిలుకలు ఏ రోజుకారోజు పలవరిస్తూ ఉంటాయి.
గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన శేల్జా కుమారి గారి ఇప్పటి సమస్య కూడా అదే. రసవత్తరం చేస్తున్న కాంగ్రెస్ రాజకీయాల్లో మలి పాచిక ఇది. రెండేళ్ళ క్రితం ఆవిడ ద్వారక వెళితే కులం ఏమిటని అడిగారట! అయినా అభిమాన పడకుండా, ద్వారకాధీశుడి దర్శనమైన తర్వాత ఆ మందిర యాజమాన్యాన్ని కడుపారా పొగిడి రావటం ఆవిడ సహృదయతకు నిలువెత్తు నిదర్శనం. ఆనాడే దాన్నో సమస్యగా చిత్రీకరించక దు:ఖాన్ని కడుపులోనే దిగమింగుకున్న ఆవిడ గొప్పతనం కూడా అదే మరి! ఈ విషయం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందనే అభాసు ప్రశ్నలు వేయొద్దు. అధికారంలో ఉన్నప్పుడు కాకరకాయ, లేనప్పుడు కీకరకాయ అనటం కూడా కాంగ్రెస్ నేర్పే విద్యలో భాగమే.
నాకు తెలిసీ, ఏనాడూ కులం ఆధారంగా ద్వారకలో ప్రవేశానికి అనుమతులు ఇవ్వటం కనలేదు, వినలేదు. ప్రత్యేక పూజల కోసం గోత్రం అడిగితే అడిగి ఉండవచ్చు కాక. అయినా, పుట్టినప్పటి నుంచి ఈనాటి దాకా మనం నింపే ప్రతి దరఖాస్తులో మన కులం ఏమిటని అడుగుతుంది ప్రభుత్వం. ఇది సరైన పద్ధతికాదని ఈ మాజీ మంత్రిణిగారికి అధికారంలో ఉన్ననాడు ఎందుకు గోచరించలేదో! ఆమాటకొస్తే, గతంలో రెండు సార్లు ఎస్సీ లకు రిజర్వు చేసిన అంబాలా నుంచి గెలిచిన ఒక దళిత నేత, తాను దళితురాలినని చెప్పుకోటంలో అవమాన పడాల్సిన అగత్యం ఏముంది? ఇంకో విచిత్రం. ఈ సంఘటన జరిగిందని ఆవిడ చెబుతున్న సమయంలో ఆవిడ సామాజిక న్యాయం అనే శాఖకు మంత్రి! హిందు వ్యతిరేక విధానాల వలనే కాంగ్రెస్ ఓడిపోయిందని ఆంటోనీ కమిటీ తేల్చిచెప్పినా, కాంగ్రెస్ ఆలోచనా విధానంలో ఏమార్పూ కనిపించటంలేదు. హిందువుల దేవతలను తెగనాడినవాళ్ళకి, పురాణాలను గేలి చేసినవారికి అవార్డులు రివార్డులు ప్రకటించి, పైగా హిందువులు ఓరిమి నేర్చుకోవాలని కాంగ్రెస్ చేసే ఉపదేశాలకు కాలం చెల్లింది. అయినా, ఇప్పుడు కులం కార్డులు ప్రయోగించాలనే వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నది. మహాకూటమి కి బీహారులో దక్కిన గెలుపు, తమ బలుపుగా కాంగ్రెస్ భావించుకుంటున్నది. ఉత్త కుండకు ఊపెక్కువంటే ఇదే కాబోలు!
ప్రభుత్వాన్ని అతలాకుతలం చేయాలని, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలని కాంగ్రెస్ నేతలు పన్నుతున్న వ్యూహం ఓసారి గమనించండి :
మల్లిఖార్జున్ ఖడ్గే ఆర్యుల, ద్రావిడుల చర్చకు శ్రీకారం చుడుతున్నాడు. అంతేకాక, సాక్షాత్తు పార్లమెంటులో రాజ్యాంగం గురించి మాట్లాడుతూ రక్తపాతం జరుగుతుందని బెదిరిస్తున్నాడు. మరో పక్క, అస్సాంలో తరుణ్ గగోయ్ హిందీ వ్యతిరేకతను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షీద్‌లైతే ఎన్.డి.ఎ. ప్రభుత్వాన్ని దించేయాలని ఏకంగా పాకిస్తాన్ మద్దతు అడుగుతున్నారు. ఇక మనమందరం మేధావిగా భావించే జయరాం రమేష్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వాన్ని నమ్మరాదని అమెరికాకు సుద్దులు చెబుతున్నాడు! కాపురం గుట్టు రోగం రట్టు చేసిందన్నట్లు, కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి ఆ పార్టీ గుట్టు రట్టు చేస్తున్నది.
ఇక పండిత ప్రపౌత్రుడి గురించి చెప్పేదేముంది? విద్యార్ధులతో మమేకం కావాలనే మిషతో బెంగుళూరు వెళ్ళి, ఓ కళాశాలలో మోడీని మోత మోగించాలని ప్రసంగించి, విద్యార్ధుల అహహ్హహ్హాకారాల మధ్య భంగపడి మయసభ నుంచి దుర్యోధనుడిలా బయటపడ్డాడు! పార్లమెంటులోనూ ఇదే తంతు!! దేశంలో ఎప్పుడు ఉంటాడో తెలియదు. పార్లమెంటుకు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాగితం లేకుండా ఒక్క ముక్క కూడా ముక్కలేని అర్భకుడు ఎప్పుడు విన్నా మోడీకి ఉపదేశం చేస్తూనే ఉంటాడు!! ఈలాంటి బామర్ది బావగారు కూడా ఇప్పుడు హూంకారాలు చేస్తున్నాడు.
దేశంలో కాంగ్రెస్ ఇంత గందరగోళ పరిస్థితులు సృష్టిస్తూ ఉంటే, ప్రధాని నిమ్మకు నీరెత్తకుండా ఫ్లైట్లు ఎక్కుతూనే ఉన్నాడు, దిగుతూనే ఉన్నాడు! ఒబామా మెచ్చుకున్నాడని చంకలు కొట్టుకోవటం, ఏదో పత్రిక రేటింగులో పదో స్థానంలో ఉన్నాడని కూనిరాగాలు తీయగా పాడుకోవటం తప్పించి ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్‌ముక్త భారత దేశం కోసం చేస్తున్న ప్రయత్నం ఏమీ లేదు. రాముడు మంచి బాలుడు అన్న వాక్యానికి తనే ఓ ఉదాహరణగా నిలవాలని తాపత్రయపడుతున్నాడు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆలోచించండి… కాంగ్రెస్‌కే కనుక ఏక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ వచ్చి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో! అల్లుడుగారి మీద నోరు పారేసుకున్నందుకు ముందుగా మోడీ, అమిత్‌షాలు జైల్లో ఊచలు లెక్కపెట్టుకుంటూ ఉండేవారు. ఆరెస్సెస్, విహెచ్‌పిలు నిషేధించబడి ఉండేవి. భారతరత్నగా సోనియా నోబెల్ బహుమతి కోసం ఎంపిక చేయబడి ఉండేది. ప్రధానిగా పప్పు, ప్రధాన సేవకుడుగా మన్‌మోహన్, రాజగురువు పాత్రలో డిగ్గీరాజ, షిండేలు, చవానులు, సిబల్సు, ఖుర్షీదులు, ఖర్గేలు…. జనాలకు సినిమా చూపించి ఉండేవాళ్ళే!!
ఏదేమైనా, దేశానికి పట్టిన ఓ కమ్యూనిస్టు చీడ దాదాపు వదిలింది. ఇక వొదిలించుకోవాల్సిన మరో ముఖ్యమైన చీడ ఈ కాంగ్రెస్సే! లాతోమ్ కే భూత్ బాతోమ్ సే నహీ మాన్‌తే. కాబట్టి, నరేంద్ర మోడీ భయ్యా… మరో ధృతరాష్ట్రుడివో, మన్‌మోహనుడివో కావద్దు. దేశానికి పట్టిన సెక్యులర్ భూతం వదలాలంటే, కాంగ్రెస్‌ముక్త్ భారత్ కావాలి. ఇకనైనా మీనమేషాలు లెక్కించకుండా అవినీతికి అమ్మ, అమ్మమ్మా, తాతమ్మ అయినా కాంగ్రెస్‌ను ఏమాత్రమూ ఉపేక్షించకుండా కటకటాల వెనక్కి పంపి ఘాటైన సందేశాన్ని ఇవ్వాలి. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నా నానాపార్టీల మహాసమూహాలని పెకిలించి వేయాలి. ప్రజల మధ్య సామరస్యం వెల్లివిరిసేలా నిజమైన సామ్యవాదాన్ని ప్రభుత్వం ఆచరించి చూపాలి. అదే చేత్తో స్వంత పార్టీలోని అటుకులు బొక్కే నోళ్ళనీ, ఆడిపోసుకునే నోళ్ళనీ మూయించాలి. అవకాశ మిచ్చిన భారతాన్ని అవమానించొద్దు. నూరుకోట్ల ఆశలు వమ్ము చేయొద్దు.