ఒకేఒక్కడు – ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర – ఓ పరిచయం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈమధ్య “చిరంజీవి ఓ చిరుజీవి” అన్న వ్యాసం వ్రాసే సమయంలో ఎన్.టి.ఆర్. బొమ్మ కోసం వెతుకుతుంటే, అన్న ఎన్.టి.ఆర్. కాం అనే వెబ్ సైటులో ఐ.వెంకట్రావ్ అనే జర్నలిస్టు వ్రాసిన ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర కనిపించింది.. మొట్టమొదటిసారిగా, ఎన్.టి.ఆర్. కు సంబంధించిన జీవిత విశేషాలు ఆ పుస్తకం ద్వారా చదివాను.

స్థూలంగా ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా చదవాలి. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు ఏ ఏ ఆశయాలతో సినీజీవితంలోకి అడుగు పెట్టాడో, తన నవరస నటనా వైదుష్యంతో ఆంధ్రుల గుండెల్లో నిల్చిపోయాడో అనేది ఒక భాగమైతే; ఏ ఏ ఆదర్శాలతో జనహితాన్ని కోరుతూ ఓ ప్రభంజనంలా రాజకీయాల్లో ప్రవేశించిన వ్యక్తి, అనిలానలమై రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎలా దహించివేశాడో, ఆప్తుల హితవులు పక్కన పెట్టి ఓ అసమగ్రమైన పుస్తకంలా ఎలా మిగిలిపోయాడో అనేది రెండవభాగం.

ఈ పుస్తకం చదివిన తర్వాత ఎన్.టి.ఆర్. పై సహజంగానే చాలా అభిప్రాయాలు ఏర్పడతాయి. ఎటువంటి నేపధ్యము లేకుండానే, మొదట సినిమాలలోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి దూకిన ఎన్.టి.ఆర్. సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని సరిపోలిస్తే, రాజకీయ జీవితంలోనే చాలా ఆటుపోట్లని చవిచూసాడు. ఆయనకు, సినీ జీవితం పూలపానుపు కాకపోయినా, పుట్టుకతో ఆయన ఒక కళాకారుడు కనుక తొందరగానే నిచ్చెనలన్నీ ఎక్కగలిగాడు. ఇటు, ఒక నటరత్నగా, ఒక నటసార్వభౌముడుగా ప్రజల మనసుల్లో పదిలంగా ఉన్న ఆయన ఇమేజ్ రాజకీయాల్లో మొదటి మెట్టు ఎక్కటానికి ఉపయోగపడిందే కానీ, ఆ తర్వాత ఆటుపోట్ల నుంచి తప్పించటానికి ఏవిధంగాను ఉపయోగపడలేదు.

సినీ జీవితంలో ఒక మొండివాడుగా (ఒకే చెయ్యి నాలుగు సార్లు విరిగినా పట్టించుకోని) కనిపించే ఆయన వ్యక్తిత్వం, రాజకీయాల్లోను, జీవిత చరమాంకం వచ్చేటప్పటికి జగమొండిగా మారిన ఓ వృద్ధుడిగా పరిణమిస్తుంది ఈ పుస్తకంలో. నిజానికి, అక్కడక్కడా ఇప్పటి తెలుగుదేశం కరపత్రంలా (ప్రో చంద్రబాబు) ఈ పుస్తకం కనిపించినా, ఎన్.టి.ఆర్. పరంగా ప్రజలకు తెలియని కొన్ని కోణాలను ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. ఎన్.టి.ఆర్ తన పరిపాలన ఆరంభంలో తీసుకొన్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వెనుక ఉన్న అసలైన కారణాలు కూడా పాఠకులకు ఎన్.టి.ఆర్.పై ఒక అవగాహన కలిగించే ప్రయత్నం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

ఈ పుస్తకంలో ముఖ్యంగా పరిశీలించదగ్గ, సరిపోల్చ దగ్గ విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి – ఏ పరిస్థితుల నేపధ్యంలో నాదెండ్ల భాస్కర రావు ఎన్.టి.ఆర్. ను “వెన్నుపోటు” పొడిచాడు? రెండు – ఎన్.టి.ఆర్. ను పదవీచ్యుతుడిని చేయటానికి చంద్రబాబుకు ఉన్న కారణాలేమిటి? విచిత్రం ఏమిటంటే, ఈ రెంటికీ కారణం ఒక్కటే. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో ఎన్.టి.ఆర్. కుటుంబం పోషించిన పాత్ర.

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కాలేక, తెలుగుదేశంలోనైనా ముఖ్యమంత్రి అవుదామనే ఆశతో పార్టీలో చేరిన నాదెండ్ల, ఎన్.టి.ఆర్. తన ఇద్దరు అల్లుళ్ళకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గగనమౌతుందేమో అన్న భయంతో “వెన్నుపోటు” పొడిస్తే;

లక్ష్మీ పార్వతి ఎన్.టి.ఆర్. కొత్త భార్యగా మాత్రమే ఉండకుండా, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో వేళ్ళు పెట్టి, తనను ఏకాకిని చేస్తున్నదని, పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎన్.టి.ఆర్. ను పదవి నుంచి తప్పించటం మినహా వేరే మార్గం లేదని చంద్రబాబు భావించాడు.

వీరిద్దరిలో ఎవరు తక్కువ తప్పు చేసారు, ఎవరు పెద్ద తప్పు చేసారనేది ఇప్పుడు మనం తీరిగ్గా విశ్లేషించుకోగలమే కానీ, కేవలం తన జనాకర్షణతో పార్టీని పెట్టి అందలం ఎక్కించిన ఎన్.టి.ఆర్. దృష్టిలో ఎవరు పెద్ద నేరస్తులో ఈ పుస్తకం చదివి మనం నిర్ణయించుకోవచ్చు.

ఏదేమైనా, ఓ ప్రభంజనంలా సాగిన ఓ మహానటుని, ఓ మహానాయకుని జీవితం అసంపూర్తిగా, అసంతృప్తిగా ముగిసిందనేది వాస్తవం.

Your views are valuable to us!