పోతామన్నారు, పొగబెట్టారు!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మీకు మీరే, మాకు మేమే??భా.జ.పా. ఎన్నికల ప్రచార సారధిగా మోడి ఎన్నిక, ఎన్.డి.ఎ.లో చిచ్చుపెడుతున్నట్లు పలు విశ్లేషణలు చెబుతున్నాయి. మోడీ కారణంగా, దాదాపు పదిహేడు ఏళ్ళుగా కొనసాగుతున్న అనుబంధాన్ని జనతాదళ్ (యు) తెంచుకోబోతున్నదన్న వార్తలు కూడా వస్తున్నాయి. దాదాపు పది పార్టీలతో అంటకాగుతున్న ఎన్.డి.ఎ. కు ఊపిరులూదుతున్న పార్టీలు జనతాదళ్ (యు) తో కలుపుకొని మూడే! 20 మంది ఎం.పి. లతో జనతాదళ్ (యు) ప్రధాన భాగస్వామిగా ఉంటే, 11 మందితో శివసేన, నలుగురితో శిరోమణి అకాలీదళ్ ఊతంగా ఉన్నాయి. అసాం గణపరిషద్, మహారాష్ట్ర గోమంతక్, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్, జనత, హర్యాన జనహిత్ కాంగ్రెస్ లాంటి ఏమంతగా చెప్పుకోలేని పార్టీలు మరికొన్ని. 

మూడో ఫ్రంటని, నాలుగో ఫ్రంటని, ఫేడరల్ ఫ్రంటని ఎవరికివారు తూకాలు కొలతలు వేసుకునే పనుల్లో తీరికే లేకుండా సమాలోచనలు చేస్తున్నారు. దేశంలోని దాదాపు ప్రతి రాజకీయ పార్టీ పాత పొత్తులు సమీక్షించుకుంటూ, కొత్త పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు. దేశంలో ఎన్నికల వేడి మొదలయ్యిందనటానికి ఇవన్నీ సూచికలే. 

మొన్నటిదాకా, మోడీని ఎన్నికల ప్రచార సారధిగా భా.జ.పా. నియమించుకోవటం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా పరిగణించిన జనతాదళ్ (యు) అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించాల్సిన అవసరం ఏముంది? మోడీ నియామకం భా.జ.పా. వరకే కానీ, ఎన్.డి.ఎ.కు కాకపోయినా జనతాదళ్ కస్సుబుస్సులెండుకు ఆడుతున్నది? దీనికి నాకు అర్ధమైనంతలో రెండు విధాలుగా విశ్లేషించుకోవచ్చు. ఒకటి భా.జ.పా. కోణంలో, మరొకటి జనతాదళ్ (యు) కోణంలో. 

భా.జ.పా. కోణంలో గమనిస్తే, బీహారులో జనతాదళ్ (యు) ప్రభుత్వం రాబోయే ఎన్నికలనాటికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకోబోతున్నది. మొన్నటి ఉప ఎన్నికల్లో మహరాజ్ గంజ్ లోక్ సభ నియోజకవర్గంలో జనతాదళ్ దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ సీటు గెలుచుకున్నది లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడి! 

బీహారులో పాలకపక్షానికి వ్యతిరేకత వ్యక్తమౌతున్న సూచనలు ఈ ఉప ఎన్నికలు బయటపెట్టాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ తో అంటకాగటం వల్ల భా.జ.పా.కు పెద్ద ఉపయోగం లేదు. పోనీ, భా.జ.పా.తో ఆర్జేడీ పొత్తుకు సిద్ధమౌతుందా అంటే, లాలూ మొదటి నుంచి భా.జ.పా.కు వ్యతిరేకమే. పోనీ, జనతాదళ్ తోనే ఉందామా అంటే, ఆ పార్టీ ప్రధానమంత్రిగా మోడీ అభ్యర్ధిత్వానికి వ్యతిరేకంగా ఉంది. మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే కలుగుతాయనుకుంటున్న లాభాలతో పోలిస్తే, జనతదళ్ తో తెగతెంపులు చేసుకుంటే కలిగే నష్టమే తక్కువగా కనిపిస్తున్నది. అదీ కాక, మోడీ నేతృత్వంలో యు.పి., బీహారు లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భాగస్వాముల అడ్డంకులేవీ లేకుండా మరోసారి పాగా వేయటానికి ఎంతవరకు అవకాశముందో తెలుసుకునే అవకాశమూ భా.జ.పా.కు ఉంటుంది. బహుశా, ఇలా ఆలోచన చేసే, మోడీకి ఆప్తుడైన అమిత్ షా కు యు.పి. బాధ్యతలు కూడా అప్పగించింది భా.జ.పా. 

జనతాదళ్ విషయానికి వస్తే, మొన్నటి మహరాజ్ గంజ్ ఉప ఎన్నిక ఆ పార్టీకి చెంప పెట్టు. ఆ ఓటమికి కారణం ఎనిమిదేళ్ళ తమ పాలనపై వ్యక్తమైన వ్యతిరేకత అని ఆ పార్టీ అనుకోవటం లేదు. మోడీ మీద తమ మెతక వైఖరి కారణంగా ముస్లీములు దూరమయ్యారని భావిస్తున్నది. ఇప్పుడు భా.జ.పా.తో తెగతెంపులు చేసుకుంటే ముస్లీములు ఆనందపడి, రాబోయే ఎన్నికల్లో తిరిగి తమను నెత్తిన పెట్టుకుంటారనే ఆలోచిస్తున్నది. 

ఈ ఆలోచన సరైనదా కాదా అనేది పక్కన పెడితే, మరో విషయం కూడా అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో యు.పి.ఎ. భాగస్వామి కావటం వలన జనతాదళ్ కు ఉపయోగం లేదు. ఎందుకంటే, పదేళ్ళ యు.పి.ఎ. పాలన మీద రాబోయే ఎన్నికల్లో వ్యతిరేకత ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ వ్యతిరేకతకు తోడుగా, బీహారులో వీరి పాలనపై ఉన్న వ్యతిరేకత కూడా కలిస్తే, అన్నివిధాలుగా నష్టపోయే పరిస్థితి జనతాదళ్ ది. 

మరో ముఖ్య విషయం ఏమిటంటే, బీహారులో గత వైభవాన్ని తిరిగి తెచ్చుకునే దిశగా లాలూ యాదవ్ అడుగులు వేస్తున్నాడు. బీహారులో జనతాదళ్ పాలనపై ఉన్న వ్యతిరేకత లాలూ యాదవ్ కు లబ్ది చేకూర్చేదే. అటు పార్లమెంటులోను, ఆ తర్వాత రాబోయే రాష్ట్ర ఎన్నికల్లోను లాలూ ప్రాభవాన్ని నియంత్రించాలంటే జనతాదళ్ కు,  భా.జ.పా. కాక ఉన్న ఏకైక మార్గం మరో ఫ్రంటు. అందుకే ఆ దిశగా అడుగులు వేయాలని జనతాదళ్ నిశ్చయించుకుంది. ఎన్నికలైన తర్వాత ఏ వేషాలు వేయాల్సి వచ్చినా, ఎన్నికల ముందు ప్రజలకోసంగా వేస్తున్న వేషంగా ప్రజలని మభ్యపెట్టకపోతే పార్టీ పరిస్థితి మరింత అస్తవ్యస్తమౌతుంది. 

కాబట్టి అసలు విషయమేమిటంటే, ఎన్.డి.ఎ.లో జనతాదళ్ కొనసాగాలని అటు భా.జ.పా. కోరుకోవటంలేదు, ఇటు జనతాదళ్ కూడా ఇష్టపడటంలేదు. విడిపోటానికి కారణాలు కావాలి కాబట్టి, మోడీ ఉదంతం దానికి ఓ ప్రేరకంగా నిలుస్తుంది. అంతే! ఎన్నికలయ్యాక, ఇవి మళ్ళీ మిత్రపక్షాలుగా మారినా, బయట నుంచి ఒకరికొకరు మద్దతు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

Your views are valuable to us!