“పోయినోళ్ళందరూ మంచోళ్ళు…” అన్నాడు ఓ సినీకవి. అందుకే, బతికున్న రోజుల్లో ఎవడు ఎన్ని వెధవ పనులు చేసినా, వాడు చచ్చిపోయాడని తెలిసినప్పుడు మాత్రం అయ్యో పాపం అనేస్తాం మనం. వాడి చావు, మన మనసుల్లో నిల్చిపోయిన వాడి పాపాలను తుడిచేస్తుంది.
వాల్ పోస్టర్లకు మెరుగులు దిద్దే స్థాయి నుంచి ఓ అరుదైన, అద్భుతమైన చిత్రకారుడుగా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన మక్బూల్ ఫిదా హుస్సేన్, తొంభై ఆరేళ్ళ పండు వయసులో దేశం కాని దేశంలో తలదాల్చుకోవాల్సి రావటం, అక్కడే మరణించటం కేవలం స్వయంకృతం. మతాలకతీతంగా దేశప్రజల ప్రేమాభిమానాలని చూరగొన్న కళాకారులకు దేశంలో కొదవలేదు. ముఖ్యంగా హిందువుల గౌరవాభిమానాలను చూరగొన్న ముస్లీం కళాకారులు చాలామందే ఉన్నారు. ఉదా. భారతరత్న బిస్మిల్లా ఖాన్, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అల్లారఖా. ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. వీరిని ఆదరించినట్లే, హుస్సేన్ ను కూడా ఈ దేశ ప్రజలు మతానికి అతీతంగా ఆదరించారు.
మహానుభావులైన ఆ కళాకారులకి, ఇతనికి ఉన్న తేడా ఏమిటంటే… కళ పేరుతో, వికృతమైన వేషాలు వాళ్ళు ఏనాడు వేయలేదు. ప్రజల మనోభావాలతో ఆడుకోలేదు. ఇక్కడ ఓ ఉదంతం మనం చెప్పుకోవాలి. ముదిమి మీద పడింది. మిమ్మల్ని ఢిల్లీలోనో, ముంబాయిలోనో పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, వారణాసి వదిలి వచ్చేయండని శ్రీ బిస్మిల్లా ఖాన్ ని ప్రాధేయపడితే, ఆయన ఇచ్చిన సమాధానం గగుర్పొడుస్తుంది. నేనిక్కడ షెహనాయ్ వాయించకపోతే, కాశీ విశ్వనాధుడికి మేలుకొలుపు ఎలా అవుతుందయ్యా… పోయేదాకా నేనిక్కడే ఉండాలి. విశ్వనాధునికి మేలుకొలుపు చేస్తూనే ఉండాలి అన్నాడట.
ఎన్ని వెర్రి వేషాలు వేసినా, మన ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ లతో ఎమ్మెఫ్ హుస్సేన్ ను సత్కరించింది. ఆ గౌరవాన్ని కూడా నిలుపుకోలేకపోయాడు ఇతను. కళ పేరుతో, భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరిన స్వాతంత్ర్యంతో, అడ్డగోలు స్వేచ్ఛతో దేవతల చిత్రాలను నగ్నంగా చిత్రీకరించాడు. ప్రతిఘటించినవారిని రెచ్చగొట్టే విధంగా ఆయా చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేసి సమూహాల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లటానికి దోహదపడ్డాడు. మాటవరసకైనా పశ్చాత్తాపం ప్రకటించకుండా, తన మీది కేసులన్నీ ఎత్తివేయాలని ప్రాధేయపడి, భంగపడి, మాతృదేశాన్ని విడనాడాడు.
ఏదేమైనా, ఒక అద్భుతమైన చిత్రకారుడు, చిత్రకళను సి గ్రేడ్ సినిమా వాల్ పోస్టర్ల స్థాయికి దిగజార్చి మరీ పోయాడు. పోయినోడే కాబట్టి మంచోడు అనగలమా?