ఏ విషయంలో అయినా యదార్ధ జ్ఞానాన్ని ‘ప్రమ’ అంటారు.
ప్ర = ప్రకర్ష, మ= కొలుచుట; అనగా విషయముయొక్క మూలము వరకు ప్రవేశించి నిశ్చయాత్మక జ్జానము పొందుట అని.
ఈ నిశ్చయ జ్జానమే ప్రమ. ఇటువంటి ప్రమ కలిగిన వ్యక్తి ‘ప్రమాత’. ‘ప్రమ’ ను కలుగజేసే విశిష్ట కరణమే ‘ప్రమాణము’. ‘ప్రమ’ యొక్క విషయమే ‘ప్రమేయము’. ఈ ప్రమాత, ప్రమాణ, ప్రమేయ విభాగమే ‘త్రిపుటి’. కేవలం ‘తెలుసుకోవడం’ అనే విషయమే కాక భోక్త, భోగము, భోజ్యము, అట్లాగే ధ్యాత, ధ్యానము, ధ్యేయము, అలాగే సాధకుడు, సాధన, సాధ్యము మొదలైన వాటిని కూడా ‘త్రిపుటి’ అంటారు.
వివిధ విషయాల నిశ్చయ జ్జానము వివిధమైన ప్రమాణాలతో లభిస్తుంది. ఆ ప్రమాణములు:
- ప్రత్యక్షము
- అనుమానము
- ఉపమానము
- అర్ధాపత్తి
- ఆగమము
ప్రత్యక్ష ప్రమాణం:
జగత్తులోని అసంఖ్యాకమైన విషయాలన్నీ కూడా ఐదు వర్గాల్లోకి వస్తాయి. అవి శబ్ద,స్పర్శ, రూప, రస, గంధములు. ఈ ఐదింటిని విడచి జగత్తులో ఇంకేవిషయము లేదు. శరీరంలోని పంచేద్రియముల ద్వారా వీటి గ్రహణ కలుగుతుంది. ఈ జ్జానేంద్రియములు శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రాణము. ఇంద్రియములకు విషములతో సన్నికర్ష (సంపర్కము) ఏర్పడగానే బుద్ధిలో విషయము యొక్క నిశ్చయజ్జానము ఏర్పడుతుంది. ఈవిధమైన జ్జానోత్పత్తిని కలిగించే కరణములను ‘ప్రత్యక్ష ప్రమాణం’ అంటారు.
జ్జానము కలిగించే సామాగ్రిలో (కరణములలో) ఏవిధమైన దోషము ఉన్నపటికీ నిశ్చయజ్జానము కలుగదు. సంశయ జ్జానము, మిధ్యాజ్జానము (అన్యధా గ్రహణము) మాత్రమే కలుగుతాయి. ఏ దోషము లేకపోతే సమ్యక్ జ్జానము (నిశ్చయజ్జానము) కలుగుతుంది.
అనుమాన ప్రమాణం:
ప్రత్యక్ష ప్రమాణము (జ్ఞానేంద్రియములవలన కలిగినది) వలననే కాక ఇతర ప్రమాణముల ద్వారా కూడా ‘ప్రమ’ యొక్క ఉత్పత్తి కలుగుతూ వుంటుంది. ఉదాహరణకి దూరంగా పొగను చూచి అక్కడ అగ్ని ఉందని తెలుసుకొంటాము. ఏ కరణం వల్ల ఈ ప్రమ కలుగుతుందో దానిని ‘అనుమాన ప్రమాణం’ అంటారు. ‘అనుమితి కరణమ్ అనుమానమ్’.
వ్యాప్తి జ్జానంచేత అనుమానం కలుగుతుంది. అందువల్ల వ్యాప్తిజ్జానమే అనుమాన ప్రమాణం. వ్యాప్తి యొక్క అవాస్తవిక జ్జానం వలన కలగడంచేత ఒక్కొక్కప్పుడు అనుమెతి జన్య జ్జానం భ్రమ కావచ్చును. అందువల్ల అనుమాన ప్రమాణంతో తెలిసికొన్న విషయం సరియైనదా కాదా అన్నది ప్రత్యక్ష ప్రమాణం చేత నిశ్చయం అవుతుంది.
ఉపమాన ప్రమాణం:
‘ఉపమితి’ కరణమును ‘ఉపమాన ప్రమాణం’ అంటారు. ఉదాహరణకు, ‘గవయము’ అనే ఒక అరణ్యప్రాణి గోవు లాగానే ఉండే ఒక నల్లని జంతువు. నగరంలో ఆవు చూచిన వ్యక్తి గవయమును చూడటంతోటే ‘ఈజంతువు ఆవు వలే వుంది’ అన్న జ్జానం కలుగుతుంది. తరువాత, దీనివంటిదే నా గోవు అన్న ఉపమితి ప్రమ కలుగుతుంది. ఇక్కడ ఆవు ఉపమానం, గవయం ఉపమేయం. ఉపమాన, ఉపమేయాలకు కొన్ని విషయాలలోనే సాదృశ్యం ఉంటుంది.
అర్ధాపత్తి ప్రమాణం:
పగలు భోజనం చేయని వ్యక్తి సుస్టుగా వున్నట్లైతే రాత్రి చక్కగా తింటున్నాడు అని భావిస్తాం. ఇక్కడ రాత్రి తింటున్న విషయం చెప్పకపోయినా ఊహించి తెలిసికొనగలం. ఈ జ్జానమే అర్ధాపత్తి ప్రమ. వింటున్న, చూస్తున్న విషయాలకి అర్ధమవటంలో ఆపత్తి (విభేదం) వస్తున్నప్పుడు ఆ భేదాన్ని ఇంకొక అర్ధం తో నివారించడాన్ని ‘అర్ధాపత్తి ప్రమాణం’ అనవచ్చు.
ఆగమ ప్రమాణం:
‘వేద’, ‘శ్రుతి’ ఆగమ శబ్దానికి పర్యాయ పదాలు. అలౌకిక విషయాలు చర్చించడానికి లౌకిక కరణాలు, ప్రమణాలు కానీ సహకరించలేవు. అందుకే, అపౌరుషాలైన వేదోపనిషత్తులు మాత్రమే ప్రమాణములు కాగలవు. ముఖ్యంగా వేదాలు మనుష్యకృతం కాదనటానికి 5 కారణాలు చెప్పవచ్చు.
1. వీటిలో ఎక్కడా కర్తయొక్క నామము కనపడదు. ఎవరైనా కర్త వుంటే ఎక్కడో ఒకచోటైనా వారి ప్రస్తావన వచ్చేది.
2. ఇందులో సప్తస్వరాలు వున్నాయి. ప్రతిఒక్క అక్షరానికీ స్వరం, మాత్ర నిశ్చయింపబడినాయి. అవి ఈనాటికి కూడా అదే విధంగా ఉన్నాయి. ఒకవేళ ఇవి మానవనిర్మితాలైతే, ఏ మార్పులేకుండా ఇంతకాలం అదే విధంగా కొనసాగడం అసంభవం.
3. వేదాలు సమస్త విషయజ్జానాములకి గని వంటివి. వీటి విస్తారం మన ఊహకు అందవు. ఎవరో ఒక కర్త వల్ల ఇంత విస్తారమైన గ్రంధం రచింపబటం అసంభవం.
4. అంతేకాకుండా, అనేక కర్తలతో, అనేక కాలాల్లో రచింపబడిందనటానికీ ఆస్కారం లేదు. అనేకులు రచించిన విషయాలు వారి వారి విరుద్ధభావాలని ప్రతిబింబింపజేస్తాయి. కానీ వేదాలలో ఏకాభిప్రాయం ఉండటం వల్ల ఇది సాధ్యం కాదు.
5. వేదాలలో అనేక విషయాలు మానవులకు తెలియనవి, లేదా ఇప్పుడిప్పుడే తెలిసికొన్నవి. ఉదాహరణకి అధర్వవేదం లో పృధ్విమీద సప్తద్వీపాలు ఉన్న విషయం తెలిపింది. కాని, 1910 వరకూ కేవలం 6 ద్వీపాలే మానవుడు కనుకొనగలిగాడు. ఆ తరువాతే ‘అంటార్టికా’ ని తెలిసికొన్నాడు. పురాణాలలో దీనిని ‘శాకద్వీపం’ అంటారు. ఒకవేళ ఇది మానవ కృతం అయితే మిగిలిన ద్వీపాలసంగతితో పాటు ఈద్వీపం సంగతి కూడా తెలిసేది.
ఇప్పుడు ఆప్రమాణాలు వినియోగించి జగత్ బ్రహ్మ జీవుల స్వరూపాలు నిశ్చయించాలి.
స్వరూపమంటే తన యొక్క రూపం. ఇది ఎప్పుడు తనను విడిచి వుండదు. కానీ జగత్తు ఎప్పుడూ పరిణామం చెందుతూనే ఉంటుంది కనుక ఏ ప్రత్యక్షరూపం లో మనం దానిని చూస్తున్నామో అది దాని స్వరూపం కాదు కన్న విషయం స్పష్టం.
ఏదో ఒక మూలవస్తువు లేకుండా పరిణామమౌతున్నవస్తువు స్వతంత్రంగా వుండదని భౌతికశాస్త్రం కూడా అంగీకరించే విషయమే. అంటే, దీనిని ఇలా చెప్పవచ్చు – ఒకానొక మూలవస్తువు తనస్వరూపంలో తాను వుంటూ, జగత్తు రూపంలో అనేక ఆకారాలు పొందుతున్నది అని. మనం ఇక్కడ ఆకారాలని చూడగలుగుతున్నాం కానీ జగత్తుకు ఆధారమైన మూలవస్తువును ప్రత్యక్షప్రమాణంతో తెలిసికోలేకపోతున్నాం. దానిని, కనుక, ఇతర ప్రమాణాలతోనే నిశ్చయించాలి. ఉదాహరణకు మంచుగడ్డ నీరుగా మారుతుంది. నీరు ఆవిరై పోతుంది. మంచు, నీరు, ఆవిరి ఇవి మనకు ప్రత్యక్షంగా కనపడే పదార్ధాలు. ఈమూడు పదార్ధాల సంభవానికి ఇంకొక పదార్ధం కావాలి. అది ప్రత్యక్షం కాదు. దానిని నిశ్చయం చేయాలంటే భౌతికశాస్త్ర విజ్జాన సహాయం కావాలి.
ఏ కార్యానికైనా రెండు కారణాలు ఉంటాయి.
1) ఉపాదాన కారణం
2) నిమిత్త కారణం
ఏ వస్తువు తన స్వరూపంలో ఉంటూనే అనేక రూపాల్లో ప్రకటించబడుతుందో దానిని ‘ఉపాదానం’ అంటారు. ఆ రూపాలు ఆ కారణం యొక్క కార్యాలు. అందువల్ల ఉపాదాన కారణమే కార్యము యొక్క స్వరూపం. ఉదాహరణకు కుండ, ఇటుక మొదలైనవి కార్యాలు. వాటి ఉపాదాన కారణం మట్టి. కార్యం ఒకరూపం నుంచి ఇంకొక రూపం పొందుతుంది. కాని ఉపాదాన కారణమైన మట్టి ఆ కార్యముల స్వరూపం అవుతుంది.
ఉపాదానం తనకు తానుగా కార్యరూపం పొందకపోవచ్చు. అలా కార్యరూపం పొందటానికి ఇంకొక కారణం యొక్క సహాయం అవసరం కావచ్చు. దానినే నిమిత్తకారణం అంటారు. ఉదాహరణకు మట్టిని కుండగా చేయటానికి కుమ్మరి కావాలి. అలాగే బంగారాన్ని ఆభరణంగా చేయటానికి కంసాలి కావాలి. ఇక్కడ ‘కుమ్మరి’ ‘కంసాలి’ నిమిత్త కారణాలు. కుండని, ఆభరణాలని చేయడానికి ఉపయోగించే పరికారలని ‘సహకారి కారణం’ అంటారు.
ఇక జగత్తు స్వరూప నిర్ణయం చేయడానికి దాని ఉపాదాన కారణాన్ని కనుగొనాలి. ఇక్కడ వేదాంత సిద్ధాంతం చెప్పేముందు వైశేషికుల (వీరి తర్కం భౌతిక శాస్త్రవేత్తల దృక్పధంతో ఏకీభవిస్తుంది) సిద్ధాంతాన్ని పరిశీలిద్దాం. వారు చెప్పేది ఏమిటంటే ఈ స్తూల జగత్తు పృధ్వి, జలం, తేజస్సు, వాయువు యొక్క పరమాణువులతో తయారైంది. గంధము, రసము, రూపము, స్పర్శ అనే గుణములతో కూడిన స్థూలమైనది పృధ్వి.
రసము, రూపము, స్పర్శ అనే గుణములతో కూడిన జలము సూక్ష్మమైనది. రూపము, స్పర్శ అనే రెండు గుణముల తేజస్సు సూక్ష్మతరమైనది. కేవలం స్పర్శ గుణం కలిగిన వాయువు సూక్ష్మతమమైనది. నాలుగు భూతములలో ఆఖరుకు విడదీయరానంత సూక్ష్మమైనది పరమాణువు. జగత్తు ప్రళయ సమయంలో ఈ పరమాణువుయొక్క అవయవాలు ఇంక వేరుచేయడానికి వీలులేనంతగా విడిపోతాయి.
ఈవిధంగా ప్రళయంలో నాలుగు భూతాల పరమాణువులే వుంటాయి. తిరిగి సృష్టి సమయంలో ఈ నాలుగు పరమాణువుల సంయోగం వలన పృధ్వి మొదలైన స్థూల భూతాలు తయారవుతాయి (In modern science, they call it Big Bang Theory).
వైశేషికుల పై సిధ్ధాంతం అనేక కారణాలవల్ల సరిఅయినది కాదు.
వారి అభిప్రాయం ప్రకారం సృస్టి, ప్రళయం, పరమాణు సంయోగం, పరమాణు లక్షణాలు…ఇవి ఏవి సమంజసంగా లేవు.
1. పరమాణువు జడమైనందువల్ల చైతన్యం సహాయం లేకుండా తమంత తాముగా పృధ్వి మొదలైన భూతాలను సృస్టించలేవు.
2) ప్రళయ సమయంలో కూడా వైశేషికులు చెప్పింది సరిగ్గాలేదు. ఇక్కడ కూడా చైతన్య సహాయం లేకుండా ప్రళయం సాధ్యంకాదు.
3) ఇక పరమాణు సంయోగ వాదన కూడా ఉచితంగాలేదు. ఒక పరమాణువుతో ఇంకొక పరమాణువు పూర్ణంగా కాని, కొంతభాగంతో కానీ సంయోగం చెందాలి. రెండు నిరవయమైన పూర్ణ పరమాణువల సంయోగం వలన ఇంకొక నిరవయవ ద్రవ్యమే పుడుతుంది. అలా కాకుండా కొంత భాగంతో సంయోగం చెందాయంటే పరమాణువుకి అనేక అవయవాలు వున్నాయని ఒప్పుకోవాలి. అప్పుడు పరమాణువు విభజింపడదనే వారి సిధ్ధాంతానికి విఘాతం కలుగుతుంది.
4) పరమాణువులు స్పర్శాది గుణాలు కలిగినివి, నిత్యమైనవి అని చెప్పడం కూడా పరస్పరం విరుద్ధం. ఏందుకంటే, మన అనుభవంలో స్పర్శాది గుణాలు కలిగిన సమస్త వస్తువులు అనిత్యమైనవి. ఉదాహరణకు స్పర్శాది గుణాలు కలిగిన వస్త్రం తంతువు యోక్క కార్యం. తంతువు ప్రత్తి యొక్క కార్యం. ఇదే విధంగా పరమాణువు స్పర్శాది గుణాలు కలిగుంటే అది కార్యమే అవుతుంది కానీ మూలకారణం కాదు. అలా అయినట్లయితే పరమాణువు అనిత్యమౌతుంది.