రాజకీయ నాయకులు – ఆలయ దర్శనాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

“పరమేశ్వర భక్తిర్నామ నిరవధిక అనంత అనవద్య కల్యాణగుణత్వ జ్ఞానపూర్వకః స్వాత్మాత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధికో అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధో నిరంతర ప్రేమప్రవాహః”

“సుధృఢ స్నేహో భక్తిరితి ప్రోక్తః”

 

“భక్తి” అన్న పదానికి శ్రీజయతీర్థ యతివర్యులు చేసిన వ్యాఖ్యానం. 

అనంత కల్యాణ గుణాలు కలిగిన పరమాత్ముని పట్ల జీవికి గల ప్రేమసిక్తమైన సుధృఢ స్నేహానికే భక్తి అని పేరు. వేలకు వేల అడ్డంకులు ఎదురైనా ఆగకుండా ప్రవహించే ప్రేమకే భక్తి అని పేరు అని మధ్వాచార్యుల గ్రంథాలకు టీకాభాష్యం వ్రాసిన జయతీర్థ వివరించారు.

ఇటువంటి సుధృఢ భక్తిని ప్రదర్శన కోసం కాక గుండె లోతుల్లోంచి పొంగివచ్చిన పారవశ్యంతో ఆచరించిన రాజులు (రాజకీయులు) చరిత్రలో దొరుకుతారు. అటువంటి ముగ్గురు విజయనగర చక్రవర్తుల గురించి వ్రాసిన వ్రాత ఇది.

*****

కృష్ణదేవరాయలు

ఇతను ఏడుసార్లు తిరుమల ఆలయాన్ని దర్శించాడు. మొదటి యాత్రలో ఇద్దరు రాణులు, అధికారులతో వచ్చినవాడు రెండు, మూడవ యాత్రల్లో ఒంటరిగా వచ్చాడు. తెలుగు ప్రాంతాల్లో యుద్ధాలు సాగిస్తున్నప్పుడు ఇలా ఒంటరిగా వచ్చాడని చరిత్రకారుల అభిప్రాయం.

తిరుమల ఆలయంలో కృష్ణదేవరాయలు, అతని భార్యలు (ఊహాచిత్రం)

యుద్ధ సమయాల్లో ఎదురయ్యే మానసిక, శారీరిక శ్రమను మర్చిపోవడానికి కృష్ణరాయలు తిరుమలకు వచ్చేవాడన్న మాట!

మూడవ యాత్రలో చేసిన దానాల పుణ్యం గతించిన తన తల్లిదండ్రులకు దక్కి వారికి ఉత్తమగతులు పొందాలని రాయలు కోరుకున్నట్టు 1513 సంవత్సరం నాటి కృష్ణరాయల తిరుమల శాసనం చెబుతోంది.

అంతేకాదు, యుద్ధాలలో తను సాధించిన ఘనవిజయాలన్నీ ఆ శ్రీనివాసుని కృప వల్లనే లభించాయని కృతజ్ఞతపూర్వకంగా బంగారు నాణ్యాలతో స్వామివారికి అభిషేకం చేసాడన్న కథనం కూడ ఉంది.

చిత్రం: suvarnamohur.com

 

ఇదీ కృష్ణరాయకు తిరుమలరాయని పై గల ’సుధృఢ స్నేహ భక్తి.’

*****

SUBSCRIBE TO ANVESHI CHANNEL – ACCESS FACTUAL HISTORY

అచ్యుత దేవరాయలు

కృష్ణరాయల తర్వాత చక్రవర్తి అయిన అతని తమ్ముడు అచ్యుతరాయల దైవభక్తిని పరిచయం చేసేందుకు ఒక శాసనమే ఉంది.

31/01/1533 నాటి ఈ శాసనం ప్రకారం, తిరుమల ఆలయ అర్చకులు శ్రీనివాస సహస్రనామాన్ని చదువుతుండగా అచ్యుతరాయలు స్వయంగా స్వామివారికి అర్చన చేసాడు.

తిరుమల ఆలయంలోని అచ్యుతదేవరాయలు, వరదాజీ అమ్మ విగ్రహాలు

 

ఇది అచ్యుతరాయలి ’అనన్య భక్తి.’

*****

రెండవ వేంకటపతి దేవరాయలు

వినాశనం వైపుకు వెళుతున్న విజయనగరాన్ని నిలబెట్టినవాడు (రెండవ) వేంకటపతిరాయలు. ఇతను రాజధానిని పెనుగొండ నుండి చంద్రగిరికి మార్చాడు.

ఈ రాజధానికి మార్పుకు చరిత్రకారులు రెండు కారణాలను చెప్పారు:

  1. సైనికపరమైనది
  2. భక్తిపరమైనది.

వేంకటరాయలకు వేంకటపతిపై అమితమైన భక్తి. కనుక స్వామివారి పర్వతపాద ప్రాంతమైన చంద్రగిరిని తన నివాసంగా ఎంచుకున్నాడు. తిరుమల ఆలయంలో శ్రీనివాసునికి అర్చకులు నైవేద్యం  నైవేద్యం సమర్పించాక మాత్రమే తను భోజనం చేసేవాడు. 

తిరుమల ఆలయంలోని రెండవ వేంకటపతి దేవరాయల విగ్రహం

ఇది వేంకటరాయల ’ప్రేమప్రవాహరూప భక్తి.’

 

*****

ఇలా యుద్ధాలు, రాజకీయాలు మొదలైన ప్రాపంచిక లంపటాల మధ్య జీవించిన ముగ్గురు పాలకులు సకలలోకచక్రవర్తి అయిన శ్రీనివాసుని పట్ల అనన్యసామాన్యమైన భక్తిని చూపించారు. కొండంత దేవునికి గోరంత పత్రిగా యథాయోగ్యంగా కట్నకానుకలు సమర్పించుకున్నారు. ఆ సమర్పణలు “మేము మహారాజుల“మన్న అహంకారంతో కాదు. తమ ఆరాధ్యదైవం పట్ల తమకు ఉన్న ధృడమైన స్నేహం, అపరిమితమైన భక్తి కొద్దీ చేసిన ’కృష్ణార్పణా’లవి.

ఈ చారిత్రిక సత్యాల వల్ల తెలుసుకోవలసినదేమిటంటే – భక్తిశ్రద్ధలు పదవులు, అధికారమూ, ప్రోటోకాల్ నిబంధనలు మొదలైనవాటితో ముడిపడినవి కావు. అవి మనోధర్మాలు. సంస్కారజనితాలు. శాశ్వతత్వ సూచికలు.

కనుక దైవ దర్శనానికి, ఆలయ సందర్శనానికి కావల్సినది ఒకేఒకటి – సుధృఢ భక్తి మాత్రమే.

“భక్త్యా తుష్యంతి కేశవః” అని నారదపురాణం అన్నట్టు ఆ విశ్వచక్షువు చూసేది లోపలున్న భక్తిని. పైనున్న వేషాన్ని కాదు. రాజకీయ నాయకులు ఈ వైదిక, చారిత్రిక, సాంస్కృతిక సత్యాన్ని తెలుసుకుని దర్శనానికి వస్తే ఇహపరాలు దక్కుతాయి.

లేదంటే…

//స్వస్తి//

Your views are valuable to us!