రమ్మని, పొగ పెట్టటం దేనికి?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నిరాహార దీక్ష చేసిన దరిమిలా, కేంద్ర ప్రభుత్వం పౌర సమాజ ప్రతినిధులకు లోక్ పాల్ బిల్లు రూపొందించటానికి ఏర్పడిన సంయుక్త ముసాయిదా కమీటిలో చోటు కల్పించి దాదాపు రెండు నెలలు కావొస్తున్నది. ఒక్కడుగా నిరాహార దీక్ష మొదలేసిన అన్నా హజారేకు ప్రజల నుంచి లభించిన స్పందనకు సహజంగానే ప్రభుత్వం అప్పుడు సానుకూలంగా స్పందించింది. మరి ఈ రెండు నెలలలో ఏ మిన్ను విరిగి మీద పడుతున్నదని ప్రభుత్వం భావిస్తూ పౌర సమాజ ప్రతినిధులను పొమ్మనకుండా పొగ పెడుతున్నదో! దానికిగాను ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న వాదనలు కూడా అర్ధరహితంగానే ఉన్నాయి.

కేవలం అయిదారువేలమంది దన్నుతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అన్నాహజారే బ్లాక్ మెయిల్ చేస్తున్నారట! ఈయన ఒత్తిళ్ళకు లొంగితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలౌతుందట! అంతే కాదు, దేశప్రధానిని లోక్ పాల్ బిల్లు పరిధిలోకి తీసుకువస్తే దేశప్రతిష్ట మంట కలసి పోతుందట!

సో కాల్డ్ ప్రజాప్రతినిధుల, ప్రజా ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా అన్నా హజారే చేసిన దీక్షకు దేశమంతటా లక్షలాదిగా ప్రజలు ఇచ్చిన మద్దతుతో అప్పుడు నోట మాటరాని పరిస్థితి కేంద్రానిది. కక్కలేని, మింగలేని పరిస్థితుల్లో తప్పనిసరై, పౌరసమాజ ప్రతినిధులకు ముసాయిదా కమిటీలో చోటు కల్పించారు. ఆ మాత్రానికే పొంగిపోయి పౌరసమాజ ప్రతినిధులు ప్రభుత్వం మాటలకు గంగిరెద్దుల్లా తలలూపుతారని భావించి ఉంటుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి, పార్టీలకు కాకుండా ప్రజలకే బాధ్యత వహిస్తున్న పౌరసమాజ ప్రతినిధులు ససేమిరా అనటంతో, ఒక్కో ప్రతినిధి మీద తమ పార్టీ ప్రతినిధులతో ఆరోపణల మాయాజాలం పరచి ఊపిరాడని పరిస్థితి కల్పించింది. అయినా దిగిరాని పౌరసమాజ ప్రతినిధులకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రచార పర్వాన్ని ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మొదలుపెట్టింది ప్రభుత్వం.

పౌరసమాజ ప్రతినిధులకు అయిదారువేల మంది కూడా మద్దతు లేదనుకుంటే, వారికి ముసాయిదా కమిటీలో చోటెందుకు కల్పించారు?

దేశప్రధానిని లోక్ పాల్ బిల్లు పరిధిలోకి తీసుకువస్తే దేశ ప్రతిష్ట ఎలా మంట గలుస్తుందో చెప్పగలదా ప్రభుత్వం? రేపు ఏ ఇటలీ వ్యక్తో, ఇరాక్ వ్యక్తో దేశ ప్రధాని అయితే పరిస్థితేమిటి? పౌరసమాజ ప్రతినిధులు చెబుతున్నట్లు రేపు మధు కోడా లాంటి వ్యక్తి ప్రధానైతే పరిస్థితి ఏమిటి? అందరూ మంచివాడనుకుంటున్న మన్మోహన్ సింగే, 2జి స్కాంకు సంబంధించి “సంకీర్ణ ప్రభుత్వం నడపటంలో తప్పని పరిస్థితులుగా” అభివర్ణించినప్పుడు జవాబుదారితనం ఎక్కడ నుంచి వస్తుంది?

తాము ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రధాని, మంత్రిమండలి జవాబుదారితనం లేకుండా అవినీతికి పాల్పడుతుంటే, పోరాటం చేయకుండా రాబోయే ఎన్నికల దాకా వారిని భరించటం ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు తోడ్పడుతుందా?

ఉద్యమించిన ప్రతి వ్యక్తిని ఆరెస్సెస్ తోనో, ప్రతిపక్ష పార్టీతోనో ముడిపెట్టి మతవాదిగా చిత్రించటంలోని ఔచిత్యం ఏమిటి? ఇంకా దారుణం ఏమిటంటే, భారతమాత కటౌట్ పెట్టుకున్నందుకు గాను, అన్నా హజారేను ఆరెస్సెస్ వ్యక్తిగా ముద్రవేయటం!

ప్రభుత్వాలకు అవినీతి నిర్మూలన మీద చిత్తశుద్ధనేదే ఉంటే, ఆరు దశాబ్దాలుగా లోక్ పాల్ బిల్లు వెలుగుకు నోచుకోకపోవటం ఏమిటి?

2జి స్కాం కు సంబంధించి దాదాపు రెండు సంవత్సరాలు సి.బి.ఐ. ఎలా విచారణ చేపట్టిందో అందరికీ తెలుసు. ఆ అవినీతి మీద లోకమంతా కోడై కూస్తున్నా, “సంకీర్ణ ప్రభుత్వం నడపటంలో ఈమాత్రం రాజీ పడక తప్పదు” అని స్వయానా ప్రధానే అవినీతిని వెనకేసుకురావటం ఆ అవినీతిలో ప్రధాని ప్రమేయాన్ని ప్రశ్నించక మానదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతున్నందువల్లే రాజా, కణిమొళి అరెస్టు కాబడ్డారనేది కూడా దాచలేని వాస్తవం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చటం తప్పించి, ఆదర్శ్ కుంభకోణంలో ప్రభుత్వం ఇంతవరకూ తీసుకున్న చర్యలేమీ లేవు.

కామన్ వెల్త్ కుంభకోణంలో సురేష్ కల్మాడి పాత్రపై, గతంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రులుగా పనిచేసిన సునీల్ దత్, మణిశంకర్ అయ్యర్, ఎమ్మెస్ గిల్, గత ఆరేడు సంవత్సరాలుగా ప్రధాని చెవిన ఇల్లు కట్టుకొని చెప్పినా వినకుండా, వేల కోట్ల రూపాయలు ఆయన ఆరగించిన తర్వాత తీరిగ్గా అరెస్టు చేయటం చిత్తశుద్ధా?

వేలకోట్ల కామన్ వెల్త్ కుంభకోణంలో ఒక్క కల్మాడిని బాధ్యుడిని చేస్తే సరిపోతుందా? లక్షల కోట్ల కుంభకోణంలో నలుగురైదుగురిని బాధ్యుల్ని చేస్తే సరిపోతుందా? ఆ సొమ్ము తిన్నది వాళ్ళేనా? మరెవరి ప్రమేయమూ లేదా?

లోక్ పాల్ బిల్లు పరిధి ప్రధానికి కూడా విస్తరింప చేస్తే పై ప్రశ్నలకి ప్రధాని బిక్క మొహం వేయాల్సివస్తుందనేది ఒక కారణమైతే, రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానిగా యువరాజుకు ఇబ్బందులు రాకూడదని కాంగ్రెస్ తీసుకుంటున్న ముందు జాగ్రత్తలే ఇవి.

ఏదేమైనా, నిర్మొహమాటంగా ప్రవర్తిస్తున్న పౌరసమాజ ప్రతినిధుల తీరు ప్రభుత్వానికి కంటగింపుగా ఉన్నదనేది వాస్తవం. అందుకే ఏదో కారణంతో వాళ్ళంతట వాళ్ళే ముసాయిదా కమిటీ నుంచి వైదొలగేలా పన్నాగాలు పన్నుతోంది. ఆ తర్వాత తమ ఇష్టానుసారంగా బిల్లు రూపొందించి అవినీతిని నియంత్రించటంలో తమ నిబద్ధతను ప్రజలకు చాటి చెప్పాలని భావిస్తున్నట్లుగా ఉంది.

Your views are valuable to us!