ఈ క్షణికావేశం వలన వ్యక్తులు పొందిన నష్టం అపారం. పైగా దీనికి లక్ష్యమైన వారు పొందిన నష్టం ఎంచలేనిది. కార్మిక నాయకుడు మురళీ మోహన్ చావుకు కారణాలు, రీజెన్సీ సిరమిక్స్ ఉన్నతాధికారి చంద్రశేఖర్ మరణానికి కారణాలు వాస్తవ దృష్టితో ఆలోచిస్తే, కేవలం కొందరు మనుషులు వాళ్ళ ఆలోచనా శక్తిని కాలరాచి అర్ధంలేని ఆవేశాలకు గురై పచ్చనైన బతుకుల్ని అదుపెరుగని కోపాగ్నికి గురి చేసుకున్నారు.
ఇక్కడ జరిగినది మాత్రం తప్పు అని అందరికీ తెలుసు. అభిజాత్యాలు అడ్డువచ్చి నిజాన్ని ఒప్పుకోవడానికి ఒక్కరు మాత్రం ముందుకు రారు. ఇది చరిత్ర పునరావృతమౌతుంది అనడానికి నిదర్శనం. ఏ నాయకుడైతే శాంతితో శ్రమించి అవిశ్రాంతంగా వ్యక్తులను శత్రువులుగా భావించక సమస్యలను శత్రువులుగా భావించి వాటి పరిష్కారానికి శతధా ప్రయత్నిస్తాడో వాడే విజయాన్ని పొందగలుగుతాడు. ఇందుకు రుజువు మహాత్మా గాంధి. దురదృష్టం ఏమంటే గాంధిని మనం ఒక ఆచరణలో అనుసరించదగ్గ వ్యక్తి గా కాక ఒక మహనీయుడుగానే భావించి అంతటితో ఆపేయడంవల్ల దైనందిన జీవితంలో హింస, అమానుషత్వం పేట్రేగి పోయి మానవతా విలువలు మట్టిగోట్టుకొని పోయాయి.
యానాంలో జరిగిన లూటీ ఒక సామాజిక రుగ్మత. అప్పటి వరకూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను వేలమందికి జీవనోపాధి కల్పించిన ఒక సంస్థ ఎప్పుడైతే అరాచకం ప్రబలిపోయి, రక్షణ కరువై అసహాయ స్థితిలో ఉందో అప్పుడు, ఎప్పుడు సమయం వస్తుందా అని అప్పటివరకూ ఎదురు చూసిన, అప్పటివరకూ సహజంగా ఉన్న ప్రజానీకం ఒక్క సారిగా పగటి దొంగలై, మీడియా చూస్తున్న ఫోటోలు తీస్తున్నా దేనినీ ఖాతరు చేయక ఘరానాగా దొరికింది చేజిక్కించుకోవడమే ధ్యేయంగా ప్రవర్తించిన తీరు అత్యంత విస్మయకరం. వాళ్ళకూ, వాళ్ళను చూసినవారికి, వారి గురించి వార్తలుగా చదివిన వారికి ఈ ఘటన ఆశ్చర్యంతో బాటు అసహ్యాన్ని కూడా కలిగిస్తుందనడంలో అనుమానం లేదు.
సభ్య సమాజం లోనే అసభ్యం అణిగి మణిగి ఉంటుంది. సమ్యమనం కొరవడిన రోజున దాని అసలు రూపం బయటకు వస్తుంది. సుదీర్ఘంగా ఆలోచిస్తే ఇలా లూటీకి దిగిన ప్రజానీకం సైతం సిగ్గుతో మనసు కుంచించుకొని పోయే క్షణాలు ఉండక మానవు. మనది కానిది సొంతం చేసుకోవడం ఎప్పటికీ మనోక్షోభకు గురిచేస్తుంది. తస్కరించిన వస్తువులు అమ్ముకోవడానికి, లేదా వాడే ప్రతి క్షణమూ మనః సాక్షి రోద వినపడుతూనే ఉంటుంది. కాని మనసుకి సమర్ధించుకొనే వ్యాపకం ఒకటి ఉండడం వల్ల మనిషి అధోగతిని పొందడంలో ఎక్కడా మార్పు లేదు.
చనిపోయింది ఇద్దరా, ముగ్గురా వందమందా అన్నది
ముఖ్యం కాదు. సంఖ్యలతో సంబంధం లేకుండా ఏ ప్రాణమైనా విలువ ఒకటే. ఈ ఘటన ఇంతటితో సమసిపోతుందని అనుకొంటే పొరపాటే! ప్రత్యక్ష సాక్షులు, వారి కథనాలు, వారి వ్యక్తిగత ప్రయోజనాలు, సత్యాసత్యాలు, పగలు-ప్రతీకారాలు, దొంగ దెబ్బ తీయాలనే పన్నాగాలు తమ పని తాము నిశ్శబ్దంగా చేసుకుపోతాయి. ఇటు కార్మికులు ఏదో సాధించామని భావించడం, అటు యాజమాన్యం నష్టం అంచనావేయడంలోనూ, దాన్ని పూడ్చుకోవడంలోనూ సతమతమవడం – అలాగే మానవలకు సహజమైన రీతిలో ఇరు వర్గాలలోనూ ’దెబ్బకు దెబ్బ’ అనే ధోరణీ సహజంగానే ఉంటుంది. ఈ ధోరణే కాలంలో ఎంతో తీరని నష్టానికి కారణమౌతుంది.ఈమధ్య కాలంలో పారిశ్రామిక అశాంతి అనేది చాల వరకూ తగ్గుముఖం పట్టింది. దీనికి కారణం ఆర్ధికపరమైన చక్కటి మనుగడ ప్రాధమిక అవసరం కావడం. మద్యం తక్కువ ధరలో దొరికే యానాంలో మానవ జీవితం కొంత అసహజానికి గురికావడం వింత కాదు. కాని అసాంఘిక శక్తులు కలి స్థానాలైన జూదం పేకాట, మద్యపానం లాంటి వ్యసనాలు ఆయా వ్యసనపరుల్నే కాక వారిని నమ్ముకొన్న అమాయకుల ఆర్ధిక స్థితిని సైతం అతలా కుతలం చస్తోంది. రైతుకీ, రైతుకూలీలకు పోలంపై కోపమొస్తే పండేది పంట కాదు మంట. అదే మాట పరిశ్రమలకూ వర్తిస్తుంది సంస్థను కంటికి రెప్పలా కాపాడుతూ కార్మికులు యాజమాన్యం వారి వారి ప్రయోజనాలను నెరవేర్చుకొనే రీతిలో మసలడమే నేటి ఆర్ధిక పరిస్థితిలో “నువ్వూ గెలువు నన్నూ గెలిపించు” అన్నదే అత్యున్నత మానసిక పరిపక్వ స్థితి. దీన్ని కాదని, “నేనే గెలవాలని” కోరుకోవడం ఎవ్వరికీ శ్రేయస్కరం కాదు
యానాం పురపాలక వ్యవస్థకు అధినేత శాంతియుత పౌర జీవనానికి బాధ్యుడూ అయిన వ్యక్తికి ఎంతో చొరవ కావాలి. ఒక సమాజంలో శాంతిభద్రతల బాధ్యత ఆ సమాజంలో ఉన్న ప్రముఖ వ్యక్తులతో బాటు ప్రభుత్వ అధికారులకూ సమానంగా ఉంటుంది. పొగను చూసి జాగ్రత్తపడే పౌరులు సంస్థలలోనూ ఉన్నపుడే కోపాగ్నులు రగలవు. వాటిలో జీవితాలు దగ్ధం కావు. సమస్యను పెంచి పోషించే తత్త్వం మానవతకు విఘాతం . కాలం ఎప్పుడూ మారుతూవుంటుంది. కాలగమనంలో మనిషి మినహా అన్ని జీవరాశులూ తమ పనిని తాము ప్రకృతిబద్ధంగా చేసుకుపోతాయి. దగ్ధమైన లారీల పక్కన ఉన్న గడ్డి మళ్ళీ మొలుస్తుంది, గాలి వీస్తుంది, ఎండ కాస్తుంది. ఘోరం జరిగిపోయిందని ఆరోజు చంద్రుడు వెన్నల కురిపించక మానడు, ఆవు పాలివ్వక పోదు. వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తాయి. కాని మనిషి మాత్రం తరచూ విఫలమౌతాడు. తనకు కొత్త చేతిని ఇవ్వడం చేతకాదని తెలిసీ చేతులు నరుకుతాడు. ప్రాణం పోయడం రానివాడు ప్రాణం తీస్తాడు. గడ్డి పరకని చులకగా చూస్తాడు కాని ఆ గడ్డి పరకకున్న కర్తవ్య నిష్ఠ ఇసుమంతకూడా అలవరచుకోడు.
యాజమాన్యాలు కార్మికులకు నిరంతర అధ్యనం, ఆరోగ్యకరమైన ఆలోచనా విధానం అలవరచుకోవడం తద్వారా సంస్థలోను, కుటుంబంలోనూ గౌరవ మర్యాదలు పొంది సంతృప్తి కరమైన జీవితాన్ని గడపడానికి అనువైనా నిరంతర శిక్షణను ఇవ్వాలి. ఇందుకు ఇతోధికంగా నిధులు కేటాయించాలి. ఏ పెట్టుబడి సంస్థను ఎప్పుడూ ఆరోగ్య కరమైన రీతిలో ఉంచుతుందో ఆ పెట్టుబడే అసలైన పెట్టుబడి. లాభాలు-జీతాలతో పాటు మర్యాద-మన్నన ఉంటె ఆ ఉపాధి ఉత్కృష్టమైనది. అట్టి ఉపాధి సాధనకు యాజమాన్యాలూ కార్మికులు కలసికట్టుగా పనిచేయాలి.
ప్రతి సంస్థ ఒక చిన్న ప్రత్యేకమైన సమాజంలాంటిది. ఆ సమాజ పెద్దలు ఆచరించేదే సభ్యులూ ఆచరిస్తారు. మన సమాజంలో ఆధ్యాత్మిక దృక్పధం కేవలం వార్థక్యం లోనే ఉండాలనే వింతైన నియమం వల్ల మనం స్వతహాగా పుట్టుకతో ఆధ్యాత్మిక జీవులమై ఉండీ, ఆధ్యాత్మికతకు ఎంతో దూరమైయ్యాము. మనకు ప్రియమైన వారు చనిపోతేనే భగవద్గీత గుర్తుకు వస్తుంది. మనం మన పురాణేతిహాసాలను పూరిగా చదవం. దురదృష్టవశాత్తు చదివినా అరకొరగా అర్థం చేసుకొంటాం. ఎందుకంటే వీటాన్నింటినీ చదివి, అర్థం చేసుకోవాలంటే అధమపక్షం అరవై దాటాలని భావించడం!! కానీ మనలో చాలామంది మన వేద వాజ్ఞ్మయాన్ని కనీసం కూడా తెలుసుకోకుండా కాలం చేస్తారు. పురాణం మాట దేవుడెరుగు, కనీసం శ్రీశ్రీ మాటలైనా అవశ్యంగా గుర్తుపెట్టుకోవాలి – “మనదీ ఒక బతుకేనా….కుక్కల వలె నక్కల వలె“. జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు కేవలం మనం చేతులారా సృష్టించుకున్నవే. కనుక వాటికి పరిష్కారాలు కూడా మనమే కనుగొనగలం. ఐతే అందుకు కావలసింది మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మన సనాతన విజ్ఞానం పట్ల ప్రాధమిక అవగాహన. ఇది ఎప్పుడు మన సమాజంలో కలుగు తుందో అప్పుడే మనం యానాం లో జరిగిన ఘటనలను నిరోధించగలం.
ఇహపై జరిగే తంతు అంతా ఒక చోద్యమే. సంఘటనపై కమిటీ, కమిటీ నివేదిక, న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు, నష్టపరిహారాలు, లూటి చేసిన వస్తువుల పట్టివేత, లూటి కి పాల్పడిన వ్యక్తుల గుర్తింపు, దాడికి ముందుండి నడిపించిన వారిని విచారించడం లేదా వారు పారి పోవడం. చిన్నా చితుకూ ఘర్షణలు ఒక సం. రం పోయాకా మళ్ళీ దినపత్రికల్లో ఈ ఘటనను గుర్తు చేస్తూ ఎనివర్సరీ వ్యాఖ్యలు. మళ్ళీ పాత పద్ధతులు, పాత నడవడికలు, పాత ఆలోచనా విధానాలు తమ తమ స్థానాలు తీసుకుంటాయి. ఇవి ఇలా జరగక పోతేనే మార్పు వచ్చినట్లు.