శివారెడ్డి ‘అతను చరిత్ర’ – ఓ విమర్శ

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

శ్రీ శివారెడ్డిగారి “అతను చరిత్ర” సంకలనం చదివిన తరువాత, పాఠకులను ఖచ్చితంగా స్పృశించేది ఆయనలోని భావావేశం, ఉద్వేగం. ఏదో చెప్పేయాలన్న తపన. కవికి కావల్సిన ప్రాథమిక లక్షణాలే పుష్కలంగా కనిపిస్తాయి. కానీ, మనసులో నాటుకుపోయే కవితలు మాత్రం చాలా తక్కువ. దీనికి ప్రధానమైన కారణంగా కనిపించేవి భావ వ్యక్తీకరణలో క్లుప్తత, స్పష్టత లేకపోవటం. మరికొన్ని చోట్ల కవిత్వం పరిధి నుంచి వ్యాసంలోకి దూకేయటం.

భావావేశ ప్రదర్శనకు, ఉద్వేగాల వ్యక్తీకరణకు, తెగిపడిన శిరస్సులు, తగలబడ్డ ఊళ్ళు, నరకబడ్డ చేతులు, చీకటి దారులు, ఇనుపగోడలు, ఆకాశాలు కూలటాలు, సముద్రాలు విరిగిపడటాలు లాంటివే వాడటం ఆయనస్థాయి కవులకు సరిపడే వ్యక్తీకరణలు కావని నిస్సందేహంగా చెప్పవచ్చు.

మరో ప్రధానమైన లోపం, భావంలోని ఇంటెన్సిటీ చెప్పటానికి ఒకే పదాన్ని పునరుక్తం చేయటం, మరోచోట ఇంగ్లీషులో చెప్పిన డైలాగు తెలుగులో అనువదించి మళ్ళీ చెప్పే మన హీరోలా, తెలుగులో ఖాళీ ఇళ్ళు అని చెప్పి, శూన్య గౄహాలని పునరుక్తం చేయటం నలుగురు చెప్పుకునే శివారెడ్డిగారి స్థాయిలో మాత్రం ఈ కవితలు లేవు.

ఈ మొత్తం సంకలనంలో నాకు ఓ మాదిరిగా నచ్చిన కవితలు ఇవి కొన్ని :

వెన్నెల

ఆమె కళ్ళ నిండా
నీళ్ళు పెట్టుకుని అడిగింది
“నా సంగతేమిటని”

నేను గుండె నిండా
దుఃఖాన్ని నింపుకుని అడిగాను
“నా సంగతేమిటని”
ఇద్దరం ఫక్కున నవ్వాం
ఇద్దరి కళ్ళ నుంచి
వెన్నెల్లా వర్షం కురిసింది.

000

పిలవటం తప్ప

దారి పక్కన నుంచుని
ఒకడు చెయ్యూపుతాడు
నాకా, ఈ ప్రవాహానికా అర్ధం కాదు
నేలలోపలి నీటిని
ఒక వేరు తట్టిలేపినట్టు
ఒక రాతిగోడ పక్క
ఒకే ఒక మొక్క విరగబూస్తుంది.
….
….
దారిపక్కన నుంచుని
పిలుస్తుంటాడొక బాలుడు
పిలవటం తప్ప
అతనికింకేం పని లేనట్టు

000

సొరంగం

నాకొక దోవ ఉంది
నేనందులో దూరిపోతా
కానీ, ఆమెకేముంది
దారుల్లేని చీకటి
….
….
తప్పదు
ప్రతి ఒక్కడూ
బతుకులో బయటపడే
ఒక సొరంగం వెతుక్కోవాలి

000

ఇప్పుడు కవిత్వం అనబడిన ఓ వ్యాసం :

తల్లికో బహుమతి

ఇంతకు ముందు
అది నాకు తట్టలేదు
చెంపల దగ్గర తెల్లబడుతున్న
ముప్ఫయారేళ్ళ వయసులో

(పాఠకులకు కూడా రెండో ఖండిక చదివే దాకా పజ్లింగా ఉంటుంది ఆ వయసుదాకా తట్టనిదేమిటా అని.)

నాకు రెండింతల వయసుండి
వృద్ధాశ్రమంలో వుంటున్న
మా అమ్మకో బహుమతి కొనివ్వాలని
ఇప్పుడు తట్టింది
జుట్టు తెల్లబడుతున్న ముప్ఫయారేళ్ళ వయసులో
మా అమ్మకో బహుమతి కొనివ్వాలని –

(హమ్మయ్యా పాఠకులకేమైనా సర్ప్రైజ్ ఇస్తున్నారేమో అని అనవసరంగా భయపడితే శివారెడ్డిగారి తప్పు కాదు)

చక్కని ఉన్ని పరుపు పరిచిన
ఉయ్యాలెందుకు కాగూడదు

(ఏమివ్వాలో అని ఇలానే సాగే ఐడియాలు మిగతా లైనులు – దిండా, హోటల్లో భోజనమా, ఓ నవల వ్రాసి ఇవ్వటమా, ఫొటోనా…)
….
….
….
సతతం నా గురించి ఆలోచించే
ఆరాటపడే గొప్ప హృదయముంది ఆమెకి
శాశ్వతంగా ఆమె నాకిచ్చే
గొప్ప బహుమతి ముందు
నేనిద్దామనుకున్న బహుమతులన్నీ
ముక్కచెక్కలయిపోయాయి

హృద్యంగా ఉన్న భావనొక్కటి తప్పించి, ఒక్కో వాక్యాన్ని రెండు మూడు ముక్కలుగా ఖండించటమే కానీ, ఎక్కడైనా కవిత్వం కనిపిస్తున్నదా?

శివారెడ్డిగారి సందేహం, సందేశం కలగలసిన ఈ కవిత చదివితే పోలమారకపోతే ఒట్టే!!

సదా ప్రేమికులు

ఎప్పుడూ మేం కూచునేచోట హోటల్లో
ఇవ్వాళ యిద్దరు ప్రేమికులు కూచున్నారు

(కాకతాళీయమేనేమో!! మా రెండో అమ్మాయి అడిగింది, మనం చెప్పులు పెట్టుకునే చోట పక్కింటివాళ్ళు పెట్టుకున్నారు అని – కొంపదీసి కవయిత్రైపోతుందేమో!!)

ఇన్నాళ్ళు మేం అక్కడ కూచోబట్టి పవిత్రమయిందా
ఇవ్వాళ వాళ్ళు కూచోబట్టి పవిత్రమయిందా?

(అసలది పవిత్రమయ్యిందని ఎవరు చెప్పారో అని తలపట్టుకు కూర్చోవద్దు)

సదా ప్రేమికులు కవులు
కవులు కూచున్నా
ప్రేమికులు కూచున్నా
అక్కడ ప్రేమ పరిమళిస్తుంది.

మనసులో మాటు వేసుకు కూర్చుంటారు కవులు, ప్రేమికులు అని కవిగారి భావననుకుంటా.

000

చిన్నప్పుడు మనం చూసొచ్చిన సినిమా స్నేహితుడికి చెప్పే స్థాయిలో ఉంది ఈక్రింది కవిత. చూడండి.

యిప్పటికీ

బయటికి తోసేశారు
యిద్దరు పిల్లల తల్లిని
ఏడుస్తున్న చిన్నపిల్లాణ్ణి
బలవంతాన లాగేసి,
మొగుడూ, అత్తా, మామా
ఆమెను బయటికి తోసేశారు
చూస్తూ ఉండటం తప్ప
ఎవరూ ఏమీ అనలేని
మొగుడూ పెళ్ళాల వ్యవస్థ

చెట్టు కింద గోడకానుకుని
ఇంటివైపు చూస్తూ ఆమె అలానే
శ్రీరాముడి కాలం నుంచి
ఇప్పటిదాకా ఆమె అలానే

ఇక టైటిల్ లోని కవిత చూద్దాం.

అతను చరిత్ర

శాశ్వతంగా గాయపడ్డవాడు ఏం చేస్తాడు?
చరిత్రని చక్కగా అర్ధం చేసుకుంటాడు.

(పాఠకులకో ప్రశ్న, ఆవెంటనే ఓ జవాబు. కవిత్వం ప్రాథమిక స్థాయి దాటకపోవటం అంటే ఇదే)

రెండు మూడు తులాల బంగారం తెచ్చి
దాన్నింత బూడిద చేసి (వీలయితే)
మట్టిలో కలుపుతాడు.

విమర్శకులు “అతను”కి బంగారం ఎక్కడిదని అడుగుతారనే అనుమానంతోగామోసు బ్రాకెట్లో “వీలయితే” అని తప్పించేసుకున్నారు.

అతనికి తెలుసు మట్టి కన్నా
బంగారం విలువయిందేమీ కాదని

(“అతను” డౌన్ టు ఎర్త్ అని చెప్పకుండానే చెప్పుకోవటం).

శాశ్వతంగా గాయపడ్డవాడు ఏం చేస్తాడు?
ఒక చెరువొడ్డున కూర్చుని ప్రార్ధిస్తాడు.

(పక్షి కళ్ళల్లో పద్యాలు వెతుక్కోవటం, ఇంటికొచ్చి అందరూ తిన్నదీ లేనిదీ చూడటం, మంచి నీళ్ళు తాగి పడుకోవటం ఇలాంటి జవాబులతో ఓ పదిలైనులు లాగించి ఇచ్చే ముక్తాయింపు)

చరిత్ర నిండా అల్లుకుపోయిన
తన్ను చూసి నవ్వుకుంటాడు.

కొద్దిగా కవిత్వం కనిపించినా కవి అతిశయాన్ని సంపూర్తిగా వ్యక్తీకరించే ఇలాంటి కవితలు ఈ సంకలనంలో ఇంకా ఉన్నాయి. “మణిదీపం” మరో ఉదాహరణ.

మంచి మినీకవిత కాదగ్గ మరో కవిత.

అప్పుడప్పుడు

అప్పుడప్పుడు
వెనక్కి తిరగటం మంచిదే
వెనక్కి తిరిగినవాడు
మళ్ళా ఎదురుదాడి చేయడనే
గ్యారంటీ ఏమీ లేదు.

(ఇంతవరకు ఫర్వాలేదనుకోవచ్చు. కానీ, ఎన్ని రకాలుగా వెనక్కి తిరగొచ్చో చెప్పే తరువాతి విషయాలతోటే ఈ కవితలో అందం అన్యాయమైపోతుంది.)

శక్తి కూడగట్టుకుంటానికి
వంగి చేతిలోకి రాయి తీసుకుంటానికి
….
….

అలొచ్చినప్పుడు
తలొగ్గటంలో తప్పు లేదు
తలొంచినట్టు వంచి
మళ్ళా తలెత్తేవాడు తుంగమొక్క
కూడగట్టుకోవటం
కాళ్ళల్లో కళ్ళు పెట్టుకోవటం
ఎండిందనుకున్న చెట్టు
వేళ్ళలోంచి మనుషులు పుట్టుకురావటం

రావటమే, తిరిగి తిరిగి
యుద్ధరంగానికి రావటమే
రణస్థలి జన్మస్థలి.

చివరి వాక్యాల్లో తప్పించి దాదాపు ప్రతి కవితలోనూ కవిత్వం లేకపోవటం ఆశ్చర్యం!


ఏదేమైనా 100 కిలోల బియ్యం బస్తాలో, గోతాం బరువెంత ఉంటుందో ఈ సంకలనంలో కవిత్వం అంతే ఉంది.

సముద్రంలా గంభీరంగా ఉండాలి భావం. గలగలా పారే నదిలా ఉండాలి వ్యక్తీకరణ. అప్పుడే కవిత్వం వినిపిస్తుంది. అమ్మ పిలుపుకి, కుక్క అరుపుకు తేడా స్పష్టంగా చూపగలిగినప్పుడే కవిత్వం పదికాలాలు నిలుస్తుంది.

సంవత్సరానికో సంకలనం తీసుకురావాలనే తపనతో “నేను క్షేమం, మీరు క్షేమమేనని తలుస్తాను” అన్న తీరులోనే ఈ సంకలనం కనిపిస్తుంది కానీ, గుండె నుంచి వచ్చి, గుండెను తాకే శివారెడ్డి కవితలు ఇందులోనైతే లేవు.

Your views are valuable to us!